Previous Page Next Page 
భవ బంధాలు పేజి 6


                           పేరెంట్స్ డెన్
    ఆ వాణి నిలయం టెర్రేస్ మీద స్మశాన నిశ్శబ్దం అలుముకుంది. కింద మూడో ఫ్లోర్ లో శవయాత్ర కి జగన్నాధం గారిని సిద్దం చేస్తున్నారు. అక్కడ వున్న ఆరుగురు పేపర్లో ముఖం దాచుకున్నారు. రూమ్ లో నించి వస్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ 'కిందికి వెడదామా' అంది జానకమ్మ జనాంతికంగా.
    "ఇంకా టైం పడుతుంది. ఇంటి నిండా జనం, బంధువులు, స్నేహితులు అయన ఆఫీస్ వాళ్ళు, బోలెడు మంది వున్నారు. చోటు లేదు. కిందికెళ్ళి చూసి వచ్చా స్నానానికి కిందికి తీసుకెళ్ళి నపుడు వెడదాం" రామ్మూర్తి అన్నాడు.
    "సరే అయితే .....వెళ్ళేటప్పుడు పిలవండి , పని చూసుకుంటా లోపల" అంటూ లోపలి కెళ్ళి పోయినందావిడ.
    "ఒక కుటుంబం లా వున్నాం ఇన్నాళ్ళు. ఇంత తొందరగా దాటి పోతారను కోలేదు. "నిట్టూర్చి అన్నారు సుబ్రహ్మణ్యం.
    "పోయిన వాళ్ళు అదృష్ట వంతులు. భార్య పోయిన ఈ రెండేళ్ళ నించి అయన దిగులుగానే వున్నారు. అందులో గత ఏడాది స్ట్రోక్ వచ్చిందగ్గిర నించి మరీ డీలా పడిపోయాడు. ఏదో మంచిపని చేసి పేరు తెచ్చుకుని పోవడం, ఎందరికి దక్కుతుంది. ఈ తృప్తి, అదృష్టవంతుడు నలుగురికి మేలు చేసేపని. తోవ చూపించి దాటిపోయాడు. ఆయనకి ఎంతో దగ్గర స్నేహితుడు ఆప్తుడు గౌరీ శంకర్ అన్నాడు.
    "అందరి మాటేమో గానీ మనకి ఈ చివరి రోజుల్లో ఓ తోవ చూపించి సంతోషంగా స్వేచ్చగా పరువుగా మన మానాన మనం బతికే వీలు ఇచ్చాడు ఎక్కడి వాళ్ళం ఎలా కలిసి పోయి ఆనందంగా యేడాది నుంచీ ఒక కుటుంబమయి పోయాం" చలపతిరావు విచారంగా అన్నాడు. అంతా తలాడించారు.
    కింద నించి "నారాయణ నారాయణ" అన్న మాటలు వినగానే అందరు దిగ్గున లేచి "పదండి కిందికి తీసుకేడుతున్నారు వెడదాం" అని బయలుదేరారు.
    కింద బ్రాహ్మడు తంతు స్నానాదికాలు యధావిధి గా కొడుకు చేత చేయించి అందరి చేత ప్రదక్షిణాలు చేయించి నోట్లో బియ్యం గింజలు వేయించాడు. పాడే లేచింది నారాయణ శబ్దాల మధ్య కావాల్సిన వాళ్ళంతా వెంట కదిలారు.
    "నాన్న కుటుంబం అయిపోయారు మీరంతా. వచ్చాక స్నానాలు చేసి రండి. భోజనానికి ఏర్పాట్లు చేసాం ఈ పూట" అంది కూతురు కళ్ళు తుడుచు కుంటూనే, అంతా తలాడించారు.

                                   *    *    *
    ఆరోజులో జగన్నాధం గారి శకం ముగిసింది. పదమూడు రోజులు ముగిసి ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు. అపార్ట్ మెంట్స్ కట్టినపుడే, ముగ్గురు పిల్లలకి తలొకటి తన కొకటి రిజిస్టర్ చేయిన్చేశారు. వున్న క్యాష్ కర్మ కాండలకి , సంవత్సరానికి ఖర్చు పెట్టగా మిగిలింది తన పేరు, భార్య పేరుతొ వారి వారి అబ్ధిక దినాలలో రామకృష్ణ ఆశ్రమం లో ఆ వడ్డీతో అన్నదాన కార్యక్రమానికి వినియోగించవలసిందిగా కోరాడు. తన అపార్ట్ మెంట్, తన తమ్ముడి కొడుకు జీవితం లో పైకి రాలేక పోయిన అతనికి ఇస్తున్నట్టు విల్లు రాసి ఏ గొడవలు తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు. తన పుస్తకాలు, సామాను తన మిత్రులకి కావలసింది ఇచ్చేట్టు ఏ ఆశయానికి ఈ "పేరెంట్ హోమ్స్" మొదలు పెట్టారో అది అన్ని చోట్లకి విస్తరించి అమలు జరిగేట్టు చూసే బాధ్యత మిగతా మిత్రుల పైన పెట్టారు. ప్రార్ధనలు భోజనాలు చేసి ఫోటో కి దండం పెట్టి అందరూ కదిలారు.
    జగన్నాధం గారు జనానికి జడ్జి అయినా ఆయనకి భార్య వాణి జడ్జి. ఇంట్లో ఆవిడ మాట ఏనాడు కాదనలేదు. ఏదన్న అయన చెప్పింది సరిగా లేదని అనిపించినా, సావకాశంగా అలోచించి, నెమ్మదిగా సందర్భం చూసి తన ఆలోచన సరియైనదేనా అన్నట్టు అడిగేది భర్తని, "అవును సుమా నేనంత దూరం ఆలోచించలేదు , నయమే చెప్పావు అనేవారు " అయన.
    అవిడెం పాతకాలం ఇల్లాలు కాదు. చదువుకుని , స్కూల్ ని పిల్లల్ని కంట్రోల్ చేసే హెడ్ మిస్త్రేస్ స్థాయి నించి అదే స్కూలు కాలేజ్ అయ్యాక ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగి, పవర్ పుల్ ఇంటిలిజెంట్ లేదీగా అందరి చేత మన్ననలు అందుకున్న ఆవిడ అన్నదే కరెక్ట్ అని నమ్మేవారు అయన. పుట్టిన ఊర్లోనే తండ్రి లా ప్రాక్టీస్ అంది పుచ్చుకుని తండ్రిని మించి పేరు తెచ్చుకుని కాల క్రమంలో హైకోర్టు జడ్జిగా ఎదిగి రిటైర్ అయిన పెద్ద మనిషి. ఒకే ఊరిలో జాయింట్ ఫ్యామిలీలో వుంటూ, తండ్రి పేరు నిలబెట్టి, తండ్రిని మించి ఎదిగిన కొడుకుగా, జగన్నాధం గారంటే ఆ ప్రాంతాల తెలియని వారులేరు. తల్లి తండ్రి కాలం చేసాక ఆ యిల్లు ఇంట్లో పెద్ద అన్నయ్య గా ఏ బాధ్యతలు వదలకుండా, ఆ ఇంట్లో భార్య భర్త హాయిగా ఆనందంగా,పిల్లల బాధ్యతలు తీరి, నిశ్చింతగా మొక్కల మధ్య గడుపుతూ, చూడదల్చిన ప్రాంతాలు, గుళ్ళూ గోపురాలు చూస్తూ, సంతోషంగా బతికే ఆ దంపతులని చూసి దేముడి కే కుళ్ళు కుట్టే ఏమో అన్నట్టు కరోనా రూపం లో వచ్చి అయన సగం ప్రాణాన్ని తీసికెళ్ళాడు దేముడు.
    ఆత్మీయ బంధువుని కోల్పోయి జీవచ్చవం లా అయిపోయి, ఆరునెలల కు గాని అయన తేరుకోలేక పోయారు. తెరుకున్నా మునుపటి మనిషి కాలేక పోయారు. ఆ లంకంత పాత కొంప లో ఒక్కరు వుండడానికి వీల్లేదంట. ఒక విధంగా బలవంతంగా రానంటున్న ఆయన్ని, సరే నెల రెండు నెలలు వుండి వస్తే కాస్త మార్పు వుంటుందని తల్లి పోయిన నెలలో తండ్రి బాధ చూడలేక వంటరిగా వున్న తండ్రిని ఊర్లో వున్న కొడుకు తీసుకెళ్ళాడు.
    ఊరుకి దూరంగా ఎన్నో కొత్త కొత్త అపార్ట్ మెంట్స్ వెలిసాయి. అందులో మూడు గదుల ఒక అపార్ట్ మెంట్ ఆఫీసు కి దగ్గరని, అద్దెకి ఉన్న కొడుకు ఇంట్లో పుట్టిన దగ్గర నించి పెద్ద ఇంట్లో ఉండడం అలవాటయిన అయన, మనవడి తో సర్దుకుని ఓ గదిలో ఇమడలేక, ఊపిరి అడనట్టు సతమత మయిపోయారు. ముళ్ళ మీద ఉన్నట్టు నెల్లాళ్ళ గడిపి , వెళ్ళడానికి బయలుదేరి పోయిన తండ్రిని ఏ విధంగానూ ఆపలేక "ఆ పాత దెయ్యాల కొంప లో ఎలా వంటరిగా వుంటారు. అపార్టుమెంట్లు కట్టడానికి ఇచ్చేయండి. అందరికి తలోటి ఇచ్చి వాడు మిగతావి తీసుకునేట్టు బిల్డర్ ని చూద్దాం. వంటిల్లు అన్ని పాతపడి సదుపాయంగా లేవు' అని తండ్రిని ఊదర గొట్టి , అన్నగారితో, అక్కచెల్లెళ్ళ చేత చెప్పించి వప్పించాడు కొడుకు. "ఒక్కరు ఉండద్దు చుట్టూ మనుషులుంటారు' కాలక్షేపంగా ఉంటుంది మీకు నేను ఆ అపార్ట్ మెంట్ కి వచ్చేస్తా మీ ఇంట్లో మీరుండచ్చు . మీకు సాయంగా నేను అక్కడికి మారుతా, దూరమైనా సరే , అంటూ సిటీకి సెంటర్లో ఉన్న అంత పెద్ద స్థలం ఏ బిల్డర్ అయినా కళ్ళకి అద్దుకు ముందుకు వస్తారు' అంటూ ఆయన్ని ప్రలోభపెట్టి మొత్తానికి పిల్లలంతా ఏకమయి ఆయన్ని వప్పించగలిగారు.

                                                         *    *    *
    ఆ ఎనిమిది వందల గజాల స్థలం లో ఐదంతస్తుల భవనం లేపడానికి పునాదులు పడ్డాయి. మొత్తం పది అపార్ట్ మెంట్స్, బిల్డర్ కి ఐదు ఇచ్చేట్టు మిగతావి కట్టి స్థలం యజమానికి ఆధునిక హంగులతో వారి అభిరుచుల మేరకి వుడ్ వర్క్ తో సహా బిల్డర్ కట్టి ఇచ్చేట్టు ఒప్పందం కుదిరింది. ఆ స్థలానికి వున్న విలువ మరి. అన్నిటికి తలూపే బిల్డర్ పని ఆరంభించాడు. చుట్టూ ప్రహరీ గోడకి అనుకుని వున్న పళ్ళ చెట్లు అడ్డం లేని ఏ చెట్లు కొట్టరాదన్న షరతులు పెట్టారు జగన్నాధం గారు. ఏడాది కల్లా పని పూర్టి చేసి అప్పగించాలి. పనులు చురుకుగా సాగుతున్నాయి.
    ఇల్లు వదిలి ఇంటి పని పూర్తీ ఆయె వరకు కొడుకింటికి షిప్ట్ అవక తప్పని స్థితి వచ్చింది ఆయనకి. వేరే ప్లాట్ తీసుకుని ఉండడానికి ఇల్లు, సంసార బాధ్యతలు భార్య తప్ప అయన ఏనాడూ పట్టించుకోలేదు. కాఫీ కూడా చేసుకోడం తెలీని అయన వేరే ఉంటె పడాల్సిన ఇబ్బందులు తలుచుకుని, కొడుకింట్లో ఉండేందుకు తగవగ్గాడు. ఇంట్లో పాత కాలం ఫర్నిచర్ టేకువి, భార్య జ్ఞాపకాల వస్తువులు భద్రంగా ఓ గారేజ్ అద్దె కి తీసుకుని పెట్టి కొడుకు ఇంటికి బయలుదేరారు జగననాధం గారు.
    
                                  *    *    *
    ఆ ఏడాది లో అ ఇంట్లో ఉండడం ఆయనకి జీవితం చాల పాఠాలే నేర్పింది. ఎవరిని తప్పు పట్టలేని స్థితి. స్వేచ్చ అంటే అర్ధం బాగా తెలిసి వచ్చింది. తన ఇష్టాఇష్టాలకి ఆ ఇంటికి అయన కాదు యజమాని. ఆయన రుచులు అభిరుచులు అన్ని మర్చిపోయి సర్దుబాటు చేసుకోవలసిన స్థితి ఆయనకి మింగుడు పడేది కాదు. మింగుడు పడకపోయినా భార్య లేకపోవడం అంటే ఏమిటో తెలిసి వచ్చి రాత్రిళ్ళు కుమిలి పోయేవారు. అలా దిగులుగా నిద్రపట్టని రాత్రులు ఆలోచన మధ్య తనలాటి వారు ఎలా బతుకుతున్నారో బాధపడుతున్నారో అన్న ఆలోచన నించి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. పది రోజులకి ఆలోచన ఒక రూపు దిద్దుకుంది ఆయనలో. అంతే ఆ ఆలోచన అమలు చేసేవరకు నిద్రపోలేదు. అయన బిల్డర్ ని పిలిచి మనసులో ఆలోచన వివరించారు. "ఇది డబ్బాశతో చెయ్యాలనుకున్నది కాదు ఆ డబ్బు నీదే అమ్ముకో, నాకొకటి ఇచ్చి మిగతావి అమ్ముకో, నేచేప్పిన అవసరాలు సౌకర్యాలు ఉండాలి. ప్లాన్ తీసుకొచ్చి చూపించు. ఎంతవుతుందో చెప్పు. న్యాయంగా ఉండాలి. కట్టినపుడు ముసలి వారిని మర్చిపోకు" అని పర్మిషన్ వ్రాసి ఇచ్చేసారు. "మున్సిపాలిటీ శాంక్షన్ అన్నీ నీవే చూడాలి. ణా పలుకుబడి , మాట సాయం కావలిస్తే అడుగు" అంటూ ఉత్సాహంగా భుజం తట్టి అపుడే అయిపోయినట్టు సంబరపడ్డారు. బిల్డర్ కలుగబోయే లభ్దిని లెక్కలు కట్టి ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు.

                                   *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS