Previous Page Next Page 
యువత నవత పేజి 9

   
    "ఇందులో అంత పెద్ద కుసంస్కారం ఏముందే శాలినీ? నవ్వులతో హాస్యాలతో హాయిగా గడిపేసే వయసిది"

    "మీ నవ్వులకోసం, మీ ఆనందం కోసం ఒకమ్మాయిని బాధ పెడతారా? అవమానిస్తారా?"

    "ఏదో చాటుమాటుగా పిలుచుకొనే పేరు!ఎదురుగా పిలుస్తామా ఏమిటి?"

    "సరదా శృతిమించితే అదీ అవుతుంది ఒకనాడు!"

    "తాటకి పేరుకు సరిపోతుందా, సరిపోదా అని చూసుకొంటుంది పాపం!"

    "ఏయ్, అన్నయ్యా! మా ఫ్రెండుని యింకొక్కమాటన్నా నేను సహించను!"

    "అననులే! అనడానికి ఒక్క నీ ఫ్రెండే వుందేమిటి? ఇహ తిను‍!" ఇహ ఒక్కమాటన్నా శాలిని కంచంలో చేయి కడిగి లేచిపోయేంత కోపంగా ఆవేశంగా వుంది.

        *    *    *    *    *
   
     శాలిని వేళ్లి ఉద్యోగంలో చేరడానికి యింట్లో అంగీకారం కుదిరింది కాని, " వెంట ఎవరు వెళ్ళాలి? అక్కడ శాలిని ఒక్కతే వుండాలా?"అన్న విషయం మీద ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.

     అంతా క్రొత్త క్రొత్త కాబట్టి అమ్మాయివెంట వెళ్లి ఆమె ఛార్జీ తీసుకునేవరకు వుండి, వుండడానికి యిల్లు అదీ చూసిపెట్టి వస్తానన్నాడు తండ్రి.

     ఉద్యోగం ,ఊరు కాస్త అలవాటు అయ్యేవరకు అమ్మాయితోవుండి తరువాత వచ్చేస్తానంది తల్లి.

     సుధ  వీళ్ల సమస్య విని, "శాలిని ఆ పల్లెటూళ్ళో ఏం వుంటుంది ఆంటీ? అసలు, ఆ పల్లెటూళ్లో వసతులుండే ఇల్లు దొరకటం కష్టం వనపర్తి ఆ వూరికి ఇరవైకిలోమీటర్ల లోపే. ఆ రూటున, వనపర్తికి నెంబరాఫ్ బసెస్ తిరుగుతుంటాయి. వనపర్తిలో యిల్లు తీసుకోండి! రోజూ వనపర్తినుండి తిరుగుతుంది" అని సలహా యిచ్చింది.

     ఆ సలహా నచ్చింది శాలిని తలిదండ్రులకు.

     శాలిని మరునాటి ప్రయాణానికి అన్నీ సర్దుకొంటూంటే సుధ కబుర్లు చెబుతూ కూర్చొంది.

     "మగపిల్లాడే ఉద్యోగానికి వెడుతూంటే యింత కంగారుపడేవాళ్లా? ఇన్ని జాగ్రత్తలు తీసుకొనేవాళ్లా? ఆడదానికి యెవరో ఒకరు రక్షణగా నిలవకపోతే సురక్షితంగా జీవించలేదని ఎందుకనుకుంటారో నాకు అర్దం కాదు. ఎప్పుడూ తల్లి రెక్కలసందున పిల్లను దాచేసుకొన్నట్లుగా చేస్తే, దానికి స్వయంగా ఎగిరేశక్తి ఎలా వస్తుంది? తనను రక్షించుకొనే ఉపాయాన్ని యెలా తెలుసుకొంటుంది?" వాపోయింది శాలిని.

     "శారీరకంగా పురుషుడికంటే స్త్రీ బలహీనురాలు కావచ్చు. మానసికంగా అతడి బలానికి తీసిపోదు. శక్తిసామర్ద్యాలకు తీసిపోదు. మరెందుకు మగవాడికి అవసరంలేని ఆశ్రయం, ఆలంబన ఆడదానికే కావాలి?"

    "నీ మాటల్లోనే జవాబుంది సుధా! స్త్రీ శారీరక బలహీనతే ఒకరి ఆశ్రయంలో బ్రతికేట్టు చేసింది!"

    "అవునా? మా ప్రక్కింట్లో రుక్మిణి ఆంటీని చూస్తే అలా అనిపించదు మరి!

     ఆవిడని చూస్తే ఎలిఫెంట్ గా పుట్టబోయి పొరపాటున మనిషిగా పుట్టిందేమో అనిపిస్తుంది. అంత పర్సనాలిటీ ఆవిడది! లక్షమంది ఆడవాళ్లకు ఆవిడ లీడరు కాగలదు. అలాంటి ఆంటీగారి భర్త - ఆవిడ ప్రక్కన  చూస్తచే పిట్టంత కనిపిస్తాడు. బలమే మనిషికి శాసించే శక్తినిస్తుందనుకుంటే ఆమెకు కోపంవస్తే అతడిని ఫుట్ బాల్ లా తన్నేయాలి కదా? కాని, అలా ఎప్పుడూజరుగదు. ఆ పిట్టంతమనిషిముందు ఏనుగంత ఆంటీ గజగజా వణికి పోతుందంటే నమ్ము. అతడికి కోపం వస్తే ఎగిరి ఎగిరి తంతాడు. ఆవిడ కిక్కురుమనదు. ఆవిడ తిరగబడితే అతడు నామరూపాలు మిగలడు కాని. ఆమె తిరగబడదు. ఏ కనబడని సంకెళ్లు ఆమెను కట్టివుంచా యంటావు?"

    "కట్టి వుంచడంకాదు సుధా! ఆ ఏనుగంత మనిషి ఆ పిట్టంత మనిషి సంపాదనమీద ఆధారపడి వుంటుంది. తిరగబడితే తిండిలేక చావాల్సి వస్తుందని తెలిసి వుంటుంది!"

    "అది కొంత కరక్టే! అందుకే ప్రతి ఆడదీ ఆర్దికంగా నిల దొక్కుకొనేది కావాలి! అప్పుడే స్త్రీ జాతికి దాస్యవిముక్తి. కాని, చాలామంది స్త్రీలు అలా ఆలోచించరు.  ఆఁ ఎందుకొచ్చిన కష్టాలు? తెచ్చి పెట్టేవాడు వుండగా! ఇల్లు కదలకుండా ఆ తెచ్చింది వుడకేసి పెడితే పోలే!అనుకొంటారు. కాని. తమ ఆత్మగౌరవాన్ని యెలా తాకట్టు పెడుతున్నది వీళ్లు గుర్తించడంలేదు.  పావలాకి, అర్దకి భర్తముందు  చేయి చావడంకంటే చాపడం మేలంటాను!"


        *    *    *    *    *    *
   
    శాలిని ఉద్యోగంలో చేరిన నెలరోజుల తరువాత సుధనుండి ఉత్తరం వచ్చింది.

    "మైడియర్ శాలినీ!

    ముందుగా నీకో గుడ్ న్యూస్. నాకు విలేజి డెవలప్ మెంట్ ఆఫీసరుగా సెలెక్షన్ వచ్చింది. సంవత్సరం ట్రెయినింగ్. మన అభిరుచులకు తగిన మాచ్ దొరకడం ఎంతకష్టమో,మన అభిరుచికి ఉద్యోగం దొరకడం అంతకష్టంగా వున్న యీ రోజుల్లో నా అభిరుచులకు, తగిన  ఆదర్శాలకు, సరిపోయిన ఉద్యోగం దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS