Previous Page Next Page 
భవ బంధాలు పేజి 29


    మూర్తి వస్తాడు రాగానే ఎలా మొదలుపెట్టాలో , ఏమని అడగాలో, ఇప్పటికి ఓ వంద సార్లయినా రిహార్సల్స్ వేసుకుంది సీత.
    కనుచీకటి పడుతూంది..... మూర్తి వస్తాడు....వచ్చి కూర్చుంటాడు.
    "ఏం సీతా , ఏమిటి సంగతి ?" అంటాడు. తను యిటూ అటూ చూసి చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంటుంది. "నేనేం అడుగుతానో ఊహించలేదూ.... నాకేం కావాలో నీకు తెలియదా?"
    "ఊహు" మూర్తిచిలిపిగా నవ్వుతాడు.
    "నీవు కావాలి.... శాశ్వతంగా నావాడివి కావాలి. నాకింత కంటే ఏం కావాలి. మూర్తీ నన్ను నీ దాన్ని చేసుకో నలుగురి సమక్షంలో" అంటూ సిగ్గువిడిచి చెప్పేస్తుంది....
    "పిచ్చి సీతా! దానికింత సందేహం ఎందుకు, నేనే చెపుదామనుకుంటూన్నాను ఇవాళో రేపో. అసలు నీకిలాంటి సందేహం ఎందుకు రావాలి. ఆమాత్రం నామీద నమ్మకం లేదా.....' అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు.
    "లేదు....లేదు నీమీద నమ్మకం లేక కాదు.....కాని..... యీ పాడు లోకం ఒకటుందిగా....." నొచ్చుకుంటూ సంజాయిషీ యిస్తుంది.
    "అవును .....నిజమే ఇన్నాళ్ళూ ఆమాటే ఆలోచించలేదు నేను. నిన్ను బాధపెట్టానా సీతా! ఇదిగో రేపే వెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో మన పేర్లు రిజిస్ట్రర్ చేయిస్తాను.....మళ్ళీ నెలనాటికి మనం భార్యాభర్తలం అయిపోతాం ఒకే...... ఆర్ యూ సెటిస్ ఫైడ్ నౌ......." అంటూ చిలిపిగా నవ్వుతాడు. సిగ్గుతో సీత మూర్తి గుండెల్లో మొహం దాచుకుంటుంది సర్వం మరచి.
    కళ్ళముందు పరచుకున్న రంగుల కలని చెదర గొడ్తూ ప్రక్కనే ఎవరి ట్రాన్సిస్టర్ లోంచో వినవస్తున్న తెలుగువార్తలు విని సీత ఉలిక్కి పడి చుట్టూ చూసింది.
    ఏడు గంటలు! అప్పుడే ఎడయిండా? చుట్టూ పరచుకున్న చీకటిని, ఆ చీకటిని చీల్చే ప్రయత్నంలో వెలిగే ట్యూబ్ లైట్లనీ చూసి గాభరా పడింది సీత.
    మూర్తి ఇంకా రాలేదు. ఆరుగంటలకి వస్తానని ఎందుకు రాలేదో! ఇవాళ ఆదివారం! ఏం పని వుంటుంది? వస్తుంటే ఎవరన్నా స్నేహితులు అడ్డు తగిలారేమో! వాళ్ళని వదుల్చుకుని వచ్చేసరికి ఆలస్యం అవుతుంది గాబోలు.
    మూర్తి రాడేమో అన్న అనుమానం, భయం సీతకి ఎంత మాత్రం కలుగలేదు. సీత కళ్ళు చీకటిని చీలుస్తూ కనపడినంత మేరా మూర్తి కోసం ఆరాటంగా వెతుకుతున్నాయి.
    సెకన్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. "ప్రేమ వేరు పెళ్ళి వేరు ప్రేమించడం హాబీ గానీ, పెళ్లాడం కాదు! అవసరార్ధం ఆడదాన్ని వాడుకోవడాన్ని ప్రేమ అనరు. మగవాళ్ళ ప్రేమకబుర్లు పెళ్ళికి దారితీయవు సుమా! పిచ్చి సీతా! ' అంటూ, చూసిన సినిమాలల్లో చదివిన కధలల్లో వంచించబడ్డ అమ్మాయిలందరూ సీతని చూట్టూ ముట్టి ఊపిరి అడనీయకుండా ఎలుగెత్తి ఘోషించారు , భయపెట్టారు. మూర్తి మీద వున్న నమ్మకంతో సీత అందరినీ బలవంతంగా దూరంగా నెట్టేసింది.
    ఆరిపోతున్న ఆశాదీపాన్ని ఎగదోసుకుంటూ , తన మనసుని తనే మభ్యపెట్టుకుంటూ అలా స్థాణువులా కూర్చుంది సీత మూర్తి కోసం చూస్తూ.
    ఎనిమిది గంటలయింది..... పూరీ ఎక్స్ ప్రెస్ పొగలు చిమ్ముతూ పరిగెడుతుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి సుపుత్రుడిని చూస్తానా అన్న మూర్తి ఆరాటం రైలు కంటే వేగంగా పరుగేడ్తుంది.
    ఎనిమిదన్నర ......"వేషము మారెను. భాషలు నేర్చెను, అయినా మనిషి మారలేదూ ....." ట్రాన్సిష్టర్  లోంచి వినిపిస్తున్న రికార్డు ఎక్కడో కలలో మాదిరి వినిపిస్తుంటే .....ఏదో కల కరిగిపోయినట్లు లేచింది సీత తడబడ్తూ ! .... కాళ్ళు తేలిపోతుండగా ఎలాగో వెళ్ళి బైట వున్న ఓ రిక్షాలో కూలబడింది సీత! పాపం సీత!

                                  ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS