Previous Page Next Page 
భవ బంధాలు పేజి 42


    "వివేక్ చూడు నీ వాదనా విన్నాం. దాని వాదనా విన్నాం. పెద్దదాన్ని ఒక్కమాట చెబుతున్నా పాతికేళ్ళు ఒకచోట ఆడపిల్ల పెరిగి, పెళ్లి పేరుతొ ఇంకో చోటకు వెళ్లి అక్కడ కొత్త మనుష్యులు , కొత్త అలవాట్లు , కొత్త చోటు, కొత్త రుచులు, కొత్త పద్దతులు, వీటన్నిటి మధ్య అలవాటు పడి, ఇమడడానికి మానసికంగా ఎంత మధన పడుతుందో మగాళ్ళ కి అర్ధం కాదు. ఏం చెయ్యాలో, ఎక్కడ కూర్చోవచ్చో, ఏం మాట్లాడచ్చో , ఏ పని చెయ్యచ్చో, అలా చేస్తే ఏమంటారో, ఇలా చేస్తే ఏమంటారో అని లక్ష సందేహాలు భయాలతో ఆడపిల్ల అత్తింట్లో అడుగు పెట్టాక, అక్కడి పరిస్థితులకు అనువుగా తనను తాను మలచు కోడానికి కొంత సమయం పడుతుంది. ఒక లేత మొక్కను తీసి ఇంకో చోట పాతితే రెండు మూడు రోజులకు జీవం పోసుకుని ఎదుగుతుంది'. అదే పెరిగిన మొక్కను వేళ్ళతో సహా పీకి ఇంకోచోట పాతితే, వేళ్ళు తన్ని జీవం పోసుకుని బతకడానికి చాలా సమయం పడుతుంది. ఆడపిల్ల కూడా అంతే. పుట్టి పెరిగిన చోట, ఆప్యాయంగా , ప్రాణ ప్రదంగా చూసుకునే తల్లి తండ్రుల ని వదిలి ఇంకోచోట, తెలియని మనుష్యుల మధ్య అలవాటు పడడానికి సమయం కావాలి. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అత్తింటి కాపురాల రోజుల్లో అమ్మాయిలు తొందరగా పెద్దల సలహాలతో ఇమిడిపోయే వారు. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలకు ఆర్ధిక స్వతంత్యం వచ్చాక, తమ వ్యక్తిత్వం లో , అభిరుచుల్లో మార్పు వస్తాయి. అలాంటి అమ్మాయిలు అత్తారింట్లో అంత తొందరగా కొత్త జీవితానికి అలవాటు పడలేరు. వాళ్ళ ఆత్మాభిమానం ఒప్పుకోదు. 'నేనేం తక్కువా?" అనే ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిలలో. అలాంటప్పుడు భర్త ఆమెకు భరోసా ఇవ్వాలి. ఇది 'ఇది మనిద్దరి ఇల్లు మనం కలిసి జీవించాలి. అలకలు, అపార్ధాలు, ఏం వచ్చినా మనమే మాట్లాడుకుని సరిదిద్దుకుందాం" అని ప్రేమాభిమానాలు చూపితే అమ్మాయిలు త్వరగా సర్దుకు పోతారు. యిది నా యిల్లు , వీడు నా వాడు అనే ప్రేమకి లొంగి పోతారు.
    అలా కాకుండా, 'నా అలవాట్లు నావి, నీకు నచ్చినట్లు నేనెందు కుండాలి ?' అనుకుంటే ఆ సంసారంలో సామరస్యం లోపిస్తుంది. గొడవలు మొదలవుతాయి. ఆడవాళ్ళు ఇటు ఇంటి పని, అటు బయట ఉద్యోగం రెండు చెయ్యాలని ఆశించకూడదు. ఇద్దరూ సమానంగా పనులు పంచుకోవాలి. ఆమె కష్టాన్ని గుర్తించాలి. అలాంటి భర్తలనే ఈనాటి ఆడపిల్లలు కోరుకుంటున్నారు. ఇంటి పనులు షేర్ చేసుకోలేని భర్తల్ని ఎందుకు భరించాలని వాళ్ళు అనుకోవడం లో తప్పేంటి?' అడిగింది సావిత్రి.
    "అది సరే అంటీ, నాకు పని చెయ్యడం చేత కాదు. అలాంటప్పుడు నన్ను ప్రేమగా పిలిచి అడగాలి. ఈ కూరలు తరుగు. బాబు ఫీడింగ్ బాటిల్స్ కడుగు అని ఎలా చేయ్యాల్లో ఒకటికి రెండు సార్లు చెప్పవచ్చు కదా? దాని బదులు ఏమీ రాదని దెప్పడం , దులిపేయడం ....అదే కరెక్ట్ అనుకుంటారు ఆడవాళ్ళు."
    "మీ ఇద్దరి మధ్య సామరస్యత ఉన్నప్పుడు అవన్నీ సాధ్యపడతాయి. ఈ విషయంలో మా అమ్మాయి తప్పు లేదని నేననను."
    "నన్నేం చెయ్యమంటారు చెప్పండి. ఆఖరి ప్రయత్నంగా వచ్చాను. ఇప్పటికి అరునెలలైంది తను వచ్చేసి, ఇంక ఎదురు చూసే ఓపిక నాకు లేదు" అసహనంగా అన్నాడు వివేక్.
    తలుపు తీసుకుని బాబుని ఎత్తుకుని గదిలోంచి వచ్చిన సౌమ్య , వివేక్ ని చూడనట్టే వంటింట్లో కి వెళ్ళబోయింది. వివేక్ చటుక్కున లేచి "హాయ్, చేతన్ దా, దా, ఇలా రా...." అని ఆమె చేతులోంచి బాబుని తీసుకోబోయాడు.
    సౌమ్య తీక్షణంగా చూసి, బాబుని గట్టిగా పట్టుకుంది. "హాయ్ సౌమ్య బాబుని ఇటివ్వు. వాణ్ణి చూడడానికే వచ్చా తెలుసా'? దా నాన్నా ....' అని మళ్ళీ చేతులోకి తీసుకోబోయాడు.
    "నేకు నాకు సరిపడదనుకోని నేను వచ్చేశాక ఇన్కాఏ రావడాలేమిటి , ప్లీజ్ నన్ను అనవసరంగా డిస్ట్రబ్ చెయ్యకు" అంది సౌమ్య తీవ్రంగా . వివేక్ మొహం ఎర్రబడింది.
    అంతలోనే నిగ్రహించుకుని "మనకు జరిగింది బొమ్మల పెళ్లి కాదు. శాస్త్రోక్తంగా జరిగిన పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ కూడా. ఇలా ఇంట్లో కూర్చుని నీకూ నాకు చెల్లు అనుకునేంత తేలికైన విషయం కాదు" అంటూ బలవంతంగా ఆమె చేతిలోంచి బాబుని తీసుకున్నాడు. సౌమ్య తిరిగి బాబుని లాక్కోబోయింది.
    అప్పుడు తన కూతుర్ని మూర్తి గట్టిగా మందలిస్తూ.
    "ఏమిటదీ? బాబుకి అతను తండ్రి అని మరిచిపోకు. నీకెంత హక్కుందో అతనికీ అంతే హక్కు ఉంది. బెహేవ్ యువర్ సెల్ప్" అన్నాడు. సౌమ్య తండ్రి వంక చురుగ్గా చూసి ఏదో అనబోయి, తండ్రి మొహంలో కోపం చూసి మౌనంగా తన గదిలో వెళ్ళిపోయింది. "నీతో మాట్లాడేందుకే వివేక్ వచ్చాడు ఇద్దరూ రూములో కి వెళ్లి మాట్లాడుకోండి." ఆర్డర్ వేసినట్లు అన్నాడు.
    "మా మధ్య ఇక మాటలెం లేవు. మాటలాడాల్సింది ఒక్క లాయరు తోనే"
    "సౌమ్యా' ఒకసారి ఎదుటి వాళ్ళు చెప్పింది వినడం నేర్చుకో, వివేక్ ఏం చెబుతున్నాడో ఒకసారి విను" కూతుర్ని గట్టిగా హెచ్చరించింది సావిత్రి.
    "సరే, మేం మాట్లాడుకునే మాటలకు గదులు అవసరం లేదు. అందరి ఎదురుగానే మాట్లాడవచ్చు" మొండిగా అంది.
    "సరే, అయితే, అంకుల్, అంటీ మీరూ ఇక్కడే ఉండండి అంటూ, సౌమ్యా నేను క్రితం సారే చెప్పాను. ఇప్పుడూ చెపుతున్నాను. మనిద్దరం కలిసి కాపురం చెయ్యాలనేది నా కోరిక. మన మధ్య ఇప్పుడు బాబు కూడా వున్నాడు కనుక వాడి కోసమైనా మనం కలిసి బతకాలని కోరుతున్నాను. పిల్లాడికి తల్లి తండ్రులు ఇద్దరూ ఉండాలి. వాళ్ళ సంరక్షణ లోనే వాడి పెంపకం జరగాలని నా ఉద్దేశం."
    "తండ్రిగా నువ్వు ఏం చేశావు? ఒక్క రోజన్నా వాడి ఆలనా పాలనా చూశావా? రాత్రి పూట ఒక్కసారైనా వాణ్ణి నిద్రపుచ్చావా? వాడికి పాలు పట్టవా? అన్నీ నేనే  చేసుకునేటైతే ఇక నువ్వెందుకు? నేనే ఒంటరిగా బతుకుతూ వాడిని పెంచుకుంటా."
    "అంత పసిపిల్లాడికి నేను ఏం చేయగలను. నాకు ఆ పని అలవాటు లేదు."
    'అందరికీ అన్ని అలవాట్లూ ముందే వచ్చేయవు. చేస్తూ ఉంటె అవే వస్తాయి."
    "నిజమే, నేను నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు , ఏ పనీ సరిగా చెయ్యవు నీకు చేత కాదు అని నా చేతి లోంచి బాబుని లాగేసుకుంటే నేనెప్పుడు నేర్చుకోవాలి?"
    "రోజంతా నిన్ను కూర్చో పెట్టి నేర్పెంత ఓపిక , టైము నాకు లేదు. సరే, ఈ గోలంతా చాలాసార్లు అయింది గానీ, ఇప్పుడు నాతొ ఇంకేం మాట్లాడాలో చెప్పు."
    "అంటే నా అవసరం లేదనీ, ఒంటరిగా ఉండాలనే నువ్వు నిర్ణయించు కున్నావా?
    "ఈ విషయం కిందటి సారే చెప్పానుగా" మొండిగా అంది సౌమ్య.    
    వివేక్ ఒక్క క్షణం సౌమ్య తల్లితండ్రుల వంక చూసి, "విన్నారు కదా, ఇంక మాట్లాడటానికి ఏమీ లేదు అన్న తర్వాత, ఇక ఆమె కాళ్ళు పట్టుకునేంత ఓపిక, సహనం నాకూ లేవు" అని బాబుని ముద్దు పెట్టుకున్నాడు వివేక్.
    "నా కొడుకు సంగతి ఏం చెయ్యాలో లాయర్ల తో మాట్లాడి చెపుతా" అంటూ పిల్లాడిని సావిత్రి చేతిలో పెట్టి గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని బ్యాగ్ పట్టుకుని విసవిస బయటకు వెళ్ళిపోయాడు.
    "ఇంత అహంకారం పనికి రాదు. నువ్వు చేసిన ఈ పనికి విచారించే రోజు వస్తుందని తండ్రిని కాబట్టి , శాపం పెట్టను గానీ, అల్ ద బెస్ట్ , ఇంక నీ ఇష్టం. నీ విషయంలో మేం జోక్యం చేసుకోదల్చుకోలేదు" అని తండ్రి పేపరు మొహానికి అడ్డం పెట్టుకున్నాడు. సావిత్రి కూతురు వంక విముఖంగా చూసి వంట గదిలోకి వెళ్ళిపోయింది.

                                       *    *    *
    "మీ అమ్మ నేను మూడు రోజుల్లో అమెరికా బయలుదేరుతున్నాం. నిన్ననే టిక్కెట్లు వచ్చాయి" అన్నాడు కూతురుతో మూర్తి . సౌమ్య చకితురాలైంది.
    'అదేంటి నాన్నా? ఎందుకు ఇంత హటాత్తుగా ప్రయాణం?" కలవర పడుతూ అడిగింది సౌమ్య.
    "మీ అన్నయ్య కి కొడుకు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మేం చూడలేదు. వాళ్ళ అత్తగారు పురిటికి వెళ్లి నాలుగు నెలలై పోయింది. ఆవిడ ఇండియా తిరిగి వచ్చేస్తుందట. అందుకని మమ్మల్ని రమ్మన్నాడు. పిల్లాణ్ణి ఒంటరిగా ఇంట్లో వదిలి ఉద్యోగాలకు వెళ్ళ లేరుగా? ఆయా దొరికింది గానీ, ఇంట్లో మన అనేవాళ్ళం మేం ఉండాలి కదా" అన్నాడు.
    "మరి ఇక్కడ నేను ఎలా? బాబు....బాబుని ఎలామేనేజ్ చెయ్యాలి?"
    "ఏదైనా క్రష్ లో ఉంచు. మీ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఆఫీసులకు వెళ్లినప్పుడైనా బాబుని క్రష్ లో ఉంచక తప్పదు కదా" నిర్లిప్తంగా అన్నాడు తండ్రి.
    "చెప్పా పెట్టకుండా ఇంత హటాత్తుగా మీరు అమెరికా ప్రయాణం పెట్టుకుంటే ఎలా? ముందే చెపితే ఏదో ఒక ఏర్పాటు చేసుకునేదని కోపంగా అంది.
    "మాకు మాత్రం తెలుసా వెళ్ళాలను కున్నాం గానీ, అక్కడ వాడి మామగారి తండ్రి ముసలాయన ఐసి యూ లో ఉంటె కోడలుగా వాడి అత్తగారు వెళ్ళద్దా. అందుకే ఫోను చేశాడు కిషోర్. టిక్కెట్లు కూడా పంపాడు. అవసరానికి నీలాగే, వాడినీ ఆదుకోవాలి గదా. కనీసం ఆరునెలలు పడుతుంది మేం తిరిగి రావడానికి" అన్నాడు తండ్రి.
    "ఆరునెలలు నేను బాబుతో ఒంటరిగా ఎలా ఉండాలి?' కోపం, ఉక్రోషం, గాబరా, భయం ....కలగలిసిన వ్యాకులత తో అడిగింది సౌమ్య.
    "ఉండాలి మరి . పెళ్లి చేసి, పురుడు పోవడం వరకే మా బాధ్యత. ఇంకా ఇంకా మేమే చెయ్యాలంటే ఎలా? మా పనులు మాకుంటాయిగా. కూతుర్ని గానీ, కొడుకును గానీ జీవితాంతం కనిపెట్టుకుని ఉండలేకే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు. పెళ్ళాయ్యాక భార్యాభర్తలు కలిసి వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ జీవిత సమస్యలను వాళ్ళే ఎదుర్కోవాలి.
    మొగుడు అక్కరలేదని నువ్వు అనుకున్నప్పుడు ఒంటరిగానే నీ బాధ్యతలు నువ్వే మోసుకోవాలి. అవసరానికి తల్లి తండ్రులు ఆదుకుంటారు గానీ ఆజన్మాంతం నిన్నూ, నీ పిల్లల్ని కనిపెట్టుకుని ఉండే ఓపిక మాకు మాత్రం ఉంటుందా. పిల్లల బాధ్యతలు తీరిపోయి, ఉద్యోగ విరమణ చేశాక కాస్త నాలుగు చోట్లా తిరిగి గుళ్ళూ, గోపురాలు చూద్దామను కున్నపుడు , ఈ కొత్త బాధ్యతలు మానేత్తి నే వేస్తె, అవన్నీ మేం మోయలెం. మాకూ కాస్తంత విశ్రాంతి తీరిక కావాలి గదా."
    సౌమ్య తల్లి దండ్రుల కేసి చురచుర చూసింది. "నేనువివేక్ దగ్గరికి వెళ్ళను అన్నాను కాబట్టి , నాకు పాఠం ఈవిధంగా నేర్పాలను కుంటున్నారా, నాకు బుద్ది చెప్పడానికే మీ ప్లానంతా?"
    "డోంట్ బి సిల్లీ. అన్నయ్య కి కొడుకు పుట్టిన దగ్గర నుంచి వియ్యపురాలు ఇండియా తిరిగి వచ్చాక మేం వెడదామన్న ప్లాను ముందుగా అనుకున్నదే గదా...."
    మొహం ఎర్ర బరుచుకుని విసురుగా పిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య. రెండు రోజులు తల్లి తండ్రులతో మాట్లాడం మానేసింది సౌమ్య. వాళ్ళు కూడా ఏమీ జరగనట్టే వాళ్ళ ప్రయాణం ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు.
    
                                   *    *    *
    నెల రోజుల తరువాత ఒక రాత్రి సౌమ్య ఫోను చేసింది ఏడుపు గొంతుతో . "డాడీ బాబు....బాబు మెట్ల మీద నుంచి పడిపోయాడు. తలకి దెబ్బ తగిలి బాగా రక్తం వచ్చి తెలివి తప్పిపోయాడు. "అయ్యయ్యో మరి ఎలా? ముందు ఆస్పత్రికి తీసుకెళ్ళు ఫోనులో గాబరాగా అరిచాడు మూర్తి. "తీసుకెళ్లా తెలివి వచ్చేవరకు ఏం చెప్పలేం అంటున్నారు డాడీ. మమ్మీ మీరు వెంటనే రండి." ఏడుస్తున్న కూతురు ఎటువంటి పరిస్థితిలో ఉందొ వాళ్ళకి అర్ధమైంది.
    "వస్తాం కానీ రెండు రోజులున్నా పడుతుంది.  ముందు నువ్వు వివేక్ ఫోన్ చెయ్. తండ్రికి వెంటనే చెప్పాలి.' మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆర్డర్ వేసినట్టే కఠినంగా చెప్పి ఫోను పెట్టేసి, తలపట్టుకుని కూర్చున్నాడు మూర్తి.
    "మీరు కూడా ఆతనికి ఫోన్ చెయ్యండి" సలహా ఇచ్చింది సావిత్రి.
    తెల్లారాక వివేక్ నుంచి ఫోను. బాబు కళ్ళు తెరిచాడని నార్మల్ గానే ఉన్నాడని. కొన్ని పరీక్షలు మెదడుకు చేయాలన్నారని , బాబు కాస్త కోలుకున్నాక మిగతా పరీక్షలు చేస్తారనీ చెప్పాడు. "మీరు బెంగ పడకండి. నేనున్నాను చూసుకుంటున్నా. ఎప్పటి కప్పుడు ఫోను చేస్తా." అని చెప్పాక అందరూ కుదుట పడ్డారు. వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు వివేక్. బాబుని తీసుకుని ఇంటికి వచ్చామని, అన్ని పరీక్షల్లో నార్మల్ రిపోర్టు లే వచ్చాయనీ చెప్పాక స్థిమిత పడ్డారు సావిత్రి మూర్తి.

                              *    *    *
    మూడు నెలలు గడిచాయి.
    ముందుగా అనుకున్న సమయానికే మూర్తి, సావిత్రి ఇండియా కి తిరిగి వచ్చారు.
    ఇంటికి వచ్చి చూస్తె తాళం వెక్కిరించింది వాళ్ళని, పక్క ఇంట్లో ఉండే కొలీగ్ గబగబ వచ్చి ఓ కవరు , తాళం చెవి వాళ్లకు ఇచ్చి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్లి సామాను పడేసి ఆరాటంగా ఉత్తరం చదివారు.
    "నేను, వివేక్ , బాబు మా ఇంటికి నిన్ననే షిప్ట్ అయ్యాం.
    ఇన్నాళ్ళూ మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థాంక్స్ పెళ్ళయ్యాక ఆడపిల్లలు తల్లిదండ్రులకి బరువవుతారని అమ్మాయిని 'ఆడపిల్ల' గానే తప్ప కన్నకూతురుగా ఏనాటికి గుర్తించని తల్లితండ్రులతో మీరు ఒకరు. బాబుకి తండ్రి అండ దొరికింది. నేను కాంప్రమైజ్ అయ్యానో, ,మనస్పూర్తిగా వెళ్ళానో మీకు చెప్పనవసరం లేదు. మీ ఇంట్లోంచి నేను వేల్లిపోయినందుకు మీరు సంతోషించండి.
    అంతే.
            గుడ్ బై' - సౌమ్య.
    "దీనికి మతిపోయింది చూడు ఎలా రాసిందో " అన్నారు మూర్తి విరక్తిగా. "దాని మొహం దాని కోపం నాలుగు రోజులు. మనం వెంటనే రాలేదని కోపం లెండి డానికి. మీరు కంగారు పడి ఇండియాకి రావద్దు అని వివేక్ మనకి చెప్పిన విషయం మనం దానితో చెప్పామంటే మళ్లీ అదో గోల. మనతో మాట్లాడక పొతే ఇప్పుడు కొంపలేం మునిగిపోవు గానీ . దాని కాపురం అది చేసుకుంటే చాల్లెండి" అంది నిశ్చింతగా సావిత్రి.

                                      *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS