"అరే నేను పాసయానురా. నాకు కంగ్రాట్స్ చెప్పవా?"
"సారీరా... వెరీ సారీ. ఎనీవే కంగ్రాచ్యులేషన్స్."
"థాంక్యూ చెప్పు ఇంతకీ ఏం జరిగింది? కోపంగా వస్తున్నావు. ఎవరేమన్నారు?"
"ఏం లేదురా. ఏం లేదు."
"నాకు తెలుసులే. అర్చన గురించేనా నీ బాధ!"
"ఆ... అర్చన... నీకూ తెలుసా?"
"నాకేంటి? మొత్తం యూనివర్శిటీకి తెలుసు. షి బికేమ్ ఎ పబ్లిక్ ఫిగర్."
వేణుకి ఏడుపొచ్చినంత పనైంది. రుద్ధమైన కంఠంతో అన్నాడు. "ఎవర్రా? ఎందుకు చేశార్రా అలా? నా అర్చన ఎవరికేం అపకారం చేసింది?"
"అయినా ఆమెది కూడా తప్పే! తనో పెద్ద వీరనారీమణి ననుకుంటుంది. తనేదో పెద్ద అసాధారణ యువతి ననుకుంటుంది. వాళ్ళు కాఫీకి పిలవగానే వెళ్ళడమేనా? పోనీ వెళ్ళితే వెళ్ళింది. ఎప్పుడూ తోకలా తిప్పుకునే అమలని కూడా తీసికెళ్ళకుండా ఒక్కతే వెళ్ళింది. వాడు వెధవని తెలుసు కదా! ఏదో ఉద్దరించేశానని, తను క్లాసు పీకగానే వాడేదో మారిపోయి మహోత్తముడై పోయాడని నమ్మింది. ఏం జరిగింది? అందుకే ఆడవాళ్ళకంత ధైర్యం పనికిరాదనేది."
"విక్రాంత్! ప్లీజ్ స్టాపిట్" వేణు దవడలు బిగుసుకున్నాయి.
"మీరంతా తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి, ఇలా చిత్రహింస పెట్టారా?"
"బాగుంది. మనకేం అవసరం? వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు. ఆమె వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసింది. కేసు ఇప్పుడు కోర్టులో ఉంది."
"వాళ్ళని అరెస్టు చేశారా లేదా?"
"చేశారు. జామీను మీద వాళ్ళ వాళ్ళు విడిపించుకుని వెళ్ళారు."
"ఎలా? ఎలా జామీను ఇస్తార్రా అలాంటివాళ్ళకి?" ఆవేశంగా అడిగాడు వేణు.
"ఇది ఇండియా బాబూ! ఇక్కడ అన్నీ సాధ్యాలే."
"నాన్సెన్స్" కసిగా అన్నాడు. అతని రక్తం మరుగుతున్నట్టుగా అనిపించింది. జామీను మీద విడిపించారా? అసలు అవతలివాడు నేరం చేశాడని, ఆ విక్టిమ్ వెళ్ళి చెప్పగానే వాడికి శిక్ష వేయాల్సింది పోయి, ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు?
"ఏంటిరా? అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావేంటి?" విక్రాంత్ వేణు భుజం తట్టాడు.
వేణు ఏం మాట్లాడకుండా కొద్దిసేపలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. తరవాత సన్నగా నిట్టూరుస్తూ "సరే నువ్వెళ్ళు. నేను అర్జంటుగా వెళ్ళి అర్చనని చూడాలి" అన్నాడు.
"నీకేం పిచ్చా? ఇంకా దానిమీద ప్రేమేనా? చెడిపోయిందిరా!"
"షటప్" గట్టిగా అరిచాడు వేణు. విక్రాంత్ అయోమయంగా చూశాడా అరుపుకి.
వేణు తమాయించుకుంటూ అన్నాడు. "విక్రాంత్ తప్పు. అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇదే మన అక్కలకో, చెల్లెళ్ళకో జరిగితే ఇలాగే అంటామా?"
విక్రాంత్ మొహం జేవురించింది. "ఛ, ఛ మా అక్కలు, చెల్లెళ్ళు ఇలా అర్చనలాగా బరితెగించి తిరగరు. అలా జరగదు కూడా" అంటూ బండి స్టార్ట్ చేసి, గేటు లోపలికి పోనిచ్చాడు.
వేణుకి పట్టరాని కోపం వచ్చింది. కానీ, ఏమనలేకపోయాడు. పాపం అర్చన ఎంతమందితో ఎలాంటి మాటలు పడాల్సి వచ్చింది అనుకుంటూ బాధగా రోడ్డు మీదకి నడిచి, కాస్సేపు రోడ్డు మీదే అస్థిమితంగా తిరిగాడు. కొంచెం సేపు తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా గబగబా ముందుకు నడిచి ఖాళీగా వెళ్తోన్న ఆటో పిల్చాడు. యానివర్శరీ రోజున అర్చన బండి వెనకాల ఆమెని అనుసరిస్తూ వెళ్ళిన దారి గుర్తుకు తెచ్చుకుంటూ ఆటోవాడికి ఎక్కడికి వేళలలో చెప్పి, ఆటో ఎక్కడు. మరో రెండు నిమిషాల్లో వేణు కూర్చున్న ఆటో అర్చన ఇంటివైపుగా కదిలింది.
తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని బైటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తోంది. అందమైన అర్చన, చలాకీగా మొత్తం కాలేజీని ఒక్కటి చేసిన అర్చన, ఎందరికో ఆరాధ్యదేవత అర్చన శోకమూర్తిలా కూర్చుంది. ఆమె ఆత్మవిశ్వాసం మీద పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఆమె గుండెని ముక్కలు చేసింది. ఆ దెబ్బ ఆమె భవిష్యత్తుని నిలువునా కూల్చేసింది. ఆమె ఆశలు, ఆశయాలు, కోరికలు అన్నీ ఆ ఒక్క సంఘటనతో విచ్చిన్నం చేయబడ్డాయి. సంప్రదాయాలకు, పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే సావిత్రమ్మ, ఆనందరావులు అర్చనని గుమ్మం కదలనివ్వడం లేదు.
జరిగింది నిజానికి ఏమీ లేదు. కానీ, జరక్కూడనిధి జరిగిందన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ, తననీ బాధపెడుతున్న తల్లిదండ్రుల ఉద్దేశం ఏమిటో, తన భవిష్యత్తుని ఎలా నిర్ణయించబోతున్నారో అర్చనకి అర్ధం కావడం లేదు. నాగరాజు చెరనుంచి బైటపడిన మరుక్షణం నుంచి తనకి ఇల్లు ఒక జైలు అయిపోయింది. దెబ్బలాడి, అరిచి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ రికార్డు చేసుకుని, ఎఫ్ ఐ ఆర్ రాసుకుని కూడా నాగరాజుని పోలీసులు ఏమీ చేయలేక పోయారు. కనీసం తను మళ్ళీ వెళ్ళి ఏం జరిగిందని కూడా అడిగే అవకాశం లేకుండా తన చుట్టూ కంచె కట్టేశారు. ఎవరూ రావడం లేదు. తానెక్కడికీ వెళ్ళడం లేదు. ఏం చేయాలో, ఎలా చేయాలో ఆమెకేం అర్ధం కావడం లేదు.
తన చుట్టూ చేరి అర్చనా, అర్చనా అని పిలిచే స్నేహితులంతా తనని వెలివేశారు. చెల్లెలి తెలివితేటలు, చలాకీతనం భరించలేని అన్నగారు కిరణ్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. కిరణ్ కి చదువబ్బలేదు. అతికష్టం మీద బికాం పూర్తిచేసి, రియల్ ఎస్టేట్ బిజినెస్ తో కుస్తీ పడుతూ, లేస్తూ సరిగ్గా నిలబడలేని కిరణ్ కి ఇప్పుడు చెల్లెలికి జరిగిన ఒక అవమానం ఆనందం కలగజేస్తోంది. ఆ అవమానంతో ఆమె తనకన్నా పైకి ఎదిగే అవకాశం కోల్పోయిందన్న ఆనందం అతడిని నిలవనివ్వడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆడదానికి అంత ధైర్యం పనికిరాదు. నీ ధైర్యమే నిన్ను మోసం చేసింది చూశావా? ఏం జరిగిన జరక్కున్నా పరాయిమగాడి చెరలో రెండు రోజులుండి వచ్చిన నీకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో అర్ధం అయిందా? అంటూ ప్రతిక్షణం దెప్పి పొడుస్తూనే ఉన్నాడు.
ఇప్పటికి ఇంట్లో నాలుగు గోడల మధ్యనే ఉండి పదిరోజులైంది. ఇవాళో, రేపో రిజల్ట్స్ రావాలి. తప్పకుండా తనకి ఫస్ట్ క్లాస్ వస్తుంది. పి.జి.కి అప్లై చెయ్యాలి. పిజి అయ్యాక, అయ్యాక కాదు, ఈ లోపలే సివిల్స్ కి ప్రిపేర్ అవాలి. ఐఏఎస్ అవాలి. అయి తీరాలి. అర్చన కిటికీలోంచి పెరట్లోకి చూసింది. తనచేతుల మీదుగా నాటబడి, ఏపుగా ఎదిగి కాపుకి సిద్దంగా ఉన్న మామిడిచెట్టు, నిండుగా కాయలతో బరువుగా వంగిన జామచెట్టు కొమ్మలు, గాలికి సుతారంగా కదులుతున్న గులాబీలు, చామంతులు, కనకాంబరాలు నేలమీద పరిమళాల పానుపు వేస్తున్న పారిజాతం. తన భవిష్యత్తు ఈ తోటలా కళకళ్ళాడుతుందా? దుఃఖం ఎగదన్నుకు వచ్చింది.
