ఆరునెలల్లో పునాదులు గోడలు మొదలై స్ట్రక్చర్ తయారయింది. ఆ అపార్ట్ మెంట్స్ మీద ఆయనకు ఏమీ ఇంటరెస్ట్ లేదు. అయన దృష్టి అంతా టెర్రస్ మీద తాను అనుకున్నది ఎలా వుండాలి . ఇద్దరు ఉండడానికి ఏ ఏ సదుపాయాలు కావాలీ అని. దేనికి ఇబ్బంది పడకుండా సుఖంగా చరమాంకం గడిచి పోవాలంటే ఆ గదిలో రెండు మంచాలు, ఇద్దరికీ చెరో వార్డ్ రోబ్, ఓ టేబిల్, రెండు కుర్చీలు, విలువైనవి దాచుకోడానికి గోడలో ఒక చిన్న గోద్రెజ్ అలమారా , ఒక పక్క గోడలో చిన్నది దేముడి స్థలం. ఇవన్నీ పట్టేట్టు మరీ ఇరుకుగా లేకుండా ఉండాలంటే గది సైజు ఎంత వుంటే సరిపోతుంది . టాయిలెట్ కమోడ్, స్నానం చేయడానికి స్థలం, సీనియర్ సిటిజెన్స్ కి ఊతం ఇచ్చి పట్టుకుని ఇబ్బంది లేకుండా లేచెట్టు స్లీట్ రాడ్స్ మర్చిపోకూడదు. కమోడ్ వయసు మీరిన వారికీ ఎత్తులో ఉండేట్టు బాల్కనీ కాస్త పొడుగ్గా ఉండేట్టు, అందులో సగ భాగం ఏంక్లోజ్డ్ గా ఉండేటట్టు ఓ చిన్న స్టవ్ పెట్టుకుని కాఫీ, టీ, బోర్నవిటా కలుపు తాగే సదుపాయం ఓ పక్క స్టవ్ పైన చిన్న కప్ బోర్డ్, కాపీ సామానులు, కప్పులు, గ్లాసులు , గిన్నెలు, పెట్టుకునే చోటు. రెండో పక్క ఫారెన్ లో లాగా గోడకి ఫిక్స్ చేసి వాషింగ్ మిషన్ , బట్టలు అరెసుకోడానికి అడ్డు లేకుండా సీలింగ్ వరకు లాగే రాడ్స్ , బయట టెర్రస్ మీద అందరూ కూర్హుని కబుర్లు ఆడుకుంటూ కేరమ్స్, పేక, చదరంగం లాంటివి ఆడుకునే విధంగా ఓ ఆరు బై మూడడుగుల సిమెంట్ బల్ల , ఎండకీ, వానకి తడిసినా ఇబ్బంది లేకుండా ఉండేట్టు , ఓ అరడజను గార్డెన్ చైర్స్ , ఎండ వున్నప్పుడు కాస్త వర్షానికి ఆగేట్టు యాస్బేస్టాప్ పెట్లతో తయారు చేయించాలని ఆయన ఆలోచనలు. ఒక్కోటి మర్చిపోకుండా డైరీ లో రాసుకుంటూ, బిల్డర్ తో చర్చిస్తూ , తన రిక్వయిర్ మెంట్స్ చెపుతూ , ఒప్పిస్తూ ఒక్కరోజు విడవకుండా టెర్రేస్ మీద కడుతున్నప్పుడు , ఒక మోడల్ తయారు అయ్యే వరకు, తను అనుకున్న విధంగా అయేవరకు అక్కడే వుండి పర్యవేక్షించారు. బిల్డర్ అయన కోరికలకి తగ్గట్టు మార్పులు చేస్తూ మనసులోవిసుక్కుంటూనే మోహన నవ్వు పులుంకుంటూనే ఆఖరికి పూర్తీ చేశాడు. రాబోయే కోట్లు తలుచుకుంటూ మొత్తానికి అన్న వేళకి రెండు నెలలు ఆలస్యమైనా ఆగమేఘాల మీద అన్నట్టు చేతికి అప్పగించాడు. అపార్టు మెంట్ల గురించి పిల్లలు బిల్డర్ తప్ప ఆయన జోక్యం కలుగ చేసుకోలేదు.
తండ్రి టెర్రేస్ మీద వన్ బెడ్ రూమ్స్ మీద అంత శ్రద్ధ ఎందుకో అర్ధం కాక అడిగారు పిల్లలు. అయన జవాబుకి తెల్లబోయారు. "ఏమిటి మీరుంటారా ఇక్కడ. అపార్ట్ మెంట్ లో ఉండరా" ప్రశ్నలు గుప్పించారు. "అంత పెద్ద అపార్ట్ మెంట్ నేను మేనేజ్ చేయలేను. ప్రశాంతంగా , హాయిగా ఎవరితో ప్రమేయం లేకుండా నేను ఉండడానికి ఇది కంపార్ట బుల్ గా ఉంటుందని పించింది. మీరు వండుకున్నది నాకు ఇంత వంట మనిషి చేత పంపండి అదీ కుదరకపోతే కేటరింగ్ పుడ్ వుందిగా కాఫీ చేసుకుంటా. ఒకే బిల్డింగ్ లో వున్నాం కనక పిల్లలు దూరంగా వున్నారని నేను, నాన్న ఏం ఇబ్బంది పడుతున్నారో అని మీరు బాధపడక్కర్లేదు. ఎమర్జెన్సీ వస్తే చూడడానికి పిల్లలు ఉన్నారన్న భరోసా చాలు. ఎవరి స్వతంత్యం ప్రయివేసీ వారి కుంటుంది. అంత ఇల్లు నేనేం చేసుకుంటా. మీ అమ్మ ఉంటె ఆ సంగతి వేరు. నాకు ఎవరు అడ్డు చెప్పద్దు. ఈ వయసులో వంటరిగా తోచక మగ్గే కంటే నాలాటి రిటైర్డ్ అయి భార్యో, భర్తో వంటరిగా మిగిలిపోయి పిల్లల దగ్గర ఇమడలేక సర్దుకు ఇరుకు గదుల్లో ఉండలేక బాధపడుతూ కాలక్షేపం లేక బాధపడే వారందరం కలిసి మెలసి ఉండచ్చు. పది అపార్ట్ మెంట్స్ లో వుండేవాళ్ల పేరెంట్స్ ఇక్కడ కొనుక్కుంటే, లేక పిల్లలు కొనిచ్చి వయసు మీరిన తల్లి తండ్రి వారి మానాన వారు హాయిగా వుంటారు. పిల్లలకి దగ్గిర పెట్టుకునే ఇబ్బంది, తల్లి తండ్రులకి సర్దుకుని బతికే అవస్థ ఉండదని ఈ ఆలోచన చేశా" అని అన్ని విశదంగా అందరికి భోధపరిచి ఎవరు ఏం మాట్లాడడానికి లేకుండా చేశారు జగన్నాధం గారు.
* * *
అమ్ముడవుతాయో లేదో కొంటారో లేదో ఇన్ని కట్టించారీయన అని మనసులో భయపడే బిల్డర్ హాట్ కేక్స్ ;లా ఎనిమిది అమ్ముడవడమే కాదు "ఇంకా ఏమన్నా ఉన్నాయా, బయటి అపార్ట్ మెంట్స్ వాళ్ళకి అమ్ముతారా" అంటూ ఎంతో మంది తిరగి పోవడం చూసి మళ్ళీ ఈ ప్లాన్ తో కట్టాలి ఇంకో చోట అని నిర్ణయం చేసుకున్నాడు.
అక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ మధ్యతరగతి సంసారులే. ఓ ఇల్లు ఉంటె చాలు బతకడానికి పెన్షన్ వుంది అనుకునేవారే.
మంచిరోజు చూసి పాలు పొంగించి, సింపుల్ గా గృహప్రవేశం చేసారు కొనుక్కున్న వారందరినీ సంప్రతించి "పేరెంట్స్ డెన్' అని టెర్రస్ రూమ్స్ కి ఆరోజే బ్రహ్మాడి చేత నామకరణం చేయించేసారు. భార్య పేరిట వాణి నిలయం అని అపార్ట్ మెంట్స్ కి పేరు రాయించేశారు.
పిల్లలు తల్లి తండ్రులు అందరు హ్యాపీ వేరు వేరు కారణాలతో -- అబ్బా కాస్త విశాలంగా ఉన్నట్టుంది ఇల్లు. మూల కూర్చోకుండా అన్ని అడుగుతారు అన్ని వాళ్ళకే కావాలి అని విసుకున్న కోడళ్ళు ఏదో ఫ్రీడమ్ దొరికినట్టు ఫీల్ అయ్యారు. అమ్మా నాన్నలతో ఓ పక్క , పెళ్ళాంతో ఓ పక్క వేగలేక పొతే పోయింది కాస్త డబ్బు ప్రశాంతత దొరికింది. డబ్బు కాస్త సర్ది పెన్షన్లో నించి మిగతా లోన్లు కట్టే ఏర్పాటు చేసిన కొడుకులు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. భగవంతుడా తినో తినకో హాయిగా గొడవలు, అవమానాలు లేకుండా సర్దుకు బతికే అవస్థ నించి తప్పించావు . మేము కృష్ణ రామా అనుకునే వీలు కల్పించారు. చేతులెత్తి దండాలు పెట్టుకున్నారు. తలలో తండ్రి ఒక్కరయ్యాక కాస్త డబ్బుండి ఇల్లు మైంటైన్ చేయలేని వారు పిల్లలతో సర్దుకు బతకడం చేతకాక సతమత మయ్యేవారు అన్ని రకరకాల ఇబ్బంది పడిన వారందరూ జగన్నాధం గారిని పొగడ్తలతో ముంచెత్తి 'ఇంతమంచి ఐడియా మీకు వచ్చినందుకు మీ వల్ల మా శేష జీవితం ఆనందంగా గడుపుతాం. మీకు మేమందరం రుణ పడ్డాం" అంటూ దండాలు పెట్టారు.
మొత్తానికి జగన్నాధం గారి పెద్దరికం అందరు ఇష్టపడి , అయన చెప్పినట్టు వాళ్ళ వాళ్ళ జీవితాలు కి ఓ రొటీన్ ఏర్పరచుకుని, ఓ కుటుంబంలా కలిసి మెలిసి ఆనందంగా బతకడానికి ఆరునెలలు గడవకుండానే తయారు అయిపోయారు.
* * *
"తాతయ్యా, మీ గది ఎంత బాగుంది హాయిగా ఎవరి గొడవ లేకుండా చక్కగా చదువుకోవచ్చు, ఇది నాకిచ్చేసి నీవు కిందికి ణా గదిలోకి వెళ్ళిపో' అన్నాడు జగన్నాధం గారి మనవడు పైకి వచ్చి అన్నీ తిరిగి చూసి.
"అమ్మ ఆశ నీకోసమా... ఇంత కష్టపడి కట్టించాను. ఈ ప్రశాంతత కోసమే, ఈ కాలక్షేపం కోసమే కదా. కింద మీరంతా స్కూల్స్ కి , ఆఫీస్ లకి పోతారు. మీ చదువులు పనులు మీవి. ఈ ముసలాడి సంగతి ఎవరికి కావాలి రా, తోచక కొట్టుకునేవాడిని. ఇప్పుడు చూడు ణా వయసు వాళ్ళం అందరం ఉదయం యోగ చేస్తా, అందరు మాట్లాడుకుంటూ, పేక, చదరంగం, కేరమ్స్ ఆదుకుంటాం. కలిసి వాక్ కి వెడతాం, కలిసి కష్టం సుఖం పంచుకుంటాం. ఎంత హాయిగా ఉందిరా ఇపుడు" ఎమోషనల్ గా అన్నారాయన.
"ఓ కారమ్స్ పేకాట ఆడుతున్నారా తాతయ్యా , నేను ఆడుతాను. పిలు తాతయ్యా నన్ను" ఉత్సాహంగా అన్నాడు.
"మీ అమ్మ కర్ర పుచ్చుకు వస్తుంది. అయినా మా ముసలి వాళ్లతో నీకెందుకురా...నీ వయసు వాళ్ళు లేరా ఎవరు అయినా చదువు కోకుండా వీటి మీదకు గాలి మళ్ళి పోతుంది ఆడుతుంటే. ఆదివారం ఎప్పుడైనా పిలుస్తాలే " చిన్నపోయిన మనవడి మొహం చూసి మనవడి భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అన్నారు.
"ఏమో సరిగా ఇంకా ఎవరు పరిచయం కాలేదు" అని తాతగారి మొహం చూస్తూ "తాతయ్యా ఒకటి అడుగుతా నిజం చెపుతావా , నీవు అమ్మ మాటలు విన్నావు కదూ! అమ్మ ఏదో అందని ఇక్కడికి వచ్చేశావు కదూ!: సూటిగా చూస్తూ అన్నాడు తొమ్మిదో క్లాస్ చదివే జ్ఞానం వచ్చిన మనవడు.
అయన ఒక్క నిమిషం తెల్లబోయి తరువాత నవ్వేస్తూ "నీ మొహం అదేం కాదు. మామ్మ పోయాక ఇలా ఫ్రెండ్స్ తో ఉంటె కాలక్షేపంగా ఉంటుందని, ఎవరికీ ఇబ్బంది లేకుండా, చోటు సరిపోడురా చదువుకునే పిల్లలకి ఓ గది వుండాలిరా నాకు రూం వద్దా చెప్పు" అంటూ మాట మార్చేసి నవ్వేసారు.
మధ్య మధ్య తాతగారి దగ్గరకు వచ్చి వెళ్ళేవాడు మనవడు. ఆదివారం కొడుకు వచ్చి తండ్రి యోగ క్షేమాలు విచారించే వాడు. జగన్నాధం గారు చెప్పింది సంభ్రమంతో విన్న మనవడు దృష్టి లో తాతగారు ఒక్కసారి అంతెత్తు ఎదిగి పోయారు.
* * *
అలాగ అందరికీ ఒకే రొటీన్ అలవాటు చేసి జగన్నాధం గారు ప్రతీది పద్దతి ప్రకారం జరిగేట్టు చూసారు. అక్కడ ఇద్దరు ఒంటరి ఆడవారు ఇద్దరు కలిసి ఒక రూం కొనుక్కుని వుంటారు. అక్కడ వున్న అందరు డెబ్బయి, ఎనభై దాటినవారే. అన్నయ్య గారు అక్కగారు అనుకుంటూ ఒకరి నొకరు సాయం చేసుకుంటూ హాయిగా బతికేస్తున్నారు. అట్టే డబ్బు లేకపోయినా తమకు నీడా తోడు సాయం దొరికి నిశ్చింతగా ఉన్నామని గొడవలు లేకుండా బతుకుతున్నామని అనుకుంటారు.
మనందరం ఎంత ప్రశాంతంగా బతుకుతున్నామో, మనలాటి ఒంటరి వారు బాధ్యతలు, బరువులు, గొడవలు లేకుండా బతకాలంటే ప్రతి అపార్ట్ మెంట్ లో ఇలాటి రూములు ఏర్పాటు చేసేట్టు బిల్డర్స్ తో స్థలాలు అమ్మినప్పుడే మాట్లాడి సెటిల్ చేసుకునేట్టు ఉండాలి. ఈ పద్దతి నలుగురి లోకి వెళ్ళాలన్నా, అందరి దృష్టి ఈ విషయం మీదకి వెళ్ళాలన్నా, మనం విసృతంగా ప్రచారం చేస్తే , పేరెంట్స్ మధ్య, పిల్లల మధ్య మనస్పర్ధలు లేకుండా, ఎవరి ప్రైవసీ వారికి వుండి హాయిగా ఉంటారని అయన అంటుండేవారు. ఎన్నో ఫోటోలు పత్రికలకి పంపించి, తెల్సిన అందరి ద్వారా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ లకి కరపత్రాలు ముద్రించి , జనం మధ్యలు ఈ వార్త వెళ్ళేట్లు చేయడం సఫలీ కృతు లయ్యారని చెప్పచ్చు. తనకున్న పలుకుబడితో ప్రభుత్వాలు అపార్టు మెంట్స్ కట్టేటప్పుడు విధిగా ఈ రూలు పాటించి , చట్టం రూపొందించాలని ఎంతో మంది ఆఫీసర్ల ని వారి ద్వారా, చీఫ్ మినిస్టర్ని కలిసి, చర్చించి ఒప్పించి తప్పకుండా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం ప్రవేశాపెడతాం అని మాట తీసుకున్నారు. ప్రెస్ వాళ్ళు రావడం, ఫోటోలు , వార్తలు ఆర్టికల్స్ వచ్చాయి.
ఇదంతా ఒకరోజో వారమో కాదు జరగడానికి ఏడాది పట్టి, అందరు సర్దుకు అలవాటు పడి, హాయిగా ఉన్నామని అనుకునేసరికి జగన్నాధం గారికి ఓ రాత్రి స్ట్రోక్ వచ్చింది. ఆయనకి కాలు చేయి కాస్త దెబ్బ తిన్నా తొందరగానే తేరుకుని ఫిజియోతెరఫీ వాటితో కోలుకుని, వాకర్ సాయంతో నడుస్తూ అయన పనులు అయన చేసుకునే స్థాయికి వచ్చారు. అయన ఆప్తమిత్రుడు పార్ధసారధి అనుక్షణం ఆయనతో వుండడానికి ఆ గదిలోకి మారాడు సాయంగా. మిగతా అంతా ఏ ఒక్క క్షణం ఒంటరిగా వదలకుండా, ఎవరో ఒకరు దగ్గిరుండి నడిపిస్తూ, ఎక్సర్ సైజులు చేయిస్తూ పేకాట, చదరంగం ఆడుతూ ఆయన్ని మూడు నెలల్లో కాస్త బయటికి తీసుకు వెళ్లి, దగ్గరుండి వాక్ చేయిస్తూ ఇంచుమించు కొంచెం కాలు తప్ప మిగతా ఏ ప్రాబ్లం లేదు. అమ్మయ్య అని అంతా అనుకునే వేళకి, మృత్యువు నిద్రలోనే తీసికెళ్ళి పోయింది. ఆయన్ని బ్రతికినంత సేపు అయన మిత్రులతో గవర్నమెంట్ రూల్ చేయించే బాధ్యత మీదే నేనున్నా లేకపోయినా అనేవారు అందరు తలలూపేవారు.
పదమూడో రోజు భోజనాలు అయ్యాక అయన ఫోటో దగ్గర నమస్కారం చేసి అయన కోరిక తీరేందుకు ప్రయత్నిస్తామంటూ ఫోటో మీద చేయి వేసి ప్రమాణం చేసారు మిత్రులు.
* * *
