Previous Page Next Page 
భవ బంధాలు పేజి 31


    "ఐసి! " అన్నాడు రమాకాంత్ కంట్రాక్టర్ అనగానే అతనికి అంతా అర్ధం అయింది. "ఆ...రాత్రి షికారీ కి అన్ని ఏర్పాట్లు జరిగాయా?"
    "ఎస్ సార్."
    "మారు సిద్దం చేశారా? మాతో రావాల్సిన వాళ్ళు జీపు, ప్లడ్ లైట్స్, గన్నర్ ."
    "చిత్తం అంతా రెడీ సార్."
    "సరే డిన్నరయ్యాకపదిన్నర పదకొండు కి బయలుదేరుతాం." అంటూ రమాకాంత్ గదిలోకి వెళ్ళాడు.
    మిత్రులు ముగ్గురు స్నానాలు చేసి వచ్చేసరికి బయట వరండాలో పెట్రో మాక్స్ లైటు చుట్టూ కుర్చీలు గుండ్రబల్ల చుట్టూ వేయించి బాటిల్స్, ఐస్ ఫ్లాస్క్, గ్లాసులు , నంజు కోడానికి వేయించిన జీడిపప్పు, పోటెతోచిప్స్, వేరుశనగ పప్పులు, సిగరెట్ పెట్టెలు , పేక దస్తాలు ఏర్పాటు చేశాడు పట్నాయక్ ఏర్పాట్లు కు సంతసించి మెచ్చుకోలుగా తల ఊపి "వేల్' ....కమాన్ ఫ్రెండ్స్ పది గంటల వరకు యీ అడవిలో మనకిదే కాలక్షేపం" అంటూ బాటిల్ అందుకున్నాడు రమాకాంత్.
    "రమ్మీ వేద్దామా,: అంటూ పేక తెరిచాడు అభిరామ్ పండా. అభిరామ్ పండా ఐ.ఎస్ సెక్రటరీ గా ఫైనాన్స్ లో వున్నాడు.
    "మరోకరుంటే బ్రిడ్జి ఆడుకునేవాళ్ళం . ఏరి మీ డి.ఎఫ్ వో లు . అంతా వెళ్లి పోయారా?' అన్నాడు విభీషణ్ మహంతి అతను నేషనల్ హైవేస్ లో చీఫ్ యింజనీరు, ముగ్గురూ క్లబ్ మిత్రులు.
    "వాళ్ళెందుకు? నవ్వడానికి కూడా భయపడి బిగపట్టుకుని బిక్కచచ్చి కూర్చుంటారు. వాళ్లకి మనకి ఫ్రీగా వుండదు" అన్నాడు రమాకాంత్ గ్లాస్ లో ఐస్ ముక్కలు వేస్తూ.
    రాత్రి పది వరకూ పేకాడుతూ, తాగుతూ రమాకాంత్ యిదివరలో తన వేట విశేషాలు చెప్తూ కబుర్లతో నవ్వులతో హోరెత్తించాడు ఆ అడవి అంతా.
    పదిగంటలకి డిన్నర్ కి లేచారంతా. మటన్, చికెన్ పలావు తో పాటు సాంబార్, రసం కొబ్బరి పచ్చడి, రకరకాలతో టేబిల్ నింపేశాడు పట్నాయక్!
    "అరె తెలుగు వంటలు చేయించారే 'కంసమా' తెలుగు వాడా?' రుచి చూస్తూ మెచ్చుకుంటూ అన్నాడు రమాకాంత్.
    "కాదండి . మీకు తెలుగు వంటలు యిష్టం అని విని స్పెషల్ గా మా ఆడవాళ్ళ తో చేయించాను." కంట్రాక్టర్ వినయంగా అన్నాడు.
    "ఓ, ఐసీ!' తాగిన మత్తులో తేలిపోతున్న అతనికి అంతకంటే వివరాలు అడిగి వినే ఓపిక లేదు. అంతా సుష్టుగా భోం చేశారు. వాళ్ళు భోం చేసి వచ్చేసరికి ఆరు బయట వెన్నెల్లో కుర్చీలు వేయించి సిగరెట్లు, పాన్ అరేంజ్ చేశాడు పట్నాయక్.
    "హెహ్! భలే ఎరేంజ్ మెంట్లోయ్, దమ్మిడి ఖర్చు లేకుండా పెళ్ళివారి మర్యాదలు జరిపిస్తున్నావు మా వాడి చేత" అన్నాడు అభిరామ్, మరేమీ అనుకున్నావ్ అన్నట్టు గర్వంగా చూశాడు రమాకాంత్.
    వెన్నెల పుచ్చ పువ్వులా కురుస్తుంది. ఎక్కడివో అడివి పూల వాసన డాక్ బంగళా లో మల్లెలు, నైట్ క్వీన్ పరిమాణాలు పిల్ల తెమ్మెర తో పాటు కదిలి వస్తుంది. ఎక్కడో దూరంగా కొండ మీద నించి దుమికే నీటి ధార శబ్దం . వాతావరణం ఆహ్లాదకరంగా వుంది.
    "వండర్ ఫుల్. ఇలాంటి చోట వలచి వలపించే ప్రియురాలితో విహరిస్తే యింకెంత మజాగా వుంటుంది ఈ వెన్నెల. ఈ చల్లగాలి, ఈ పరిమాణాలు, ఈ ఏకాంతం, ఓహ్ హనీమూన్ 'సరి అయిన చోటు కదూ'రమాకాంత్ అసలే సరసుడు. డానికి తోడు పిసరంత కవి హృదయం వుందేమో , పుచ్చుకున్న పానీయంతో పాటు పరిసరాలు మత్తు నివ్వగా కలల్లో తేలిపోతున్నట్లున్నాడు.
    "చంపావు ఈ అడవిలో ప్రేయసి లను కూడా ఎక్కడ సప్లయి చేస్తారు. పూర్ ఫెలోస్ ఇప్పుడు వాళ్ళ నిబ్బంది పెట్టకు" రమాకాంత్ వీక్ నెస్ తెల్సిన విభీషణ్ చమత్కారంగా అన్నాడు.
    మన కాంత్ తల్చుకోవాలే గాని కారడవి లో కూడా కాంతల్ని సంపాదిస్తాడు జోక్ చేశాడు అభిరామ్.
    ఆ మాట నిజం అన్నట్టు హటాత్తుగా రమాకాంత్ కుర్చీలో కూర్చుని "అరె' అన్నారు ఆశ్చర్యంగా. అతను చూస్తున్న వైపు తక్కిన యిద్దరు కూడా ఆశ్చర్యంగా చూశారు నిటారుగా.
    డాక్ బంగళా ఎదురుగా కాస్త దూరంలో ఓ టెంటు వుంది. టెంటు బయట పండు వెన్నెలలో , మిలమిల మెరిసే తెల్లచీర, బారెడు నల్లటి జడ, జడలో విచ్చిన తెల్లని పూలు-- యిటు అటు పచార్లు చేస్తున్న స్త్రీమూర్తి ని చూసి ముగ్గురూ ఒక్కక్షణం ఆశ్చర్యంగా ఆటే చూస్తుండి పోయారు.
    "ఎవరీమె -- కామినీయా, వన సుందరా, గాంధర్వ కన్యా-- కలా, నిజమా, భ్రమా " రమాకాంత్ కళ్ళ చికిలించి మెలకువ తెచ్చుకుని మరోసారి చూశారు. తక్కిన యిద్దరికీ అదే అనుమానం వచ్చింది.
    "ఈ అడవిలో ..రాత్రి....ఎవరీమె? యిక్కడేందుకు వుంది? చాలా ఆశ్చర్యంగా వుందే. ఆ టెంట్ యింకా మనం వచ్చినప్పుడు వుందా?" దెయ్యాల కధలు గుర్తువచ్చి అనుమానంగా అన్నాడు రమాకాంత్.
    "ఏమో- మనం సరిగ్గా చూసి ఉండం , చీకట్లో వచ్చాం గదా" మహంతి అన్నాడు.
    "అడిగేస్తే పోతుందిగా" అన్నాడు పండా. వెనకాతల కిచెన్ లో అంతా భోజనం చేస్తున్నారు. పళ్ళాలు, గ్లాసుల చప్పుడు, మాటలు వినిపిస్తున్నాయి. గేటు దగ్గర ఓ గార్డు మాత్రం కనిపించాడు. రమాకాంత్ గార్డుని పిలిచాడు. టెంటు వైపు చూపించి "అక్కడ.....ఎవరు ? .... ఆమె ఎవరు?" అనడిగాడు. వాడు జవాబిచ్చేలోగా వెనక నించి పట్నాయక్ భోం చేసి గొంతు సవరించు కుంటూ వచ్చాడు రమాకాంత్ ప్రశ్న విని . అతను టెంట్ వైపు ఒకసారి చూసి "హి....మా ఫేమిలీ లెండి" అన్నాడు నసిగి. రమాకాంత్ ఆశ్చర్యపోయాడు. "ఏమిటి ఈ అడవిలో టెంటు లో ఫేమిలీ తో వుంటున్నారా మీరు?" అడిగాడు. కాంట్రాక్టరు  వినయంగా చేతులు నలుపుకుంటూ "అబ్బే లేదండీ  , యిటు ప్రాంతాలు ఎప్పుడూ చూడలేదంటే ఈ అడవి అది చూడాలని సరదా పడుతుంటే నాతొ తీసుకు వచ్చాను" ఏదో అపరాధం చేసినట్లు సంజాయిషీ యిస్తున్నట్లున్నాడు.
    "ఆహా ...మరి టెంటు లో వున్నారు భయం లేదా?"
    "మరిక్కడ వసతి ఏముందండి. మీరు రాకపూర్వం గది ఖాళీ వుందని డాక్ బంగళా లో వున్నాం. మీరోస్తున్నారని ఖాళీ చేసి టెంటు వేయించాను. రెండు రోజుల్లో వెళ్ళిపోతాం." వినయంగా అన్నాడు. రమాకాంత్ ఉత్సాహం ఎందుకో కరిగిపోయింది. ఏదో వింటాననుకున్నది యింత చప్పగా కాంట్రాక్టరు భార్యగా తెలిపోగానే ఏదో పొంగు అణిగి పోయినట్టయింది. కాంట్రాక్టరు వెళ్ళగానే మరోసారి అటు చూశాడు. మంచి విగ్రహం, యింత దూరం నించే మెరిసే రంగు ! చీర జాకెట్టు కి మధ్య కన్పిస్తున్నట్లున్న నడుం రంగు ....యింత అందం , ఈ నల్ల మొద్దు స్వంతమా వీడికి....ఈ ఎద్దుకి....అంత అందమైన భార్యా...." మింగుడు పడని నిజంలా అన్పిస్తుంది.
    "నో యూస్ మై బాయ్-- ఫేమిలీ లేడీ -- తన్నగలదు పిచ్చి వేషాలు వేస్తె" మహంత రమాకాంత్ మొహంలో భావం చదివినట్లున్నాడు.
    "ఛా...ఛా.... అదేం కాదు. ఈ అడవి మధ్యలో హటాత్తుగా స్త్రీ కనిపిస్తే కుతూహలం అన్పించింది అంతే " అన్నాడు రమాకాంత్ నవ్వి-- అన్నంత తేలిగ్గా అతని మనసుని నమ్మించ లేకపోయాడు .

                                     *    *    *
    పదకొండు గంటలకి అంతా జీపు ఎక్కారు. జీపుకి అటు ఇటు రెండు ఫ్లడ్ లైట్స్ కట్టారు. మహంతి డ్రైవ్ చేస్తుంటే రమాకాంత్, పండా పక్కన కూర్చున్నారు. రమాకాంత్ గన్ పట్టుకుని గురి పెట్టుకుని సిద్దంగా ఉన్నాడు. తోవలో ఏదన్నా కనిపించదా అన్న ఆశతో వెనకాతల గన్నర్, కంట్రాక్టర్ , ఒక గార్డు కూచున్నారు. రెండు పెద్ద ఫ్లాస్కుల నిండా టీ- బిస్కెట్ల పెకట్లు, సిగరెట్ పెట్టెలు, వాటర్ బాటిల్, ఒక జంపుకానా ,, బ్యాటరీ లైట్లు వగైరా సరంజామా సిద్దం చేసుకున్నారు.
    "ఎంత దూరం వెళ్ళాలి మనం " రమాకాంత్ కంట్రాక్టర్ ని అడిగాడు.
    "ఇక్కడ నించి అరుమైళ్ళు ఈ రోడ్డు. ఆ తరవాత అడవి లోకి కచ్చా రోడ్డు లో నాలుగు మైళ్ళు వెళ్ళాక జీపింక వెళ్ళదు సార్. అక్కడ నించి మూడు ఫర్లాంగులు నడిచి లోపలికి వెడితే అక్కడ మాటు వేయించి రెడీ చేశాను సార్....' పట్నాయక్ తోవ చూపిస్తుండగా జీపు కదిలింది.
    కంకర రోడ్డు దిగగానే ఫ్లడ్ లైట్ల వెలుగు కి జీపు చప్పుడికి భయపడి నాలుగైదు కుందేళ్ళు, గాభరాగా పరిగెత్తి మాయమయ్యాయి. రెండు నక్కలు తలలెత్తి చూశాయి. పోను పోను అడవి దట్టమవుతున్న కొద్ది చెట్ల కొమ్మలు తలలకి తగులుతున్నట్లనిపించింది. నిద్రపోతున్న పక్షులు ఆ హడావిడికి లేచి ఒక్కమ్మడిగా అరవసాగాయి. అడవి అంతా హటాత్తుగా మేల్కొన్నట్లు అయింది. మనిషి వెళ్ళగలిగే పాటి ఆ బాటలో గతుకులలో జీపు ప్రయాణం చేస్తుంది. ఎత్తెత్తి కుదేస్తుంది. "ఓ దుమ్మర గుండయినా తగలలేదు తోవలో ఈవాళ" అన్నాడు నిరుత్సాహంగా రమాకాంత్. ఓ కుందేల్ని కొట్టబోతుంటే "ప్చ్...ప్చ్...వద్దు వద్దు చిన్న ముండ తెల్లగా ముద్దు వస్తుంది పాపం చంపకు అన్నాడు అభిరామ్. మొదటిసారి ఈ షికారు కి రావడమేమో ఆ యిద్దరికీ అంతా ఆశ్చర్యంగా, ఆనందంగా వుంది. ఆ గతుకుల సన్నని బాట కూడా అంతం అయి నాలుగు పక్కల మహా వృక్షాలతో నడవడానికి కూడా తోవలేని చోటు వచ్చేసరికి జీపు ఆపేశారు. అంతా జీపు దిగారు. గన్నర్ బ్యాటరీ లైటు గన్ తో ముందు నడుస్తుండగా గార్డు సామానులన్నీ మోస్తుండగా తలో కళ్ళు నడవసాగారు. పైన పండు వెన్నెల కురుస్తున్న ఆ దట్టమైన చెట్లనీ చీల్చుకుని వెన్నెల రాలేకపోవడంతో అంతా చీకటిగా వుంది. కీచురాళ్ళ రోద, నడుస్తుంటే కింద ఎండు టాకుల గలగలలు-- ఆ వాతావరణం చూస్తుంటే పండాకి, మహంత్ కి భయం కంటే ఏదో ఎడ్వంచర్ లా ఉంది. వీళ్ళ అడుగుల చప్పుడికి నిద్రపోతున్న ఓ లేడి లేచి చెంగున దుమికి పొదలోకి పారిపోయింది. కుందేళ్ళు గాభరా పడి పరిగెత్తాయి. మూడు ఫర్లాంగులు దట్టమైన అడవి మధ్య నడిచాక పట్నాయక్ ముందే ఏర్పాటు చేసిన మంచే దగ్గరికి చేరారు. పెద్ద పెద్ద కొమ్మలతో వున్న మహావృక్షం మధ్య కొమ్మల మీద వెదురు కర్రలతో మంచే తయారు చేశారు. పైన గడ్డి పరిచారు. ఆరుగురు శుభ్రంగా కూర్చోవచ్చు. ముందే పంపిన ఓ గార్డు మాటు కట్టడానికి తీసుకొచ్చిన మేక పోతుని పెట్టుకుని అక్కడ కూర్చుని వున్నాడు. కాంట్రాక్టరు చకచక గడ్డి మీద జంబుకానా పరిచి అంత సామాగ్రి చేరేశాడు. అంత ఒకరినొకరు చేయి అందించుకుని పైకి ఎక్కారు. కింద కాస్త దూరంలో ఓ చెట్టుకి మేకపోతుని కట్టారు. రమాకాంత్ ఒక గన్ గన్నర్ ఒక గన్, గార్డు మరో గన్ పట్టుకుని ముగ్గురూ మూడు దిక్కులకి మొహం పెట్టుకుని రెడీగా పొజీషన్ చూసుకుని కూర్చున్నారు.
    పులి వేట కి సరదా తో పాటు ధైర్య సాహసాలే కాక, ఓర్పు చాలా అవసరం. అలా చీకట్లో విసుగు -- విరామం లేకుండా కళ్ళు విప్పుకుని రాత్రంతా పులి కోసం ఎదురు చూడడానికి చాలా ప్రాక్టీస్ వుండాలి. ఒకోసారి అంతలా కాచుకున్నా పులి కనపడక పోవచ్చు. పులి కన్పించినా గురి తగలక పోవచ్చు. గుండు తగిలినా సరియైన చోట తగలక పులి పారిపోవచ్చు. వరసగా రెండు మూడు రోజులు ఓపిగ్గా ఎదురు చూడాల్సి రావచ్చు. అంచేత పులి వేటకి వెళ్ళినప్పుడల్లా పులి దొరుకుతుందని లేదు. అంత మాత్రం చేత నిస్పృహ పడి లాభం లేదని రమాకాంత్ మిత్రులిద్దరికీ ముందే చెప్పాడు. రమాకాంత్ ఏభై సార్లయినా వేటకి వెళ్లి ఉంటాడు. అన్ని సార్ల లో కేవలం ఆరు పులులని మాత్రం చంపగలిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS