Previous Page Next Page 
అతడు భార్య ప్రియుడు పేజి 38

   
    "అంత అమూల్యమైన ఇన్ ఫర్ మేషన్ నా గురించి సేకరించి ఇస్తే బోడి పదివేలా నీకిచ్చేది! దానికోసం నువ్వింత శ్రమపడింది" అంది.

    "నాలాంటి వాళ్లకి పదివేలు చాలా గొప్ప మేడం" అన్నాడు నరేంద్ర.

    " యూ ఆర్ ఎ మాడ్ మ్యాన్ ఐసే! ఓ పక్క కోలార్ ఫీల్డు, మరో పక్క పదివేలు పెడితే  నువ్వు ఏది కోరుకుంటావు?" అడిగింది.    

    "కోలార్ ఫీల్డుని"

    "దెన్ ...వ్వాట్ ఫర్ బ్లడీ టెన్ తౌజండ్" అంది.

    కోలార్ ఫీల్డు అంటే ఆమె అతని అన్వయించుకుని అంటోందని అతనికి అర్దం అయిందప్పుడు.

    నిజమే! నాగమణి కోలార్ ఫీల్డు లాంటిదే!

    ఇంకా నయం! తను సేకరించిన వివరాలు జి. కె. కి చెప్పలేదు. ఆ ముసలివాడు మంచంలో పడ్డాడని చెప్పలేదు.

    నిజంగా ఆ విషయాలు చెప్పివుంటే తనెంత నష్టపోయి వుండేవాడు.

    జి. కె. చచ్చిపోతే మేడం సర్వాధికారిణి అవుతోంది.

    ఆమె కను సన్నలలో వుంటే..... ఆమె అభిమానానికి పాత్రుడైన తనని విడిచి పెట్టదు. కాస్త కష్టపడి ప్రేమలోకి దింపితే...ఆమెని పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు తనే.. .జి. కె. స్థానంలో.....

    నిజంగా తను గొప్ప జాతకుడైపోతాడు!

    ఆమె అతను ఎక్కడో వూహల్లో తేలిపోయినట్టు  పసికట్టింది.

    అతని తొడమీద గట్టిగా గిచ్చింది.

    "అబ్బ....."

    "అందమైన అమ్మాయి గిచ్చితే ఒళ్ళు పులకరించాలి.  కానీ  అబ్బ అంటే ఎలా?" అంది నాగమణి.

    నరేంద్ర ఆమెకేసి చూశాడు.

    "ఇప్పుడన్నా చెబుతావా?" అడిగిందామె గోముగా.

    "మీ కాలేజీ లైఫ్ లో మీ కోసం చాలామంది తహతహ లాడిపోయేవాళ్ళు."

    "అది నా తప్పుకాదు. అది నాలోవున్న ప్రత్యేకత."

    "అయినా మీరు ఎవర్నీ లక్ష్యపెట్టలేదు."

    "అఫ్ కోర్స్...."   

    "కొంత మంది లెక్చరర్స్ ... కూడా....."

    "అది వాళ్ళ దౌర్బాగ్యం.. .నేనేం చేస్తాను"

    "నిజమే.... కానీ...."

    "కారీ ఆన్" అంది.

    మీరు ఉద్యోగం చేసేటప్పుడు పై అధికారులతో చనువుగా వుండేవారని....."

    "అది ఉద్యోగ ధర్మం. పై అధికారులు చెప్పినట్టు కిందివాళ్లు వినాలి. పోట్లాడలేను కదా! నువ్వు జి. కె. ని ఎదిరించగలవా?"

    "లేదు!"

    "  మగాడివి నీకే దమ్ముల్లేనప్పుడు ఆడదాన్ని, ఉద్యోగం కాపాడుకోవడానికి అణకువగా వున్నానే తప్ప  పిచ్చివేషాలు వేయలేదు కద!"

    "ఓ. డి. డి. ఎప్పుడూ మిమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని  కబుర్లు చెప్పేవాడట!"

    "డిక్టేషన్ తీసుకొనేదాన్ని."

    "సో... ఇంత వరకూ మీరు ' క్లీన్' అని మీ మాటలవల్ల తెలిసింది."

     ఆమె గుండెలు గుబగుబలాడాయి.

    " కిరణ్ కుమార్ ఎవరు?"

     ఆమె మొహంలో రంగులు మారాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS