Previous Page Next Page 
భవ బంధాలు పేజి 8


                           పుత్ర కామేష్టి


    పెళ్ళయి వెళ్ళాక కరోనా ధర్మమాని రెండేళ్ళ తరువాత వచ్చిన మనవడిని చూసి సంబర పడిపోయింది అనసూయమ్మ. పలకరింపులు, కబుర్లు, భోజనాలు నిద్రలు అయ్యాక సావకాశంగా కాఫీ కప్పుతో కూర్చుని "ఏమిటి బామ్మా కబుర్లు" అంటూ చేయి పట్టుకు పలకరించాడు మనవడు చైతన్య.
    "ముసలిదాన్ని ణా దగ్గరే ముంటాయి కబుర్లు. నీవే చెప్పు మీ అమెరికా కబుర్లు, కొత్త పెళ్ళాం కబుర్లు, మీ హనీమూన్ పర్వం అయిపోయిందా" మురిపంగా చూస్తూ అందావిడ.
    "పో బామ్మా రెండేళ్ళ యింది ఇంకా కొత్త పెళ్ళాం , హనీమూన్ లు ఏమిటి ప్రేమ యాత్రలకి నందనవనాలు , బృందావనాలు ఏలనోయి అన్నట్టు గృహమే స్వర్గసీమ అనుకుంటూ కరోనా ధర్మమాని ఖర్చు లేకుండా గడిపేసాం" హాస్యంగా అన్నాడు చైతన్య.
    "అయితే పోట్లాటలు లేకుండా అన్యోన్యంగా వున్నారా, మీ ఆవిడ వంట గింటా నేర్చుకుందా , వండి పెడుతుందా" అరా తీసింది ఆవిడ గొంతు తగ్గించి పక్క గదిలో ఇంకా నిద్ర పోతున్న మనవరాలికి వినపడకుండా.
    "అవన్నీ నీవడగకూడదు నేచేప్ప కూడదు. అవన్నీ పాతకాలం కబుర్లు ఎవరికీ టైం వుంటే వాళ్ళే చేస్తాం. అక్కడ కాఫీ కావలిస్తే కలుపుకుంటాం. ఆకలేస్తే అన్నం వండేయాలి. పప్పో కూరో ఏం తిన్నాం అన్నది కాదు కడుపు నిండిందా అన్నదే పాయింట్ . అంతగా ఓపిక లేకపోతె హోటల్ కి పోతాం సెలవు రోజు వస్తే ' అన్నాడు నిర్లిప్తంగా చైతన్య.
    "అదేమిటిరా అదేం చోద్యం పెళ్లయి పెళ్ళాం వచ్చాక అయినా ఇంట్లో వంట చేయదా" వింతగా చూస్తూ అనసూయమ్మ అడిగింది. "మరేంటనుకున్నావు ఉద్యోగం చేసే పెళ్ళామంటే...మాతో సమంగా చదివి, సమంగా సంపాదిస్తున్న వాళ్ళు, మేమే ఎందుకు చేయాలి పని అంతా ఇద్దరం కలిసి చేయాలంటారు. కాఫీ అని ఆర్డర్ వేస్తె గో అండ్ గెట్ అంటారు ఇప్పటి అమ్మాయిలు. నీవింకా ఎప్పటి ప్రశ్నలో వేస్తె ఎలా బామ్మా" నవ్వుతూ తేలిగ్గా అన్నాడు.
    "బానే వుంది సంబడం. ఆమాత్రం డానికి పెళ్లి ఎందుకు ...ఏం చదువులు చదివితే మాత్రం ఆడది ఇల్లు సంసారం పట్టించు కోవద్డా" కోపంగా అందావిడ.
    "బామ్మా ఆమాటలు వదిలేయి ఇంకేమన్నా కొత్త సంగతులు చెప్పు."
    "వాళ్ళు కలిసి మెలిసి పనులు చేసుకుంటారు. మనలా ఆడపని, మగ పని అని వుండదక్కడ. మీరేం అనకండి. వసుధ దగ్గర చాదస్తంగా." కోడలు కాస్త మందలింపు ధోరణిలోనే అంది.
    "ఆ అవును రేపు పొద్దున్న పిల్లలు కంటే నెప్పులు నీవంతు అంటారేమో చూసుకో నాపీలు, పాలసీసాలు ఇప్పటికే అంట కట్టారు మీవంతని" అందావిడ వ్యంగ్యంగా.
    "ఏదో ఏడవండి గాని రెండేళ్ళ యింది మునిమనవడిని ఎత్తుకుని కానీ నేను వదలను. అదేదో తొందరగా ఇచ్చేస్తే చూసిదాటి పోతా. ఇంకా ఉంటె ఇంకేం పోకడలు చూడాలో. ఒరేయ్ హాస్యం కాదు రెండేళ్ళయింది పిల్లలని కనే ప్లానుందా లేదా....ఇంకా ఏదో కరోనా టైం అని భయపడి అడగలేదు" అంది.
    "బాబోయ్ పిల్లలా నన్నిలా కొన్నాళ్ళు హాయిగా బతకనీ" నవ్వుతూ దాటేశాడు.
    "బామ్మా పిల్లల్ని కనాలంటే భయమేస్తుంది వాళ్ళతో , మా స్నేహితులు పడుతున్న అవస్థలు చూస్తె. ఇప్పటి పిల్లలు తెలివి మీరి పోయారు బామ్మా. తినడానికి చేతిలో ఫోన్లో బొమ్మలు చూపెడుతూ ముద్దలు నోరు తెరిచి నప్పుడల్లా కూరాలి. ఏడుపు ఆపాలంటే ఐపాడ్ చేతిలోకి రాగానే టక్కున ఆపేస్తారు. ఏడెనిమిది నెలలు వరకు ఒకే గానీ తరువాత పాట్లు చూడాలి. ఓ పక్క ఉద్యోగాల టెన్షను, ఇంట్లో పిల్లల పెంపకం, ఏమిటో ఆ పరుగులు, ఉరుకులు, గెంతడాలు, మొండి తనాలు , కావాలన్నది ఇచ్చేవరకు ఆ ఏడుపులు, తినిపించడానికి మా ఒపికలు" అడుగంటి పోతాయి. గంట గంట కూర్చోవాలి. కళ్ళు పాడవుతాయని ఐపాడ్ అవి ఇవ్వకపోతే తినరు. వాళ్ళ ముద్దు మురిపాలు ఫోటోలు తీస్తే, అవి చూసుకుని ఏడాది పిల్లాడు కూడా ఎంత మురిసి పోతాడో ....వాళ్ళడిగే ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికి ఎంతంత ఒపికలుండాలో , బాబోయ్ వాళ్ళందరి బాధలు చూస్తె పిల్లలని కనాలంటే భయం వేస్తుంది. మీరంతా అరడజను తక్కువ కాకుండా కని ఎలా పెంచారో ఆశ్చర్యంగా ఉందిప్పుడు. పిల్లలు కాదు పిడుగులు ఈ జెనరేషన్ పిల్లలు" గుక్క తిప్పకుండా ఏకరువు పెట్టాడు మనవడు.
    "అదేమిటిరా పిల్లలని పెంచడానికి భయపడి కనకపోవడం ఏమిటి విడ్డూరం "అనసూయమ్మ వింతగా చూస్తూ అన్నది. "మీరు ఒకళ్ళు ఇద్దరు అయి గారభం చేసి పిల్లని పెంకి వాళ్ళుగా , మొండి వాళ్ళుగా చేస్తున్నారు. ఇద్దరూ సంపాదిస్తూ అడిగిందంతా కొనిచ్చి, వాళ్ళు ఆడింది అట పాడింది పాటలా మీరు వాళ్ళని పెంచి పాడు చేస్తున్నారు . వాళ్ళని కాదు మిమ్మల్ని అనాలి అసలు."
    "మీరేం చేసేవారు.....మీకాలంలో పిల్లలు ఇలా వుండేవారు కాదా" మనవడు చెప్పమన్నట్టు చూసాడు.
    "ఆరేడు నెలల వరకు మూలనున్న ముసలమ్మ పెంచుతుంది అనే సామెత వుంది. అప్పటి వరకు పాలు నీళ్ళు టైం ప్రకారం జరిగిపోతాయి. అప్పుడైనా వేడివేడి నీళ్ళు నలుగు పెట్టి స్నానం చేయిస్తే , పాలు రెండు వైపులా తాగించి చక్కగా పడుకోబెడితే మూడు గంటలు వోళ్ళేరగకుండా పడుకునేవారు. మీవి చలి దేశాలని బేసిన్లో గబగబా గిన్నెలు తోలిచినట్టు స్నానం చేయిస్తారు. కుయి మంటే చాలు పాలు కుదిపిస్తారు. రెండుసార్లు చప్పరించి కళ్ళు మూసేసి మళ్ళీ అరగంట కు ఏడుస్తారు. ఏడ్చినప్పుడల్లా పాలు పడితే వాళ్లకి అదే అలవాటు అయి అరగంట కోసారి ఏడుస్తుంటారు. కాసేపు ఏడవనీయండి, బాలానాం రోదనం బలం అనేవారు ఇదివరకు ఏడిస్తే, శరీరం లోని కండరాలు, నాడులు, కదలిక తో బాగా ఆకలి వేస్తుంది. అరగంట ఊరుకుని, పాలిస్తే, అడిగినప్పుడల్లా పాలివ్వరన్న సంకేతం చిన్న మెదళ్ల కి అంది రెండు మూడు సార్లకి అర్ధమయ్యి తాగడం మోదేలేడతారు. అసలు పెంపకం అంత ఏడెనిమిది నెలల నించి పాకడం ఆరంభమైనప్పటి నించి మొదలు. అన్నీ లాగేస్తారు. పీకేస్తారు. కనిపించిన వన్నీ నోట్లో పెట్టుకుంటారు. పాలు తాగరు. ఏడ్చి అన్ని పనులు సాధ్య పరచు కుంటారు. అప్పుడే కాస్త ముందు జాగ్రత్తతో వాళ్ళకి తెలియ చెప్పాలి. పాలు ఇంకా తాగుతావా తీసేయనా అని సీసా చూపిస్తూ అడగాలి. తలూపడం తెలిస్తే వద్దన్నట్టు అనగానే పాలసీసా తీసేయాలి. అంతేగాని ఫోను లో ఇప్యాడ్లో , టీవీ లలో బొమ్మలో చూపించి తాగించే ప్రయత్నం చేయద్దు ,. అది వాళ్లకి అలవాటయి ముద్దకోసారి ఏదో చూపించి పెట్టె అలవాటు చేస్తున్నారు. డైనింగ్ టేబిల్ దగ్గర బేబీ కుర్చీలో కూర్చో పెట్టి భోజనం చేసే అలవాటు చేసి గబాగబా తినిపించాలి. కాస్త తిని మానేస్తే ఇంక తినవా వద్ద తీసైనా అని గంబీరంగా అడిగి ప్లేట్ తీసేయాలి. వాళ్లకి పిచ్చి వేషాలు వేస్తె అమ్మ అన్నం పెట్టదు అని అర్ధమవాలి. మీకేమో పిల్లలు ఏదో లాగాతినాలి హెల్దీగా తయారవ్వాలన్న ఆతృత. ఎలాగో అలాగా ఏదో కాస్త తినిపిస్తే, ఆడుకుంటాడు అనో, ఆఫీస్ టైం అయిపోతుందనో , క్రాష్ ;లో సరిగా తినదనో, వాళ్ళు ఏది అడిగితె అది చేసేసి అలవాటు చేస్తున్నారు. అపురూపాలు ఎక్కువయి పోయాయి. పెళ్లి అయ్యాక ఐదారెళ్ళకే కంటున్నారు. ఒకరిని, డబ్బెక్కువయింది. ముద్దేక్కువయి పిల్లల్ని పాడు చేస్తున్నారు. తుమ్మితే భయం, దగ్గితే బెంబేలు పడిపోవడం, కాస్త వళ్ళు వెచ్చ బడితే గాభరా, డాక్టర్ల దగ్గిరికి పరుగులు. మాటలు రాకపోయినా ఏడాది నిండిన పిల్లకి, మీ గాభారాలు, మీ వీక్ నేస్సులు, మీ అపురూపాలు అన్నీ అర్ధమవుతాయి. ఎలా మిమ్మల్ని లొంగ దీసుకోవాలో అర్ధం అవుతుంది. ఏడ్చి తిండి మానేసి లొంగ దీస్తారు. కాస్త పెద్దయిందగ్గర నించి కనిపించిన బొమ్మ అల్లా కావాలంటారు. ఎవరి దగ్గర ఏది కొత్తగా కనిపిస్తే అది కొనాలి. కొందరయితే పిచ్చి అల్లరి చేస్తారు. ఇంట్లో వస్తువులు పాడుచేసి, విరకొట్టి తోటి పిల్లలని కొట్టి, వాళ్ళ చేతుల్లోవి లాక్కోడం, వాళ్ళని చిన్నప్పుడే కంట్రోల్లో పెట్టకపోతే, పెద్ద అయ్యాక ఇంకా దురుసుగా తయారవుతారు . ఆ అనగానే ఆగే భయం ఉండాలి."
    "నిజమే బామ్మా మా ఫ్రెండ్స్ పిల్లలు దబీమని సోఫాలు ఎక్కి గెంతుతుంటే ఏమనరు పేరెంట్స్. కొత్త సోఫాలు బోలెడు డబ్బు పోసి కొన్నారు. మాలాంటి వాళ్ళు వెడితే విద్యలన్నీ చూపడానికీ మరీ చేస్తారు. వాళ్ళందరినీ చూసాక అందుకే పిల్లని కనాలంటే భయం వేస్తుంది." నిజాయితీగా అన్నాడు చైతన్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS