నిజంగానే వేణు గుండెల్లో బాంబులు పేలుస్తున్నట్టుగా ఉంది చక్రవర్తి అలా చెపుతోంటే. అర్చన అమాయకురాలు. తను చాలా తెలివైందాన్ని అనుకుంటుంది. కానీ, అందర్నీ నమ్ముతుంది. ప్రతి వాళ్ళకీ తనేదో చాలా తెలివైనదానిలా నీతిసూక్తులు చెబుతూ ఉంటుంది. అవి విన్నవాళ్ళు కొందరు ఆమె వెనకాల నవ్వుకోవడం తనకి తెలుసు. ఎన్నోసార్లు ఆమెకి చెప్పాలనుకున్నాడు అందర్నీ నమ్మద్దని, ఎవరు పిలిస్తే వాళ్ళతో ఎక్కడికీ వెళ్ళద్దని, అందరితో మాట్లాడద్దని. కానీ, ఆమె తనని అపార్ధం చేసుకుంటుందని ఊరుకున్నాడు. అలాంటిది.... అలాంటిది...... ఇంత దారుణం....అర్చన తన ప్రేమని తిరస్కరించినా, తనని అవమానించినా తను ఆమెని ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు.
వేణు ఇంక ఆలోచించదల్చుకోలేదు. ముందు అర్చన ఎలా ఉందో ఒక్కసారి చూడాలి. గబగబా స్నానానికి వెళ్ళిపోయాడు.
త్వరత్వరగా స్నానం ముగించి, నలిగిన బట్టలతోటే బైటికి వచ్చాడు. ముందు ఎటు వెళ్ళాలో అర్ధం కాలేదు. అర్చన ఇంటికి నేరుగా వెళ్ళేకన్నా, కాలేజీకి వెళితే ఇంకే ఏమన్నా వివరాలు తెలుస్తాయని ముందుగా కాలేజీకి బయలుదేరాడు. చక్రవర్తి ఎక్కడికి అని వెనకాల అడుగుతున్నా వినిపించుకోలేదు.
అతను కాలేజీకి వెళ్ళేటప్పటికి స్టూడెంట్స్ గుంపులు, గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. అందరి మొహాల్లో ఆనందం, ఆందోళన, ఏదో హడావుడి కనిపిస్తోంది. వాళ్ళందరినీ అలా చూడగానే వేణు గుండెల్లో రైళ్ళు పరిగెత్తినట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అనుకుంటూ లోపలికి నడిచాడు. అతడిని చూస్తూనే వేణుకి సన్నిహితులైన మిత్రులు కొందరు గబగబా అతని దగ్గరకు వచ్చి చేయి అందుకుని గట్టిగా ఊపుతూ "వేణూ! కంగ్రాట్స్" అని అరిచారు.
"ఎందుకు?" అయోమయంగా చూశాడు వేణు.
"రిజల్ట్స్ వచ్చాయిగా. చూసుకోలేదా? ఫస్ట్ క్లాస్ వచ్చింది నీకు."
వేణు మొహంలోకి సర్ మని దూసుకొచ్చిందో క్షణం ఆనందం. ఒక స్టూడెంట్ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ లాక్కున్నాడు. జేబులోంచి పాకెట్ సైజ్ డైరీ తీసి ఏదో నంబరు కోసం వెతికాడు.
"ఏంట్రా? మా మాటలమీద నమ్మకం లేదా? డైరీ తీశావు."
"కాదురా! వాడి నెంబరు కోసం కాదు. ఇంకెవరో ఆత్మీయుల నెంబరుకోసం చూస్తున్నట్టున్నాడు" ఇలా అందరూ తలోమాట అంటుండగానే వేణు తనకి కావలసిన నెంబరు వెతికి, డైరీ జేబులో పెట్టుకుని, పేపర్ లో ఆ నెంబరు కోసం చూశాడు. కొన్ని క్షణాల్లో అతని మొహంలో కాంతి నిండింది.
వేణు మొహంలో ప్రతిఫలిస్తున్న ఆనందం చూసిన ఒక స్టూడెంట్ అడిగాడు "ఏంటిరా అంత ఆనందం? ఎవరి నెంబరు? అర్చనదేనా?'
వేణు నవ్వుతూ అన్నాడు "అవును అర్చన కూడా ఫస్ట్ క్లాస్ లో పాసైంది."
"లాభమేముంది? అర్చన పాసైనా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే! లైఫ్ లోనే ఘోరంగా ఫెయిల్ అయింది. పరీక్షదేం ఉంది? ఇంక ఆమెకి భవిష్యత్తు లేదులే వేస్ట్."
వేణు రక్తం కుతకుత ఉడికింది. మొహంలో ఆనందం ఆవిరిలా మారింది. కళ్ళు చింతనిప్పుల్లా అయాయి.
"ఏం? ఏమైంది? అర్చనకేమయింది?" ప్రాణాలు ఉగ్గబట్టుకుని అడిగాడు.
"నీకు తెలీదా? చెడిపోయింది."
"షటప్" తీవ్రంగా అరిచాడు వేణు.
"నిజం చెపితే అంత కోపం దేనికిరా? నిజంగానే ఆమె చెడిపోయింది. గ్యాంగ్ రేప్ చేశారు నాగరాజు అండ్ పార్టీ."
వేణు కోపం దుఃఖంలా మారింది. వణికే స్వరంతో అన్నాడు. "ఏం...ఎందుకురా? తను వాళ్ళకేం అపకారం చేసింది? ఎందుకు చేశారలా? ఎప్పుడు జరిగింది? ప్లీజ్ చెప్పండిరా. అర్చన ఇప్పుడెలా ఉంది?" ఒక కుర్రాడి షర్టు కాలర్ పట్టుకుని గట్టిగా ఊపుతూ ఆవేశంగా అడిగాడు.
అతను షర్టు విడిపించుకుని సర్దుకుంటూ "నాగరాజుగాడు లవ్ లెటర్ రాశాట్ట. అర్చన మామూలుగానే వాడి మొహం మీద కూడా ఆ లెటర్ చింపి ముక్కలు విసిరేసి, 'అద్దంలో మొహం చూసుకున్నావా ఎప్పుడన్నా? నీ మొహం నాకు లవ్ లెటర్ రాయమని చెప్పిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకో' అంటూ తిట్టి వెళ్ళిపోయిందట. వాడు ఆ దెబ్బతో తనమీద పగపట్టాడు."
"పగా! పగబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాడా? వాడ్ని... వాడ్ని... ఎక్కడున్నాడు వాడు?"
"ఏం చేస్తావు? వాడి తండ్రి పొలిటికల్ లీడర్. పైగా రూలింగ్ పార్టీ. వాడితో తగవు పెట్టుకోగలవని నమ్మకం నీకుందా?"
"ఏం? పొలిటికల్ అయితే ఆడపిల్లల జీవితం నాశనం చేయడానికి వాడికి లైసెన్స్ ఇచ్చారా?"
"అది కాదులే గానీ, వాడు మళ్ళీ అర్చనకి సారీ చెప్పాట్ట."
"సారీనా? అర్చన క్షమించిందా?"
"తెలియదు.క్షమించిందో, ఆమె కూడా వాడి మీద పగబట్టి డిప్లమేటిక్ గా వాడి అంతం చూడాలనుకుందో కానీ వాడు వెళ్ళి 'సారీ అర్చనా ఇవాళ్టినుంచి మనం బ్రదర్స్ అండ్ సిస్టర్ లా ఉందాం. మన అనుబంధానికి గుర్తుగా టీ పార్టీ చేసుకుందాం' అంటూ హోటల్ కి ఆహ్వానించాట్ట."
"అలాగా? అర్చన వెళ్ళిందా?"
"వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి? తప్పు ఆమెదే కదా పైగా ఒక్కతే వెళ్ళింది. వాడు రోగ అని తెలిసి కూడా వెళ్ళింది. వాడు కాఫీలో మత్తుమందు కలిపిచ్చి...."
వేణు చెవులు మూసుకుంటూ అన్నాడు "పార్టీ ఎక్కడిచ్చాడు?"
"తెలియదు."
వేణు పళ్ళు పటపట నూరుకున్నాడు. రాస్కెల్ వాడి అంతు చూస్తాను.
"నువ్వేం చూడక్కర్లేదు. ఆవిడగారు కోర్టెక్కింది."
"ఏంటి? అర్చన కేసు పెట్టిందా?" ఆశ్చర్యంగా అడిగాడు వేణు.
"అవును. వాడ్ని జైలుపాలు చేసిందాకా, నిద్రపోనని పంతం పట్టిందిట."
వేణు మొహంలో ఆశ్చర్యం ఆనందంగా మారింది. "మంచిపని చేసింది. వాడిని నగరం నడిమధ్యలో ఉరి తీయించాలి. అలా చేస్తేగానీ మరెవారూ ఇలాంటి పని చేయరు" అంటూ అక్కడినుంచి వేగంగా ముందుకు నడిచాడు. అతని స్నేహితులంతా "వేణూ! ఎక్కడికి? ఆగు" అని పిలుస్తున్నా వినిపించుకోకుండా గేటు దాటుతుండగా, అప్పుడే గేట్లోకి వస్తున్న విక్రాంత్ "వేణూ! కంగ్రాట్స్" అంటూ అతని పక్కన బండి ఆపాడు.
వేణు బలవంతంగా నవ్వి, "థాంక్యూ" అంటూ వెళ్ళబోతుంటే వేణు భుజం పట్టి ఆపుతూ అడిగాడు విక్రాంత్. "ఏంటిరా? అలా ఉన్నావేం? ఎవరి మీదో కోపంగా ఉన్నట్టున్నావు?"
"లేదు. అదేం లేదు. అర్జంటు పని ఉంది."
