విజయ్ ని కనీసం ఎక్కడుండేది అడిగి తెలుసుకోలేదు. ఎంత పిచ్చిపని చేసింది. అంతసేపు వుండి అతని వివరాలు పూర్తిగా తెలుసుకోలేక పోయింది.
జి.కె. అనారోగ్యం తనకనుకూలంగా మారడం అమెకి ఆనందాన్ని కలిగిస్తోంది. పనివాళ్ళ మన్ననలు పొందుతుంది. విజయ్ తో పరిచయాన్ని పెంచుకోడానికి నిశ్చయించుకుంది. పైగా అతను బాచిలర్, స్నేహం థ్రిల్లింగ్ గా వుంటుంది.
ఇంటికొచ్చాక మళ్ళీ స్నానం చేసి అలంకరించుకుని జి.కె. పడుకున్న గదిలోకి నడిచింది. తనని చూడగానే అతనికి పిచ్చిపట్టేలా తయారైంది నాగమణి.
సిస్టర్ ఓ కుర్చీలో కూర్చుంది.
జి.కె కళ్ళు తేరిచి ఏటో చూస్తున్నాడు.
మిస్టర్ జి.కె. హౌ ఆర్యూ!" అడిగింది కాస్త దూరంలో నించుని, మంచం పట్టిన ఆ భర్తని భార్య అడిగే పద్దతి కాదది. ఆ సంగతి అమెకీ తెలుసు.
జి.కె పళ్లు కొరికాడు అమెకేసి చూస్తూ.
"గట్టిగా కొరికితే పళ్ళు కూడా ఊడిపోతాయి. మళ్ళీ కట్టుడు పళ్ళు పెట్టుకోవాల్సి వుంటుంది"
. "యూ ....?" కీచుగా అరిచాడు జి.కె.
"అరవకు. జి.కె. బి.పి. పెరుగుతుంది. కనీసం పదిరోజులన్నా నువ్వు మంచంపైన వుంటే నేను కొంచెం పికప్ అవుతాను----- మళ్ళీ నువ్వు కొట్టడానికి" అంది.
"నిన్ను....చంపేస్తాను!" నూతిలోంచి మాట్లాడుతున్నట్లుగా అన్నాడు జి.కె.
అమె నవ్వింది.
నాగమణి సిస్టర్ కేసి చూసింది. ఓసారి బయటకెళ్ళమన్నట్టు.
అమె వెళ్ళగానే అంది నాగమణి.
"చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే మిస్టర్ జి.కె. టార్చర్ చేయడం మగాళ్ళకేకాదు, ఆడవాళ్ళకి చేతనవును. కానీ అడవాళ్ళు మనసు నవనీతం. మొగుడు ఎంత చండాలుడైనా, బేవర్స్ గాడైనా భరిస్తుంది. కారణం సంస్కృతి సాంప్రదాయం.
నువ్వు మారితే సరి! లేకపోతే నేను మారతాను. నీలా... నువ్వేం చేస్తున్నావో అవన్నీ నేను చేసి చూపిస్తాను".
"యూ...బ్లడీ...."
"అరవకు బాస్. గట్టిగా అరిస్తే పక్షవాతం వచ్చి నోరు పడిపోవచ్చు. ఉద్దరించలేని నీ మగతనానికి నువ్వు సిగ్గుపడి నాగరికత పేరుతో వాకు స్వేచ్చనియ్యాలి"
రోషంగా చూస్తున్నాడు జి.కె. అతను ఏ మాత్రం శక్తి వున్నా లేచి అమె పీక నులిమివేయగలడు.
"జి.కె నొప్పిగా వువ్నాయా నా మాటలు. మాటలకే నీకు నొప్పిగా వుంటే- నీవు పెట్టిన దారుణ హింసకి నేనేం కావాలి. నడుం విరిగిన కుక్కలా నువ్వీమంచంలోనే పడుండాలి. అదే నా కోరిక" అని విసవిస బయటికి నడిచింది.
అవకాశం దొరికినప్పుడల్లా తను అతని గదిలోకి వెళ్ళి వేధించడానికి నిశ్చయించుకుంది.
అమె బయటికి రాంగానే మల్లన్న అమె వెనకే నడుస్తూ.
"అమ్మా!" అని పిలిచాడు.
అమె తోటలోకి నడిచి పొగడచెట్టుకింద బల్లమీద కూర్చుంది.
"చెప్పు మల్లన్న!" అంది.
"ఏం లేదమ్మా!" నిన్ను చూస్తుంటే జాలితో నా గుండె బరువెక్కి పోతుందమ్మా!"
నాగమణి ఆదోలా నవ్వింది.
వెన్నెల్లో అమె శరీరం బంగారు గనిలా మెరుస్తోంది.
"నాకేం తక్కువ మల్లన్న. కోటిశ్వరుడి భార్యని, నాకేం కావాలన్నా నిముషాల్లోనే మీరంతా ఏర్పాటు చేస్తారు!"
అమె కళ్ళల్లో కన్నీరు తొణికిసలాడింది.
"అమ్మా! నేనీ ఇంట్లో చేరి ముప్పైఏళ్ళు దాటింది. రెండ్రోజుల నించి నా మనసు కుదుటగా వుండడం లేదమ్మా! మీ పెళ్ళయిన రోజునించి చూస్తూనే వున్నాను. కష్టాల్లో పెరిగిన నిన్ను సుఖపడతావని అయ్యగారి కిచ్చి పెళ్ళి చేశారు. సుఖం లేకపోగా అన్నీ నష్టాలేనమ్మా నీకు దక్కింది"
