Previous Page Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 7

 

మంజరి అని పోల్చుకోగలిగాను ఆ అమ్మాయిని. 
అప్పుడే పడుకుని లేచివచ్చినట్లుంది. 
జుట్టు చెదిరిపోయి బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. 
ఎవరు కావాలి అని అడిగింది. స్వరంలో కొంచెం బెరుకు వినిపించింది. 
ముకుందరావు గారి ఫ్లాట్ ఇదే కదా. 
అవును మీరెవరు అని అడిగింది మంజరి.
నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. మధు ఫ్రెండ్ ని. 
ఈ వెడ్డింగ్ కార్డు ముకుందరావు గారి కి ఇవ్వాలి . లోపలి రావచ్చా అని నవ్వుతూ అడిగాను.  
కంగారుపడుతూ తలుపు పూర్తిగా తీసి లోపలికి రమ్మంది. 
హాల్ లో ఉన్న సోఫాలో కూర్చున్నాను ఇల్లంతా కలయ చూస్తూ. 
ఇంతలో ఒక కుర్రాడు పై ఆచ్ఛాదన ఏమీ లేకుండా గడ్డం నిమురుకుంటూ  లోపలినుంచి వచ్చాడు ఎవరు స్వీటీ వచ్చింది అనుకుంటూ. 
మంజరి కంగారు పడుతూ అతన్ని లోనికెళ్ళమని సైగ చేసింది. 
మీసం మెలివేసుకుంటూ లోపలికెళ్ళాడతాను.
మనిషి కాస్త చామన ఛాయలో వస్తాదులాగా ఉన్నాడు. 
అతను మా కజిన్ అంకుల్. పిన్ని కొడుకు. 
నిన్ననే వచ్చాడు రాజమండ్రి నుంచి. 
అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని గబ గబా అప్పచెప్తోంది మంజరి నేను ఏమీ అడక్కపోయినా. 
చాలా కంగారుగా ఉంది తను.
మమ్మీ డాడీ లేరామ్మా అని అడిగాను అతను వెళ్లిన రూమ్ వైపు తేరిపారా చూస్తూ. 
మమ్మీ కాలేజీ కి వెళ్ళింది అంకుల్. 
డాడీ కాకినాడ ఆఫీస్ డ్యూటీ మీద వెళ్లారు నిన్న. రేపు వస్తారు అని చెప్పింది జుట్టు, బట్టలు సవరించుకుంటూ. 
మాటలు నిదానంగా లేవు. ఏవో అప్పచెపుతున్నట్లుగా ఉంది. మోహంలో భయం, బెరుకు, తత్తరపాటు మిళితమై ఉన్నాయి. వెరసి కంగారు కంగారుగా ఉంది తను.
ఇంట్లో బామ్మ గారు లేరా అని అడిగాను. 
లేదు అంకుల్. మా అత్తయ్య వాళ్ళింట్లో ఉంది వారంనుంచి అని చెప్పింది మంజరి.  
సరేనమ్మా. మీ అమ్మగారు వస్తే ఈ వెడ్డింగ్ కార్డు ఇవ్వు. 
మీ కాబోయే మామగారు మధు పర్సనల్ గా ఇవ్వమన్నారని  చెప్పు. 
వాడు కొరియర్ లో పంపింది మీకు చేరలేదట. 
తీసుకున్న వాళ్ళ పేరు చూస్తే మీ మమ్మీ పేరుతొ ఉంది. 
మరి ఎవరు తీసుకోనుంటారు అని ప్రశ్న వేసాను. ఎలాగైనా కొంచెం సేపు అక్కడ ఉందాము అన్న ఉద్దేశంతో.
ఏమో అంకుల్ నాకు తెలీదు. కనుక్కుంటాను అంది.   
గొంతులో అదే తడబాటు, అదే కంగారు. 
లాయర్ ని కదా అనుమానాలు మొదలయ్యాయి. 
కొంచెం మంచినీళ్లిస్తావా అని అడిగాను.
ఓకే అంకుల్. తెస్తాను అని లోపలికెళ్లింది తప్పదన్నట్లు.
ముందుగా ఆ కుర్రాడున్న రూంలో కెళ్ళి ఏదో చెప్పి మరలా వంటింట్లో కెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది.  
కాఫీ తాగుతున్నట్లు మెల్లగా సిప్ చేస్తూ మంచి నీళ్లు తాగాను మంజరినే చూస్తూ. 
ఏదో బెరుకు కనిపిస్తోంది ఈ అమ్మాయిలో అన్న ప్రశ్న వేధిస్తోంది.   
ఎప్పుడు లేచి వెళతానా అని ఎదురుచూస్తోంది మంజరి. 
ఎక్కువ మాట్లాడటం ఇష్టంలేనట్లు ముఖం అదోలా పెట్టింది కూడా.
ఏవో ఆలోచనలు నా మెదడును తరుముతున్నాయి. 
తెలియాల్సిన విషయమేదో ఉంది అని మనసు చెప్తోంది. 
అలా ఆలోచిస్తూనే లేచి నిలబడ్డాను ఇక ఎక్కువ అక్కడ వెయిట్ చేసే అవకాశం లేక.  
ఎందుకంటే మంజరి నేను ఎప్పుడు వెళతానా అని చూస్తోంది నావైపు. 
వస్తానమ్మా. అంతా ఓకేనే కదా మళ్ళీ ఒకసారి లోపలికి చూస్తూ అడిగాను.  
ఆ.... ఆ.... అంతా ఓకే అంకుల్ అంటూ లేచి తలుపు దగ్గర నిలబడింది మీరెళ్తే నేను తలుపేసుకుంటాను అన్నట్లు. 
మంజరి గొంతులో తడబాటు ఇంకా తగ్గలేదు. 
తప్పదన్నట్లు బై  చెప్పి బయటకొచ్చాను. 
నా వెనకాలే దభాలున తలుపేసుకుంది మంజరి.  అమ్మయ్య అన్నతన నిట్టూర్పు తెరచివుంచిన కిటికీలోనుంచి గట్టిగానే వినిపించింది. 
****
అపార్ట్మెంట్స్ నుంచి బయటకి వచ్చానే గాని అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. 
ఏదో ఉంది. అదేదో అంతు బట్టడం లేదు. 
కారులో కూర్చొని హోటల్ కి పోనివ్వమన్నాను లంచ్ చేద్దామని. 
భోజనం చేస్తూ ఆలోచించాను ఎలా చేస్తే బాగుంటుందా అని. 
లంచ్ తిన్నాననిపించి డ్రైవర్ ని పిలిచి మళ్ళీ కోర్ట్ కి పోనివ్వమన్నాను. 
ఒక వెరీ క్లోజ్ జూనియర్ అడ్వకేట్ ఉన్నాడు. ఆతని పేరు భాస్కర్. 
క్రిమినల్ కేసెస్ లో ఎక్స్పర్ట్. కేసు ఇన్వెస్టిగేషన్ లో దిట్ట. 
అన్ని కోణాలలో ఆలోచిస్తాడు. 
అతనికి ఈ విషయం అప్పచెపుదామనిపించింది. 
విషయం కేవలం అనుమానంగానే ఉన్నా ఎందుకో శోధన చేస్తేనే కాని మనసు ఆగేట్టు లేదు. 
అందునా పెళ్లి విషయం. ఏ మాత్రం తేడాలున్నా జీవితాలు, కుటుంబాలు, మనసులు దెబ్బతింటాయి. 
కారు కోర్ట్ ఆవరణలో ఆగగానే హుటాహుటి బార్ అసోసియేషన్ వైపు దారి తీశాను. 
లంచ్ టైం కదా బార్ అసోసియేషన్ లోనే కూర్చోనున్నాడు భాస్కర్. 
నా విజయవాడ కేసులు అతనే ఎక్కువ చూస్తుంటాడు. 
నేనంటే మంచి అభిమానం కూడా. 
భాస్కర్ కజిన్ మనోహర్ నా దగ్గర హైదరాబాద్ లో జూనియర్ అడ్వకేట్ గా ఉన్నాడు. 
అతనిని కాంటీన్ కి తీసుకెళ్లి ఎవ్వరు లేని చోట కూర్చున్నాం.  
అన్ని విషయాలు వివరంగా చెప్పాను. 
ముకుందరావు కూతురు మంజరి తో పెళ్లి సంబంధం కుదరడం, పొద్దున వాళ్ళింటికి వెళ్లడం, అక్కడ చూసిన సన్నివేశాలు అన్నీ పూసగుచ్చినట్లు చెప్పాను. 
ఇంకొక రెండు వారాల్లో పెళ్లి జరగబోతోంది భాస్కర్. 
ఈ సమయంలో నాకు ఇటువంటి సన్నివేశాలు ఎదురవ్వడం, అవి బోలెడు అనుమానాలకు దారి తీయడం అన్నీ చెప్పాను.
అతను వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు. 
ఈ విషయం నాకొదిలెయ్యండి సర్. రెండు రోజులు టైం ఇవ్వండి. 
పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి మీకు పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. 
భాస్కర్ తలచుకుంటే సాధించగలడు. అతని మీద నాకు అపార నమ్మకం. 
థాంక్యూ భాస్కర్. చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. నాకు ఎంత తొందరగా విషయం చెప్తే అంత మంచిది అని రిక్వెస్ట్ చేసాను. 
తప్పకుండా సర్. ఇప్పటినుంచి అదే పనిలో ఉంటాను అన్నాడు భాస్కర్.
భాస్కర్ కి మళ్ళీ మళ్ళీ చెప్పి బయలు దేరాను.
సరే రెండు రోజులు కదా. ఏ మాత్రం తేడా వచ్చినా పెళ్ళికి ఇంకా పది రోజులు టైం ఉంది. తాళి కట్టే లోపు నిర్ణయం తీసుకోవచ్చు అనుకుని సమాధానపడ్డాను.
మధ్య దారిలో మధు నుంచి ఫోన్ వచ్చింది. 
మంజరి కి కార్డు ఇచ్చానురా అని  చెప్పాను. 
ముకుందరావు, వాణి వాళ్ళు లేరా అని అడిగాడు. 
ముకుందరావు క్యాంపు లో ఉన్నాడురా. వాణి గారు కాలేజీ కెళ్ళారు. మంజరి, తన కజిన్ ఇద్దరే ఉన్నారు అని చెప్పాను. నా అనుమానాలేవీ వాడితో చెప్పలేదు. ఏమీ ఆధారాలు లేకుండా మాట్లాడటం నాకు అలవాటు లేని పని. 
సరేరా. థాంక్యూ అని చెప్పాడు మధు.
హైదరాబాద్ చేరేసరికి రాత్రి తొమ్మిదయ్యింది.
శ్రీమతి ఎదురు చూస్తోంది. 
భో జనాలప్పుడు అడిగాను ఇవాళ పెళ్లి పనుల ప్రోగ్రెస్ ఏంటని. 
శశి అన్నీ వివరించింది. 
అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయండి. ఇబ్బందేమీ లేదు అంది. 
పొద్దున నేను చూసిన విషయం తనకి చెప్పలేదు. రెండు రోజులాగి విషయం తేలిన తరువాత చెపుదాంలే అనుకుని ఆగాను. 
ఆ రోజంతా బాగా బిజీగా ఉండటం, ప్రయాణం బడలికతో త్వరగా పడుకున్నాను. 
అందులోను కొంచెం డల్ గా అనిపించింది. 
పొద్దున లేచి ఆ రోజు కేసులు చూసుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నాను. 
ఆఫీస్ రూమ్ లో జూనియర్ అడ్వొకేట్లు బిజీగా ఉన్నారు.
మనోహర్ రాలేదా అని అడిగాను.
దారిలో ఉన్నాడు సర్. ఫోన్ చేసాడు పది నిముషాలలో వస్తానని.
సరే అంటూ డ్రాఫ్టింగ్స్ చెక్ చేస్తున్నాను.
ఇంతలో మనోహర్ వచ్చాడు. 
వస్తూనే పిడుగులాంటి వార్త చెప్పాడు. 
భాస్కర్ కి రాత్రి పెద్ద ఆక్సిడెంట్ జరిగి హాస్పిటల్ లో ఉన్నాడట. 
కాలు రెండుగా విరిగింది. లోపల రాడ్ వెయ్యాలి. ఇవాళ ఆపరేషన్ అట.  
నాకు ఒక్కసారి నీరసం ఆవహించింది. 
ఇప్పుడేమి చెయ్యాలి. ఏమీ తోచక కాసేపు అలానే నిస్తేజంగా ఉండిపోయాను.
ఆధారాలు లేకుండా ఎవరితోనైనా ఎలా చెప్పగలను. 
 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS