Previous Page Next Page 
అతడు భార్య ప్రియుడు పేజి 33

   
    ఆసలాయన అందులో ఏం రాయమన్నాడో తెలుసుకోవాలి!

    లాయర్ని సంప్రదిస్తే? జి.కె. కి తను వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించినట్టు తెలిసిపోతుంది.

    అదీ కాక ఒకవేళ వీలునామా రాసినా రిజిష్టర్ చేయించి రహస్యంగా లాయర్ దగ్గరే వుంచినా తనకేమి తెలీకపోవచ్చు.

    చాలా చిరాకుగా వుంది.

    ఓ పక్క నరేంద్ర తన వివరాలు సేకరిస్తున్నాడు.

    ఇటు వీలునామా రాయించడానికి జి.కె. సన్నాహాలు.....

    అసలు జి.కె. గురించే తనకి తెలీదు.

    భార్య పోయింది. కాస్త వయస్సులో ఎక్కువ. కటీశ్వరుడు.

    అంతవరకే వింది.

    అంతకిమించి వివరాలని అతన్నించి తెలుసుకోడానికి తను ప్రయత్నించలేదు.

    డబ్బుంది! అది చాలు అనుకొంది.

    కానీ పెళ్ళయిన తర్వాతేగా ఈ వెధవ గురించి తెలుసుకొంది.

    జికె గురించి  ఇంతకాలం పూర్తిగా తెలుసుకోలేక పోవడం ఎంత బుద్దిలేని పని.

    తను అడగలేదు.

    ఎవరూ చెప్పలేదు.

    అమె లోపలికి నడిచింది. అమె వెనకే మల్లన్న అనుసరించాడు.

    హాల్లో సోఫాలో కూర్చుని మెట్లపైన గోడకి వేలాడుతున్న జి.కె. మొదటి భార్య ఫోటోకేసి చూసింది.

    అమె అందమైన మనిషే! చాలాసార్లు ఆ పోటోని చూసిందిగాని అమె గురించి కూడా తను తెలుసుకోలేదు.

    "అమెని కూడా ఇలాగే హింసించేవాడా?"

     "అమె పేరు?" అడిగింది నాగమణి.

    "వసుంధర"

    ఆ భూదేవిలాగే పోటోలో సైతం అమె ముఖంలో మార్పు కనబడుతోంది.

    "అమె ఎలా చనిపోయింది?"

    "లోకం దృష్టిలో అమె చనిపోయిందమ్మా" అన్నాడు మల్లన్న.

    "అంటే?" కళ్ళు పెద్దవి చేసి చూసింది నాగమణి. మల్లన్న రెండు క్షణాలు ఆలోచించాడు.

    "వసుందరమ్మగార్ని అయ్యగారే చంపేశారమ్మా!"

    అతని మాటలకి ఉలిక్కిపడింది.

    "ఎందుకు?"

    " అనుమానం మనిషి. మేడమేట్లు పైనించి కిందికి తోసేశాడు. అమె ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిందని అందర్ని నమ్మించాడు. అమె అమె దేవతమ్మా. తల్లి చావు చూసి చిన్నమ్మాయిగారు దేవయాని ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో కూడా తెలీదు" చెప్పాడు.

    అమె భృకుటి ముడిపడింది.

    "చిన్నమ్మాయిగారంటే? ఇంకా...."

    "పెద్దమ్మాయి రాజేశ్వరి...పెళ్ళయిన అర్నెల్లకే ఆత్మహత్య చేసుకొందమ్మా! అమె కాలేజిలో ఎవడ్నో ప్రేమించింది. బలవంతంగానే పెళ్ళిచేశాడు జి.కె. అతనితో కాపురం చేయలేదు రాజేశ్వరమ్మ. అల్లుడు గారు ఎంతో మంచివాడు. కూతురు చనిపోగానే అల్లుడే అమె చావుకి కారణమని జైలుకి పంపించాడు"

    " ఆ పిల్ల చనిపోతే అతనేం చేస్తాడు?" ఆశ్చర్యంగా అడిగింది.

    "జి..కె బాబు తల్చుకుంటే చేయలేనిది ఏముందమ్మా! రాజేశ్వరమ్మ పెళ్ళయిన మర్నాటినుంచే అల్లుడుగార్ని బాగా తిప్పలు పెట్టింది. పిచ్చిగా ప్రవర్తించేది. అది భరించలేక పిచ్చిదాన్ని తనకి అంటగట్టారని అతను ఉద్రేకంతో జి.కె కి ఎదురు తిరిగాడు. తన కూతురు పిచ్చిదని అల్లరిచేశాడన్న కక్షతో వరకట్నం కారణంగా తన కూతుర్ని అల్లుడే చంపేశాడని లోపలకి తోయించాడమ్మా! జి.కె.కి ఇద్దరే కూతుళ్ళు. ఆస్తి ఆ ఇద్దరికే దక్కుతుంది. అలాంటప్పుడు అల్లుడుగారు తొందరపడి రాజేశ్వరమ్మని ఎందుకు చంపుతాడమ్మా!  అదీకాక ఆ పిల్ల  ఉరిపోసుకుని చచ్చినప్పుడు జగదీష్ బాబు ఇంట్లో కూడా లేడు. రాజేశ్వరమ్మ పోంగానే ఆ బాబుకి పెళ్ళిలో లాంఛనాలుగా తనకిచ్చిన పూచికపుల్లని కూడా తిరిగి ఇచ్చేశాడమ్మా! కానీ ఏం చేస్తాం1 డబ్బు పలుకుబడి ముందు ఆ బాబు దోషి అయిపోయాడు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS