Previous Page Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 6

 

ఎంగేజ్మెంట్ ఫంక్షన్ని నేను మధు ప్లాన్ వేసుకుని హోటల్లో చక్కగా చేసాం.  
వెబ్కాస్టింగ్ కూడా ఆరెంజ్ చేసాము. 
సంజయ్, వాడిస్నేహితులు కూడా ఇంటర్నెట్లో వీక్షించారు. 
మంజరి కూడా చక్కగా అలంకరించుకుని హాపీగా, కలివిడిగా అందరితో మాట్లాడుతూ సందడి చేసింది. 
ప్రవల్లిక చెప్పిన మాటలు నా మెదడులో తిరుగుతున్నాయి కనుక నా ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉంచాను. 
నాకేమీ అభ్యంతరాలు కనపడలేదు. అంతా సరిగానే ఉందనిపించింది. 
ఒక నెల తరువాత పెళ్లి ముహూర్తం అన్నారు. 
పెళ్లి విజయవాడ లో చేస్తామని చెప్పారు ముకుందరావు. 
అన్నిటికీ ఓకే అంటున్నాడు మధు.
సంజయ్ కూడా ఒక నెల లీవ్ పెట్టుకుని వస్తున్నాడు. 
పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయి వీసా స్టాంపింగ్ చేయించి తనతో తీసుకెళ్లేట్లు ప్లాన్ చేస్తున్నాడు. 
వీసా స్లాట్ బుక్ చేసాడు మంజరికి. 
రిటర్న్ టికెట్స్ ఇద్దరికీ బుక్ చేసాడు కూడా. 
సో, అంతా మ్యారేజ్ డే కోసం ఎదురు చూస్తున్నారు. 
****
పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి.
 పెళ్ళంటే జీవితంలో ఒక అతి పెద్ద ఈవెంట్. 
కాకుంటే ఈ కాలంలో అన్నీ సులువుగా జరిగిపోతున్నాయి.
అన్ని పనులకు అందరూ కాంట్రాక్టర్స్ ఉన్నారు కాబట్టి. 
వాళ్లకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. 
మగపెళ్ళివారి కంటే ఆడపెళ్ళివారికి ఎక్కువ పనులు, బాధ్యతలు ఉంటాయి. సంస్కారంకొద్దీ అందరూ అన్నీ షేర్ చేసుకుంటూ సరదాగా కానిచేస్తారు ఏ ఆటంకాలు లేకుండా. 
మాదీ అదే పధ్ధతి. 
మధు, ప్రవల్లిక చాలా హడావిడి పడుతున్నారు పెళ్లిపనుల విషయంలో. అందులోనూ మొదటినుంచి మా అలవాటు మన సంప్రదాయాలు, ఆచారాలు, పెళ్లి పద్దతులకి పెద్ద పీట వేస్తాం. 
ఆ విషయంలో మా పెద్దల్ని తూచా తప్పకుండా అనుసరిస్తాం.
అంతా శాస్త్రోక్తంగా జరగాలి అని పట్టుబట్టాడు మధు. 
మంచిదేరా అని చెప్పాను. 
వాడి ఇష్ట ప్రకారమే మంచి పురోహితుడిని మాట్లాడాను మా క్లైంట్స్ ద్వారా. 
ఆ విషయమే ముకుందరావుకి కూడా చెప్పాము. 
ఆయన కూడా సరే అన్నాడు. 
ఎక్కడైనా వెసులుబాటు, ఇబ్బందులున్నా ఫరవాలేదు గానీ పెళ్లి తంతు మాత్రం శాస్త్ర ప్రకారం జరగాలి అని నొక్కి వక్కాణించాము ఇద్దరం. 
మా పురోహితుడు, వాళ్ళ పురోహితుడు పలుమార్లు ముచ్చటించుకున్నారు ఫోన్లో. 
ఇద్దరికీ ఉమ్మడి జాబితా కూడా తయారయ్యింది.
నాకు కోర్ట్ పనులతో బాటు పెళ్లిపనులు కూడా కలవడంతో బాగా ఉక్కిరి బిక్కిరి గా ఉంది. 
కాకుంటే నా దగ్గర తెలివైన జూనియర్స్ ఉన్నారు.
 వాళ్లకి చాలా వరకు కేసులు  అప్పగించాను. 
ఉత్సాహంగా చూసుకుంటున్నారు ఒకరికొకరు పోటీపడుతూ. 
పెళ్ళికి వచ్చే వాళ్ళు  చాలా మంది ఉన్నారు. 
అందులో చాలా వరకు   హైదరాబాద్ నుంచి విజయవాడ కి బయలుదేరేట్లున్నారు. 
అందరికి సరిపడా నాలుగు పెద్ద ఏ సి బస్సులు మాట్లాడాను. 
ఒక పద్ధతిలో పెళ్లి పనులు అన్నీ చక చక జరుగుతున్నాయి.   
గంట గంటకి మధు, ప్రవల్లిక ఫోన్లు. 
వాళ్ళింట్లో ఇది మొదటి పెళ్లి కదా. 
అందులోను ముద్దుల కొడుకు సంజయ్ ది . 
కంగారు తో కూడిన ఆనందంగా ఆ ఇద్దరిలో కనపడుతోంది. 
మధు, ప్రవల్లిక రోజూ సంజయ్ తో మాట్లాడుతున్నారు. 
చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరిస్తున్నారు.
పెళ్లి బాధ్యతలను అందరం పంచుకున్నాం.
 నేను, మా ఆవిడ శశిరేఖ, మధు, ప్రవల్లిక, వాళ్ళ అమ్మాయి శృతి అందరం వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి తలకొక బాధ్యత తీసుకున్నాం.
శృతి  మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతోంది. 
తనకి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. 
అలాగే మావాడు శ్రీరామ్, మధు కొడుకు సంజయ్ మద్రాస్ ఐఐటి లో చదివారు. 
సంజయ్ కంటే శ్రీరామ్ ఒక సంవత్సరం చిన్న . 
వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో.  
వాళ్ళు చాలా మంది పెళ్ళికి వస్తారు. 
అందరిని కలుపుకుంటూ తలా ఒక్కో పని అప్ప చెపుతున్నాను కంట్రోల్ మాత్రం నా దగ్గర పెట్టుకుని.  
అందువల్ల అన్నీ పద్దతిగానే జరుగుతాయని నాకు ధైర్యం ఉంది. 
అందరం తలా ఒక చెయ్యి వేసి సులువుగా ఫంక్షన్ చెయ్యొచ్చు ఇబ్బందేమీ ఉండదు అనుకున్నాను. 
అందులోను మగపెళ్ళివాళ్ళం.
 పెద్ద పనులేముంటాయి. 
ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు. 
మధుకి బ్యాంక్లో ఆడిట్ జరుగుతోంది. 
అందులో వాడు ఆడిట్ కి హెడ్. 
ఆఫీస్ పనిలో తలమునకలవుతున్నాడు.
 వాడికప్పగించిన పనుల బాధ్యత కూడా నేను తీసుకున్నాను. 
ఖాళీ దొరికినప్పుడు జాయిన్ అవుతున్నాడు వాడు. 
మధుకి అకస్మాత్తుగా సందేహం వచ్చి అడిగాడు నన్ను. 
ఒరేయ్ మనం సరిపోతామా ఈ పనులన్నింటికీ ? ఇంకా ఎవరినన్నా మన టీంలో చేర్చనా అని. 
వద్దురా అని చెప్పాను. మనం ముఖ్య బాధ్యతలు తీసుకున్నాం. 
ఎలాగూ అందరికి వాళ్ళ వాళ్ళ సర్కిల్ అఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. 
వాళ్ళు తమ వాళ్ళని కలుపుకుని మేనేజ్ చేస్తారు. 
నువ్వేం కంగారు పడకు. అంతా సవ్యంగా జరుగుతుంది అని భరోసా ఇచ్చాను. మొత్తం కార్యక్రమానికి నేను హెడ్డుని అని చెప్పాను నవ్వుతూ. 
అమ్మయ్య అంటూ రిలీఫ్ ఫీల్ అయ్యాడు మధు. 
అవును గానీ మీ వాడు శ్రీరామ్ ఎప్పుడొస్తున్నాడు ? వాడిని కూడా  ఒక నెల లీవ్ పెట్టుకుని రమ్మను. 
పిల్లలందరూ ఉంటె హుషారుగా ఉంటుంది. 
పెళ్లి సందడి వాళ్ళే చూసుకుంటారు. మనం రిలాక్స్ అవ్వొచ్చు అన్నాడు మధు. 
అసలు సంగతి మధుకి పెళ్లి ముందు రోజు వరకు చెప్పొదనుకున్నాను. 
మా వాడు శ్రీరామ్ నెల క్రితమే మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యాడు టీమ్ లీడ్ గా. 
వాడికి పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పారు. 
ఆరు నెలలవరకు నేనెక్కడికి కదలలేను డాడీ అని నెల క్రితమే చెప్పాడు. 
ఆ విషయం సంజయ్ కి కూడా తెలుసు. 
ఈ విషయం ఇప్పుడే చెప్పి మధు మనసు ఎందుకులే కష్టపెట్టడం అని సరేరా తప్పకుండా వస్తాడులే నేను ఆల్రెడీ చెప్పాను అంటూ తప్పించుకున్నాను.
వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యి వచ్చాయి. 
మా ఆఫీస్ క్లర్క్ అందరి చిరునామాలు ప్రింట్ చేసి ఉంచాడు. 
అతను వాటిని చక్కగా స్టికర్ పేపర్ మీద ప్రింట్ చేసి వాటితో అంటించేసాడు. మధు వాళ్ళ వియ్యంకుడు ముకుందరావుకి కొరియర్ లో ఒక కార్డు పంపాము. 
మూడు రోజుల తరువాత ముకుందరావు నుంచి ఫోన్ వచ్చింది మధుకి.  
ఇంకా వెడ్డింగ్ కార్డు రాలేదేమని.
 వాళ్ళ కార్డు మధు వాళ్లకు వచ్చి రెండు రోజులయింది. 
మధు కంగారుపడుతూ నాకు ఫోన్ చేసాడు,  వాళ్లకు ఇంకా కార్డు అందలేదట్రా అని . 
మా క్లర్క్ కొరియర్ వాడితో మాట్లాడాడు. 
వాడు డెలివర్ చేసినట్లుగా చెప్పాడు.
 ప్రూఫ్ అఫ్ డెలివరీ కూడా వాట్సాప్ లో పంపాడు. 
అది మధు కి ఫార్వర్డ్ చేసాను . 
దాని మీద వాణి అని మంజరి వాళ్ళ అమ్మ సంతకంలా ఉంది.
పక్కరోజు విజయవాడలో ఒక కేసు తాలూకు క్రాస్ ఎక్సమినేషన్ కోసం వెళ్లాల్సి ఉంది. 
అదే విషయం మధు తో చెప్పాను. 
నేను పర్సనల్ గా ఒక కార్డు తీసుకు వెళ్లి ముకుందరావు వాళ్ళకి ఇస్తానురా నువ్వేమీ వర్రీ అవ్వకు అని. 
మధు హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. 
నాకు ముకుందరావు అడ్రస్ ఇచ్చాడు. 
ఫోన్ చెయ్యొద్దులేరా, వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం.
 నేను వీలు చూసుకుని మధ్యలో ఒక గంట వాళ్ళింటికి వెళ్లి ఇచ్చేస్తాను అని చెప్పాను. 
ముందే చెప్తే మరీ మర్యాదలెక్కువవుతాయి. 
అంత మర్యాదలు నాకు సరిపడవు . 
సరే అన్నాడు మధు. 
వాట్సాప్ లో వాళ్ళ పూర్తి అడ్రస్, లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేసాడు.  
అనుకున్నట్లు గానే ఆరోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి విజయవాడకి నా కారులో బయలుదేరాను డ్రైవర్ ని తీసుకుని. 
కోర్ట్ కి సమయానికి చేరుకోగలిగాను. 
కోర్టులో పని పూర్తి చేసుకుని పన్నెండు కల్లా కోర్ట్ నుంచి బయటపడ్డాను.
కారులో మధు ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లాను. 
రోడ్ వేస్తున్నట్టున్నారు ఆ వీధిలో. 
కారు అక్కడే ఆపి డ్రైవర్ కి చెప్పి అపార్ట్మెంట్స్ కి చేరుకున్నాను. 
వాచ్ మెన్ కనపడలేదు ఆ దరిదాపుల్లో. 
సరేలే అనుకుని థర్డ్ ఫ్లోర్ కి వెళ్లాను. 
లిఫ్ట్ పక్కనే ముకుందరావు అపార్ట్మెంట్. 
కాలింగ్ బెల్ నొక్కాను. 
తలుపు కొంచెం తీసి చూసింది ఒక అమ్మాయి. 
 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS