Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 9


    "అదృష్టవంతుడివి" అన్నాడు సెంట్రీ వెళ్ళబోతూ.

    "అన్నాన్ని మెడికల్ ఎగ్జామినేషన్ కి పంపుతారేమో" అడిగాను.

    "ప్రాచీన భారతీయ మూలికల్ని ఈ సైంటిఫిక్  పరికరాలు కనుక్కోలేవురా అబ్బీ" చెప్పాడు ఠాకూర్ ముసుగులోంచే.

    కాలం నెమ్మదిగా గడుస్తోంది. ఎక్కడా అలికిడి లేదు. సెంట్రీలు కూడా ర్ర్  ఊహించని పరిణామంతో ఆదుర్దా పడ్డట్టున్నారు. బూట్లుచప్పుడు వినిపించడం లేదు. అంతకు ముందే డాక్టరువచ్చి ఏవో రంగునీళ్ళు అందరికి పోసి వెళ్ళేడు.

    దూరంగా రాత్రి రెండు కొట్టింది.

    నెమ్మదిగా లేచేను.

    "ఠాకూర్" అన్నాను రహస్యంగా.

    "ఊ" మూలిగేడు. వంటిమీద చెయ్యివేసి చూసేను. సల సలా కాలిపోతుంది. బట్టల్లో దాచుకొన్న ఉల్లిపాయ తీసి, చేతుల మధ్య రసంపిండి నోట్లో చుక్కలు చుక్కలుగా పోసేను.

    అరగంట.....

    గంట......

    నెమ్మదిగా అతడు కళ్ళు విప్పేడు. నావైపు చూసి నవ్వేడు. లేచి ఒళ్ళు విరుచుకున్నాడు.

    "థాంక్స్ బిడ్డా!" అన్నాడు.

    "నువ్వు జ్ఞాపకం వుంచుకో, ఆ ఆకుని దానికి విరుగుడు ఉల్లిని."

    ఎక్కువసమయం వృధా పర్చటం నాకిష్టం లేదు.

    కటకటాల దగ్గరికి వెళ్ళి వూచల్ని పట్టుకుని బలంగా వంచటం మొదలెట్టేను. అయిదు నిమిషాలు గడిచినయి. నా నుదురంతా చెమట పట్టేసింది. చొక్కా తడిసిపోయింది. పని పూర్తిచేసి బలంగా ఊపిరి వదిలేను. ఠాకూర్ నావైపు తృప్తిగా చూసి "చాలుబిడ్డా" అన్నాడు.

    నా మనసంతా చాలా నిర్లిప్తంగా వుంది. ఏదో అనుకొన్న ప్లాన్ ప్రకారం పని చేసుకుపోతున్నానే తప్ప, నాకు మాత్రం హుషారు లేదు. నా వ్యధని అతడు కూడా గుర్తించినట్టున్నాడు, ఏవీఁ ఎక్కువగా మాట్లాడలేదు.

    చివరికి మేం అనుకొన్న సమయం వచ్చింది.

    మూడు గంటలు కొట్టేడు.

    ఠాకూర్ ఊచలు పట్టుకొని బయటకు వెళ్ళపోతూ వెనక్కి తిరిగి గదిలోకి పరకాయించి చూసేడు. ఓ మూలగా నిలబడి వున్నాను నేను. మాకళ్ళు కలుసుకొన్నాయి. చేతులు సాచి, "వెళ్ళొస్తాను బిడ్డా" అన్నాడు ఒక్క ఉదుటున పరుగు పరుగున వెళ్ళి అతడి కౌగిలిలో వాలిపోయేను. నా కళ్ళు అప్రయత్నంగానే వర్షించి, అతడి భుజాన్ని తడిపి వేయసాగాయ్.

    "ఊరుకో బిడ్డా, ఊరుకో!........." సముదాయించేడు. నిముషంపాటు ఆ విధమైన ఆచేతనావస్థలో వున్న  తరువాత నన్ను నేను సంభాళించుకొన్నాను. 'వెళ్ళిరా-తాతా' అన్నాను.

    నా భుజాల చుట్టూ అతడి చెయ్యి మరింతగా బిగుసుకొంది. 'నువ్వు నాతో రాకపోవటం నాకు విచారంగా వుంది బిడ్డా. కానీ నువ్వు నమ్మిన న్యాయాన్ని గౌరవించంటం కోసం నువ్విలా వుండిపోవటం నాకెంతో గర్వకారణంగా  వుంది. ఆయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ.'

    చాలా విచారకరమైన ఎడబాటు ఇది ఇద్దరి మనస్సుల్లోనూ ఆవేదన నిండుకొంది. ఇన్నాళ్ళ సాహచర్యం, ఇన్నాళ్ళ అనుబంధం, అన్నీ  ఈనాటితో ఆఖరు. ఊహే భరించలేనంత బాధగా వుంది. నాతోపాటు ఇన్నాళ్ళు కలిసి వుండి, నా జీవితానికి ఓ అస్థిత్వం కల్పించిన ఈ వృద్ధుడు నానుంచి వీడ్కోలు తీసుకోబోతున్నాడు. మళ్ళీ బహుశా మేం కలుసుకోకపోవచ్చు. ఏది శాశ్వతం? ఈ  మనుష్యులూ- అనుబంధాలు అన్నీ ఆ చరాచర సృష్టి లయకారుడు సరదాగా  ఆడుకోవటానికి చేసుకొన్నా పరికరాలు.

    ఠాకూర్ కదిలి 'వెళ్ళొస్తాను బిడ్డా' అన్నాడు. ఇంకోసారి చేయిసాచేను.  ఇలా  షేక్ హేండ్ ఇవ్వటం కూడా ఈ పల్లెటూరి వాడికి అతడు నేర్పిందే. జ్ఞాపకం వచ్చి మనసు మళ్ళీ వ్యాకులమైంది.

    "మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకోబోతున్నాం ఠాకూర్?" అన్నాను నా చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. నా కళ్ళలోకి సూటిగా చూసేడు.

    'బిడ్డా' చాలా నెమ్మదిగా దృఢంగా స్పష్టంగా అన్నాడు. 'నీకు ఆర్ధికశాస్త్రం నేర్పాను. రాజకీయం చెప్పేను. చరిత్ర గురించి, సామాజిక వ్యవస్థల గురించీ వివరించేను. కానీ నేన్నీకొకటే ఇవ్వలేకపోయేను భేటా అది 'అనుభవం'- నువ్వు బైటకొచ్చిన తర్వాత నీ చుట్టూ ప్రపంచాన్ని గమనించు. నేను చెప్పిన పాఠాల్ని నీకున్న తర్కాన్నీ, పొందుతున్న అనుభవాల్నీ క్రోడీకరించి సమస్యకు  పరిష్కారం ఆలోచించు. సామాన్యుడి కోసం నీకు యింకోదారి దొరికితే మంచిదే. లేక నా దారి మంచిదని తోచినప్పుడు నా కోసం రా. అప్పటికి చాలా ఆలస్యం అవ్వొచ్చు. ఈ  వృద్ధుడు చనిపోవచ్చు. కానీ వస్తే అడవిలో ప్రతి చెట్టులోనూ, లతలోనూ నీకో ఠాకూర్ కన్పిస్తాడు' సన్నటి దీపకాంతిలో మొహం ఉజ్వలంగా ప్రకాశిస్తోంది.

    "నాకు గురుదక్షిణ ఏమిస్తున్నావ్ బిడ్డా?"

    "పాత కృష్ణ ఎప్పుడో చచ్చిపోయేడు తాతా. నీ చేతుల్తో నువ్వు నిర్మించుకొన్న ఈ కృష్ణే ఇప్పుడున్నాడు. అర్థించటం కాదు. ఆజ్ఞాపించు."

    "తెలివైన మానవుడి జీవితం చాలా విలువైంది బిడ్డా? తెలివి తేటల్ని పక్కవాడిని మోసం చెయ్యటానికి ఉపయోగించకు. పంథా ఏదయినా గమ్యం సామాన్యుడిదిగా పెట్టుకొని జీవించు. అంతే నే కోరేది."

    "తప్పకుండా ఠాకూర్! నువ్వు చెప్పింది నా జీవితంలో ప్రతి క్షణమూ గుర్తు పెట్టుకుంటాను."

    ఆఖరిసారి చేతులు కలుపుకొన్నాం.

    ఇరుగ్గా వున్న ఊచల మధ్య శరీరాన్ని అవతలికి పోనిస్తూ "నేను చెప్పిన ప్రదేశం జ్ఞాపకం వుందిగా" అన్నాడు.

    "ఉంది."

    "ఎంతో వుండకపోవచ్చు. ఇరవై ముప్ఫయి వేలు. కానీ ఆ మాత్రం డబ్బు నీకు అవసరం."

    నాకిష్టంలేదు. కాని అతడి సంతృప్తికోసం తలూపేను.

    "గుడ్ నైట్ బేటా-"

    "గుడ్ నైట్ ఠాకూర్."

    రెండోకాలు కూడా అవతలికి పెట్టేడు. క్షణంలో వెయ్యవవంతు ఆగి చురుకుగా అటూ ఇటూ చూసి పరిశీలించేడు. వడివడిగా నడుస్తూ నెమ్మదిగా చీకట్లో కలిసిపోయేడు. అతడి ఆకారం కొద్ది కొద్దిగా అస్పష్టమై చివరికి అదృశ్యమై పోయింది.

    నా చుట్టూ నిశ్శబ్దం. నెమ్మది నెమ్మదిగా పరచుకొంది. భరింపలేనంత ఒంటరితనం ఒక్కసారిగా నన్ను ఆవరించింది. ఠాకూర్ వెళ్ళిన వైపే చూస్తూ అచేతనంగా నిలబడి పోయేను.

    అయిపోయింది.

    అతడు నా జీవితంలో నుంచి బైటకు వెళ్ళిపోయేడు. ఎంత ఉదాత్తమైన వ్యక్తి అతడు. బహుశా అతడ్ని నేను ఈ జీవితకాలంలో మళ్ళీ కలుసుకోలేక పోవచ్చు. నా జీవితాన్ని ఉద్దీప్తం చేసిన ఆ మహనీయుడి వ్యక్తిత్వం ఉన్నతమై మహొన్నతమై నా ఊహకందనంతగా పెరిగి పోయింది వెనక్కి వచ్చి నా మామూలు స్థలంలో కూర్చున్నాను. మనసంతా వెలితిగా వుంది.

    లోపల్నుంచి వేదన పొంగుకొస్తూంది.

    చుట్టూవున్న గోడలూ, కిటికీలోంచి కనబడుతున్న నక్షత్రాలు,  భూమి ఆకాశం అన్నీ నాతోపాటు మౌనంగా వుండి తిరిగిరాణి ఆ వ్యక్తి కోసం నిశ్శబ్దంగా రోధిస్తున్నాయా అన్నట్టు వెలవెలబోతున్నాయి. ఠాకూర్ వెళ్ళి అయిదు నిముషాలై వుంటుంది.

    అంతలో దూరంగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. అది తుపాకీ పేలిన చప్పుడో, ఏదన్నా  వస్తువు క్రింద పడిన చప్పుడో సరిగ్గా తెలియలేదు.  తరువాత మళ్ళీ నిశ్శబ్దం. నా వెన్నులోంచి చలి శరీరం అంతా వ్యాపించింది. అర్థంకాని భయంతో వణికిపోయేను, అదేం చప్పుడు?

    ఇప్పటికీ - ఇన్ని సంవత్సరాల తర్వాతకూడా ఆ చప్పుడు ఇదమిద్దం అని తేల్చుకోలేకపోయేను. ఆ చప్పుడు తరువాత మళ్ళీ అలజడి వినిపించకపోవటంతో నేను భయపడింది జరిగి వుండదని మనసుని సంతృప్తి పర్చుకొన్నాను. కాని మళ్ళీ మనసులో ఏ మూలో ఏదో అనుమానం.

    ఠాకూర్ని మాత్రం మళ్ళీ నేను కలుసుకోలేదు.

    ఎన్నో రాత్రులు అందరూ నిద్రపోయేక నాకు ఠాకూర్ జ్ఞాపకం వచ్చేవాడు దూరంగా వరండాలోంచి అతడు నడచి వస్తున్నట్టు భ్రాంతి కలిగేది నా  భ్రమకి నేనే విషాదంగా నవ్వుకొనేవాడ్ని.

    అతడి ప్రభావం నా మీద చాలా పడింది. ఎవరితోనూ కలిసేవాణ్ని కాదుఒక విధమైన బుశిత్వం సిద్ధించిన వాడిలా ఒంటరిగా వుండేవాణ్ని కానీ అభ్యాసం మాత్రం మానలేదు.

    రోజులు నెమ్మదిగా గడవసాగేయి.

    ఒకరోజు ఒక వార్త దావానలంగా మా మధ్య వ్యాపించింది.


                                                                      6


    "మిస్టర్ కృష్ణా ఇవి మీ వస్తువులు. ఇన్ని రోజులు పనిచేసినందుకు ఇది మీ వేతనం. ఈ క్షణం నుంచి మీరు స్వేచ్చ పొందుతున్నారు. మీ ప్రవర్తనా, నడవడికా, పారిపోయే వీలున్నా దాన్ని వినియోగించుకోకపోవటం- యివన్నీ శిక్ష తగ్గించటానికి కారణాలు. దేశ స్వాతంత్ర్యోత్సవాల దృష్ట్యా మిమ్మల్ని వదిలిపెడుతున్నారు-వెళ్ళండి-"

    బల్లమీది వస్తువులు తీసుకున్నాను. మౌనంగా వెనక్కి తిరిగి గుమ్మంవైపు అడుగులు వేస్తూంటే అతడు అన్నాడు.

    "ఒక మనిషి స్వేచ్చనీ, హక్కుల్నీ అరికట్టడానికి ఎవరికీ అధికారం లేదు. కానీ  ఆ మనిషి పశువుగా మారితే అతణ్ని నాలుగు గోడల మధ్య బంధించటానికి చట్టం ప్రయత్నిస్తుంది లాగే మళ్ళీ యిక్కడికి రావనే ఆశిస్తున్నాను."

    "రాను జైలర్ సాబ్! పశువుల మధ్య మనిషిగా బ్రతకటానికే ప్రయత్నిస్తాను" వెనక్కి తిరగకుండా చెప్పేను.

    రిపార్టీ గురించి ఠాకూర్ చెప్పేడు.

    బయటికి నడిచేను. ఎత్తయిన జైలు గోడల తలుపులు నా కోసం తెరవబడ్డాయి. దృఢమైన రాతిగోడల మధ్య చిన్న ఇనుప తలుపు. తల బాగా వంచి ఇవతలికి వచ్చేను. నా వెనుకే తలుపులు మూసుకొన్నవి. బలంగా ఊపిరి పీల్చుకొని చుట్టూ పరకాయించి చూసేను- విశాలమైన మైదానం నాలుగు వైపులనుంచి నన్నాహ్వానిస్తున్నట్టు కనిపించింది.

    అప్పుడు నేను పొందిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను.

    సూర్యుడు ఒకవైపు పశ్చిమాద్రిలో  కుంగిపోతున్నాడు. కొంగల బారు దక్షిణ దిశగా ఎగిరిపోతుంది. పిల్ల తెమ్మర ఒకటి నాజూకగా వచ్చి పలకరించి సాగిపోయింది. నా మనసులోంచి ఆనందం పొంగి పొర్లుకొస్తుంది. అప్పుడు నేను కావాలనుకుంటే పరుగెత్తగలను.....కావాల్సివచ్చినప్పుడు స్నానం చేయగలను.

    స్వేచ్ఛకర్థం- అది పోయినప్పుడే తెలుస్తుంది.

    జైలు గోడ పక్కనే ఒక కుక్క నావేపే వింతగా చూస్తూ నిలబడివుంది. దాని వైపు చూసి నవ్వి, 'హలో; అన్నాను ఏమనుకుందోఏమో - పరుగెత్తుకు వెళ్ళిపోయింది. బిగ్గరగా నవ్వి నేనూ మైదానంలో పరుగులు తీయటం ప్రారంభించేను. ఆగో చేతులు నేలమీద పెట్టి తలక్రిందులుగా గెంతు వేసేను. గోడమీద నుంచి నావైపే చిత్రంగా చూస్తున్న సెంట్రీని దూరంనుంచి ఎక్కిరించేను. అతడు నవ్వుతూనే స్నేహపూర్వకంగా చేయి వూపేడు. నేనూ చెయ్యి వూపేను.

    అంతలో గుర్తొచ్చింది- నేనూ ఈ గౌరవప్రదమైన సమాజంలో ఒక పౌరుణ్నని. హుందాగా పెద్ద మనిషిలా వీపు నిటారుగా పెట్టి నడవసాగేను.

    ఊళ్ళోకి వచ్చేను. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS