తోడొకరుండిన
డోర్ బెల్ మోగింది.
'పాల ప్యాకెట్ గుమ్మంలో పడేసి పోవచ్చుగా? మళ్ళీ బెల్ ఎందుకు కొట్టడం? ఎన్నిసార్లు చెప్పినా ఆ కుర్రవెధవ వినడు. ఇంకా పూర్తిగా చీకట్లు పోనేలేదు. తెల తెల వారుతుండగా అప్పుడే మంచి నిద్ర పడుతుంది. అసలే చలికాలం . అందులోనూ దుప్పటి కప్పుకుని పడుకుంటే అస్సలు లేవాలని అనిపించదు' విసుక్కుంటూ లేచి తలుపు తీసింది సావిత్రి.
ఎదురుగా కనపడిన మొహం చూసి బిత్తర పోతూ "నువ్వా ?....మీరా! ఏమిటిలా హటాత్తుగా , ఫోనైనా చెయ్య వచ్చు గదా" అల్లుడిని చూసి నైట్ గౌను సర్దుకుంటూ గాబరాగా అంది.
"చెప్పి వచ్చినా గానీ, ఇక్కడెవరు మాకు హరతు లిచ్చి స్వాగరించరని తెలుసుగా" వ్యంగ్యంగా ఓ నవ్వు విసిరాడు అల్లుడు. గుమ్మం లోంచి తప్పుకుని, "రండి లోపలికి" అంది సావిత్రి. షోల్డర్ బ్యాగ్ తో లోపలికి వచ్చి , కూతురు గది వైపు వెళ్ళబోతుంటే , కాసేపు ఈ గదిలో కెళ్ళి పడుకోండి. ఇంకా పూర్తిగా తెల్లార లేదుగా , అమ్మాయి మంచి నిద్రలో ఉంది. మళ్ళీ పిల్లాడు నిద్ర లేచైపోతాడు" అంటూ మూడో గది వైపు చెయ్యి చూపించింది సావిత్రి.
"అవును లెండి. ఆవిడ గారికి ఇప్పుడప్పుడే తెల్లారదుగా" అన్నాడు అల్లుడు, మళ్ళీ ఓ వ్యంగ్యపు నవ్వు నవ్వి, లోపలికి వెళ్లి తలుపేసుకున్నాడు.
సావిత్రి తన గదిలో కెళ్ళి పక్క మీద వాలిందే గానీ, ఇంక నిద్రెం పడుతుంది. 'తెల్లారి ఎదుర్కోబోయే సంఘటనలు.....అటు అల్లుడు, ఇటు కూతురు ఇద్దరి కిద్దరే. ఒకరి మాట ఒకరు వినరు. తమదే రైటు అంటారు తప్ప ఎదుటి మనిషిని అర్ధం చేసుకునే ప్రసక్తే లేదు. మధ్యలో తనకే చచ్చే చావోచ్చింది. అయన కల్పించుకోరు. పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఏడాది కాలంగా చెప్పీ, చెప్పీ ...." నాకింకేం చెప్పొద్దు . వాళ్ళేడుపు వాళ్ళని ఎడవనీ....నా ప్రాణం విసిగిపోయింది. ఇది వెళ్ళదు అతను వదలడు" అంటూ ఏం చెప్పినా చెవులు మూసేసు కుంటాడు తన భర్త.
"ఏమిటి అప్పుడే లేచావు. పడుకో పడుకో" కళ్లిప్పి బద్దకంగా అన్నాడు మూర్తి.
"ఏం పడుకుంటాను. అవతల అల్లుడు గారు వెం చేశారు" విరక్తిగా అంది సావిత్రి.
"ఏమిటి వివేక్ వచ్చాడా..." కప్పుకున్న రజాయి తీసేసి లేచి కూర్చున్నాడు మూర్తి.
"ఆ వచ్చాడు . పేరులోనే తప్ప ఏ కోశానా ఇసుమంతైనా వివేకం లేదు."
"అవును, నీ కూతురికి కూడా పేరులో తప్ప సౌమ్యత లేనట్టుగానే" అయన విసుర్లు.
"మీకు కూతురే . ఆ మాట మరిచిపోకండి" చురుగ్గా చూస్తూ పక్క మీద నుంచి లేచి బయటకు వెళ్ళిపోయింది సావిత్రి.
తెల్లవారాక బ్రష్ చేసుకుని కాఫీ కోసం వంటింట్లో కి వచ్చిన సౌమ్యతో , "మీ అయన వచ్చాడు."
కాఫీ కలుపుతూ లోగొంతుకతో చెప్పింది సావిత్రి. సౌమ్య చటుక్కున తల్లి వంక చూసి, "అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు" చిరాగ్గా అంది.
"సరే, వివేక్ వచ్చాడు"సావిత్రి అంతకంటే తీవ్రంగా అంది. "రానీ నాకెందుకు చెప్పడం ...కాఫీ మగ్గు, పిల్లాడి ఫీడింగ్ బాటిల్ పట్టుకుని సౌమ్య గదిలోకి వెళుతుంటే "నీకు మొగుడు గనుక చెప్పాను" అంది వెనక నించి మళ్ళీ.
వెనక్కి తిరిగి తల్లిని మింగేసేట్టు చూస్తూ "ఆ మాటే అనొద్దన్నాను..." అంటూ గదిలోకి వెళ్లి దడాలున తలుపు వేసుకుంది సౌమ్య. గదిలోంచి బయటకు వచ్చిన మూర్తి ని చూసి ఆ కోపం అంతా చేతిలో ఉన్న పటకారు మీద చూపించి పొయ్యి గట్టు మీద గట్టిగా విసిరేసింది సావిత్రి. నిమ్మకు నీరెత్తి నట్టు భార్య కేసి చూస్తూ, "ఆ కాఫీ ఇలా ఇవ్వు" అన్నాడు మూర్తి ప్రశాంతంగా.
తలుపు తీసి, గుమ్మంలో ఉన్న పేపరు తీశాడు. హెడ్ లైన్స్ చూస్తూ భార్య ఇచ్చిన కాఫీ గ్లాసు అందుకుని సోఫాలో కూర్చో బోతుంటే , "హలో గుడ్ మార్నింగ్ సార్" అంటూ వచ్చి పలకరించాడు వివేక్.
"ఓ వెరీ గుడ్ మార్నింగ్ , మీరు వచ్చారని సావిత్రి చెప్పింది. కూర్చోండి సావిత్రీ . మరో కాఫీ పట్రా" మర్యాదగా అన్నాడు మూర్తి కాఫీ తాగుతూ , పేపరు చూస్తూ, "ఏమిటీ? ఇలా వచ్చారు" అని అడిగాడు.
"పెళ్ళాం బిడ్డలు ఇక్కడే వున్నప్పుడు మావగారింటికి రాక తప్పుతుందా" వ్యంగ్యంగా ఎత్తిపడుపు గా అన్నాడు.
"ఓ రియల్లీ , మీరిద్దరూ ఇంకా భార్యభర్తలేనా?" అంతకంటే వ్యంగ్యంగా అన్నాడు మూర్తి.
"అని నేను అనుకుంటున్నాను. మీ అమ్మాయి ఏమను కుంటుందో మీకే తెలియాలి." గడుసుగా అన్నాడు వివేక్.
"నాయనా మీ ఇద్దరికీ ఓ నమస్కారం . మీ ఇద్దరూ భార్యాభర్తలో కాదో మీరే తేల్చుకోండి." ఆ పని మీరు చెయ్యకపోతే మీకు సాయపడడానికి కోర్టులున్నాయి . మీ ఇద్దరికీ చెప్పలేక , మాకున్న ఓపిక, సహనం అన్నీ నశించి పోయాయి. కన్నాం కాబట్టి దాన్ని ఇంట్లోంచి పొమ్మనలేక పోతున్నాం అంతే" విరక్తిగా అన్నాడు మూర్తి. సావిత్రి వచ్చి కుర్చీ జరిపి కూర్చుంటూ, "వివేక్ ఇదేమీ బాగాలేదు. ఇద్దరికిద్దరు ఇలా పంతాలకు , పట్టింపు లకూ పొతే ఎలా? మీ మధ్య ఒక పిల్లాడు ఉన్నదన్న విషయం మరిచి పోకండి. రేపు వాడు కాస్త పెద్దైన తర్వాత "నాన్న ఏడీ అని అడిగితె...."
"అవును....అది మీ అమ్మాయి ఆలోచించు కోవాల్సిన వ్యవహారం. ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఆమెకు ఆమొండి వైఖరి , ఆ ధైర్యం ఏమిటో నాకైతే అంతుబట్టడం లేదు, మీకేమైనా అర్ధం అవుతుందా?"
"చూడు వినేక్ భార్యాభర్తల తగవులలో ఎవరిది రైటు. ఎవరిది తప్పు అన్నది మూడో వాళ్లకి అర్ధం కాదు. ఎవరికి వాళ్ళు మేమే రైటంటారు. మా అమ్మాయి మాటలే కరెక్టు అని మేం ఎప్పుడు నీతో అనలేదు గదా! ఇప్పటికైనా ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోండి. ఏదో ఒక నిర్ణయానికి రండి. అప్పుడు బాగుంటుంది."
"మాట్లాడాలని ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చాను కదా! ఆవిడ నోట్లోంచి మాటరాదు. కంప్రమైజ్ అన్న పదానికి అర్ధం తెలియనట్లు ప్రవర్తిస్తుంది. నాకు ఇంక ఈ రాకపోకలు చాలనిపిసొంది. అంత కాళ్ళబేరానికి దిగేంత తప్పులు నేనేమీ చెయ్యలేదు. వస్తుందో రాదో అడిగేసి, నా దారి నేను చూసుకుంటానిక. దేనికన్నా పట్టూ విడుపూ వుండాలి. మా గొడవల మధ్య పిల్లాడు తండ్రి లేని వాడై పోకూడదని, సంసారం పాడు చేసుకోకూడదని ణా వైపు నుంచి నా ప్రయత్నాలు నేను చేశాను."
"వివేక్ అన్నానని కోపం తెచ్చుకోకు . చేతులు కాలాక ఆకులూ పట్టుకున్నావు. ఈ ఆలోచన , ఈ సౌమ్యత కాస్తంత ఓపిక , సహనం అప్పుడే ఉంటె, కాస్తంత ఆదరణ, అభిమానం, అప్పుడే చూపించి ఉంటె, ఏనాడో కరిగిపోయి ఉండే దయ్యా సౌమ్యా. కానీ నువ్వు దాన్ని రెచ్చ గొట్టావు. అర్ధం చేసుకోవలసిన సమయంలో ఆదరించి దగ్గరకు తీసుకోలేక పోయావు."
"అంటీ, మనిషిలో పాజిటివ్ పాయింట్స్, కనిపెట్టి, నెగటివ్ పాయింట్స్ గురించి కొంచెం అర్ధం చేసుకుని, ఆ పాజిటివ్ పాయింట్స్ ని హైలైట్ చేస్తే అవతలి వాళ్ళు లొంగి పోతారు. ఎప్పుడూ నెగటివ్ పాయింట్స్ ను వేలెత్తి చూపిస్తుంటే అవతలి వాడి ఇగో దెబ్బతిని మొండిగా ప్రవర్తిస్తాడు. మీ అమ్మాయిలో ఉన్న ముఖ్యమైన లోపం అదే. ఎప్పుడూ ఎదుటి వ్యక్తీ తను కోరుకున్న విధంగా ప్రవర్తించాలంటే సాధ్యమేనా? అవతలి వాడూ మనిషేగా! 'తనని అర్ధం చేసుకోవాలి. తన మాట వినాలి.' అని అవతలి వాళ్లకు మాత్రం వుండదా? సాధించడం, ఎత్తి పొడవడం, చేతకాని తనంగా భావించి పదేపదే దెప్పి పొడవడం , ఆఖరికి కట్టుకునే బట్టలు, తినే తిండి మీద కూడా తనదే చాయిస్. తనకి నచ్చినట్టే చెయ్యాలి అంటే ఎలా? పోనీ అదేదో అహంకారంగా కాక ప్రేమ , అనురాగంతో మార్చే ప్రయత్నం చేస్రే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ఆ ప్రేమకి లొంగిపోతాడు మనిషి.
"వివేక్ , ఈ వాదులాటలు , ఇద్దరి వెర్షన్ ఇదివరకే విన్నాం, నీవు చెప్పేది కొన్ని రైటు, అది చెప్పేది కొన్ని రైటు."
"ఒక్క విషయం అంటీ, సరే , మా అమ్మ నాకు కొన్ని పద్దతులు నేర్పలేదు.
"నాకు శుభ్రం తక్కువ. బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను. బాత్ రూమ్ అంతా తడితడి చేసేస్తాను. పేపరు చదివాక నీట్ గా పెట్టకుండా వదిలేస్తా. ఎంగిలి కప్పులు వదిలేస్తా. డబ్బు లెక్కలేదు. సరుకులు తేవడం తెలీదు. సంతలోంచి చచ్చూ, పుచ్చు కూరలు తెస్తాను..." రోజూ ఇలా లక్ష సాధింపులు, చివాట్లు తింటూ, వాటిని భరిస్తూ విరక్తి చెందకుండా ఉండడానికి నవ్వుతూ మునీశ్వరుడిలా ప్రశాంతంగా ఉండడానికి నేనేమన్నా యోగినా? పోనీ నన్నోక్కడ్నే అనుకుంటే ఫర్వాలేదు. కానీ మా అమ్మని, మా ఇంటికి దేప్పే అధికారం తనకుందా? మనుషులందరి అలవాట్లూ ఒకేలా ఉండవు. మా అమ్మ పెంపకం ఆవిడ పద్దతిలో జరిగింది. ఆవిడ ఇల్లు ఆవిడ ఎలా సర్దుకుందో అదంతా ఆవిడ ఇష్టం. ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఆ తల్లి పెంపకం లో పెరిగి ఆమె నేర్పినవే నేర్చుకుంటారు. పెరిగిన వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందా" నిలేసినట్టు అంటున్నాడు వివేక్.
సావిత్రి వెంటనే అందుకుంది.
"అవును , కరెక్ట్. నీవన్నది చాలా నిజం. దాని విషయం లోనూ అదే వర్తిస్తుంది. ఇక్కడ పద్దతిగా అన్నీ ఎక్కడి వక్కడ వుండి, చాలా నీట్ గా మెయిన్ టైన్ చేసిన అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా కొన్ని పద్దతులు దానికి అలవడ్డాయి. నా పద్దతి అది. నాకంటే ఎక్కువగా డానికి కొన్ని మంచి అలవాట్లున్నాయి. హైక్లాస్ గా పెరిగిన పిల్ల. దానిదంతా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుండే రకం. నాజూగ్గా , మంచిగా ఓరిమి గా చెప్పడం డానికి తెలీదు. నేను చిన్నమాట అన్నా కూడా భరించే మనస్తత్వం కాదు దానిది. కానీ, పెళ్లి కాకముందు ఎన్నిసార్లో చెప్పేదాన్ని. 'నా పద్దతి అంతే , ణా మాట అంతే. ఎవరైనా నువ్వు కోరుకున్నట్టే ఉండాలంటే కుదరదు. నీకు నచ్చకపోతే, నచ్చ చెప్పే తీరు ఇది కాదు. మంచిగా మనిషిని మార్చుకోవాలి అనేదాన్ని. చెప్పడం సులువే అనేది.
మీరిద్దరూ పెళ్లి కాక ముందు ఒకే ఆఫీసులో పనిచేశారు. ఆరేడు నెలలు ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. ఆ టైం లో అంత పూర్తిగా కాకపోయినా ఒకరి గురించి మరొకరు కొంతైనా అర్ధం చేసుకుని ఉంటారు. మీ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి అన్నీ నచ్చిన తర్వాతే ఇష్టపడి చేసుకోడానికి ఒప్పుకున్నారని మేమూ మా అంగీకారం తెలియజేశాం."
"అవును అంటీ, ఇందులో మిమ్మల్ని అనడానికీ ఏమీ లేదు. కానీ నేను సౌమ్య లో ప్లస్ పాయింట్స్ చూసి ఆకర్షితుడినయ్యాను. తన తెలివి, స్మార్ట్ నెస్, పనిలో ఏకాగ్రత, నిర్దుష్టమైన అభిప్రాయాలు, ముచ్చట గొలిపే ఆకారం అన్నీ నాకెంతో నచ్చాయి. తనూ నాలో ప్లస్ పాయింట్స్ చూసే ఒప్పుకుందనుకున్నా. కానీ, అంత తెలివైన అమ్మాయి, "నిన్ను ఎంచుకోవడం లో నేను బోల్తా పడిపోయాను' అని నన్ను అంటుంటే నా ఆత్మాభిమానం , నా అహం దెబ్బతినదా . మొదట్లో సరదాగా భావించి దులిపెసుకునే వాడిని. రోజురోజుకి ఆవిడ ధోరణి మితిమీరి పోతుంటే తిరగబడి నిర్లక్ష్యంగా జవాబివ్వడమే నేను చేసిననా నేరమా?"
"వివేక్ ఎన్నిసార్లు వినమంటావు నువ్వు చెప్పే ఈ మాటలన్నీ . మా ఇద్దరికీ ఇంక వినే ఓపిక లేదు. ఇంక మీ ఇద్దరూ కలిసి బతకలేం అనుకుంటే మ్యుచ్యువల్ డైవోర్స్ తీసుకుని ఎవరి బతుకు వాళ్ళు బతకండి. ఇంతకంటే మేం ఏమీ చెయ్యలేం. చెప్పలేం." మూర్తి అసహనంగా అన్నాడు.
