Previous Page Next Page 
భవ బంధాలు పేజి 32


    గంట రెండు గంటలు మూడు గంటలు అలా గడిచిపోతున్నాయి. రెండు గంటలయింది. అలా చీకట్లో సిగరెట్లు కాలుస్తూ -- అప్పుడే రెండు సార్లు టీ తాగారు అందరూ. పండా కి, మహంతి కి ఆవలింతలు వస్తున్నాయి. కళ్ళు కూరుకు పోసాగాయి. కూర్చుని కూర్చుని కాళ్ళు పట్టేస్తున్నాయి. ఆకుల సందు నించి కొద్ది కొద్దిగా వెన్నెల వెండి బిళ్ళల్లా పడుతోంది. కింద మేకపోతు తనకేదో జరగబోతుందని పసిగట్టి భయం భయంగా 'మేమే' అని అరుస్తుంది మధ్య మధ్య తాడు తెంచుకోడానికి గింజు కుంటుంది. మాట్లాడుకోడాని కన్నా లేదేమో ఆ నిశ్శబ్దం లో. అడవి లో ఆకుల గలగలలు-- దూరంగా ఎక్కడో కొండల మీద నించి దుముకుతున్న నీటి ధార శబ్దం . కీచురాళ్ళు నక్కల అరుపులు, వుండి ఉండి వినిపించే ఏవో పిట్ట కూతలు. ఆ వాతావరణం ముందు అంతా అద్భుతంగా వుందనిపించినా రానురాను విసుగు పుట్టసాగింది మిత్రులిద్దరికీ. రమాకాంత్ కి అలవాటేమో నిశ్శబ్దంగా సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఓపిగ్గా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. యాంత్రికంగా కూర్చున్న ఆరోజు అతని మనసు వేటమీద లేదు. శరీరం ఇక్కడున్నా మనసు ఇందాకచూసిన స్త్రీ మూర్తి ని వేటాడుతుంది. వెన్నెలలో కన్పించిన ఆ సౌందర్యం అతని ఏకాగ్రతని చేడగోడుతుంది . డబ్బిచ్చి కొనుక్కొనే పరాయి స్త్రీల పొందు అతనికి కొత్త కాదు. కాని ఈరోజు ఈ స్త్రీ అలా డబ్బిచ్చి కొనుక్కునేది కాదనుకోగానే ఏదో నిరాశ, నిస్పృహ కల్గింది. ఆ నిరాశే అతనిలో మరింత ఆకర్షణ పెంచినట్టయి వద్దనుకున్నా పదేపదే ఆమె రూపమే గుర్తు రాసాగింది.
    మూడు గంటలయింది. ఇంక ఈరోజు ఏ పులీ రాదు కాబోలు అన్న నిరాశ చోటు చేసుకుంది. అందరిలో. కూర్చునే కునికి పాట్లు పడుతున్నారు అందరూ. అంతలో హటాత్తుగా దూరంగా ఎక్కడో పులిగర్జన వినబడింది.
    అందరికి నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. ఎటేన్షన్ లో కూర్చుండి ఆసక్తిగా చూడసాగారు. "ఎక్కడో ఈ చుట్టూ పక్కలకి వచ్చింది' రమాకాంత్ నెమ్మదిగా గుసగుస లాడాడు. పులి అరుపు విని మేక గింజుకుంటూ అరవసాగింది. గాలితో పాటు పులు వాసన తగిలింది. తప్పకుండా మేక అరుపు విని పులు వస్తుందని ఆశగా ఎదురు చూడసాగారు. ఎక్కడ ఏ ఎండుటాకు కదిలినా, పొద కదిలినా చీకట్లో కళ్ళు చీల్చుకుని చూడసాగారు. నాల్గు గంటల యింది. ఎండాకాలం ఏమో మరో అరగంట లోనే తోలి వెలుగు రావచ్చు. ఇంకేం వస్తుంది పులు అనుకుంటూ, అప్పుడే తిరిగిన చల్లగాలికి అందరికి చిన్న మత్తు రావడం ఆరంభించింది. హటాత్తుగా ఒక్కసారి మేక అరుపుతో పాటు డబ్బున చప్పుడవడం ఏమిటి అందరి కంటే గన్నర్ ముందు తేరుకుని ఆదిక్కుగా తుపాకి పేల్చాడు. వెంటనే అందరి చేతుల్లో బ్యాటరీ లైట్లు వెలిగాయి. ఒక్క ఉదుటున పులి మేక మీదకి లంఘించి మేకను కరచుకుని పారిపోయింది. పొదలు కదలడం మాత్రం వెలుగులో అందరికీ కన్పించింది. రమాకాంత్ , గార్డు కదలిక వైపు తుపాకులు కాల్చారు. కాని పులికి తగల లేదని అర్ధం అయింది. ప్చ్! పారిపోయింది. ఈ పొదలలో ఎక్కడో దాక్కుని సమయం కనిపెట్టి మీద పడింది ఒక్కసారి. ఈ పులులూ మనుష్యుల్ కంటే తెలివి మీరిపోతున్నాయి. బాడ్ లక్ ఏం చేస్తాం . వుయ్ విల్ ట్రై అవర్ లక్ టుమారో" అన్నాడు రమాకాంత్.
    "దిగి లైటుతో చూద్దామా?" అన్నాడు అభిరామ్ కుతూహలంగా.
    "వద్దు. ఏ పోదచాటునో వుంటే వుండచ్చు. వెలుగు వచ్చేవరకు దిగడం ప్రమాదం." అన్నాడు. అందరికి ఉత్సాహం పోయింది. వెలుగు రావడం కోసం ఎదురుచూస్తూ ఆవలిస్తూ కూర్చున్నారు. మరో అరగంట లో తూరుపు తెల్లబడింది. ఇంక భయం లేదని అంతా చెట్టు దిగి పొదల వైపు ఓసారి లైట్లు వేసి వెదికారు. బ్యాటరీ లైటు వెలుగులో కొంత మేర మేక రక్తం గుర్తులు కన్పించాయి. అప్పుడు వెడితే లాభం లేదని అంతా వెనుదిరిగి జీపు చేరారు. ఐదు గంటల కల్లా బంగళా చేరి వళ్ళేరగకుండా పది గంటల దాకా నిద్రపోయారు. నిద్రపోయే ముందు ఒకసారి డేరా వైపు చూశాడు రమాకాంత్.
    
                                       *    *    *
    పదిగంటల కి మెలకువ రాగానే ఒక్కసారిగా తుళ్ళిపడి లేచి కిటికీ లోంచి టెంట్ వైపు చూశాడు రమాకాంత్. టెంట్ బయట తాడు మీద ఆమె బట్టలు అరవేస్తుంది. స్నానం చేసి వేసుకున్న జారుముడి-- వంగపండు రంగు మీద ఏవో పెద్ద పూల డిజైను అదే రంగు జాకెట్టు -- రెంటికి మధ్య మెరిసే నడుం చూడగానే రమాకాంత్ గుండెలు ఒక్క క్షణం జోరుగా కొట్టుకున్నాయి. ఆమె యిటు తిరిగితే బాగుండును అనుకొంటుండగానే ఆమె బట్టలు అరవేసి యిటు వైపు తిరిగి ఓసారి బంగళా వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ చూసిన ఒక్క చూపే రమాకాంత్ మతి పోగొట్టడానికి సరిపోయింది.
    ఆరోజంతా రమాకాంత్ మనసు మనసులో లేదు. ఆఫీసర్ల తో యాంత్రికంగా డిస్కస్ చేశాడు. భోజనం చేసినా మధ్యాహ్నం పడుకున్నా అంత మొద్దు నిద్రలోనూ ఆమె గురించే కలలు కన్నాడు. సాయంత్రం అయిందగ్గిరనించి రమాకాంత్ మూడు సార్లు బాత్ రూం కి వెళ్లి వచ్చాడు. రెండుసార్లు వాంతి చేసుకున్నాడు. తల తిరుగుతుందని దిమ్ముగా ఉందని తల పట్టుకు కూర్చున్నాడు. మాత్ర వేసుకున్నా తగ్గక బాధపడ్డాడు. మిత్రులిద్దరూ గాభరా పడ్డారు. "మరేం ఫరవాలేదు. రాత్రి నిద్దర చాలలేదు. నిన్న యివాళ డ్రింక్స్, భోజనం హెవీ అయి అరగలేదు అంతే" అన్నాడు రమాకాంత్ . రాత్రి అయినకొద్దీ అతని తలనొప్పి ఎక్కువయింది. "ఫ్ర్రెండ్స్ యివాళ షికారుకి రాలేను. మీరు వెళ్ళండి. కంట్రాక్టర్ దగ్గిరుండి తీసికేడతాడు. అన్ని ఏర్పాట్లు చూశాను." నీరసంగా అన్నాడు.
    "నీవు లేకుండా ఏం బాగుంటుంది. నిన్న చూశాం గా. ఇంక వెళ్ళక పోయినా ఫరవాలేదు." అభిరామ్ అన్నాడు.
    "అబ్బెబ్బే అదేమిటి- షికారి కోసం వచ్చి పులిని కొట్టకుండా వెళ్ళడం ఏమిటీ? ఇవాళ మరోచోట మాటు వేయించమని చెప్పాను. పులి తప్పక వస్తుంది. మీరివాళ మిస్ కాకూడదు. నేను లేకపోతేనేం పట్నాయక్ దగ్గరుండి తీసికేడతాడు." స్నేహితులని వప్పించాడు రమాకాంత్. కంట్రాక్టర్ ని పిలిచి అప్పగించాడు. "మీదే పూచి, పులిని కొట్టాలి-- అన్ని ఏర్పాట్లు చెయ్యండి" అన్నాడు.
    'అలాగే సార్ . మీకెందుకు మీరు రెస్ట్ తీసుకోండి. అన్నీ నేను చూసుకుంటాను. పులిని కొట్టి మరీ వస్తాం ఉదయం" అన్నాడు వినయంగా.
    రాత్రి అంతా వెళ్ళాక చల్లగాలికి బయట కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు రమాకాంత్. కిచెన్ పని పూర్తయి అందరూ వెళ్లి నట్టున్నారు. అంతటా నిశ్శబ్దంగా వుంది.
    వెన్నెల పిండారబోసినట్లుంది. గోడ మీదకి పాకించిన సన్నజాజి తీగ నిండా నక్షత్రాలలా జాజిపూలు విచ్చుకుని తెల్లగా మెరుస్తున్నాయి. వాటి పరిమళం అతనికి పులకింత నిస్తుంది. వెన్నెల అతని మతి పోగోడ్తుంది. వుండి వుండి అతను టెంట్ వేపు చూస్తున్నాడు. నిన్నటి లాగే ఆమె తెల్ల చీరతో బయట ఇటు అటు తిరుగుతుంది. కాసేపు విసుగొచ్చినట్లు కుర్చీలో కూర్చుంటుంది. ట్రానిష్టర్ వింటూ కాసేపు కాలక్షేపం చేస్తుంది. పాపం వంటరిగా వుండి విసుగుగా వున్నట్లుంది అనుకున్నాడు. ఆమె వంటరితనం -- అతనిలో ఏదో ఆలోచనలని రేపుతుంది -- వాతావరణం ఏదో ప్రోత్సహనిస్తుంది. కాని అంతలో ఏదో సందేహం, బెరుకు, భయం , ఏదో వంకన షూటింగ్ కు వెళ్ళకుండా తప్పించుకుని ఏకాంతం దొరికేట్టు చేసుకున్నాడు కాని -- అంతకు మించి ముందుకు వెళ్ళడానికి జంకుగా వుంది. ప్రయత్నించి చూస్తె ఏం పోయింది అని అతని మనసు తొందర పెడ్తుంది. ఇదివరకు ఎంతోమంది స్త్రీలని చూశాడు గాని ఈనాటి ఈ అనుభూతి అతనికి కొత్త! అందని దానికి అర్ర్తులు  చాచడం లో కావాలనుకున్నది పొందడానికి ఈ నిరీక్షణ , ఈ ఆరాటం అతనికి తెలియనివి! అందుకే అతనిలో ఏదో ఆవేశం , ఆరాటం, ఎక్సైట్ మెంట్ తో చెమట పడుతోంది. ఏం చెయ్యాలో ఎలా అరంభించాలో -- ఆడదానితో అన్ని అనుభవాలు రుచి చూసిన అతనికే తెలియడం లేదు. ఆమె ఏదన్నా అంటే గొడవ చేస్తే తను పరువేం గాను??
    ఆఖరికి ఏమయితే అయింది కనీసం ఆమెతో మాట్లాడి ఆమెని దగ్గర నించన్నా చూడాలన్న కాంక్ష ని అదుపులో పెట్టుకోలేక పోయాడు. ఆమె ధోరణి చూసి ముందంజ వెయ్యచ్చు. లేదంటే వూరికే పరిచయం చేసుకుని మాట్లాడినట్లు మాట్లాడి రావచ్చు. అందులో తప్పేం వుంది? మనసు కూడదీసుకుని ధైర్యం చిక్క పట్టుకుని తడబడుతున్న అడుగులతో టెంట్ వైపు వెళ్ళాడు.

                                        *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS