కందరాంతరవిశంకటవనౌకంబు
సందీప్త శ్రుంగానుషంగనాకంబు
అపహృతాద్వన్యశ్రమాతిరేకంబు
తపనేందుగణమణిస్థగితలోకంబు
సారసినీచరచక్రవాకంబు
తీరవనీసముత్తీర పైకంబు
ప్రతిపన్నయతిపుణ్య ఫలవిపాకంబు
శ్రితఋష్యనీకంబు ఋష్యమూకంబు
రఘునాధ రామాయణం
ఇది తంజాపురాన్ని పరిపాలించిన నాయకపురాజశిరోమణి రఘునాధనాయకుని రచన. ఈ రామాయణం బాలకాండవరకే దొరికింది. ఉన్నంతలో యధావాల్మీకంగానే ఉన్నది. పసిపాపలకై పరితపించే దశరధుని పితృహృదయం ఈ చంపకంలో పరిమళిస్తున్నది గమనించండి -
కలుగునొకో చకోరహితు గన్గొని తెమ్మని పోరుపెట్ట దా
దులు గికురించి అద్దమున దోచిన చందురు జూప రెండు చే
తులగొని పట్టి సంతసముతో దన చేతికి జిక్కేనంచు ను
గ్గలిక జెలంగు బాలకుని కన్నుల జూడగ గల్గు భాగ్యముల్!
"అద్దంలో చందమామ కధ" ఇందు అందంగా పొందుపరుపబడింది. ఈ రసవత్మ్రుతిని రఘునాధుని కవయిత్రి మధురవాణి సంస్కృతంలోకి అనువాదం చేయటం అభిజ్జులు గమనింపదగిన విషయం.
అచ్చతెలుగు రామాయణం
దీనిని రచించిన మహాకవి కూచిమంచి తిమ్మన. ఈయన "కవిసార్వబౌమ' బిరుదాంకితుడు. రుక్మీణీ పరిణయం, రాజశేఖర విలాసం, నీలా సుందరీ పరిణయం, కుక్కటేశ్వర శతకం మొదలైనవి ఈయన యితర కృతులు. తన కృతులన్నీ ఇష్టదైవమైన పీఠికాపుర కుక్కుటేశ్వరస్వామికే అంకితం చేశాడు.
"హాటక గర్భవధూలీ
లాటన చలితాంఘ్రిం నూపురారావ శ్రీ
పాటచ్చరములు; తేనియ
తేటలు మా కూచిమంచి తిమ్మయ్య మాటల్."
అన్న ప్రశస్తి ఈయన కవిత్వానికి ఉన్నది. అచ్చ తెనుగు రామాయణం ఆరు కాండలుగా విభక్తమైంది. ఇందలి కొముదీవర్ణనం కమనీయం -
"వేల్పుటెనికలయ్యే బోల్ప నేనుగు లెల్ల
కొండలన్నియు వెండికొండలయ్యే
పలుకుచెడియ లైరి పొలతుక లందరు
చెట్టులన్నియు వేల్పుచెట్టు లయ్యె."
ఈ సీసం "నారదులైరిసన్మునులు నాకమహీజము లయ్యె భూజముల్" అన్న మొల్ల పద్యాన్ని స్పురింపజేస్తున్నది.
గోపీనాధ రామాయణం
ఈ మహాగ్రంధం రచించినవారు గోపీనాధం వెంటకకవిగారు. కవుల నామాలతో "రంగనాధ రామాయణం" "భాస్కర రామాయణం" "మొల్ల రామాయణం " అన్నట్లే కవి యింటి పేరుతొ దీనికీ "గోపీనాధ రామాయణం" అన్న పేరు వచ్చింది. ఈ కవి 19వ శతాబ్దికి చెందినవాడు. వేంకటగిరి సంస్థానంలో ఆస్థానకవి పీఠం అలంకరించినవాడు, కృష్ణజన్మఖండం, ఆంధ్రశిశుపాలవధ మహాకావ్యం వీరి యితర కృతులు. ఆంధ్రదేశంలో గోపీనాధరామయాణానికి విశేషఖ్యాతి ఉన్నది. ఇటీవల వెలువడిన రామాయణాలలో "అగ్రతాంబూల" మందుకున్న రామాయణ మిది.
గోపీనాధం వారు తమ రామాయణాన్ని శ్రీకృష్ణాంకితంగా రచించారు. శ్రీకృష్ణాంకితమైన కంకంటి పాపరాజుగారి ఉత్తరరామాయణమూ తన పూర్వ రామాయణమూ కలిసి సంపూర్ణరామాయణంగా తెలుగుదేశంలో వెలుగొందాలని వారు ఆశించినట్లు తోస్తుంది.
వెంకట కవిగారి కవిత సలక్షణమై లలితపద సంకలితమై ధారాళంగా గంగాప్రవాహంవలె సాగింది. సీతాదేవి రావణున్ని తృణీకరించి పలికే ఈ పద్యం చిత్తగించండి.
అంబుధిపల్వలంబులకు , హంస బకంబులకున్ , ఖగేంద్ర కా
కంబులకున్, మృగేంద్ర శశకంబులకున్ , మదహస్తి రాడ్ బిడా
లంబుల కెంత యంతర మిలాస్తలిం గన్పదు; నంత తార త
మ్యం బగు నాదు భర్తకు నిశాటకులాధమ! నీకు జూడగన్.
శ్రీనాధుని "చిరుసాన బట్టించి చికిలి చేయించిన" అన్న కాశీఖండ పద్యానికి సరిజోడుగా నడిచిన ఈ క్రింది సీసపద్యాన్ని తిలకించండి.
గగనకాసారోడు కైరవంబులు గోయ
బ్రాచి సాచిన హస్త పల్లవంబు
నెఱసిన బలితంపు నిబిడాంధకార కాం
తారసీమకు బృహద్బాను హేతి
ప్రబలవిభావరీప్రతతి ద్రుంపగ సాన
బట్టించి యెత్తిన పరశుధార
జలజాత వనవాటికల గల్గు జాద్యంబు
పరిహరింపంగ బాల్పడ్డమందు
పయనములు వేకువం బోవు పదిక తతికి
దారి జూపెడు తెరువరి, దంపతులకు
పంచశరజన్యవిరతి బుట్టించు చతురు
డరుణుదుదయించే బ్రాక్పర్యతాగ్రమందు.
వానరులందరూ సీత సంగతి తెలుసుకున్నామన్న సంతోషంతో మధువనంలో ప్రవేశించి చెట్లన్నీ పాడుచేస్తూ స్వచ్చందంగా వివరించిన సందర్భాన్ని 48 పాదాలు గల "వృషభగతి రగడ" లో వర్ణించటం వానరుల పశుప్రవర్తనకు తగినట్టుగా ఉంది. గోపీనాధరామాయణం అవతారికలో శాస్త్రి గారు సత్కృతి స్వరూపాన్ని గూర్చి ఒక చక్కని పద్యం వ్రాశారు -
చతురత మీర బాకములు, శయ్యలు, రీతు, ఆలంకృతుల్, ధ్వనుల్,
వితత రసంబులున్ , మరియు వృత్తులు, దోషములున్, గుణంబు, లు
నృతిబరికించి సత్కృతి యొనర్చిన దత్కృతి లోకపూజ్యమై
యతులిత భంగి వృద్దిగను నావిదుభాస్కరతారమై భువిన్.
పైన చెప్పిన అశేష విశేషాలతో సమలంకృతమైన "గోపీనాధ రామాయణం" కవిగారు ఆశించినట్లే అతులితమై ఆచంద్రతార్కారం రసజ్ఞ పాఠకుల రసనాంచలాల పై విహరించుతుందని విశ్వసించుదాం.
ఆంధ్ర వాల్మీకి రామాయణం
దీనిని రచించిన వారు వావిలికొలను సుబ్బారావుగారు. వీరు విద్వత్కవులు. శ్రీరామ భక్తాగ్రగణ్యులు. "శ్రీకుమారాభ్యుదయం" "కౌసల్యా పరిణయం" మున్నగునవి వీరి ఇతర కృతులు. వీరిది ద్రాక్షాపాకం. ధారళమైన శైలి. వాల్మీకి రామాయణంలోని సర్గక్రమాన్ని అనుసరించి వీరి అనువాదం యధామాతృకంగా సాగింది. అమూలకాలైన సొంత పద్యాలను పుస్తకంలో అక్కడక్కడ చేర్చి వాటికి నక్షత్ర చిహ్నాలు ఉంచారు. వీరికి పోతనామాత్యుడన్నా, అయన కవిత్వమన్నా అపారమైన భక్తీ. ఈ క్రింది పద్యాలు దశమ స్కంధంలోని పోతన్న గారి పద్యాలను స్పురింపజేస్తున్నాయి. చిత్తగించండి-
బంధం బెక్కడ నెఱుగని
బంధురగుణ యశుడు, బుధుల బాధల మాన్పన్
సింధురగమనోదరని
ర్బందమ్మున నుండే భక్త భాంధవుడగుటన్.
అవును బంధ మెరుగని జగద్భంధునికి బంధం కల్గింది. ఈ చమత్కారం చిత్తగించండి -
పటపత్రసన్నిభం బగు
కుటిలాలక యుదరసీమ గురువై , యిపుదున్
పటపత్ర నిభమ యయ్యెను
పటపత్ర శయానుదుంట వారని ప్రీతిన్.
ఈ క్రింది ఆటవెలది అందాలు చించుతూ ఉంది -
పాలవెల్లిలోన బండి, లోకంబుల
బాలనంబు సేయు బాలకునకు
పాలోసంగునట్టి భాగ్య మబ్బే నటంచు
నోలి నుబ్బే సతి పయోధరములు.
జగములన్నీ కావు కావు మని ప్రార్ధించే ప్రభువు "కావు కావు" మన్నాడట!
