Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 5

 

ఎక్కువ సేపు స్క్రీన్ స్పేస్ కోసం ఏదో వాగుతుంటారు వాళ్ళు. దిగ్భ్రాంతి ఎందుకు? నీ మొహం చూశా? తిట్టుకోసాగాడు తనలో తనే సుధీర్.

పళ్ళన్నీ తెరిచి మొహంలో మొహం పెట్టి ఒక జర్నలిస్ట్ మొదలెట్టింది.

"సర్, మీరు ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడి వరకూ వచ్చారు. ఇప్పుడు మీకేం అనిపిస్తుంది?"

"నీ బొంద... సడెన్ గా ఇవ్వాళ అనుకోటానికి ఏముంది?  అసలది ఒక ప్రశ్నా?" తిట్టుకున్నాడు.

కానీ రాజకీయాల్లో వాళ్ళు ఏది అడిగినా ఏదో ఒక సమాధానం చెప్పటానికి ట్యూన్ అయిపోయి ఉంటారు. 

"ఏముందమ్మా, చాలా సంతోషంగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళు చక్కగా చదువుకుని స్కాలర్షిప్ లు అందుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది...రేపు వీళ్ళ లోనే ఒక సత్య నాదెళ్ల, ఒక అబ్దుల్ కలాం తయారు అవొచ్చు...."

మళ్లీ కెమెరా లో మొహం పెట్టి చెప్పిందామె.
"ముఖ్యమంత్రి గారితో ఎక్స్ క్లూసివ్ మన ఛానల్ లో మాత్రమే" 

చుట్టూ ఉన్న వాళ్లంతా మొహాలు చూసుకున్నారు. అందరూ అక్కడే ఉండి అన్ని చానల్స్ వాళ్ళకి దొరుకుతున్న ఇంటర్వ్యూ ఎక్స్ క్లూసివ్ ఎలా అవుతుంది?

బుర్ర గోక్కుంటూనే అందరూ ప్రశ్నలు మొదలెట్టారు.

"మీరు మొత్తం రోడ్లన్నీ వేయించామన్నారు. మీ పరిపాలన లో ఎనభై శాతం రోడ్లు పూర్తి అయ్యాయన్నరు. కానీ ఆ కాంట్రాక్టుల్లో మీరు భారీగా అవినీతి చేశారని మీ మీద ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏమిటి?"

"రాజకీయ నాయకుల మీద ఇలాంటి ఆరోపణలు సహజమేకదా." మృదువుగా నవ్వాడు సుధీర్.

"ఆరోపణలు అందరూ చేస్తారు. రుజువు చేయమనండి." అన్నాడు మళ్లీ.

"ఇది చూడండి." మరో ఛానెల్ అతను ఫోన్ లో వీడియో చూపించటం మొదలెట్టాడు. 

సిటీ లో ఉన్న ప్రధానమైన రోడ్లు, కూడళ్లు అన్నీ గుంటలు పడి, పెచ్చులు లేచిపోయి, కొన్ని చోట్ల మురుగు నీరు నిండి కనపడుతున్నాయి.

"ఇప్పుడు ఏమంటారు?" అడిగాడు.

అతణ్ణి తేరిపార చూసాడు సుధీర్. ప్రతి వెధవకి సెల్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్. పనులు చేసుకోకుండా సన్నాసి వీడియో లు తీయటం, ఫేస్ బుక్ లో అప్లోడ్ చెయ్యటం. 

ప్రభుత్వం లో ఉంటే తెలుస్తుంది. పరిపాలన లో ఎన్ని కష్టాలు ఉంటాయో. 

తడుముకోకుండా సమాధానం ఇవ్వటం మొదలెట్టాడు సుధీర్.
"ఇది ఇప్పటి పరిస్థితి కాదు. మాకు అధికారం రావటానికి ముందున్న రోడ్లు ఇవి."

"లైవ్ చూపించమంటారా?" అడిగాడు అతను. అతణ్ణి పట్టించుకోకుండా మరో ఛానెల్ జర్నలిస్ట్ వైపు చూసాడు సుధీర్.

"సర్, పోని లైవ్ కాదు. ఇది చూడండి" మళ్లీ ఇంకో వీడియో మొదలెట్టాడు ఇందాకటి అతను. అతని ఐడీ కార్డు వైపు చూసాడు. పేరు కనపడుతోంది. వాల్మీకి అట. ఫాన్సీ పేర్లు ఎక్కువ అయ్యాయి జనాలకి.

అతను చూపిస్తున్న రెండో వీడియో లో రోడ్డు కొత్తగా వేసినట్లుంది. దాని మీద ఒక మనిషి నడుస్తున్నాడు. నడిచినంత మేర రోడ్డు పోయి మట్టి కనపడుతోంది.

"వాటిని రోడ్లు అనరనీ, వొట్టిగా నల్ల రంగు ఊదించారని, నడిస్తే పోతుందనీ ప్రజలు అనుకుంటున్నారు" అన్నాడు వాల్మీకి.

"ఇవన్నీ గ్రాఫిక్స్. ఏదో సెన్సేషన్ కోసం ఇటువంటి న్యూస్ మానెయ్యవయ్యా. నువ్వు కావాలంటే క్రియేటివ్ గా రామాయణం రాసుకో...నీ పేరు కి బాగా సూట్ అవుతుంది!" వ్యంగ్యంగా అని ముందుకు కదిలాడు సుధీర్. 

"ఇది మా ఛానెల్ ఎక్స్ క్లూసివ్" మళ్లీ పళ్ళన్నీ కనపడేలా కెమెరా ముందుకు దూకింది ఒక ఛానెల్ కి సంబదించిన ఆమె. 

"ఆయన అందరి ముందూ చెప్పాడు. ప్రశ్నలు అడిగింది నువ్వు కాదు. మీ ఛానెల్ కి ఎందుకు ఎక్స్ క్లుసివ్ అవుతుంది" దెబ్బలాట కి దిగారు మిగతా వాళ్లు ఆమెతో.

అక్కడి నుంచి జారుకోబోయాడు సుధీర్. 

వెనక నుంచి అడగటం వినిపిస్తోంది.
"మీ మీద అవిశ్వాస తీర్మానానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మీకు తెలుసా? అతి త్వరలో మీ ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది అంటున్నారు. మీరేమంటారు?"

ఇది షాక్ లాగే తగిలింది సుధీర్ కి. 

ఇదన్న మాట తన మీద జరుగుతున్న కుట్ర. 

ఊపిరి ఆడట్లేదు అతనికి. 

లోపల అలజడి గా ఉంది. రక్తం కండరాలని, చర్మాన్ని చీల్చుకుని బయటకి వచ్చేలా ఉంది.

తన సిబ్బంది ప్రెస్ కి అడ్డం పడుతుండగా వెళ్లి కార్ లో కూర్చున్నాడు. 

కార్ వెంటనే ముందుకి కదిలింది. మరు క్షణం అతను స్పృహ కోల్పోయాడు. 

***
అదే రోజు...

టైమ్ రాత్రి పదవుతోంది. పుస్తకం చదువుతూ అప్పుడే నిద్ర లోకి జారుకుంటోంది బృంద. ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చింది ఆమెకి. 

అవతల నుంచి విష్ణు…

ఈ టైమ్ లో విష్ణు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు. 

ఆందోళన గా ఉంది అతని గొంతు.
" మేడం, సీఎం గారు కనపడట్లేదు. ఏమయ్యారో తెలిట్లేదు" ఆదుర్దాగా అంటున్నాడు...

 

_____***_____


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS