Previous Page Next Page 
భవ బంధాలు పేజి 28


    సీత అంతవరకు తనుపడ్డ బాధ మరిచి "లేదు..... లేదు నేనూ ఇప్పుడే వచ్చాను" అనేసింది.
    "పదండి, లోపలికి వెళ్ళి కూర్చుందాం."
    నడుస్తుండగా "ఇలా పిల్చినందుకు మీరేం అనుకోలేడుగా ?...." సీత మొహంలోకి చూస్తూ అన్నాడు మూర్తి.
    సీత కళ్ళరెప్ప లార్పింది. తడబడుతూ నవ్వింది. "ఊహూ...... లేదు .... ఏమనుకోడానికి ఏముంది ?"
    "సీతగారూ ....." కూర్చున్న కాసేపటికి అన్నాడు మూర్తి.
    "గారూ వదిలేయండి ....సీతా అనండి చాలు ...." సీత దైర్యంగా తలెత్తి చూస్తూ చనువుగా అంది.
    "సీతా!....." మోహంలో భావాలు వెతకడానికి ప్రయత్నిస్తూ అన్నాడు మూర్తి.
    "ఊ...."
    "సీతా.....నువ్వు ఎప్పుడూ అంత ఉదాసీనంగా ఎందుకుంటావు?.... ఎన్ని రోజుల బట్టో చూస్తున్నాను...."
    ఉదాసీనత కాక ఆమె బ్రతుకులో అనందం ఎక్కడుంది? జవాబెం చెప్పలేకపోయింది సీత.
    "సీతా , నిన్ను చూస్తె నాకు జాలి అనిపించింది. చాలాసార్లు, ఆఫీసులో ఎవరూ నీతో మాట్లాడరేం?"
    అంత ఆదరంగా అడుగుతుంటే సీత ,మనసులో ఆవేదనంతా విప్పి చెప్పుకోవాలన్నంత ఆవేశం వచ్చింది.
    "నాలో ఏం వుందని అందరూ నాతొ మాట్లాడుతారు? సుమతిలా అందం వుందా? వాసంతి లాంటి ఫిగర్ , చలాకీతనం వుందా?....." ఆమె గొంతు వణికింది.
    "అయితే, అందం లేనంత మాత్రాన మీరూ ఓ మనిషి గాదా, మీకూ ఓ మనస్సు వుండకూడదా?"
    "వుందని ఎవరో మీలాంటి సహృదయులనుకుంటారు. కానీ అందరూ అలా అనుకోవద్దూ....." కృతజ్ఞతతో సీత కళ్ళు తడి అయ్యాయి.
    తరువాత ఇద్దరూ కూర్చుని ఓ గంట మాట్లాడిన మాటలు సీత తల కెక్కలేదు. మూర్తికి తన అందంతో పనిలేదు. తనని ఓ మనిషిగా , ఓ స్త్రీగా మాత్రం గుర్తుంచాడు. మూర్తి అందగాడు కాదు. అందుకే అతనికి అందం మీద గురి లేదు. అందం లేని వారి మీద సానుభూతి వుంది.
    మూర్తితో మాట్లాడిన ఆ గంటలో సీట్లో క్రొత్త కోరికలు చిగిర్చాయి. ఏవేవో ఆశలు రేకెత్తాయి ఆమె మనసులో! యీ నాటికి తన జాతకం తిరుగుతుంది కాబోలు! మూర్తి సహృదయత మీద సీతకి ఎంతో నమ్మిక కల్గింది . మూర్తి , మనిషి అందానికి కాక మనసుకి ప్రాధాన్యం ఇచ్చేట్టున్నాడు. అదే నిజమయితే తన బ్రతుక్కి ఓ అర్ధం ఏర్పడుతుందన్న మాట. తనూ యీనాటికి ఓ యింటికి యిల్లాలవుతుంది. ఓ పురుషుడి హృదయంలో స్థానం సంపాదించుకుంటుంది. ...సీత ఆలోచనలు చాలా దూరం కళ్ళెం లేని గుర్రంలా పరిగెత్తాయి.
    తర్వాత మూర్తి, సీతతో వంటరిగా చాలాసార్లు మాట్లాడాడు. ఎన్నోసార్లు పార్కులో కలుసుకున్నారు. మరెన్నో సార్లు సినిమాలకి వెళ్ళారు. మూర్తి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా సీత అభ్యంతరం చెప్పకపోగా ఆనందంగా ఆమోదించింది.
    తన కలలు నిజమవబోతున్నాయని మురిసింది. తనని ఉద్దరించడానికి దేవుడే మూర్తిగా దిగి వచ్చాడని సీత ప్రగాడ విశ్వాసం.
    రాత్రనక పగలనక మూర్తితో తిరిగే తిరుగుడు గురించి ఆఫీసులో ఇంటి దగ్గరా ఇరుగుపొరుగు అనుకునే, అనే మాటలు సీత లక్ష్య పెట్టలేదు. మంచంలో పడుండే తల్లిని మభ్యపెట్టడానికి అట్టే కష్టపడలేదు సీత.
    రెండు నెలలు గడిచిపోయాయి. సీత, మూర్తి ఇద్దరూ చాలా సన్నీహితులైనారు . కనీసం సీత అలా అనుకుంది. ఎన్నో సందర్బాలలో తన కెంతో చెరువుగా వచ్చిన మార్టిని అభ్యంతర పెట్టలేదు. అతని మీద ఆమెకి పూర్తి నమ్మకం వుంది. అంత సన్నిహితులయ్యాక మూర్తి అడగబోయే మాట కోసం అత్రుతగ నిరీక్షించసాగింది సీత.
    మూర్తి హృదయం పెట్టి తన్మయత్వంలో వున్న క్షణాలలో ఎన్నో సార్లు " ఇక్కడ నాకు కొంచెం చోటియరూ!" అని సినిమాల్లో లాగా అడగాలనిపించినా నోటి చివరి దాకా వచ్చిన మాటలని, సిగ్గు వెనక్కి లాగేసేది. అడగవలసింది మూర్తి కానీ తను కాదేమో! తొందరపడి తను తేలిపోతే మూర్తికి కోపం వస్తుందేమో! ఇంత సన్నిహితంగా వచ్చిన మూర్తి తను అడిగితె అపనమ్మకమా అని నొచ్చు కుంటాడెమో! అనుమాలతో, జంకుతో, సిగ్గుతో రోజులు గడిపేస్తుంది సీత. మూర్తి అడగబోయే మాట కోసం ప్రతిరోజూ ఎదురు చూస్తుండగానే రోజులు దొర్లిపోసాగాయి.
     ఎవరి మాటలు ఎంత లక్ష్య పెట్టకూడ దనుకున్నా, తల్లికి జవాబు చెప్పవలసిన స్థితి వచ్చింది సీతకి. మూర్తి సమక్షంలో మిగతా ప్రపంచాన్ని మరచిపోయినా, లోకంతో నాకేమి అనుకున్నా ...... ఒక్కర్తీ కూర్చుని ఆలోచించుకుంటే..... ఇలా ఎన్నాళ్ళు అనే ప్రశ్న వచ్చేది సీతకి. నేనేం చేసినా నా యిష్టం అంటే ఈ దేశంలో, చుట్టూ వున్నా మనుష్యులు , సంఘం వూరుకోదు అన్న విషయం అర్ధమవసాగింది సీతకి. ఇలా కాలయాపన మంచిది కాదనిపించసాగింది. మూర్తి నిశ్చింతగా ఊరుకున్నా అతన్ని త్వర పెట్టవలసిన అవసరం తనకుంది. చూచాయగానైనా తన మనోగత అభిప్రాయం అర్ధం అయ్యేట్టు చెప్పాలి! మూర్తి మీద తన కెంత నమ్మకం వున్నా లోకం నమ్మాలి అతన్ని! సంఘం ముందు దోషులవకూడదు తాము.
    ఎన్నో రోజులు అలోచించి సందేహించి, ఆఖరికి మర్నాడు అడగాలని సీతగా గట్టిగా నిర్ణయించుకుంది.

                                   *    *    *    *

    సీత అరగంట నించి పార్కులో కూర్చుని మూర్తి కోసం నిరీక్షిస్తుంది. నిన్ననే ఆఫీసులో చెప్పింది. ఆశ్చర్యంగా "ఎందుకు" అన్నాడు మూర్తి!" "మీతో చాలా మాట్లాడాలి. ఒకటడగాలి " అని ముసిముసినవ్వు లతో అంది సీత. మూర్తి సీత కళ్ళలో భావం అర్ధం చేసుకోడానికి గుచ్చి గుచ్చి చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS