రెండు వెదురు తో చేసిన కుర్చీలు వేసున్నయి వరండాలో. గుమ్మం వరకూ వెళ్లి లోపలకి తొంగి చూసింది. ఎవరూ లేరు. వెనక వైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అటుగా నడిచారు ఇద్దరూ.
వెనక వైపు మొక్కల మధ్య, సన్నజాజి తీగ పాకించిన పందిరి. వాటి మధ్యలో వేసున్న వాలు కుర్చీ లో వెనక్కి జారగిలబడి పుస్తకం చదువుతున్నాడు ఒకతను.
అతణ్ణి చూడగానే ప్రాణం లేచొచ్చినంత పనయింది విష్ణుకి.
"హమ్మయ్య...ఇక్కడున్నారన్న మాట. నిన్న రాత్రి నుంచి టెన్షన్ తో చచ్చి పోతున్నాము అంటే నమ్మండి" గబగబ అతని దగ్గరకి వెళ్లి అన్నాడు.
ఎగాదిగా చూసాడతను విష్ణు వైపు. అప్పుడే వెనక నుంచి నవ్వుతూ చూస్తున్న బృంద కనపడింది.
ఆమెని చూసి పలకరింపు గా నవ్వాడతను. చక్కటి అమాయకమైన నవ్వు.
అసలతను సుధీర్ ఏనా? బృంద, సుధీర్ మధ్య అటువంటి సఖ్యత తనెరగడు.
"ఏం ఇలా వచ్చావ్ బృందా? ఈ కొత్త పాత్ర ఎవరు?" అంటూ లేచి నిల్చున్నాడు అతను.
అయితే ఇతను సీఎం గారు కాదా? ఏదో కొంచెం తేడా కనపడుతోంది. ఇతను చాలా ఫిట్ గా ఉన్నాడు. పైగా మొహం లో అమాయకత్వం కనపడుతోంది. సుధీర్ అట్లా కాదు, అతని మొహంలోనే అతని మోసపూరిత గుణం కనపడుతూ ఉంటుంది. అతనెంత మంచి వాడిలా కనిపించటానికి ప్రయత్నించినా.
అయోమయంగా నిలబడ్డ విష్ణు భుజం మీద తట్టి చెయ్యి ముందుకు జాపి "ఐయాం కార్తీక్!" అన్నాడతను.
షాక్ లో ఉన్న విష్ణు అప్రయత్నం గానే చేయి కలిపాడు.
"అచ్చం సుధీర్ సార్ లాగే ఉన్నారు" గొణుగుతున్నట్లుగా అన్నాడు.
పెద్దగా నవ్వాడు కార్తీక్.
"సుధీర్ మా అన్నయ్య" చెప్పాడు.
"నువ్వేం మారలేదు" అంది బృంద నవ్వుతూ.
"మనలో ఎవ్వరం మారలేదు. మంచో, చెడో మనందరికీ బలమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి మరి." అన్నాడు కార్తీక్.
"ఇందాక ఇతను టెన్షన్ లో ఉన్నాడేంటి? ఏదేదో మాట్లాడాడు." మళ్లీ అన్నాడు.
పనివాడిని పిలిచి కుర్చీలు వేయించాడు.
కూర్చున్నాక విషయం చెప్పింది బృంద.
మొత్తం విన్నాడతను.
"ఆశ్చర్యం గా ఉందే? అన్నయ్య పదవి వద్దనుకుని ప్రశాంతత కోరుకుంటాడు అని నేనెప్పుడూ అనుకోను."
నిజంగానే అతనికి చాలా ఆశ్చర్యం గా ఉంది. గతం గుర్తొస్తోంది అతనికి.
***
పక్క పక్క ఇళ్లలో ఉండేవారు చిన్నప్పుడు తమ కుటుంబం, బృంద వాళ్ళ కుటుంబం.
తమది మామూలు మధ్య తరగతి కుటుంబం. బృంద వాళ్లు బాగా డబ్బున్న వాళ్ళు. ఆమె తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ల కుటుంబం లో ఎవరో ఒకళ్ళు రాజకీయాల్లో ఏదో ఒక పాత్ర పోషిస్తూ వచ్చారట. బృంద తండ్రికి మాత్రం రాజకీయాలంటే ఆసక్తి లేక అవసరం లేకున్నా బ్యాంక్ ఉద్యోగం చేసేవాడు. తమ తండ్రులిద్దరికి ఆ బ్యాంక్ లోనే పరిచయం. అతని ఇంటి పక్కనే ఉన్న ఇంటిని తమకి అద్దె కి కుదిర్చింది కూడా బృంద తండ్రే.
బృంద వాళ్ళింటికి ఎప్పుడూ ఎవరో ఒక ప్రముఖులు వస్తూ పోతూ ఉండేవారు. వాళ్ళను చూసీ చూసీ సుధీర్ కి రాజకీయాల పిచ్చి మొదలైంది. అలా వచ్చిన వాళ్ళని నోరు తెరుచుకుని చూస్తూ ఉండేవాడు సుధీర్. సుధీర్ ని చూసి తెగ నవ్వొచ్చేది తనకి.
తనకీ, సుధీర్ కీ సంవత్సరం తేడా. ఇద్దరూ ఒకేలా ఉండేవారు అచ్చు గుద్దినట్లు. ఎవరు ఎవరో తెలీక తమ తల్లి కూడా తికమక పడిన రోజులున్నాయి.
ఒక్క లతకి మాత్రం తెలిసిపోయేది ఎవరు ఎవరో. ఎన్ని సార్లు కన్ఫ్యూజ్ చేద్దాం అని చూసినా అస్సలు పొరబడేది కాదు. "నువ్వు వేరే" అనేది ఆత్మీయంగా.
బృంద చెల్లెలు లత, తను మంచి స్నేహంగా ఉండేవారు. బోలెడన్ని ఆటలు. బృంద చెల్లెలు లత గుర్తొచ్చింది అతనికి. అవును, ఇప్పుడెలా ఉందో ఆమె. ఎక్కడ ఉందో.
ఆలోచనల్లో నుంచి బయట పడి లత గురించి అడిగాడు బృంద ని.
" ఇప్పుడు గుర్తొచ్చిందా?" చెల్లెలి పేరు ఎత్తేసరికి బృంద కళ్ళు తళుక్కుమని మెరిసాయి.
"నీకు తను గుర్తు ఉంటానని కూడా అది అనుకుని ఉండదు. ఇంకా అదే ఊళ్ళో ఉంది. అక్కడే స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది"
లత భర్త గురించి అడగాలనిపించింది కార్తీక్ కి.
అతను అడగకుండా తానెందుకు చెప్పాలి అనుకుంది బృంద. ఎంత మంచిదో అంత మొండిది!.
కార్తీక్ లో గతపు ఆలోచనలు కదలసాగాయి.
***
చిన్నప్పటి నుంచే బృంద హుందాగా ఉండేది. ఆమె అల్లరి చేయటం కానీ, పెద్దగా ఆటలు ఆడటం కానీ తానెప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. అప్పుడప్పుడు చెల్లెల్ని గదమాయిస్తూ పెద్దరికం ప్రదర్శించేది. చదువులో అందరి కంటే ముందుండేది.
తను చదువు ని ఆమె అంత సీరియస్ గా తీసుకోకపోయినా బాగానే చదివేవాడు.
