Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 6

 

బృంద కి నిద్రంతా ఎగిరిపోయింది.

"ఏం మాట్లాడుతున్నావ్? కనపడకపోవటానికి మామూలు మనిషా? సీఎం ఆయన...!!!"

"నిజం మేడం. చాలా ప్రయత్నించాం ఎక్కడున్నారో తెల్సుకోటానికి. ఆచూకీ తెలిట్లేదు"

"కిడ్నాప్ లాంటిదేమైనా...?" అడగటానికి భయం గా ఉందామెకి.

"లేదు. స్ట్రెస్ అంటున్నారు ఈ మధ్య. ఇవ్వాళ మీటింగ్ అయి కార్ ఎక్కగానే ఊపిరి ఆడట్లేదంటూ వెనక్కి వాలిపోయారు. డాక్టర్ ని తీసుకొచ్చాం. టెస్ట్ అయ్యాక డాక్టర్ కంగారేం లేదు... రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి వెళ్ళాడు. తర్వాత కాసేపటికి ఏదో ఫైల్ మీద సర్ సంతకం కోసం లోపలకి వెళ్ళాను. లోపల లేరు"

 " ఈ టెన్షన్లు భరించలేక కావాలని ఎటన్నా వెళ్లిపోయారని అనుమానంగా ఉంది" చెప్పాడు విష్ణు.

"ఎక్కడున్నావ్? అర్జంట్ గా ఆఫీస్ కి వచ్చేయి" అoది బృంద.

***

ఇంటి పై పోర్షన్ లోనే ఆఫీస్ సెటప్ ఉంది. లోపల నుంచి మెట్లున్నాయి. మరీ ముఖ్యమైన వాళ్ళు, బంధువులు తనతో ఏదైనా పని పడి వచ్చినప్పుడు వాళ్ళని ఇంటికి రమ్మంటాడు సుధీర్. పెళ్ళిళ్ళకి పిలవడానికి, ఏదైనా ఫంక్షన్ లకి ఆహ్వనించటానికి వచ్చేవాళ్ళు కూడా అక్కడకే వచ్చి అతణ్ణి కలుస్తుంటారు. 

చాలా ఏళ్ళ తర్వాత ఆఫీస్ లోకి అడుగు పెట్టింది బృంద. 

సుధీర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో ఆమె అతనికి సహాయపడేది. దగ్గరుండి తనే డిజైన్ చేసి కట్టించింది ఆఫీస్ ని. లోపల టీవీ, సోఫా లతో సహా అన్ని హంగులు ఉన్నాయి. 

దానికి అనుబంధంగా ఆనుకుని మరో చిన్న రూం. అందులో నలుగురు స్టాఫ్ పని చేసుకోటానికి వీలుగా నాలుగు బల్లలు, కుర్చీలు ఉన్నాయి. 

మదాలస విషయం బయటకి వచ్చినప్పటి నుంచీ తను అతని గురించి పట్టించుకోవడం మానేసింది. మళ్లీ ఇప్పుడే రావటం.  

పెద్ద మార్పు లేదు ఆఫీస్ లో. కాస్త పాతపడ్డది అంతే. విజిటర్స్ కోసం బయట సోఫాలు, కుర్చీలు వేసి ఉన్నాయి. రాత్రి పదకొండు దాటటంతో అంతా ఖాళీగా ఉంది. 

బృంద పైకి వచ్చేటప్పటికి లాబీ లో కూర్చుని వెయిట్ చేస్తున్నాడు విష్ణు. అతణ్ణి చూడగానే తీవ్రమైన టెన్షన్ లో ఉన్నాడని అర్థం అయింది. 

జుట్టు రేగిపోయి చెమటలు కారుతున్నాడు. గోళ్ళు కొరుక్కుంటున్నాడు. 

ఆమె ని చూడగానే లేచి నిలబడబోయాడు.  కూర్చోమని సైగ చేసింది బృంద.

మరో కుర్చీ లాక్కుని అతనికి ఎదురుగా కూర్చుంది.

"ఇప్పుడు చెప్పు. స్టాఫ్ అంతా సీఎం ఆఫీస్ లో ఉండగా ఎవరికీ తెలీకుండా ఎలా వెళ్తారు?"

"మేడం, సర్ అప్పుడప్పుడు ఇలాగే వెళ్తుంటారు. మీకు తెలియంది ఏముంది?" చేతులు నులుముకుంటూ ఇబ్బంది గా అన్నాడు.

అతను చెప్తున్నది మదాలస గురించి అని అర్థమయింది ఆమెకి. అవమానం గా అనిపించింది. పోతే పోనీ, మళ్లీ అతను తన కంటికి కనపడక పోవటమే మంచిది అనిపించింది ఆ క్షణాన. 

కానీ చిన్నప్పటి నుంచి తెలిసిన వాడవటం, కొడుకు, కుటుంబాలు, బంధువులు గుర్తొచ్చారు ఆమెకి. తప్పదు...నిట్టూర్చింది.

"ఆమెకి ఫోన్ చేసావా? అక్కడికి ఏమన్నా వెళ్ళుంటాడా?" అడిగింది. 

పేరు ఉచ్చరించటానికి కూడా ఆమెకి మనసు ఒప్పలేదు.

"ఇంత సేపు అక్కడ ఉంటే ఆవిడ మొహం మేకప్ లేకుండా చూసి ఎప్పుడో దారిలోకి వచ్చేవారు" వెటకారంగా అన్నాడు.

"ఫోన్ చెయ్యొకసారి" ఆజ్ఞాపిస్తునట్లు ఉంది ఆమె గొంతు.

కర్మ...ఈ పొలిటీషియన్ల దగ్గర ఉద్యోగాలేమో కానీ అడ్డమైన వాళ్ళకీ ఫోన్లు చేయాల్సి వస్తుంది. తూ నా బతుకు. 

తిట్టుకుంటూ తప్పనిసరై ఫోన్ అందుకున్నాడు.

"హల్లో!" వయ్యారంగా, దర్పంగా ఉంది గొంతు. తనే ప్రైమ్ మినిస్టర్ ని అన్నంత బడాయి గా ధ్వనిస్తుంది.

" నేను విష్ణు ని. సుధీర్ సర్ ఏమయినా అక్కడికి వచ్చారా?" 

"ఇవాళ రాలేదు. ఇంకెప్పుడూ రాత్రుళ్ళు ఫోన్ చెయ్యకు" ఫోన్ పెట్టేసింది మదాలస.

పతివ్రత మరి.. గొణుక్కొoటూ ఫోన్ పక్కన పెట్టాడు.

విష్ణు మొహం చూసి బృంద కి జాలేసింది. అప్పటికే అతను ఆమె వైపు జాలిగా చూస్తున్నాడు.

మరి కొంత మందికి ఫోన్లు చేసి చూసారు. 

మరీ ఎక్కువ మందికి ఫోన్లు చేసినా విషయం లీక్ అవుతుంది. ఇదే సందని ప్రతిపక్షం వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఎమ్మెల్యేలు గోడ మీద కూర్చుని జంపింగ్ కి రెడీ గా ఉన్నారు అసలే.

అప్పుడు వచ్చింది ఆమెకి  సుధీర్ నుంచి మెసేజ్.

"నేను కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుంటున్నా. ఈ స్ట్రెస్ నేను తట్టుకోలేక పోతున్నా. నా కోసం వెతకటానికి ప్రయత్నించ వద్దు. నేను ఏం చేయాలనేది ఆలోచించుకునే వరకూ నువ్వే ఎలాగో మేనేజ్ చేయి ప్లీజ్" 

వెంటనే అతనికి ఫోన్ చేయటానికి ప్రయత్నించింది బృంద. మెసేజ్ పంపి ఫోన్ ఆఫ్ చేసినట్లున్నాడు. 
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS