Previous Page Next Page 
భవ బంధాలు పేజి 33


    తెల్లవారుజామునే పులిని చంపిన విజయోత్సాహంతో వేటకి వెళ్ళిన అందరూ వచ్చారు. పులి నిన్నటి లాగే తెలివిగా మాటు వేసిన మేకపోతుని కరుచుకు పారిపోయింది. అయితే గన్నర్ చాలా త్వరగా తుపాకి పేల్చడంతో మొదటి గుండె సరి అయిన చోట తగిలి పులి మేకపోతు ని వదిలి పారిపొబోయింది. రెండో గుండుకి మరి కదలక నేలకూలింది. మూడో గుండు కి ప్రాణం వదిలింది. ఏడడుగుల ఆ పులిని తాళ్ళు కట్టి ఈడ్చు కొచ్చారు. పులు చర్మం, గోళ్ళు , పులి తల అన్నీ మిత్రులిద్దరికీ పంపే ఏర్పాట్లు చేశాడు రమాకాంత్. అంతా పులిని కుతూహలంగా చూడడం అయ్యాక ---
    ఉదయం బ్రేక్ ఫాస్ట్ కాంగానే ప్రయాణం పెట్టుకుని జీపు ఎక్కబోతున్నారు అందరు "మిస్టర్ పట్నాయక్ మీ ఆతిధ్యానికి మెనీ థాంక్స్. చాలా బాగా ఏర్పాట్లు చేశారు అన్నీ" అంటూ థాంక్స్ చెప్పాడు రమాకాంత్. తన అలవాటు కి విరుద్దంగా అంటే ఆ ఏర్పాటు చేయడం వారి విధిలా భావించి అతను ఈసారి ప్రత్యేకంగా కంట్రాక్టర్ కి కృతజ్ఞతలు చెప్పాడు. పట్నాయక్ ఓ నవ్వు నవ్వి "హీ ...హీ.... తమ దయ సార్ . నాడో చిన్న మనవి" అన్నాడు నమ్రతగా.
    "ఏమిటి చెప్పండి?"
    "అదే సార్ ఈ ఏరియా అడవి కొట్టి కలప, టేకు చెట్లు నాటాల్సిన మూడు లక్షల కాంట్రాక్టు ..."
    "ఐసీ!...టెండర్ కాల్ చేశాడా డి.ఎఫ్ వో?" సాలోచనగా అడిగాడు.
    "ఆ చేసారండి..టెండరు పెట్టానండి- తమరు కాస్త దయ చూపి డి.ఏప్. వో గారికి..."పట్నాయక్ చేతులు నలుపుకుని అన్నాడు.
    "ఆ ..సరే చూస్తాను. డోంట్ వర్రీ. డి.ఎఫ్. వో కి చెప్తాలెండి " అంటూ జీపు ఎక్కాడు రమాకాంత్.

                                       *    *    *
    అంతా వెళ్ళాక తీరుబాటుగా మిగిలిన సీసాలు ముందు పెట్టుకుని మిగిలిన చికెన్ తో చికెన్ ఫ్రై చేయించుకుని పట్నాయక్ , ఇద్దరు రెంజర్లు జల్సా చేసుకుంటున్నారు. కాస్త దూరంగా ఆమె కూర్చుని ప్లేటు లో వేరుశనగ పలుకులు ఒకోటి తీసి నోట్లో వేసుకుంటుంది. పట్నాయక్ కి  అప్పటికే కైపు తలకెక్కింది. చాలా కులాసాగా ఖుషీగా నవ్వుతూ తుళ్ళి పోతున్నాడు. "ఏదీ దొర ఏమన్నాడు మళ్ళీ చెప్పు-- నిన్న రాత్రి జరిగింది అంతా చెప్పు -- " నవ్వుతూ అడిగాడు పట్నాయక్ . ఆమె ముసిముసి నవ్వులు నవ్వి చెప్పాగా" అంది.
    "ఆహా ! అలా కాదు సరిగా చెప్పు."
    "చెప్పడానికి ఏముంది. పాపం వంటరిగా వున్నారు భయం లేదా అంటూ వంక కల్పించుకుని పలకరించాడు.  ఆ అవకాశం కోసం చూస్తున్న నేను కూర్చోపెట్టి కాఫీ యిచ్చాను. అక్కడ నించి ప్రశ్నలు మొదలు పెట్టాడు. ఊరికే పదేపదే నీలాంటి అందగత్తె చదువుకున్నది. ఆ ఎద్దుకి పెళ్ళాం ఎలా అయావు అంటూ బోలెడు సానుభూతి. జాలి కురిపించాడు. నా  బీదరికం నాకిష్టం లేకుండా రెండో పెళ్లి కి నన్ను కట్టబెట్టడం కన్నీళ్ళ తో జాలిగా చెప్పి, నా బాధలు చెప్పుకున్నాను. పాపం కరిగిపోయాడు. ఇద్దరిదీ ఒకటే కధ అని ఓదార్చాడు. తరువాత మరో అడుగు ముందుకు వేసి, నీ అందాన్ని అడవి గాచిన వెన్నెల చెయ్యద్దని, ఇదేం పాపం గాదు . ఈ ఒక్కరోజు అనుభవం యిచ్చిన జ్ఞాపకాలతో మిగిలిన చెదు జీవితం మింగావచ్చని , నీ అందం నన్ను పిచ్చి వాడిని చేసింది అనుగ్రహించు అంటూ మీద పడ్డాడు. అతను నన్ను వలలో వేసుకోడానికి ఎంత ఆరాట పడుతున్నాడో అతన్ని నేను వలలో వేయడానికి అంత ఆరాటపడుతూనే వున్న గనక కాస్త బెట్టు చేస్తూ పాపం పుణ్యం అంటూ పతివ్రతలా నటిస్తూ లొంగిపోవడం ఇష్టం లేనట్టు నటిస్తూ కౌగిలి లో చేరాను" ఆమె విలాసంగా , గర్వంగా నవ్వుతూ అంది.
    "ఇంత బాగా నటించాను మరి నా బహుమతి ఏది?" వయ్యారంగా చెయ్యి చాపింది. "తొందరెందుకు పిల్లా ఇదిగో వెయ్యి" అన్నాడు నోట్ల కట్టలు లెక్క పెట్టి.
    "ఇంత కష్టపడ్డా రేటు మించి ఇయ్యడం లేదు కదూ" అంది గునుస్తూ.
    "బాగుంది వంద రూపాయలు పడేస్తే పదిమంది దొరుకుతారు. ఏదో హైక్లాస్ దానివని, కాస్త ఎర్రగా, బుర్రగా వున్నావని ఇంగ్లీషు మాట్లాడుతావని ఇంతిచ్చాఇంకానా" అన్నాడు పట్నాయక్.
    "గురూ మా బలే టోకరా తినిపించావు దొరకి" అన్నాడు ఓ రేంజరు.
    "అద్సరే -- నీ పెళ్ళాం అని చెప్పకపోతే వచ్చే నష్టం ఏమిటి గురూ !" మరో రేంజరు సందేహం.
    "నా పెళ్ళాం కాకపోతే ఆడికి నేనిచ్చిందిదేటుంది. ఆడికి తప్పుపని చేసిన పాపభీతి ఎటుంటుంది-- ఆడు నాకు ఋణపడినట్టు ఫీలవుతాడా? బజారుదంటే అందరికీ హక్కే కదా - మరోడి పెళ్ళాం మీద వున్న మోజు ఉంటుందా " నవ్వాడు గలగల పట్నాయక్.
    "బలే బుర్ర గురూ నీది. ఐడియా అంటే నీదే -- వెయ్యి రూపాయలు ఖర్చేట్టి మూడు లక్షల కాంట్రాక్టు కొట్టేశావు . ఎర చూపి పులిని కొట్టేశావు. దొర ఆ పులిని కొట్టేస్తే, నీవు ఈ పులినే కొట్టేశావు. రేంజరు భుజం చరిచి గలగలా నవ్వాడు పట్నాయక్ గర్వంగా మీసం మెలేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS