Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 7

 

"ఒక్క రోజు గడువు ఇవ్వు. నేను తీసుకొస్తాను." విష్ణు తో అంది బృంద.
***
మర్నాడు పగలు పన్నెండు అవుతోంది.
చాలా సార్లు సుధీర్ కి ఫోన్ చేసింది బృంద. అవతల నుంచి రెస్పాన్స్ ఉండట్లేదు. ఫోన్ ఆఫ్ అన్నా ఉంటోంది. లేకపోతే ఎన్ని రింగ్స్ వచ్చినా ఎత్తటం లేదు.

"Escapist" అనుకుంది బృంద. రాదల్చుకోలేదనుకుంట ఇప్పుడే. ఏదో గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఉన్నాడు. ఎంత పట్టించుకోకుండా వదిలేద్దాం అనుకున్నా నెత్తి మీదకు ఏదో ఒకటి తెచ్చి పెడతాడు.

విష్ణు కి ఫోన్ చేసింది. "డ్రైవర్ ని కార్ రెడీ చేయమను. బయటికి వెళ్లాలి. నువ్వు కూడా నాతో రావల్సి ఉంటుంది. అరగంట లో ఇక్కడ ఉండండి"

"సరే మేడం" వినయం గా సమాధానమిచ్చాడు విష్ణు.

బృంద రెడీ అయి బయటకి వచ్చేసరికి కార్ రెడీ గా ఉంది. 

ఆమెని చూసి పరిగెత్తుకొచ్చి వెనక డోర్ తెరిచి పట్టుకున్నాడు డ్రైవర్ రాములు.

"ఎన్ని సార్లు చెప్పినా నువ్వింతేనా? డోర్ తెరిచి నువ్వు పట్టుకొనక్కర్లేదు. నేను తీసుకోగలను." ఇంకో వైపు నుంచి ఎక్కి కూర్చుంది ఆమె. విష్ణు డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నాడు అప్పటికే. 
బుర్ర గోక్కుంటూ కార్ స్టార్ట్ చేసాడు డ్రైవర్. బృంద అడ్రస్ చెప్పాక కార్ ముందుకు కదిలింది.

నగర శివార్లు దాటి ముందుకు వెళ్తోంది కార్.

"ఏంటి రోడ్లు ఇట్లా ఉన్నాయి?" ఆశ్చర్యంగా అడిగింది బృంద. 

రోడ్లన్నీ తవ్వి పోసినట్లు ఉన్నాయి. అక్కడక్కడా నీరు నిలిచిపోయి, మధ్యలో గుంటల తో భీభత్సంగా ఉన్నాయి రోడ్లు. కార్ వేగంగా వెళ్ళటానికి వీల్లేకుండా ఉంది. 

ఆ రోడ్డు మీద ప్రయాణిస్తే ఏ ఆరోగ్య సమస్యలు లేనివాళ్ళకి ఆర్థరైటిస్ లాంటివి మొదలయ్యేలా ఉన్నాయి.

"ఏం చెప్తాం మేడం. ఇప్పటికి రెండు సార్లు ఈ దారి వెంట రోడ్డు వేశాం." అన్నాడు విష్ణు.

"రెండు సార్లు వెయ్యడం ఏంటి?" కుతూహలంగా ఉంది బృంద కి.

"ఏముందమ్మా? రోడ్లు వేశాక టెలిఫోన్ లైన్లు అనో, డ్రైనేజ్ లు అనో వేరే డిపార్ట్మెంట్ వాళ్లు వీళ్ళు వేసిన రోడ్లు తవ్వేస్తారు." రాములు అన్నాడు.

"ఇక్కడ ఏం డ్రైనేజీలు... హైవే మీద?" అడిగింది బృంద.

"ఇది అలా జరిగింది కాదండీ. కాంట్రాక్టర్ ల మోసం" అన్నాడు విష్ణు.

"సార్, అంటే అన్నానంటారు కానీ ఒకసారి కాంట్రాక్టర్ మోసం చేస్తే మళ్ళా వాళ్ళకే ఎట్లా ఇస్తారు?" అన్నాడు రాములు. 

నోటి దూల అతనికి. మనసులో అనిపించింది పైకి అనెయ్యకపోతే తోచదు.

"ఇప్పుడు అవసరమా అదంతా?" గుడ్లు ఉరుముతూ అన్నాడు విష్ణు.

"బయటి వాళ్ల దగ్గర కాదు కదా సార్. మనలో మనం అన్నా అనుకోకపోతే ఇంక నిజాలెట్లా తెలుస్తాయి" అన్నాడు రాములు.

విష్ణు ని పట్టించుకోకుండా మళ్లీ కొనసాగించాడు. 

"స్టేట్ మొత్తం పరిస్థితి ఇదేనమ్మా. మన సీఎం సార్ ని తిట్టుకోని వాళ్ళు లేరు. అంతకు ముందు రోడ్లని అట్లాగే ఉంచేసినా పోయేది. డబ్బులు, కమీషన్ ల కోసం ఉన్న రోడ్డు మీదే మళ్లీ వేశారని చెప్పుకుంటారు. ఈ కాంట్రాక్టర్ ఏం మెటీరియల్ పెట్టి వేశాడో కానీ అంతకు ముందు ఉన్న రోడ్లు కూడా గునపం తో పైకి లాగినట్లు వచ్చేస్తాయి అంట"

"అట్లా అనుకుంటారు కానీ మన సార్ అట్లా చేస్తాడంటే నేను నమ్మను. మన సార్ దేవుడు" మళ్లీ తెలివిగా కలిపాడు.

బృంద కి నవ్వొచ్చింది. ఈ పొలిటీషియన్ ల చుట్టూ ఇటువంటి బ్రతకనేర్చిన జనాలు చేరతారు. అవసరాల కోసం వాళ్ళు చేసే భజనలకి, పొగడ్తలకు అలవాటు పడి వాస్తవ దూరమైన ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. పైగా తామేదో ప్రత్యేకమయిన వ్యక్తులనీ, తమ పుట్టుకే ప్రపంచానికి వరమనీ భావిస్తుంటారు. ఓడిపోయిన రోజు వాళ్ళకి తెలిసొస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం అయి ఉంటుంది. 

నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాళ్ళు. కుడి వైపు చిన్న పల్లెటూరు లాంటి ప్రాంతం కనిపిస్తోంది. అటు వైపు పోనిమ్మంది బృంద. 

మట్టి రోడ్డు అయినా  శుభ్రం గా ఉంది. రోడ్డు కి రెండు వైపులా క్రమపద్ధతిలో పెంచిన చెట్లు. రెండు కిలోమీటర్ల వరకూ అదే దారిలో వెళ్లాక ఒక వైపుగా చిన్న పెంకుటిల్లు కనపడసాగింది. క్రమంగా ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ పూల మొక్కలు, కూరగాయల మడులు కనపడుతున్నాయి. 

మధ్యాహ్నం నాలుగు అవుతోంది. 

ప్రశాంతంగా ఉందా ప్రాంతం. పూల మొక్కల సువాసన, పక్షుల కువకువలతో ఆహ్లాదంగా ఉంది అక్కడ వాతావరణం. 

కార్ ఆపమంది బృంద. రాములు ని అక్కడే ఉండమని, కార్ దిగి ఇంటి వైపు అడుగులు వేసింది. విష్ణు ఆమెని అనుసరించాడు. 

"ఎవరైనా స్వామీజీ అశ్రమమా మేడం?" అడుగుతున్నాడు విష్ణు.

అతనికి వింతగా ఉంది. ఒక పక్కన బాస్ మిస్సింగ్. బృంద అసలేం జరగనట్టు, ఎప్పుడూ లేని విధంగా ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చింది.  ఏమీ అర్థం కావట్లేదు అతనికి. మధ్య మధ్యలో ఫోన్లు వస్తున్నాయి అతనికి. సీఎం అప్పాయింట్మెంట్ కోసం. ఒక వారం వరకూ అన్నీ వాయిదా వేస్తున్నాడు బిజీ అని చెప్పి. 

తర్వాత ఎలా...? 

అసలీ తేడా గాడి దగ్గర ఉద్యోగం లో చేరటం తను చేసిన పెద్ద తప్పు. అటు ఇటు అయి, సెక్యూరిటీ లేక సీఎం కి ఏదైనా జరిగితే తన పీకలకి ఎక్కడ చుట్టుకుంటుందో అని భయంగా ఉంది అతనికి.
***
చిన్న నాలుగు గదుల ఇల్లది. ఇంటి ముందు పెద్ద వరండా. ముందు నాలుగు మెట్లున్నాయి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS