Previous Page Next Page 
యువత నవత పేజి 11

         శాలిని ఒక నిమిషం పరిశీలనగా చూసింది. తెల్లచీర మీదనల్లటి చుక్కలున్న ఆర్గండీ చీర అదే బ్లౌజ్  కుడిచేతికి వాచీ, చెవులు, మెడ, చేతులు అన్నీ బోసిగా వున్నాయి.  ఏ ఆభరణం లేకపోయినా ఆత్మ విశ్వాసం  అన్నది ఆమె ముఖంలో, కళ్ళలో ప్రతిఫలిస్తూ అదే ఒక దివ్యాభరణమై సుధను సౌందర్యవంతం, దీప్తివంతం చేస్తూంది!

     "స్వచ్చత మూర్తీభవించిన ఒక దేవకన్యలా వున్నావు! అంది శాలిని చిరునవ్వుతో"

     "అప్పుడే నన్ను దేవతల్లో, దేవుళ్లలో కలిపేయకు! మనిషిగా నాకు కొంతకాలం జీవించాలని వుంది!"

    భుజానికి ఒక ఖద్దరు సంచీ తగిలించుకొని బయల్దేరింది సుధ.

    బస్సు సౌకర్యం లేని కుగ్రామం అది. బస్సుదిగి రెండుమైళ్లు కాలి నడకన నడవాలి. ఆ స్టేజీ దగ్గర సుధ ఒక్కతే దిగింది.

     గొఱ్ఱెలమంద తోలుతూ, గొల్లతడు వచ్చాడు, "కుర్, కిర్ " మంటూ విచిత్రమైన శబ్దాలు చేస్తూ.

     తను వెళ్లాల్సిన ఊరికి దారి అడిగింది సుధ.

     అతడు చెయ్యెత్తి చేలమధ్య కనబడుతున్న సన్నని కాలిబాట చూపెట్టాడు.

     సుధ కాలిబాట మీద చకచకా నడవ సాగింది.


     ఇంకా నడుం ఎత్తు పెరగని జొన్నచేలు గాలికి నృత్యం చేస్తున్నట్టుగా  ఊగుతున్నాయి. ఆకులు కరుగ్గా సుధ చేతుల్ని మొరటుగా పలకరిస్తున్నాయి.  అక్కడికి దగ్గరలో వున్న మామిడితోపునుండి పిచ్చుకల కువకువలు హృద్యంగా వినిపిస్తున్నాయి!

     తన ఉద్యగపర్వంలో పొందబోతున్న తొలి అనుభవాల్ని  తలచుకుని సుధ హృదయం ఉద్విగ్నతతో నిండిపోయింది.

     కాలిబాట సరిగ్గా తెలుగు వాడలోకి వెళ్ళింది.

     అన్నీ గుడిసెలు! గుడిసెలముందు ఆరబోసిన చేపలు.  ముక్కు అదరగొట్టేస్తున్న చేపల వాసన సుధకు స్వాగతం పలికింది. సుధ శాఖాహారి కావడంవల్ల ఈ వాసనకు పారిపోకుండా వుండేందుకు  చాలా కష్టపడాల్సి వచ్చింది.

     చాలా గుడిసెలు తలుపులు మూసి వున్నాయి.  తెరచివున్న రెండు మూడు గుడిసెల ముందు కర్రబొగ్గుతో పళ్లు తోముతూ  ఒకావిడా, బేర్ మంటూ గోండ్ర కప్పలు అధిక సంఖ్యలో వొక్కసారిగా అరుస్తున్నట్లుగా నాలికతోమి కఫం తీసేస్తూ వొకావిడ కనిపించారు.

     "ఇప్పుడు ముఖం కడుగుతున్నా వేమిటవ్వా?" బొగ్గుతో నోరు నల్లగా చేసు కొన్నావిడ దగ్గర ఆగి ఆడిగింది సుధ.

     "దినం కడిగే ఏళ ఇదే! ఎవరు దొరసానీ? సిస్టరమ్మవా?"

    "కాదు, విల్లేజ్ డెవలప్ మెంట్ ఆఫీసరు, అంటారు నన్ను ఇంట్లో ఎవరున్నారు?"

    "ఎవరు లేరమ్మా?"

    "ఎక్కడికి వెళ్లారు?"

    "కోడలు సింతసెట్ల కాడకెల్లింది. కొడుకు సేపలకు ఎల్లిండు. పిలగాడు పెదరెడ్డిగారి పనులెంట ఎల్లిండు!"

    "ఎప్పుడొస్తారు?"

    "సనీయ పొద్దుకు!'

    "అంటే?" తికమక పడింది సుధ.

     "నాకు మీ గడియారాలు తెలవ్వు! సనీయపొద్దంటే సూరిడు ఆడకొస్తడు!" చెయ్యెత్తి పైన ఆకాశంలోకి చూపింది.

     పన్నెండూ. ఒకటీ మధ్య టైం కావచ్చునని  ఊహించింది సుధ.

     ఒక్కక్షణం ఆ యింటిచుట్టూ పరిశీలనగా చూసింది సుధ; కొద్దిగా  వున్న ఆ వాకిటిలోనే వుంది కంది కట్టేతో చిన్నదడిలా కట్టి బాత్ రూమ్ గా వాడు కొంటున్నట్టున్నారు ఆ వాడే నీళ్లు అందరూ నడిచే దారిలోకి వెళ్లి ఒక చిన్న మురుగుకాలువగా మారింది. ఇంచుమించు  అందరిళ్లముందు యిదే ప కాలువలు!  నదుల్లో కలిసే ఉపనదుల్లా  వున్నాయి ఒకచోట పెద్దగుంటగా  తయారయ్యి పందులు రెండు దొర్లుతూ మహానందం అనుభవిస్తున్నాయి.

     ఆ మురికి కాలువలమీద ఈగలూ, దోమలూ, అసంఖ్యాకంగా అభివృద్ది చెంది, యింట్లోకి ప్రవేశించి సరిగా మూతలుంచని ఆహారపదార్దాలమీద , శరీరాలమీద వాలి, మనిషి శరీరంలో పుట్టెడు రోగాలు వ్యాపింప జేస్తాయి!

    పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలన్న చిన్న ఆరోగ్య సూత్రాన్ని వీళ్లు గుర్తించడం లేదంటే, వీళ్లు ఎంత అజ్ఞానంలో వున్నారనుకోవాలి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS