Previous Page Next Page 
భవ బంధాలు పేజి 10


                         విలువలు తెలిసేది
    

రిజల్ట్ పాజిటివ్.....ఒక్క నిమిషం గుండె ఝల్లు మంది. తరువాత నీరసం, వళ్ళంతా చెమటలు....భయం, ఆందోళన....రిపోర్టు కాగితాలు మరోసారి చదువుకున్నా అదేవార్త ....అనుమానించిందే . అనుకున్నదే. భయపడిందే . అయినా ఏదో చిన్న ఆశ ....అయి వుండదేమోలే....
    "యిక్కడ మందులవి ఏమన్నా రాస్తారండీ........" రిపోర్ట్ కాగితాలు యిచ్చిన అతన్ని అడిగాడు రామ్మూర్తి.
    "లేదండీ ఎవరైనా డాక్టరు గారికి చూపిస్తే చెపుతారు......"చాలా బిజీగా వున్నా, అన్నాడాబ్బాయి."
    కాగితాలు బ్యాగులో పెట్టుకుని నెమ్మదిగా బయట పడి, అటో ఎక్కారాయన.
    ఒంటి గంటన్నరయినా రాని భర్త కోసం ఓ పక్క ఆకలి, 'యింకా రాలేదు ఏమయ్యారు, ఫోను చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది ఎక్కడున్నారో ఏమయిందో, నేనూ వస్తానంటే వద్దన్నారు' ఆందోళనగా అనుకుంది సుబ్బలక్ష్మీ.
    గేటు చప్పుడు విని ఆరాటంగా గుమ్మం లోకి వెళ్ళింది. వాడిన మొహంతో నీర్సంగా అడుగు వేసుకుని వస్తున్న రామ్మూర్తి చేతిలో బ్యాగు అందుకోబోయింది . అయన ...చేయి వెనక్కి లాక్కునిఒ "అడ్డులే....లోపలికి వెళ్ళనీ" కసిరికొట్టి అని, లోపలికి వెళ్లి, మంచి నీళ్ళియ్యి" అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు.
    నీళ్ళు పట్టుకొచ్చి యివ్వ బోతుంటే "అక్కడ పెట్టు . ఇదిగో చూడు, నాకు పాజిటివ్ వచ్చింది. గదిలో కింక రాకు."'    "అదేమిటి ...మరిఎలా?' ఆందోళనగా అంది సుబ్బలక్ష్మీ.
    "చెప్పేది విను. నాకు భోజనం, కాఫీ, టిఫిన్ అన్నీ యిక్కడే గుమ్మం దగ్గర పెట్టు. భోజనం అది యిదిగో యీ ప్లేట్లో పెట్టు. నేనీ గదిలోనే వుండాలి పదిహేను రోజులు" అంటూ డిస్పోజబుల్ ప్లేట్లు, అవి వున్న పాకెట్టు టేబుల్ మీద పెట్టి 'అవి తీసుకో, పది నిమిషాలాగి భోజనం పట్టుకొచ్చి బయట స్టూలు వేసి పెట్టి వెళ్ళు. ఏం మాట్లాడాలన్నా ఫోనులో మాట్లాడు. అస్తమాను గది వైపు రాకు. నా కాఫీ గ్లాసు అవీ నేను కడుక్కుంటా. మంచి నీళ్ళు కూడా పట్టుకొచ్చి అన్నీ గుమ్మం దగ్గిరే, ణా ప్లేటు అవి నేను ఓ బ్యాగులో పడేసి బయట పారేస్తా....అర్ధమైందా? యింక వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కు వస్తా. అన్నం పట్రా " తలుపులు వేసుకోబోతుంటే "డాక్టరేమన్నారు? మందులవి చెప్పారా?" ఆరాటంగా అడిగింది.
    "అన్ని అయన ఫోనులో చెపితే కొనుక్కు తెచ్చుకున్నా నాకు కావాల్సిన మందులు, అన్నీ తెచ్చుకున్నా. పదోహేను రోజలు గదిలో వుండి ఎవరితో కలవద్దన్నారు. నీవు ఆ రెండో రూములో పడుకో, మాస్క్ వేసుకో."
    "మరి మీకు నీరసం, జ్వరం.....వంటరిగా ఎలా వదిలేయాలి?"
    "వదలక ఏం చేస్తావూ? సపర్యలు చేసి నీవూ రోగం తెచ్చుకుంటే మనకి చేసేదెవరు....నీవన్నా ఆరోగ్యంగా వుంటే గదా ఇల్లు నడుస్తుంది. నా సంగతి నేను చూసుకుంటా . నీవు జాగ్రత్తగా వుండు. వూరికే నన్ను విసిగించకు....ఏం కావాలన్నా అస్తమాను పిలవకు ఫోనులో చెప్పు..." అయన తలుపులు మూస్తూ అన్నారు.

                                  *    *    *
    "నానీ నాన్నకి కరోనా పాజిటివ్ వచ్చిందిరా, నాకు కాళ్ళు , చేతులు ఆడడం లేదు. వంటరిగా నేనేం చెయ్యగలను రా? ఎవరూ ఎవరింటికి రావడానికి లేదు...." వణుకుతున్న గొంతుతో అమెరికా లో వున్న కొడుక్కి ఫోను చేసి అంతా చెప్పింది సుబ్బలక్ష్మీ. ఒక్క క్షణం అటు నిశ్శబ్దం.
    "ఓ గాడ్, సరే అమ్మా! నీవనసరంగా భయపడకు. నాన్నగారు మందులవీ, జాగ్రత్తగా వేసుకుంటారు. అయన ఆరోగ్యం విషయం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరులే. ఆయన్ని ఆ గదిలో వుండనీ నాన్న చెప్పినట్లు నీవన్నీ వేళవేళకీ అందించు. ఈ రోగానికి దూరం పాటిస్తూ మండులవి వేళకి వేసుకుని, ఆవిరి పట్టి , వేడినీళ్ళ తో గార్గిల్ చేయడం లాంటివన్నీ చేస్తే తగ్గిపోతుంది. నీవేం గాభరా పడకు , మందులవి   తెచ్చుకున్నారుగా. నీవు జాగ్రత్తగా దూరం వుండు....యిప్పుడెవరూ వచ్చే పరిస్థితి లేదు నీకు తెల్సుగా , జాగ్రత్తగా వుండండి. ఫోను చేస్తాలే రోజూ...." అంతకంటే చేయగలిగింది ఏముంది అని సుబ్బలక్ష్మీ సరి పెట్టుకుంది.
    నాలుగు రోజులు వళ్ళునొప్పులు, కాస్త జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి - మందుల ప్రభావం అన్నీ కలిసి వేళవేళ కింత తిని , మండులేసుకుని, మగతగా పడుకునేవారు. తెల్లారి వేడి నిమ్మకాయ నీళ్ళు, మరో అరగంట కి కాఫీ, వేళ పట్టున టిఫిన్లు, భోజనం లో నోటికి హితవు గా అయన చెప్పిన కూరలు. రాత్రి తేలిగ్గా అరిగే భోజనం. వేళవేళకి అందిస్తూ....గుమ్మం ముందు పెట్టి తలుపు తడితే వచ్చి తీసుకోడం. తనేల్లెవరకూ తలుపు తీయకపోవడంతో ఎలా వున్నారో చూద్దామన్నా వీలుకాక "మరేం ఫరవాలేదు, తలుపు తీయండి. నాలుగు రోజులయింది" చూడనీయండి కాస్త ఎలా వున్నారో" సుబ్బలక్ష్మీ ఆరాటంగా అన్నా "ఏముంది ణా మొహం చూడడానికి వద్దు , డాక్టరు చెప్పారు..." అంటూ కొట్టి పారేశాడాయన."
    నాలుగో రోజు కాస్త మందులు పనిచేసి జ్వరం , గొంతు , వళ్ళు నొప్పులు తగ్గి తేలికగా వున్నట్లనిపించింది. మందులు పని చేశాయి. కాస్త సుళువుగానే వుంది" అన్న అయన మాటకే సంతోషపడి, "పోన్లెండి ఏదో మరో పది రోజులు జాగ్రత్తగా వుంటే సరిపోతుంది." నిశ్చింతగా అంది.
    మర్నాటి కల్లా పూర్తిగా తెరుకున్నట్టు వళ్ళు తేలికగా వుండి, శారీరకంగా సరే, మానసికంగా ధైర్యం వచ్చేసింది ఆయనకి. వేడివేడి నీళ్ళు పోసుకుని, తిన్న యిడ్లీ రుచికరంగా అనిపించి, మామూలు రొటీను గా పేపరు చదువుకుని విశ్రాంతి గా టి.వి చూసుకున్నారు. మానసుకి ప్రశాంతత కుదిరింది. ఫరవాలేదు. ఇంకో పది రోజులు గడిపేస్తే తగ్గిపోతుంది.
    "సుబ్బులూ నాకివాళ బాగుంది. తగ్గిపోయింది....కాస్త పరమాన్నం చేస్తావా తినాలనుంది..." సంతోషం ధ్వనించింది అయన గొంతు. అది విని సుబ్బలక్ష్మీ సంబరంగా "అమ్మయ్య....ఎంత బెంగ పడ్డాననుకున్నారు. ఈ వారం రోజులు పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెడతాను" అంది.
    "తలుపులు తీయకూడదు.. మరీ మొహాలు చూసుకోకుండా."
    "వద్దు...వద్దు....పదిహేను రోజులు జాగ్రత్తగా వుండి, నెగటివ్ వచ్చిందో లేదో టెస్ట్ చేయిన్చుకున్నాక బయటికి వస్తాను. ఇది నీ కోసమేనే. నీకు వస్తే యిల్లెలా గడుస్తుందే...."
    "సరేలెండి....మందులు యింకా వేసుకోవాలేమో అశ్రద్ధ చేయకండి" సుబ్బలక్ష్మీ అంది.

                                    *    *    *
    ఆరోగ్యం కాస్త చక్కబడి ప్రశాంతత చిక్కిన దగ్గిర నించి రామమూర్తి గారి ఆలోచనలు సుబ్బలక్ష్మీ చుట్టూ తిరుగుతున్నాయి. తనకేదన్నా అయితే పాపం దాని గతి ఏమిటి? వట్టి పిచ్చి మొద్దు. దానికి మొగుడు, పిల్లలు, సంసారం తప్ప వేరే ప్రపంచం లేదు. వంటిల్లు, చాకిరీ యే డానికి కాలక్షేపం. పెళ్ళయిన ఏభై ఏళ్ళల్లో మొదటిసారి పెళ్ళాం గురించి సానుభూతి గా అయన ఆలోచించారు. వేళవేళకి ఎలా చేసి పెడ్తుందో , కసిరినా, తిట్టినా, కోప్పడినా, ఏనాడు తిరగబడి ఒక్కమాట అన్నది లేదు. తాను లేకపోతె దానికేం తెలుసు? పిల్లలిద్దరూ అమెరికాలో వున్నారు. ఏ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు సానుభూతి తప్ప ఏం చేస్తారు సాయం....అలా నిద్రపట్టని టైం లో సుబ్బలక్ష్మీ గురించి ఆలోచన మొదలయ్యేది....
    "ఏమిటమ్మా, నాన్న మతుందే మాట్లాడుతున్నారా? సుబ్బుల్ని నే పెళ్లి చేసుకోడం ఏమిటి..." ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రామం తల్లి దగ్గిర ఎగిరి పడ్డాడు.
    "ఏమో నాయనా , ఆయనగారికి ఆ మేనకోడాలంటే పిచ్చి అభిమానం. ఆ చెల్లెలు, బావ యాక్సిడెంట్లో పొయిం దగ్గిర నించి దిక్కు లేనిదని తెచ్చి యింట్లో పెట్టుకున్నారు. సరే, తల్లి తండ్రి లేరు, మామయ్య ఆదుకోవాలి సరే, యింట్లో ఆడపిల్ల లేదు. చేతికిందకి వుంటుందనుకున్నా . యిలా తల మీద ఎక్కిస్తారని నేనెలా అనుకుంటా. ఏదన్నా అంటే నా నోరు మూయిస్తారు. ఎదురు చెప్పే వీలుందా ఆయనకి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS