Previous Page Next Page 
భవ బంధాలు పేజి 11


    "ఇదిగో యిప్పుడే చెపుతున్నా , ఆ చదువు సంధ్య లేని పల్లెటూరి మొద్దుని నా కంటగడదామని చూస్తె వూరుకొను. నాన్నకేలా చేపుతావో చెప్పు... నాకు బాగా చదువుకుని , ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి?"
    ఏడిశాడు, వెర్రి వెధవ్వేషాలు వేయవద్దను. దానికేం బంగారం లాంటి పిల్ల....ఏం లోటు వచ్చింది? ఆ వూర్లో హైస్కూలు కంటే తను చదువుకోలేదు.పది పాసయింది. యిక్కడ చదివిద్దామంటే పనిపాట నేర్చుకోనీండి అని నీవే కాలేజీ లో చేర్పించనీయ్యలేదు. కాలోంకరా, కన్నోంకరా , ఎంత బుద్ది, ఎంత వినయం, ఈ కాలం పిల్లల్లా పిచ్చి వేషాలున్నాయా? ఎంత ఒద్దికగా పనిపాట చేస్తుంది. వాడికి కాలేజీ అమ్మాయిల మోజులో ఇది కనబడడం లేదు. మొగుడికి, యింటికి సంసారానికి ఎలాంటి అమ్మాయి వుండాలో వాడికీ వయసులో తెలీదు. యిద్దరూ నోరు మూసుకోండి. నాకు తెలుసు మంచి చెడ్డా..." గట్టిగా అరిచి వెళ్ళిపోయారు అవధాని గారు.
    "వాడు చచ్చినా చేసుకోనన్నాడు తర్వాత మీ యిష్టం" వర్ధనమ్మ అంతకంటే గట్టిగా అరిచింది  వెనకనించి.
    "అయితే చదువు మానేసి ఏదో ఉద్యోగం చూసుకుని యింట్లోంచి పొమ్మను. నా మాట లెక్కలేని వాడికి నా డబ్బు , ఆస్తి ఏమీ దక్కవని చెప్పు" బెదిరించాడు ఉత్తి బెదిరింపు కాదని, ఆ నెల ఇంజనీరింగ్ కాలేజీ  హాస్టల్లో వున్నవాడికీ డబ్బు పంపడం మానేశాడు అయన.
    నిజంగానే సుబ్బలక్ష్మీ ముద్దబంతి పూవులా వుంటుంది. రంగేక్కువ లేకపోయినా కళగా మొహం, పెద్ద జుత్తు, అన్నింటి కంటే వినయం, విధేయత ... అన్నీ అవధాని గారికి ఎంతో నచ్చాయి. దాని ఖర్మ గాలి తల్లి తండ్రీ యిద్దరూ ఒక్కసారి పల్లెలో వున్న అత్తగారికి వంట్లో బాగులేదని చూడడానికి వెళ్లి, సుబ్బులుకి పరీక్షలు, ఒక్కర్తి వుందని రాత్రికి రాత్రి తిరిగి వస్తుంటే బస్సు బ్రేకులు ఫేలయి కాలవలో పడిపోయి చాలామందితో పాటు యిద్దరూ ప్రాణాలు పోగొట్టు కున్నారు. ఒక్క పిల్లని ముద్దుగా పెంచుకున్నారు. నాలుగెకరాల పొలం, తల్లి నగలు అన్నీ వున్నాయి. అదేం దిక్కు దివాణం లేని పిల్ల గాదు. మహారాజు లా యింకేవరన్నా చేసుకుంటారు. కాని యింట్లో పెట్టుకున్నాక, మేనకోడలు ఎంతటి బుద్ది మంతురాలో చూసాక కోడలిగా చేసుకోవాలని నిర్ణయించు కున్నారు అవధాని గారు.
    ఆ నిర్ణయానికి తిరుగులేదని కోడలిని చేసుకున్నారు. కొడుకుని బెదిరించి పెళ్ళాం మాట లెక్క చెయ్యకుండా ఆవిడకి సుబ్బులు మేనకోదలిగా ఏం అభ్యంతరం లేదు. కొడుకుకు నచ్చని పిల్ల కోడలవడం యిష్టం లేదు. కాలేజీ లో క్లాస్ మేట్ వసంత మీద మనసు పడ్డ రామం, చదువు పూర్తీ కాకుండా , ఉద్యోగం లేకుండా ప్రేమ బయటకు చెప్పే వీలులేక తండ్రి వత్తిడి తో నాలుగో ఏడు పరీక్షలవగానే పెళ్ళికి తల ఒగ్గక తప్పలేదు. పెళ్లి చేసుకుని ఆ కోపం, నిరాశా అంతా పెళ్ళాం మీద చూపించేవాడు. ప్రతిదానికి కసరడం, తిట్టడం, అవమానించడం, నలుగురి లో నానా మాటలు అని చిన్నపుచ్చడం-- పాపం సుబ్బులు గుడ్ల నీరు కుక్కుకుని లోపలికి వెళ్ళిపోయేది. తండ్రి ఇంట్లో లేని సమయంలో పెళ్ళాం మీద ప్రతాపం చూపేవాడు. ప్రేమ లేకపోయినా కాస్తంత అభిమానం కూడా కనపరచని భర్త ప్రవర్తన అర్ధం కాక లోలోపల బాధపడేది కాని, పల్లెత్తి ఒక్క మాట అనలేదు.
    పెళ్లి యిష్టం లేని వర్ధనమ్మ కూడా "ఏరేయ్ , యిప్పుడెందుకురా ఆ కోపం, కసుర్లు, తిట్లు, ఏదో పెళ్లి అయింది. సుఖం కాపురం చేసుకో. రోజంతా దాన్నెందుకు తిడతావు." అంది ఆఖరికి ఒకరోజు.
    సుఖంగా కాపురం చేయలేదు. మగాడి ఆసరం కొద్దీ కాపురం చేసి యిద్దరు పిల్లలని కన్నాడు. అక్కడ వసంత పెళ్లి అయిపోయిందని తెలిశాక కాస్త నిరాశ నిస్పృహ తగ్గినా, సుబ్బుల్ని భార్యగా ఆదరించింది ఏనాడు లేదు. పిల్లలు పెద్ద వాళ్లవుతున్నారు. తల్లీ, తండ్రీ రెండేళ్ళ తేడాలో పోయారు.
    కొడుకు పెద్దవాడవుతున్న కొద్దీ తల్లిని తండ్రి ఎంత హీనంగా చూస్తున్నాడో, ఆ కోపం, ఆ అరుపులు, అధారిటీ అది చూసి "ఎందుకమ్మా, అయన అలా అరుస్తారు అన్నింటికీ." చిన్నపిల్లలపుడు అనేవాడు కొడుకు.
    "ఏదో మీ నాన్నకి కోపం ఎక్కువరా, ఏదో అంటారు. వూరుకోడమే విని" అని సర్దిచేపుతూ.
    "నీవలా వూరుకోబట్టే అయన అలా అరుస్తాడు. జవాబివ్వ వెందుకు?" ఇంటర్ చదువుతున్న కొడుకు తల్లిని నిలేశాడు ఒకరోజు.
    "జవాబిస్తే యింకా అరుస్తారు. వూరుకోడం ఉత్తమం" అంత శాంతంగా అంటున్న తల్లిని వింతగా చూసేవాడు కొడుకు.
    "నాన్నా ఎందుకలా అమ్మ మీద అలా అరుస్తారు నెమ్మదిగా చెప్ప కూడదా?" ఒకరోజు ధైర్యం చేసి తండ్రిని నిలేశాడు ఇంజనీరింగ్ చదివే కొడుకు.
    రామ్మూర్తి వింతగా చూసి జవాబివ్వడానికి కాస్త తడబడి , "మొద్దుమొహం ఒక్కటీ సరిగా చేయదు. అరవక ఏం చెయ్యడం?" అన్నాడు చూపు తప్పించి.
    "అమ్మ ఏం మొద్దు మొహం కాదు. మాకు చిన్నప్పుడు ఎంత బాగా చదువు చెప్పేది. అమ్మకన్నీ తెలుసు బాగానే. తెలియనివి వుంటే మీరు ఒకసారి చెపితే తెలుస్తుందిగా!" అన్నాడు పంతంగా వాదించి కొడుకు.
    "నీ కొడుక్కి అంత ధైర్యం ఎలా వచ్చింది. నామీద నేరాలు చెప్పి వాడ్ని నాకు కాకుండా చేస్తున్నావా?' కొడుకు వెళ్ళాక పెళ్ళాం మీద హుంకరించాడు తర్వాత.
    "నే చెప్పడం ఎందుకు? ఇంట్లో చూస్తె తెలియదా? వాళ్ళెం చిన్నపిల్లలు కారు" సుబ్బలక్ష్మీ జవాబిచ్చింది.
    "ఓ, తల్లీ కొడుకులకి చాలా ధైర్యం వచ్చిందే. మాటకి మాట జవాబిస్తున్నారు." పెళ్ళాం మీద ఎగిరినా, యిప్పుడు కొడుకు , కూతురు పెద్దయ్యాక కాస్త తగ్గించుకున్నారు. ధోరణి రామ్మూర్తి. వయసుతో పాటు కాస్త ఆ దూకుడు తగ్గింది.
    సుబ్బలక్ష్మీ నోరెత్తకుండా యింట్లో చేసేచాకిరి , యిల్లు, పిల్లలకి, తనకి ఏది కావాల్సినా, ఉన్నంత లో అమర్చి పెడుతుంటే భార్య పట్ల కాస్త మనసు కరగడం మొదలైంది. రిటైరవడం, అల్లుడు రావడం, కొడుకు ఉద్యోగస్తుడవడం . ఇంతా బయటా అందరూ సుబ్బలక్ష్మీ మంచితనాన్ని పొగిడి, యిల్లాలుగా ఆమె దొరకడం తన అదృష్టం అని బంధుజనం అనే మాటలు, సుబ్బలక్ష్మీ తననుకున్నట్టు మొద్దు గాదు, చదువులో బాగా చురుకని , పుస్తకాలు బాగా చదివిన జ్ఞానం వుందని, పాట చక్కగా పాడుతుందని, అర్ధమైన కొద్ది ఆయనలో ఇదివరకటి చిన్నచూపు తగ్గి కాస్త ఆమె పట్ల సౌమ్యత మొదలైంది. డానికి తోడు కొడుకు పెళ్ళయ్యాక కోడలికిచ్చే మర్యాద, గౌరవం , అభిమానం . తనతో సరిసమానంగా చూసే ప్రవర్తన చూశాక, అమెరికా కొడుకు తనని అసలు లేక్కచేయ్యడం మానేసాక, తల్లితోనే మంచి చెడ్డ మాట్లాడుతూ, అభిమానం కనపరచడం చూసాక, రామ్మూర్తి కి తను వంటరి వాడి నవుతున్న భావన కలిగాక ప్రవర్తన లో మార్పు రావడం మొదలైంది.
    మనవలు పుట్టాక చనువుగా, కలుపుగోలుగా యింట్లో అందరితో మాట్లాడడం, సుబ్బలక్ష్మీ తో సంప్రత్రింపులు చేయడం, సలహాలడగడం కాస్త మామూలు భర్తలా మారడం, ఆ మాత్రానికే సుబ్బలక్ష్మీ గతం మరిచి భర్తతో ముభావంగా కాక మనసు విప్పి మాట్లాడేది. పిల్లలు అమెరికా వెళ్ళాక యిద్దరూ వంటరి వాళ్ళయి ఒకరికొకరవక తప్పలేదు.
    యీ కరోనా వచ్చాక ఆయనలో ఒకరకం భయం , తనకేమన్నా అయితే కొడుకుండీ రాలేడు. దిక్కెవరు, సుబ్బలక్ష్మీ కేదన్నా అయితే యిల్లు గడిచేదెలా అన్న ఆలోచనలు చుట్టూ ముట్టసాగాయి. డెబ్బై ఐదేళ్ల వయసులో తనకి భార్య కంటే దిక్కెవరు , ఆమె కంటే ఇంకెవరు అన్న జ్ఞానోదయం కలిగింది ఆయనలో....
    
                                     *    *    *
    "చాలా ఆలస్యంగా అయింది నీకు జ్ఞానోదయం నాయనా, ఆ ఆమాయకురాలు నిన్ను క్షమించినా, నేను క్షమించలేను' అన్నట్టు దేముడే పెద్ద శిక్ష వేశాడు ఆయనకి.
    తెల్లారి ఆరుగంటల కల్లా నిమ్మకాయ వేడి నీళ్ళు తెచ్చే భార్య ఆరున్నర అవుతున్నా లేవకపోయేసరికి , ఫోను చేసినా తీయక పోవడంతో తలుపు తీసుకుని బయటికి వచ్చిన అయన భార్యని శవంగా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోని అయన స్థాణువై పోయారు. మనిషి నిలువెల్లా వణికిపోయారు.
    "నానీ, మీ అమ్మ....మీ అమ్మ యింక లేదురా.." నిలువెల్లా వణికిపోతూ రుద్ద కంఠంతో ఫోనులో అన్నారు.
    ఒక్క క్షణం అటు నిశ్శబ్దం  తరువాత "అమ్మా!" అన్న కేక. "ఏమయింది అమ్మకి...ఎలా?"
    "తెలీదురా , రాత్రి ఎప్పుడు జరిగిందో ...తెల్లారి చూస్తె....అంబులెన్స్ పిలిస్తే అప్పటికే ప్రాణం లేదన్నారు...ఇరుగు పొరుగు ఎవరూ తొంగి చూడనన్నా లేదు. నేను ఒక్కడిని...ఏం చెయ్యను...నేనేం చెయ్యాలి ...యింత దగా చేస్తుందని...." బావురుమన్నాడాయన.
    "సుఖపడింది." వినిపించీ వినపడనట్టు గొణిగాడు కొడుకు. "ఏం చేస్తారు? మేము రాలేము. కొడుకుగా అమ్మకి తలకొరివి పెట్టె అదృష్టం నాకు లేదు. ప్లయిట్ లు లేవని తెలుసుగా....మీరే ఎలాగో అగ్ని సంస్కారం చేయండి. ఇక్కడ నేను తెల్సిన పురోహితుడున్నాడు. మిగతా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను... కొడుకు ఫోన్ పెట్టేశాడు.
    ఆ తెల్లారిన ఉదయంలో తన బతుకే తెల్లారిపోతుందని గుర్తెరగని రామ్మూర్తి గారు వంటరిగా భార్య శవం దగ్గర కూర్చుని "ఏమిటే యిలా చేశావు? నేను ఏం చెయ్యాలి. యిలా వదిలి వెళ్ళిపోయావేమిటి...చెప్పనైనా చెప్పకుండా యిలా దగా చేసేవేమిటి...."
    "వదిలి పోవాలని పోతానని సుబ్బులేనాడు అనుకోలేదు. మూడు నాలుగు రోజులుగా కాస్త నలతగా వుంటే మూడు నెలలుగా పనిమనిషి లేదు. ఇంటెడు చాకితి, వంట. ఆయనకి వేళవేళకి అన్నీ అందించడం అలసట అనుకుంది. నడిస్తే, పనిచేస్తే ఆయాసం అనిపించినా, అదంతా పని ఎక్కువై అనుకుంది. అంతకు ముందే నాలుగైదు రోజులుగా నిశ్శబ్దంగా శరీరంలోకి ప్రవేశించిన కరోనా సుబ్బలక్ష్మీ కి కాస్త అనుమానం వచ్చేసరికి చేరాల్సిన చోటికి చేరిందని, మందులవి వేసుకోకపోవడంతో విజ్రుంభించి చుట్టూ ముట్టింది. ఇంకో రెండు రోజుల్లో అయన టెస్ట్ అయి బాగయిందంటే అపుడు చెపుదాం . యిప్పుడు తను చెపితే భయపడతారు. తను మంచం ఎక్కితే యిన్నాళ్ళు పడిన శ్రమ వృధా....ఓ రెండు రోజులు ఒర్చుకుందాం అనుకుంది. అనుకున్నవి జరగడం మనిషి చేతిలో లేదని సుబ్బలక్ష్మీ కి తెలియకుండానే జరగాల్సింది జరిగింది.
    భార్య, తన తోడు నీడ అని తెలుసుకునేవేళకి యిదే నీ శిక్ష అన్నట్టు దేముడు నిర్ణయం...."ఏమిటే, ఎలాగే, వంటరిగా నేనెలా బతకాలె ...నన్నిలా వదిలి వెళ్ళిపోయావేమిటే...." భార్య గుండెల మీద చిన్నపిల్లాడి లా వెక్కుతూ ఏడ్చారు రామ్మూర్తి- అంబులెన్స్ వచ్చేవరకు ఓదార్చే వారే కరవయ్యారు ఆయనకి.

                                    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS