జీవిత పాఠాలు
విశాలాక్షి కి నిన్నటి నించి అంటే కూతురు వచ్చిందగ్గర నించి ఒకటే దిగులు. గాబరా పట్టుకుంది. కూతురు వచ్చిందంటే సంతోషించాలి కాని దిగులెందుకు అనకండి మీకు తెలియదు. ఆ కూతురు పెట్టె బెడా పట్టుకుని సామాను సహితంగా వచ్చిందంటే గాబరా వుండదా! అందులో ఎంత తిక్క పిల్లో ...పిల్లెమిటి , ముప్పై ఏళ్ళు వచ్చిన దాన్ని పిల్ల అని ఎలా అంటుంది. చేసుకోక చేసుకోక ఇదివరకయితే అవకతవక అనేవారు ఇప్పుడు ఆ పదాలు వాడకూడదు అమ్మాయిల దగ్గర. మేం చేసుకోలేదు అనాలి అంతే గాని అవకపోవడమేమిటి? మాకేం చదువులు లేవా, సంపాదనలు లేవా?
అందరి మాట ఎవరూ ఇప్పుడేత్తకూడదు. స్మార్ట్ వుంటే చాలు. "ఏం అబ్బాయిలకి అందాలున్నాయా?' అని వాదిస్తారు.
ఈ రోజుల్లో ఏ మాటైనా అనే ముందు అలోచించి అనాలి. కడుపున పుట్టిన పిల్లలనయినా!'
సరే ఇదంతా అలా ఉంచి ఎన్ని సంబంధాలు తెచ్చిన తిరగ్గొట్టి "ఇంకా మీరు సంబంధాలు తెచ్చి పెళ్లి చూపులంటూ నన్ను చంపద్దు. నాకు నచ్చినవాడు దొరికితే నేనే చేసుకుంటా!' అని అల్టిమేట్టం ఇచ్చేసింది.
"ఇంకెప్పుడు? ముప్పై నిండి పోతున్నాయి నీకు. భూ ప్రపంచంలో ఎవ్వడూ కంటికి అనడు" అని కోపగిస్తే మింగేసేట్టు చూసి జవాబివ్వక్కరలేనట్టు వెళ్ళిపోయే పిల్లని చూసి మనం తలలు బద్దలు కొట్టుకోవాలి గాని డానికి ఏం లెక్క!
తల్లీ తండ్రి అంటే ఏం లెక్క! వీళ్ళని కని పెంచి, చదువులు చెప్పించి , ఆడా మగా తేడా లేకుండా పెంచినందుకు అనుభవించే రోజులొచ్చాయి. ఏం మా రోజుల్లో మేమూ చదువుకున్నాం, ఉద్యోగాలు చేసి రిటైర్ లు కూడా అయ్యాం. కానీ అమ్మా, నాన్న వెతికి తెచ్చిన వాళ్ళని చేసుకున్నాం. సంసారాలతో పాటు ఉద్యోగాలు చేసాం కానీ, ఈ మిడిసి పాట్లు లేవు. మాకేం తెలీదా? పిల్ల సుఖపదాలని కోరమా? అన్నీ వాళ్ళకే తెలుసు, మేము దద్దమ్మలం, అనే ఇప్పుడు మిదిసిపాట్లు వచ్చి పెట్రేగి పోతున్నారు' అంటూ కూతురుకి ఒకో సంబంధం తిరిగి పోతున్నప్పుడల్లా ఇంట్లో ఓ యుద్దమే.
అరడజను సార్లు అయ్యేక, అల్టిమేట్టం ఇచ్చేశాను. "ఈ ఏడాది లోగా చేసుకోకపోతే నీ ఇష్టం! ఇంక తరువాత అడగం. మా ప్లాన్స్ మాకున్నాయి. దేశాలు తిరగాలని , గుళ్ళు గోపురాలు చూడాలని, బంధువులందరినీ చూసి పలకరించాలని, ఇన్నాళ్ళు ఉద్యోగ బాధ్యతలయి, కన్నందుకు మీ పెళ్ళిళ్ళు అయి, మీ బాధ్యతలు అప్పగించి వెళ్ళాలను కున్నాం. అన్నయ్య ఏమనకుండా, మేం తెచ్చిన పిల్లని చేసుకొని ముచ్చటగా ఉన్నాడు. ఆడపిల్లవి నీవేమిటి ఇలా కాల్చుకు తింటున్నావు." అంటూ దెబ్బలాడితే "ఇదిగో అదే....'ఆడపిల్లవి' అని అ మాట అంటే ఊరుకోను" అంటూ ఎగురుడు. చాల్లేక తగ్గిపోవడం తమ వంతు.
టైం వచ్చినట్టుంది. ఎవడినో తీసుకొచ్చి "మేం పెళ్లి చేసుకుంటాం" అంది ఆఖరికి. అయన ఈవిడ కొలీగ, యుపిట. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారట. ఇద్దరినీ అన్నీ కుదిరాయిట....అంటే "సరే తల్లీ! ఎవరో నచ్చి మొచ్చింది అదే చాలు!" అన్నట్టు తలాదించారు ఇద్దరూ.
ముప్పై కి చేసుకుంటున్నా సరదాలు ఎందుకు మానుకుంటాం. అని నలభై లక్షలు ఖర్చు పెట్టించి ఫ్రీవేడ్డింగ్ ఫోటోలు మొదలెట్టి, ఐదు రోజులు మెహందీలు, బ్యాచీలర్ పార్టీ, పెళ్లి, రిసెప్షన్ , ప్గైవ్ స్టార్ హోటల్ ఫస్ట్ నైట్, అన్నీ ముచ్చట్లు జరిపించుకున్నారు. డబ్బు పొతే పోయింది గానీ అమ్మాయి కదిలి కాపురానికి వెళ్ళింది, అంతే చాలు అని సంబరపడి , ఓ ఆరునెలలు అమెరికాలో బంధువుల్ని ప్రదేశాల చుట్టి వచ్చి , గుళ్ళూ గోపురాలు విహార యాత్రలు చేసి ఒళ్ళు , పర్సులు నీరసపడి ఇల్లుచేరి సేద తీరేసరికి అమ్మాయి బౌల్ చేసిన బంతిలా ఇంట్లోకి వచ్చి పడింది.
"నన్నేం అడక్కు, ణా మొగుడి గురించి, మా ఇద్దరికీ ఇక సరిపోదు, కలిసి ఉండలేం అంతే!" కుండ బద్దలు కొట్టింది కూతురు.
"అదేమిటి, ఇద్దరికీ నచ్చి కదా చేసుకున్నారు పెళ్లి. అందులో ఆరునెలలు కలిసి తిరిగాక కదా నిర్ణయించుకున్నారు" తల్లి నిలేసింది కోపంగా. "ఇదేమి బొమ్మళ పేళ్లనుకున్నావా? నాలుగు రోజుల ముచ్చట తీర్చుకు వచ్చేయడానికి . ఏం జరిగిందో చెప్పు!"
"చెప్పడానికి ఏమీ లేదు. ఈ మగాళ్ళు పెళ్ళికి ముందు ఒకలా పెళ్ళయ్యాక ఒకలా ఉంటారని తెలియక మోసపోయా" రుసరుస లాడుతూ అంది తల్లి మీద చిరాకు చూపిస్తూ.
"లేకపోతె డ్యూయెట్లు పాడుతూ పెళ్ళికి ముందు తిరిగినట్టు, నీ చుట్టూ నీ కొంగు పట్టుకు ఎల్లకాలం తిరుగుతాడా! బుద్ది జ్ఞానం లేదా? ఇన్నేళ్ళు వచ్చాయి ఇంత చదువుకుని ప్రపంచ జ్ఞానం లేని చంటి పిల్లలా మాట్లాడటానికి? డ్యూయెట్లు పాడుకుంటూ తిరిగితే , కడుపులు నింపడానికి, వేళవేళలా అమ్మలేవరూ వండి పెట్టడానికి ఉండరు. సంపాదించాలి. డబ్బులు తేవాలి. వండుకు తినాలి. ఆర్డర్ కొట్టి దేనికయినా డబ్బులుండాలి అని తెలుసుకో!" విశాలాక్షి కోపం పట్టలేక అరిచింది. "ఏదో చేసుకుని ఉద్దరించావని సంతోషించినంత సేపు లేదు నీ కాపురం.అతన్ని ఇలాగే బాధపెట్టి ఏదో అంటుంటే పోతే ఫో అని ఉంటాడు. నీది అతి తెలివో , తెలియని తనమో అర్ధం కావడం లేదు నాకు. నిన్ను భరించడం ఇంక కన్నవాళ్ళ కి లేదు. కట్టుకున్న వాడికి ఉందని తేలిపోయింది. ఇంక చేస్తావో చేసుకో!" ఓ నమస్కారం పెట్టి లేచి వెళ్ళిపోయింది ఆ కన్నతల్లి.
చూడండి! అమ్మలాగే మీరూ వినకుండానే తప్పు నాదే అంటారా!" నిలేసింది ముభావంగా చూసీ చూడనట్టు తల పేపర్లో కి దూర్చుకు కూచున్న తండ్రిని చూసి కూతురు.
తప్పు మాది, నిన్ను కని, ముద్దుగా పెంచి, ఆడినట్టు ఆడి, చదువుతా నన్నంత వరకూ చదివించి, ఆర్ధిక స్వతంత్యం ఉండాలని ఆదర్శాలు వల్లిస్తూ, నిన్ను ఉద్యోగం చేయించి, ఏదో మంచివాడిని చూసి ఇద్దరూ సంపాదించుకుంటూ ఒకరి కొకరుగా నిలిస్తే మా బాధ్యత తీరిపోతుంది అని వెర్రి కలలు కన్నాం చూడు అది మా తప్పు" తండ్రి పేపర్లోంచి తలెత్తకుండానే ఏ గోడకో చెప్పినట్టు అన్నాడు.
అసలు ఏం జరిగిందో వినకుండానే , కూతురు తిరిగి వచ్చి భారమై పోయిందని మీ బాధ....ఇలాంటి తల్లితండ్రులు ఉండబట్టే ఆడవాళ్ళ బతుకులు ఇలా తగలడ్డాయి!" విసావిసా వెళ్ళిపోయింది.
ఏమి చేద్దాం! అతనితో ఒకసారి మాట్లాడదామా? అసలేమైందో కనుక్కుందామా?" విశాలక్షి అంది.
మాట్లాడే బాధ మీకెందుకు? కట్టుకున్నందుకు నేనే మాట్లాడతా" అని అన్నట్లు అల్లుడే ఫోన్ చేశాడు. ఉపోద్ఘాతాలు ఏమీ లేకుండానే పాయింట్ కీ వచ్చేసాడు. "పెళ్లి అంటే ఇద్దరూ కలిసి ఆనందంగా ఓ ఇల్లు, సంసారం నడుపుకుంటూ, పిల్లల్ని, కని జీవితం పంచుకోవడం అనుకున్నా. కానీ రెండు నెలలకే మీ అమ్మాయి ణా ఊహలు తప్పు అని తేల్చేసింది. సంపాదిస్తున్నందుకు అమ్మాయిలు ఇలా నెత్తికెక్కి అడిస్తారనుకొని నాకు మీ అమ్మాయి పెద్ద షాక్ ఇచ్చింది. అన్నిట్లోనూ వాటాలే! 'చాయ్ నీవు చేసుకో, నీ బట్టలు నీవే ఉతుక్కో , నీకేం కావాలో నీవు వండుకో నాకు తెలీదు. అలిసిపోయాను నాకెపుడూ పని అలవాటు లేదు. 'చేసేద్దూ' అంటూ ముద్దులు గునిస్తే , కొత్త మోజులో పాపం కొత్త అని సరిపెట్టుకున్నా , కానీ అదే రొటీన్ కంటిన్యూ అయిపోతుందనుకోలేదు. మాటకి మాట రెడీగా ఉంటుంది ఆవిడకి. వాదనకి ఓపిక వుంటుంది పనికి ఉండదు. పెళ్లి కాక ముందు సరే పెళ్లి అయ్యాక కూడా తన ఇల్లు తానె చక్క దిద్దుకోవాలనే తపన నెలలు గడిచినా లేకపోతె, భర్త ఓ మాట అంటే స్త్రీ సమానత్వాలు, ఆత్మాభిమానాలు, అంతా ప్రయోగిస్తూ "పెళ్ళికి ముందు కాఫీలు అందిస్తారు. ప్రేమగా ఇది ఇది తిను, అది నీకిష్టం అని తినిపిస్తారు. అది బాగుంది , కాదు అంటే నెక్స్ డే కళ్ళ ముందుకి వచ్చేస్తుంది ఆర్డర్. ఇప్పుడు డబ్బు తగలేసి దుబారా చేసినట్టు కేకలు. ఛ ఈ మొగుళ్ళు ఇంతే, తెలిసి తెలిసి మోసపోయా' అని ఏడుపులు. ఇదంతా ణా తప్పులు కింద లెక్క ఒప్పుకున్నా కానీ అమ్మా నాన్నా వస్తే కప్పు టీ చేసి ఇవ్వడం తెలియని చిన్నపిల్లా! వండి పెడితే, కుర్చీలో మామగారేదుట హాఫ్ ఫాంట్ వేసుకుని ఆయనతో కలిసి తినడం స్త్రీ అభ్యుదయం , స్వతంత్యం అనుకోవాలా? ఈపాటికి మీకర్ధమై ఉంటుంది సంగతి. 'అలా పెంచారు మీ అమ్మాయిని? అని నేను అనలేను. చదువుకుని ఉద్యోగం చేసి అత్తగారిని, మీ ఇంటికి చూసాక, సో మీ అమ్మాయి వెర్షన్ నాకు తెలీదు. నా తరపు నించి ఇది. నా ఓపిక అయిపొయింది. బై "ఫోన్ పెట్టేసాడు అల్లుడు.
