వేట
దట్టమైన దండకారణ్యం మధ్య రోజూ చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోయే "మల్కనగిరి " ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఆరోజు కళకళలాడిపోతుంది. బయట వరండాలో పెట్రో మాక్స్ లైట్ దేదీప్యమానంగా వెలిగి పోతుంది. బయట రెండు జీవులు నిలబడి వున్నాయి. నలుగురు ఫారెస్ట్ గార్డులు బయట సాయుధులై నిలబడ్డారు. నలుగురు ఫారెస్ట్ రెంజర్లు ఒకచోట నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరు డి.ఎఫ్. వో లు బయట వరండాలో కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వెనక కిచెన్ ;ఓ కోళ్ళ పీకలు తెగిపోతున్నాయి. మసాలా వాసనలు ఘాటుగా పైన కూర్చున్న వాళ్లకి నోరూరిస్తున్నాయి. ఆ వాసనలు పసిగట్టి నాలుగైదు కుక్కలు ఆరాటంగా తోకాడించుకుంటూ తిరుగుతున్నాయి.
ఎవరయినా ఫారెస్ట్ ఆఫీసర్లు టూర్ల మీద వచ్చినప్పుడు తప్ప మిగతా టైములో ఆ డాక్ బంగళా నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టుంటుంది. అడవి మధ్య వుందేమో మిగతా డిపార్ట్ మెంటుల వారు ఎంతో అవసరం అయితే తప్ప అక్కడ విడిది చేయరు. ఫారెస్ట్ డిపార్ట్ మెంటు వారయినా షికారీ సరదా కి వచ్చేవారే అక్కడ క్యాంప్ చేస్తుంటారు. శీతాకాలం విపరీతమైన చలి. వర్షాకాలం కుండపోతగా వర్షం. ఎండాకాలం మాత్రం చాలా హాయిగా వుంటుందేమో అప్పుడు మాత్రం ఎక్కువమంది ఆఫీసర్లు టూర్ మీద వస్తుంటారు.
ఈరోజు ఈ అర్బాటానికి హడావుడి కి కారణం కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు టూర్ వెం చేస్తున్నాడు. ఆయనగారి టూర్ ప్రోగ్రాం అందుకోగానే ఆ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారు కంట్రాక్టర్ గారితో చెప్పి చెప్పినట్లు అధికారి గారి ఆగమన వార్త చెప్పారు. ఆ మాత్రం చెపితే కాంట్రాక్టరు సకలమైన ఏర్పాట్లు చేస్తాడని ఆయనకి తెలుసు. లేకపోతె గవర్నమెంటు ఇచ్చే జీతాలతో వారికి రాజ లాంచనాలు ఏర్పాటు చెయ్యాలంటే మాటలు గాదని తెలుసు.
ఆ కంట్రాక్టర్ కి ఇది కొత్త కాదు. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ టూర్ వచ్చినా వారి వారి తాహతులను బట్టి వారికి కావాల్సిన ఏర్పాటులు చెయ్యడం తన డ్యూటీ లో ఒక భాగంగా చేసేస్తుంటాడు. అందులో ఈరోజు వస్తున్నది కన్సర్వేటర్ గారు. అదీ కొత్త కన్సర్వేటర్ , ఈ జిల్లాకి రావడం ప్రధమం. అందుచేత ఏర్పాటులు చాలా ఘనంగా చేశాడు. అరడజను కోళ్ళు, రెండు మేకలు తెచ్చి పెరట్లో కట్టేశాడు. ఫారెన్ విస్కీ బుడ్లు ఏర్పాట్లు అయ్యాయి. ఆయనే కాక ఇద్దరు మిత్రులోస్తూన్నారని మూడు మంచాలు వేయించి, డన్ లప్ పరుపులు వేయించాడు. కొత్త దుప్పట్లు, తువాళ్ళు, చాకింటి కర్టెన్లు, స్పెషల్ సబ్బులు, వేడి నీళ్ళు, చన్నీళ్ళు, అన్నీ పకడ్భందీగా ఏర్పాటయ్యాయి. కన్సర్వేటర్ గార్ని ప్రసన్నుడి గా చేసుకోవాల్సిన అవసరం చాలా వుంది. ఆ ఏరియాలో అడవి లో పిచ్చి మొక్కలు, పనికి రాని వృక్షాలు కొట్టించి చదును చేసి, టేకు. దేవదారు, కలప మొదలయిన మేలుజాతి చెట్లు నాతాల్సిన పని సాలు కి మూడు లక్షల రూపాయల కాంట్రాక్టు వుంది. ఆ జిల్లా డి.ఎఫ్. ఒ. అతనికి కొరుకుడు పడడం లేదు. పెద్ద పిట్టనే పడితే ఇంక ఆ డి.ఎఫ్.ఒ ని లెక్క చేయ్యనక్కరలేదు. ఆ మూడు లక్షల ముందు ఈనాటి ఖర్చు కంట్రాక్టర్ కి ఓ లెక్క కాదు.
ఆ కంట్రాక్టర్ పేరు యస్. పట్నాయక్. పూర్వాశ్రమం లో తెలుగువాడయినా తరతరాలుగా ఒరిస్సా లో స్థిరపడి ఒరియా వాడిగా మారిపోయాడు. ముందు ఫారెస్ట్ గార్డ్ గా చేరినపుడు సుబ్బయ్య గా వుండి, రెంజరయ్యాక సుబ్బారాయుడిగా మారి రెంజర్ గా వున్నప్పుడు అందిన మేరకు నాలుగు రాళ్ళు పోగు చేసుకుని ఉద్యోగం మాని చిన్న చిన్న ఫారెస్ట్ కాంట్రాక్టు లతో మొదలు పెట్టిన పదేళ్ళ లో ఆ ప్రాంతాలు పెద్ద ఫారెస్ట్ కాంట్రాక్టరై సుబ్బారావు పట్నాయక్ అల్లా ఎన్. పట్నాయక్ గా మిగిలాడు.
తెలుగు ఆఫీసర్ల తో తెలుగు వాడినని. ఒరియా వాళ్ళతో ఒరియా వాడినని చెపుతూ ఎవరికి ఏది ముట్టచెప్పి ఏది రాబట్టాలా వగైరా కాంట్రాక్టు లోని మెళకువలు నేర్చుకుని తెలివి మీరిపోయాడు. ఏ ఆఫీసరు టూరు మీద వచ్చినా అక్కడ ప్రత్యక్షమయి వారి అవసరాలు వెయ్యి కళ్ళతో కనిపెట్టి అందరికీ ప్రీతి పాత్రుడయ్యాడు.
ఈ కొత్త కన్సర్వేటర్ రామారాంత్ మిశ్రా షోకిల్లా పురుషుడు, స్పురద్రూపి, సరసుడు అంటే-- సుదీరతో పాటు మదవతి లేనిదే వుండలేడని , ఎప్పుడూ ఫ్రెండ్స్ క్లబ్బులు, పార్టీలు, షికారీలు, అంటూ జల్సాగా కాలక్షేపం చేసేరకం అని- బీదరికం తో పుట్టి , ఆ కారణంగా చదువు కోసం చిన్నతనం లోనే డబ్బు కోసం ఓ కోతిని పెండ్లాడి, ఇల్లరికం వెళ్లి, మామగారి డబ్బుతో చదువుకుని పైకి వచ్చి, ఇంట్లో కోతి భార్యతో , అందం లేకపోయినా చదువు సంస్కారం లేని పల్లెటూరి గయ్యాళి భార్యని భరించలేక, భరించక చేసేదేం లేక అయన యింట్లో దొరకని అందాన్ని, ఆనందాన్ని బయట అనుభవిస్తాడని, ఏ డబ్బు కారణంగా అతను జీవితంలో నష్టపోయాడో ఆ డబ్బు మీద కసితో రెండు చేతులా అందిన చోటల్లా పుచ్చుకుని జీవితాన్ని అనుభవించి ఆనందించడమే ధ్యేయంగా పెట్టుకుని యింట్లో పెళ్ళాం నించి తప్పించుకుని ఎప్పుడూ టూర్లు, లేక ఫ్రెండ్స్ క్లబ్బులలో కాలక్షేపం చేస్తాడని చాలా వివరాలే సేకరించాడు పట్నాయక్. అంతేకాక తన రూపంతో , మాటలతో ఏ స్త్రీ నైనా ఆకర్షిస్తాడని ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో ఎలాంటి ఆడదాని నైనా బుట్టలో పడేట్టు ఇంద్రజాలం చేస్తాడు. అతని వీక్ నెస్ ల గురించి కిందా మీదా అధికారులకి, మిత్రులకి అందరికీ తెలుసు. అతనితో ఈ దుర్గుణాలన్నీ అతని మాట నేర్పరితనం , అతని పెర్సనాలిటీ , అతని స్నేహ ప్రియత్వం చాటున మరుగుపడి పోతాయి. అతనెక్కడ వుంటే అక్కడ ఉల్లాసం, ఉత్సాహం, చిందులు వేస్తుందని , పదిమంది ని చుట్టూ వేసుకుని ఉంటాడనీ తెలుసుకున్నాడు. అతనికి వేట హాబీ, వేట మీద మనసు పోయినప్పుడల్లా తన జ్యూరిస్ డిక్షన్ లో ఏ అడవి లోనో టూర్ ప్రోగ్రాం వేసుకుంటాడు. అతనిప్పటి కి నాలుగు పులులను చంపాడు. మిత్రులందరికీ పులు చర్మాలు, గోళ్ళు, బుర్రలు, దుప్పి కొమ్ములు , జింక చర్మం వగైరాలు ప్రెజెంట్ చేస్తుంటాడు. ఇతర డిపార్ట్ మెంటు అఫీస్సర్లెవరికైనా వేట చూడాలని వుంటే చాలు రమాకాంత్ ని అడిగితె చాలు మహదానందంగా వెంట బెట్టుకు వెళ్లి సకలమైన మర్యాదలు జరిపిస్తాడు.
ఈ సమాచారం సేకరించి డానికి తగ్గ విధంగానే అన్ని ఏర్పాట్లు లు చేశాడు పట్నాయక్. దొరవారు టూర్ ప్రోగ్రాం ప్రకారం జయపురం నించి సాయంత్రం బయలుదేరి ఏడు గంటలకి చేరాలి.
* * *
బయట జీపు హారన్ వినగానే వాచ్ మన్ పరుగెత్తి గేటు తీశాడు. గార్డులు ఎటేన్ షన్ లో నిలబడి సెల్యూట్ చేశారు. రెంజర్లు వినయంగా నమస్కారాలు చేశారు. డి.ఎఫ్.వో లు మెట్లు దిగి ముందుకు వచ్చి నిలబడ్డారు. వంటలని పర్యవేక్షిస్తున్న కాంట్రాక్టరు పరుగున వీధి వరండాలో కి వచ్చాడు.
కన్సర్వేటర్ గారు, మిత్రులిద్దరూ జీపు దిగారు. మరో జీపు నించి వారితో పాటు టూర్ చేస్తున్న మరిద్దరు డి.ఎఫ్.వో లు దిగారు. అందరి నమస్కారాలు అందుకుని హుందాగా తలపంకించి మిత్రులతో వరండాలో కి నడిచి కుర్చీలో ఆసీనులయ్యారు. ఆఫీసర్ల ని పరిచయం చేసుకుని లాంచనంగా పది నిమిషాలు ఆఫీసు విషయాలు డిస్కస్ చేసి "అల్ రైట్ -- వుయ్ విల్ మీట్ ఎగైన్, టుమార్ మార్నిగ్ ఎట్ టెన్" అని లేచి లోపలికి వెళ్ళిపోయాడు. నాల్గు గంటల నించి పడిగాపులు పడి వున్న డి.ఎఫ్.వో లు మొహాలు చూసుకున్నారు. చచ్చినట్లు మళ్ళీ రావాలని మొహాలు చూసుకుని మెట్లు దిగారు. అక్కడ క్యాంప్ చెయ్యడానికి వున్నది ఒక్కటే డాక్ బంగళా . ఏ కోరాపూటో, జయపూర్ వెళ్లి రాత్రికి వుండి మళ్ళీ రావాలి. ఈ కన్సర్వేటర్ గారు టూర్ రెండు రోజుల్లో పని రెండు గంటలు, షికార్ రెండు రోజులు చేస్తారని వినే వున్నారు. కనుక ఏం చెయ్యలేక మనసులో తిట్టుకుంటూ వెళ్ళారు.
"తమరు కాస్త 'టీ' తీసుకుంటారా?" కాంట్రాక్టరు వినయంగా అడిగాడు. రమాకాంత్ వాచీ చూసి "టీ వద్దు" ఏడున్నరయింది ముందు స్నానం చేసి తరువాత.."
"ఆ...ఆ... ఆ ఏర్పాటులు చూశానండి. గదిలో వేడినీళ్ళు సిద్దంగా వున్నాయి. డిన్నర్ ఎన్నింటికి సార్."
"పది గంటలకి, ఆ ...మీరు ?" ఎవరన్నట్టు చూశారు.
"చిత్తం , నాపేరు పట్నాయక్' అండి. కాంట్రాక్టు పనులు చేస్తుంటాను." వినయంగా చేతులు నలుపుకుంటూ అన్నాడు.
