నిందలు మా అమ్మాయి మీద వేస్తున్నాడు. అది చాలా తప్పు. అలాంటి ప్రేమలు, పిచ్చి పిచ్చి వేషాలు మా ఇంటా వంటా లేవు. నేను నా ఇద్దరు కూతుళ్లను పద్ధతి గా పెంచాను. మా వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చెయ్యరని నాకు గట్టి నమ్మకం. మీ అబ్బాయి ఎటువంటి వాడో ముందు మీరు చూసుకుని మాట్లాడండి. అందులోను అమెరికాలో అన్నేళ్ల నుంచి ఉంటున్నాడు. ఏ అలవాట్లు ఉన్నాయో ఏమో. అనవసరంగా నా కూతురి మీద నిందలు వేస్తున్నాడు. ఆఫెన్సివ్ లోకి దిగాడు ముకుంద రావు.
ఇక నేను కలుగ చేసుకోక తప్పలేదు.
టేబుల్ మీద ఫోన్ ని నా వైపుకు తిప్పుకున్నాను.
చూడండి ముకుందరావు గారు. నేను మధు ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. మధు చెప్పేవన్నీ నిజాలే. మీ అమ్మాయికి మీరు బలవంతంగా పెళ్లి చేశారు. అది మీరు ఒప్పుకోవాలి. మీకు తెలిసే ఈ పెళ్లి చేశారు.
తనకు ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేసి ఇద్దరి జీవితాలని, రెండు కుటుంబాలని ఇరుకున పెట్టారు. ఇవన్నీ ఫోన్లో మాట్లాడేవి కావు. మీ అమ్మాయి కొద్ది గంటల్లో ఇండియా కి బయలుదేరుతుంది.
ఎల్లుండికల్లా హైద్రాబాద్లో ల్యాండ్ అవుతుంది.
మీరు విజయవాడ నుంచి ఎల్లుండి మీ అమ్మాయిని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునేందుకు రండి.
మిగతా విషయాలు ముఖాముఖి మాట్లాడుకుందాం.
మా వాడికి కూడా ఒక కూతురుంది.
మీ అమ్మాయి మీద నింద వేస్తె తనకు వచ్చేదేమీ లేదు.
పెద్దవాళ్ళం మనం సంసారాలు నిలబెట్టాలేగానీ, విచ్ఛిన్నం చెయ్యాలని ఎవ్వరికీ కోరిక ఉండదు.
ఫ్లైట్ ల్యాండ్ అయ్యే డీటెయిల్స్ మీకు మెసేజ్ పెడతాము.
మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకు వెళ్ళండి. ఖచ్చితంగా చెప్పాను మొహమాటం లేకుండా.
ఫోన్ పెట్టేసిన తరువాత మధు కి చెప్పాను.
ఎల్లుండి లీవ్ పెట్టరా. ఇద్దరం ఎయిర్పోర్ట్ కి వెళదాం.
ఆ అమ్మాయి అమెరికాలో ఫ్లైట్ ఎక్కిన తరువాత నేను సంజయ్ తో వివరంగా మాట్లాడతాను.
ఎందుకంటే ఈ వ్యవహారం ఇక అతికేది కాదు.
ఖచ్చితంగా విడాకులే ప్రత్యామ్నాయం. కాకుంటే వాళ్ళు మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చెయ్యొచ్చు.
అయినా కుదరని పని. మిగతా ఏవైనా ఫరవాలేదు కానీ తనకు ఉన్న ప్రేమ వ్యవహారం ఎవ్వరూ మార్చలేనిది.
అందు చేత సంజయ్ కి ఇబ్బందులు లేకుండా, తాను ఇక్కడకి రాకుండా న్యాయపరంగా ఎలా ప్లాన్ చేయాలనేది నేను ఆలోచిస్తాను.
నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పినట్లే.
అదే ఇండియాలో ఉంటె మంజరి ప్రియుడితో కలిసి ఇంకేదన్నా ప్లాన్ చేసుండేది. సంజయ్ ఈ విషయంలో ఎంతో లక్కీ అని చెప్పొచ్చు.
ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. జీవితాలు హతమార్చేవరకు దారితీస్తున్నాయి.
సరేరా. నీవు చాలా ధైర్యం ఇచ్చావు. నీ దగ్గరకి వచ్చేంతవరకు టెన్షన్గానే ఉంది. నువ్వే అన్నీ ప్లాన్ చెయ్యి. సంజయ్ తో టచ్ లో ఉండు. వాడిని గైడ్ చెయ్యి అంటూ లేచాడు మధు.
తప్పకుండారా. సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మన పని సులువు చేసాడు. నువ్వు భోజనం చేసి వెళ్లు. టైం పదయ్యింది.
వద్దురా. ఇంట్లో మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఇవాళ్టికి వదిలెయ్యి. ఇంకో రోజు అందరం కలుద్దాం.
అయితే ఎల్లుండి మీ వాళ్ళని తీసుకురా. వాళ్ళని ఇక్కడ ఇంట్లో వదిలేసి మనిద్దరం ఎయిర్పోర్ట్ కి వెళదాం. సరేనా.
సరేరా అంటూ నాకు, మా శ్రీమతికి చెప్పి బయలుదేరాడు మధు.
****
మధుని కారెక్కించి గేట్ వేసి ఇంటి మెట్లెక్కాను.
గుమ్మంలోనే నా శ్రీమతి శశిరేఖ వేయి ప్రశ్నలతో ఎదురు చూస్తోంది.
లోపలికి దారితీస్తూ చెప్పాను.
చాలావరకు లీగల్ గా అనుకూలంగా ఉంది శశి. చూద్దాం.
రేపు ఆ అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించిన తరువాత సంజయ్ తో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుంటాను.
ముఖ్యంగా సంజయ్ సేఫ్ గా ఉన్నాడు. అదే ముఖ్య విషయం.
ఆ అమ్మాయికి ప్రామ్ప్టింగ్ తన ప్రియుడే ఇండియా నుంచి చేస్తున్నాడు.
వాడి చేతిలో కీలు బొమ్మలా ఉంది తను. అది చాలా డేంజర్ మరియు బిగ్ న్యూసెన్స్.
సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు ఈమొత్తం వ్యవహారంలో. ఇండియాలో ఉండుంటే చాలా తలనొప్పిగా ఉండేది.
అందులో ఈమధ్య ఇటువంటి కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి.
ప్రియుడితో కలిసి ప్రాణం తీసేందుకు కూడా వెనుకాడట్లేదు. ప్రేమ మైకంలో వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకే అర్ధం కావట్లేదు.
అమెరికాలో ఉండటం ఒక విధంగా సంజయ్ సేవ్ అయ్యాడు.
ఈ వ్యవహారం పూర్తిగా పరిశోధిస్తే గాని అసలు విషయాలు తెలీవు.
కోర్ట్ కు ఎవిడెన్స్ కావాలి. అది ఎలా అనేది చూడాలి.
విడాకుల కంటే వేరే మార్గం లేదా, అమాయకంగా అడిగింది శశి.
ఈ విషయంలో ఇంతకంటే ఇంకో మార్గం లేదు. తాను తెగేసి చెప్పింది కదా. ప్రియుడే తనకిష్టమని. ఇండియా కి పంపమని.
ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ప్రవల్లిక తో నేను మాట్లాడాను.
తను కూడా చాలా షాక్ లో ఉంది.
నేను మీ సంభాషణ కొంత వరకు విన్నానుగా.
వర్రీ అవద్దని తనకు చెప్పాను.
తనే పెళ్లిచూపులు నుంచి ఇప్పటివరకు ఒక మారు మననం చేసుకుంది.
ఆ అమ్మాయి నడవడిక మిగతా విషయాల గురించి, పూసగుచ్చినట్లు అన్ని విషయాలు చెప్పింది.
అవి చాలా ముఖ్యం శశి. వివరంగా చెప్పు నాకు.
కొంత అంచనా వేసుకునేందుకు పనికి వస్తుంది.
భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రండి అని డైనింగ్ టేబుల్ పై ప్లేట్స్ పెట్టింది శశి.
ఓకే అంటూ చేతులు కడుక్కుని వచ్చికూర్చున్నాను.
వీళ్ళకి ఈ సంబంధం మాట్రిమోనీ ద్వారా వచ్చింది.
ముందుగా మంజరి తండ్రి మధు గారికి ఫోన్ చేసి మాట్లాడాడట మాట్రిమోనిలో చూసి.
మధు, ప్రవల్లిక వాళ్ళ వివరాలన్నీఫోన్ ద్వారా అడిగి తెలుసుకొని బాగానే ఉన్నాయని, సంజయ్ కి సరిపోతాయని అనుకున్నారు.
అమ్మాయికి జాబ్ చెయ్యడం ఇష్టం లేదా అని అడిగారు.
తనకి పై చదువులు చదవాలని కోరికండి.
రీసెర్చ్ చేద్దామని ప్లాన్. అందుకనే ఎం టెక్ చేసింది అని చెప్పింది వాళ్ళఅమ్మ. వాళ్ళ అమ్మ లెక్చరర్ గా పని చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ లోనే మంజరి డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
ఒక సంవత్సరం ఖాళీగా ఉంది.
తల్లితండ్రులు సంబంధాలు వెతుకుతుంటే తను కాలక్షేపం కోసం ట్యూషన్స్ చెప్తోంది.
మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మని విజయవాడకి ఆహ్వానించారట వాళ్ళు.
మధు, ప్రవల్లిక కారులో వెళ్లి హోటల్లో స్టే చేసి పక్కరోజు పొద్దున్నే దుర్గా అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళింటికి వెళ్లారు.
వీళ్ళు వెళ్ళేప్పటికి అమ్మాయి ఇంకా రెడీ కాలేదట.
పెద్ద వాళ్ళు నలుగురు కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ అరగంట సేపు గడిపారు.
ఇంతలో తను తయారయి వచ్చింది.
కొంచెం ముభావంగానే కూర్చుందట.
ప్రవల్లికకు ఎందుకో అనుమానము వచ్చి అడిగిందట. హెల్త్ ఏమన్నా బాగోలేదా అని.
వాళ్ళ అమ్మ వాణి కలుగ చేసుకుని నిన్న కొంచెం నలతగా ఉందండి. అందుకేనేమో అని చెప్పిందట.
మా అమ్మాయికి సింపుల్ గా ఉండటం ఇష్టం.
ఏవో విషయాలు దాస్తున్నట్లు తల్లి తండ్రులిద్దరూ మాట్లాడుతున్నారు ఒకరికొకరు వెనుకా ముందు.
చదువు గురించి, కాలేజీ విషయాలు మిగతా పిచ్చాపాటి మాట్లాడారట. మంజరి అన్నిటికి ముక్తసరిగానే జవాబిచ్చింది.
సరేలే కొత్త కదా అందుకేనేమో అనుకుందట ప్రవల్లిక.
మాటల మధ్యలో ఆ అమ్మాయి అందట డాక్టర్ చేద్దామనుకున్నాను.
కానీ మా అమ్మా వాళ్ళే ఒప్పుకోలేదు అందట.
వాళ్ళ తల్లితండ్రులు కొంచెం వెనక్కి తగ్గి మరలా సర్దుకుని మంచి రాంక్ రాలేదు అందుకే మెడిసిన్లో చేర్చలేదు అని సర్ది చెప్పారట.
మంజరి తండ్రి ముకుందరావు తమ కుటుంబం గురించి అన్ని విషయాలు చెప్పాడు.
తల్లి తనతోనే ఉంటుందట. పెద్దమ్మాయి అంటే మంజరి అక్క సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేసి పెళ్లి కాగానే ఉద్యోగం మానేసి సింగపూర్ వెళ్లిందట హస్బెండ్ తో.
ఆ అమ్మాయికి పెళ్లయి రెండేళ్లయింది.
మంజరి వారికి రెండో కూతురు.
మంజరి గురించి చెప్తూ మా అమ్మాయి తన ఫ్రెండ్స్ ను అందరి నాకు ఇంట్రడ్యూస్ చెయ్యం దే స్నేహం చెయ్యదండి.
అంత డిస్సిప్లిన్డ్ గా ఉంటుంది.
తనకు మొబైల్ కూడా లేదు.
కొనుక్కోమని ఎన్ని సార్లు చెప్పినా వద్దు డాడీ నాకెందుకు అంటుంది.
