Previous Page Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 5

 

ఎప్పుడూ లాప్టాప్ మీద ఏవో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది. 
తాను ఎలెక్ట్రికల్స్ ఇంజనీరింగ్ కదా.   
ఎప్పుడూ చదువు మీదే ధ్యాస అంటూ మురిసిపోయాడట తండ్రి ముకుందరావు. 
వాళ్ళ అమ్మ వాణి కూడా మంజరి చదువులో ఫస్ట్ అండి. 
కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా నాలుగు సంవత్సరాలు ఎంపికయ్యింది. 
మాకు ఇంటా బయటా మంచి పేరు తెచ్చింది తను అంటూ వంత పాడింది. 
అంతా మేమే మాట్లాడుతున్నాము. 
మీరేదయినా అడగండి అమ్మాయిని అన్నారు ఇద్దరూ. 
ఇంతలో ఒక పెద్దావిడ వాకర్ సహాయంతో హాల్లోకొచ్చింది 'ఎవర్రా వచ్చింది ' అంటూ. 
మా అమ్మ అంటూ పరిచయం చేసాడు ముకుందరావు. 
మన మంజరి ని చూసేందుకు వచ్చారు అమ్మా అని ఆవిడకి పెద్దగా చెప్పాడు. 
ఓ ! అంటూ తేరిపార చూసింది ఆమె.
మధు, ప్రవల్లిక నమస్కారం చేశారు పెద్దావిడకి. 
ఆవిడని ఒక కుర్చీలో కూర్చోపెట్టారు ముకుందరావు. 
ప్రవల్లిక కి మంజరి బాగా నచ్చింది. 
చదువు, అందం, చక్కటి మేని ఛాయ తమ సంజయ్ కి ఈడు జోడు సరిపోతుంది అనుకుని సంబరపడింది. 
కానీ ఎందుకో ఆ అమ్మాయి అంత కలగొలుపుగా లేదు. 
ఏమై ఉండొచ్చు అన్న ఆలోచనలో పడింది. 
ఏదో ఒకటి మాట్లాడక తప్పదు అని మాటలు మొదలుపెట్టింది. 
ఏమ్మా ఏంటి నీ హాబీస్ ?  నవ్వుతూ అడిగింది.
ఏంలేదు ఆంటీ. టి వి చూడడం, బుక్స్ చదవడం వగైరా వగైరా అంది ముక్తసరిగా ముఖంలో ఏ భావాలు కనిపింఛకుండా.
తల్లి వాణి కల్పించుకుని చెప్పింది. 
పాటలు పాడటం, డాన్స్ చెయ్యడం చేస్తుంటుంది. 
బయట ప్రదర్శనలేవీ లేదు కానీ ఇంట్లో తనే టి వి చూసి నేర్చుకుంటూ ఉంటుంది. 
ఇక సుధామూర్తి గారు తనకు బాగా ఆదర్శం. 
ఆమె గురించి, ఆవిడ రాసిన పుస్తకాలు బాగా చదువుతూ ఉంటుంది. 
నువ్వేం మాట్లాడటంలేదు మంజరి. 
అంతా మీ అమ్మగారే మాట్లాడుతున్నారు నవ్వుతూ అంది ప్రవల్లిక.
దానికి కూడా నవ్వి ఊరుకుంది మంజరి ముక్తసరిగా.
ఇల్లు చూద్దాం రండి అని లేచింది వాణి వాతావరణాన్ని తేలిక పరుస్తూ. మంజరి కూడా లేచింది తల్లితోపాటు. 
ప్రవల్లిక వాళ్ళని అనుసరించింది. 
ప్రవల్లిక మంజరినే గమనిస్తోంది. 
ఏంటి ఈ అమ్మాయి. నచ్చినట్టే ఉంది కానీ ఏదో అనుమానం రేకెత్తిస్తోంది. ఎటూ తేల్చుకోలేక పోతోంది. 
బాల్కనీ లో పూల మొక్కల దగ్గర ఆగారు. 
ఇవన్నీ మా అమ్మాయి టేస్ట్ అండి. 
పూల మొక్కలు స్పెషల్ గా పెంచుతుంది. 
వాటిని పదిలంగా చూసుకుంటుంది అని మెచ్చుకోలుగా కూతురి వైపు చూసింది వాణి.
మంజరి మొహంలో అప్పుడు కొంచెం నవ్వు వికసించి పూలతో పోటీ పడింది. 
అమ్మయ్య అనుకుంది ప్రవల్లిక. ఫరవాలేదులే. కొత్తయి ఉండొచ్చు. 
పెళ్ళైతే తనే సర్దుకుంటుంది అన్న నిర్ణయానికి వచ్చింది. 
నీ మొబైల్ నెంబర్ చెప్పు మంజరి. నీకు కాల్ చేసి మాట్లాడుతాను. 
ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ కదా అంది ప్రవల్లిక సరదాగా.
మొబైల్ అస్సలు వాడదండి మా అమ్మాయి అంది వాణి. 
రెండు సార్లు కొనిచ్చాం. ఒకసారి ఎక్కడో పారేసుకుంది. ఇంకో సారి బట్టలతో వాషింగ్ మెషిన్ లో వేసింది. ఇక కొనివ్వడం మానేసాం. 
దాని ఫ్రెండ్స్ నాకుగాని, వాళ్ళ డాడీ కి గాని ఫోన్ చేసి తనకివ్వమంటారు. 
మా ఫోన్లో నే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ తోటి. 
ఓహ్ అంది ప్రవల్లిక ఏమనాలో తెలీక. 
ఇంకొక మారు అందరికీ కాఫీలు వచ్చాయి. 
కాఫీ తాగేసి బయలుదేరారు మధు, ప్రవల్లిక.
బయట చెప్పులేసుకుంటుంటే ప్రవల్లిక కి మంజరి మాటలు చెవులను తాకాయి.
'వాళ్ళే మన వెంట పడుతున్నారు బామ్మా' అని వాళ్ళ బామ్మకి చెప్తోంది. ఎందుకో చివుక్కు మంది ప్రవల్లికకి. 
అదేదో తాము బలవంతంగా వచ్చినట్లు ఫీల్ అయ్యింది. 
మూడో ఫ్లోర్ నుంచి మధు, ప్రవల్లిక లిఫ్టులో దిగారు. 
ముకుందరావు కారు వరకూ వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. 
మేము వెళ్ళగానే ఒకటి రెండు రోజుల్లో మీకు ఫోన్ చేస్తాము అని చెప్పాడు మధు మర్యాదపూర్వకంగా. 
చాలా థాంక్స్ అండి అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు ముకుందరావు.
కారు బయలుదేరిన తరువాత మధు ప్రవల్లిక ని అడిగాడు. 
ఏంటి నీ అభిప్రాయం అంటూ.
ఎటూ తేల్చుకోలేక పోతున్నానండి అని చెప్పింది. 
ఆ అమ్మాయి ముభావానికి, ముక్తసరి మాటలకి నాకు అర్ధం తోచటం లేదు. మిగతా విషయాలన్నీ మన సంజయ్ కి చక్కగా సరిపోతాయి. ఎటూ తేల్చుకోలేక పోతున్నాను అంది ప్రవల్లిక. 
ఓకే. రెండు మూడు రోజులు తీరిగ్గా అలోచించి నిర్ణయం తీసుకుందాం. తొందరేముంది, నవ్వుతూ అన్నాడు మధు.
****
మధుకి, ప్రవల్లిక కి ఏదన్నా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే మా ఇంటికి వచ్చి చర్చించాల్సిందే. 
అది మొదటినుంచి ఆనవాయితీ.
మంజరి విషయంలో కూడా ఆదివారం మా ఇంటికి వచ్చారు భోజనానికి. డిస్కషన్ మొదలయ్యింది. 
ప్రవల్లిక పాయింట్ బై పాయింట్ చెప్పింది.
 ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు అన్నీ బేరీజు వేసాము. 
ప్లస్ పాయింట్లు ఎక్కువగానే తూగాయి. 
నేను, మా ఆవిడ అన్ని విషయాలు శ్రద్ధగా ఆలకించాం. 
కొన్ని క్రాస్ ప్రశ్నలు కూడా వేసి లోతుగా చర్చించాము. 
మా ఆవిడ కూడా కొన్ని లా పాయింట్స్ లేవనెత్తి సమాధానం రాబట్టింది.
ఆ అమ్మాయి ఫోటో, వివరాలు ఆల్రెడీ సంజయ్ కి వెళ్లాయి. 
ఫోటో మరియు మిగతా వివరాలు అన్నీ వాడికి నచ్చాయి. 
సో వాడి వైపు నుంచి అంతా ఓకే.
వీళ్ళకి అమ్మాయి ఓకే అయితే నెక్స్ట్ వాడు స్కైప్ లో అమ్మాయితో మాట్లాడుతాడు.
అమ్మాయి ముభావం, ముక్తసరి  అనే ఆ రెండు మాటలు తప్పితే అందరికీ ఓకే అన్నట్టుగానే ఉంది మంజరితో పెళ్లి సంబంధం.
సంజయ్ ని  కూడా ఆ అమ్మాయితో మాట్లాడనీ. 
అప్పుడు చూద్దాం అని నా తుది నిర్ణయం చెప్పాను. అది అందరికీ నచ్చింది.
ఇంకేముంది. 
సంజయ్ స్కైప్ లో మాట్లాడటం, వాడికి ఓకే అవడం, అన్నీ చక చక జరిగిపోయాయి.
సంజయ్ తో ఆ అమ్మాయి బాగానే మాట్లాడింది. 
కాకుంటే ఆ అమ్మాయి వెనకాలే తల్లితండ్రులు కూడా నిల్చున్నారట. 
ప్రైవేట్ గా మాట్లాడేందుకు వీలు లేకపోయింది అని చెప్పాడు. 
సరేలే మంచిదే కదా. మంజరి తల్లితండ్రులు మరీ స్ట్రిక్టుగా ఉన్నారు అనుకున్నాం. 
అదీ మంచిదేలే అనుకున్నారు మధు, ప్రవల్లిక. 
ముకుందరావు మధుకి ఫోన్ చేసి వాళ్లకి, వాళ్ళ అమ్మాయికి సంజయ్ బాగా నచ్చాడని చెప్పారు. 
కట్న కానుకలు మిగతా ముఖ్య విషయాలకు మా ఇల్లు వేదిక అయ్యింది.
ఆ రోజు వాళ్ళ తరపు బంధువులు కూడా కొంతమంది వచ్చారు మంజరి తప్ప. ముకుందరావు పెద్ద కూతురు అల్లుడు కూడా వచ్చారు. 
వాళ్ళందరిని చూసి నాకు ముచ్చటేసింది. 
కుటుంబం కలగొలుపులుగా అంతా బాగానే ఉంది. 
నాకు నచ్చింది. ఆ విషయమే మధు, ప్రవల్లిక తో చెప్పాను. 
వాళ్ళూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 
మధు పాయింట్ బ్లాంక్ గా చెప్పాడు కట్న కానుకలేవీ వద్దని. 
కానీ వాళ్ళు పెద్దమ్మాయి తో సమానంగా లాంఛనాలు ఇస్తామన్నారు ముకుందరావు. 
ఒప్పుకోక తప్పలేదు మధుకి. సరే అన్నాడు. 
పెళ్లి కూడా సింపుల్ గా చెయ్యమని చెప్పాడు మధు. 
తలకు మించిన భారం వద్దు అనేది మా వాడి సూత్రం. 
దానికి మళ్ళీ పెద్దమ్మాయి కి చేసినట్టే చేస్తామని చెప్పాడు ముకుందరావు. మళ్ళీ సరే అన్నాడు మధు. 
ఆ విధంగా పెళ్లి నిర్ణయాలు చక చకా జరిగాయి.  
పద్ధతి ప్రకారం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మీరే చెయ్యాలి బావగారు అని అప్పుడే ముకుందరావు వరసలు కలిపి చెప్పేసాడు. 
సరే అన్నాడు మధు. 
మావాడు పెళ్లి కుదిరిన ఆనందంలో దేనికైనా రెడీ అనేట్లున్నాడు.
ఎంగేజ్మెంట్కి , పెళ్లికి ముహూర్తాలు కనుక్కుని ఫోన్ చేస్తామని చెప్పి బయలుదేరారు ముకుందరావు మరియు వారి తరఫు బంధువులు. 
ఈ కాలంలో ఎంగేజ్మెంట్ అనే పెళ్లికి ముందు తంతు చాలా ముఖ్యమైనదిగా మారింది. 
ముందు కాలంలో అంటే తాంబూలాలు పుచ్చుకోవడం అనేవారు. 
ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ పెళ్లి ఫంక్షన్ లా చేస్తున్నారు.
 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS