
పార్ట్ - 7
- కండ్లకుంట శరత్ చంద్ర
ఇతని ప్రక్కన...ఇద్దరు యువకులు కూర్చున్నారు.
సినిమా ప్రారంభమయ్యింది.
పదినిమిషాలు గడిచాక... ఒక ఫైట్ వస్తోంది.
"వీడేనా...హీరో?" అడిగాడు చలనచిత్ర శర్మ, తన ప్రక్కనున్న యువకుడిని.
"అవును. కానీ...వాడూ వీడూ అనకు. నేను...ఫ్యాన్ ని." చెప్పాడు ఆ యువకుడు కోపంగా.
"ఓహ్! ఏంలేదు...గూడూరు రైల్వేస్టేషన్ లో అడుక్కుతినేవాడిలా ఉంటేనూ..." ఆ యువకుడు... శర్మ వంక కోపంగా చూసాడు.
శర్మ...స్క్రీన్ నే చూస్తూ... "అర్రే...ఈ ఫైట్... ఒక జర్మన్ సినిమాలో ఉంది. కాపీ కొట్టారన్నమాట!" అన్నాడు.
ఆ యువకుడు...పళ్ళు కొరికాడు.
"ఆ అమ్మాయేంటి...నవ్వుతోంది? ఎవరామె?" అడిగాడు.
"ఆమె నవ్వడం లేదు. ఏడుస్తోంది! ఆమె హీరోయిన్." కోపంగా చెప్పాడు యువకుడు.
"ఓహ్...! దీన్ని ఏడుపు అంటారా? అద్సరే...ఫైట్ ఏంటి ఇలా ఉంది. హీరో...మిగతా ఇద్దరినీ తంతే... వీళ్ళూ గాల్లోనికి లేచి పాజ్ అయ్యారు. అరే...ఆరుగురూ ఒకేసారి క్రిందపడ్డారేంటి? ఇదేమి ఫైట్?! కంటిన్యుయస్ గా లేదే? కాపే కొట్టడం కూడా చేతకాదా?"
"మీరు... ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు చూడడం లేదా?" అడిగాడు, ముందు వరుసలోని వ్యక్తి, వెనక్కి తిరిగి.
"లేదు." అన్నాడు చలనచిత్ర శర్మ.
"అదీ సంగతి! ఎనిమిదేళ్ళ క్రితం...ఇంగ్లీష్ లో మేట్రిక్స్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా వచినప్పటినుండీ...మన తెలుగు సినిమాలలో ఫైట్లు చంకనాకిపోయాయి. ఒకటో రెండో సినిమాలలో అయితే...ఓ.కే! ఇప్పుడు...దాదాపు ప్రతిసినిమాలోనూ ఫైట్ ఇలాగే ఉంటుంది. హీరోగాల్లోనికి లేచి పాజ్ అవడం. రౌడీలు...భూమికి సమాంతరంగా...పదడుగుల ఎత్తులో...పాజ్ అవడం... ఆ తర్వాత క్రిందపడడం..." చెప్పాడు వెనక్కితిరిగిన వ్యక్తి.
"నోర్మూసుకుని సినిమా చూడండహే!" అన్నాడు ఫ్యాన్.
మరో పది నిమిషాలు గడిచాయి.
"ఇది...కొరియోగ్రఫీనా...! థూ..!! ఏ పుండాకోర్ కంపోజ్ చేసాడిది? మలవిసర్జన తర్వాత... ప్రక్షాళన చేసుకునే విధానాన్ని ఒక స్టెప్పుగా, వీధులూడ్చే విధానాన్ని ఇంకో స్టెప్పుగా, వాంతి చేసుకునే విధానాన్ని మరో స్టెప్పుగా కంపోజ్ చేసారు. ఛ..ఛఛ!!" అన్నాడు చలనచిత్ర శర్మ.
ఫ్యాన్, అతని వైపు చురచురా చూసాడు.
శర్మ అతణ్ణి పట్టించుకోకుండా, "యా...క్...థూ! ప్రసారిత...వాడవాఖ్య...సముద్గత...శూలచిత...!" అన్నాడు.
"ఏయ్...సంస్కృతంలో తిడుతున్నావేంది?" ఫ్యాన్, శర్మ చెయ్యిపట్టుకుని అడిగాడు.
"తిట్లు కావు. ఇవి. యనభైనాలుగు రతి బంధనాలలో...ఓ నాలుగు బంధనాలు!! నీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే... సెక్సువల్ పొజీషన్స్! వాటిని తీసుకుని...ఈ చరణంలో స్టెప్పులు తయారుచేసారు...గాడిద కొడుకులు!"
ఫ్యాన్, శర్మ చెయ్యిని గట్టిగా నొక్కి, "బల్సిందాబే...మూసుకుని సినిమా చూడు." అన్నాడు.
ఆ హీరో ఫ్యాన్, ఆ సినిమాను అప్పటికే...పదిసార్లు చూసాడు. ఈ పాట అంటే అతనికి చాలా ఇష్టం.
శర్మ అతనికి సమాధానం చెప్పలేదు.
మరో పది నిమిషాలు గడిచాక...హీరో, హీరోయిన్...లిప్ టూ లిప్ ముద్దు పెట్టుకున్నారు.
"ఓహ్! తెలుగు సినిమా...హాలివుడ్ స్థాయికి చేరిందన్నమాట. భేష్." అన్నాడు.
ఫ్యాన్ సమాధానం చెప్పలేదు.
ఆ తర్వాత... ఇంకో ఫైట్ వస్తోంది. రోడ్లమీద...రౌడీలను...పిట్టలను కాల్చినట్లు కాల్చిపారేస్తున్నాడు హీరో!
"హ్ మ్! ఇది...హైదరాబాదా...కుగ్రామమా? ఇలా కాల్చుకుంటుంటే పోలీసులు రారా? హ్ మ్... ఈ డైరెక్టర్ కు... రివాల్వర్ లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయో, ఎల్.ఎమ్.జి మిషన్ గన్ లో ఎన్ని బుల్లెట్లు పడతాయో, అస్సలు తెలీదనుకుంటా! ఆఁ... ఆఁ...ఆఖరుకు...హీరో పేల్చే బుల్లెట్స్ కూడా... అలా గాలిలో...పాజ్ అయ్యి...పది సెకన్లపాటు ఆగుతున్నాయేం? టెక్నాలజీ వేలంవెర్రిలా...బాగానే వొంటబట్టింది... సినిమా ఇండస్ట్రీకి."
ఈసారి ఫ్యాన్, శర్మ కాలర్ పట్టుకుని, "ఏందిబే...అప్పట్నించీ చూస్తున్నా. సినిమా చూస్తావా... నీ బోడి అభిప్రాయాలు చెబుతూ ఉంటావా..." అన్నాడు.
"హ్ మ్...నటన అంటే ఏమిటో తెలియని, పట్టుమని...పది వాక్యాల డైలాగును కూడా చెప్పలేని, ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇవ్వలేని, కనీసం అందం చందం లేని... ఈ వెధవకు నువ్వు ఫ్యాన్ వి అయినంత మాత్రాన... ఇంతగా రెచ్చిపోనక్కర్లేదు." చెప్పి శర్మ గబగబా...నడిచాడు.
'పీడా విరగడయ్యింది!" మనసులో అనుకున్నాడు, ఆ ఫ్యాన్.
ఇంటర్ వెల్ అయ్యింది.
ఒక వ్యక్తి...వేగంగా...ఫ్యాన్ వైపు దూసుకొచ్చి, "ఇక్కడ...నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఏమయ్యాడు?" అడిగాడు.
"ఏమో నాకు తెలియదు." కసురుకుంటూ చెప్పాడు ఫ్యాన్.
"నేను...దూరంగా కూర్చుని...అకస్మాత్తుగా...అతణ్ణి గమనించాను. మీరు, అతనితో మాట్లాడుతున్నారుగా! అతను... మీ వెంట రాలేదా?"
"లేదు." సీరియస్ గా చెప్పాడు ఫ్యాన్.
"ఈ సినిమా హీరో...పరిమళ్ కి...నేను పర్సనల్ మేనేజర్ ని. పరిమళ్...ఇంతదాకా మీ సీట్లో కూర్చున్న వ్యక్తికి... వీరాభిమాని." చెప్పాడు ఆ వ్యక్తి.
హీరో ఫ్యాన్ కి...మొదటివాక్యం మోహనరాగంలానూ...రెండవ వాక్యం...కదన కుతూహలం, శివరంజని రాగాల మిక్స్ లానూ అనిపించింది.
అతడు చప్పున నిలబడి, "సార్ సార్...హీరోగారిని ఒక్కసారి కలిసే అవకాశం ఇప్పించండి." అన్నాడు.
"ముందు...నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఏమయ్యాడో చెప్పు."
"నాకు తెలీదు సార్! వాడు...పరిమళ్ ని తిట్టాడు సార్. నేను వాణ్ణి తిట్టి పంపేసా" అన్నాడు.
"యూ...రాస్కెల్! అతణ్ణి వాడూ వీడూ అనకు."
"అతనెవరు సార్?"
"ఒకప్పటి...ప్రముఖ తమిళ, తెలుగు చిత్రాల దర్శకుడు...కె. రత్నచంద్ర!"
హీరోఫ్యాన్, నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు.
హీరో...పర్సనల్ మేనజర్, హీరో కు ఫోన్ చేసి, "సార్...మీ అభిమాన దర్శకుడు కె. రత్నచంద్ర కనిపించారు సార్...దేవీ థియేటర్ లో. ప్చ్...కొద్దిలో మిస్సయ్యారు." చెపుతూ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోగానే...శీనయ్య, ఖాజా...హీరో ఫ్యాన్ దగ్గరికి వచ్చి, "ఈ ఫోటోలోని వ్యక్తిపేరు...చలనచిత్రశర్మ...ఈ సినిమా హాల్ లో ఎక్కడైనా కనిపించాడా?" అని అడిగారు... కె.రత్నచంద్ర ఫోటో చూపిస్తూ.
"ఇతనితో మీకేం పని?"
"ఇతడు...మా తమ్ముడు. తప్పిపోయాడు." చెప్పాడు శీనయ్య.
* * *
"టిమ్ టిమ్ టిమ్...టింటరటరటర...టిమ్ డిమ్ టిమ్!" సెల్ ఫోన్ మోగుతోంది.
"హలో..." అన్నాడు రామకృష్ణ, కంప్యూటర్ మానిటర్ ను చూస్తూనే.
అతడు, హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీయర్ గా పనిచేస్తున్నాడు.
"నమస్కారం!" ఒక గంభీరమైన కంఠం.
"ఎవరూ?" అడిగాడు రామకృష్ణ.
"ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో చదివే మీ కుర్రాడు...నా దగ్గరున్నాడు. నేనే అపహరించాను."
"వ్వాట్!" దెబ్బకు రామకృష్ణ లేచి నిలబడ్డాడు.
"వాడి నెత్తిమీద ఒక్కటిచ్చుకున్నాను. దెబ్బకు స్పృహతప్పాడు. ఇప్పుడూ...అలాగే ఉన్నాడు. చిన్నపిల్లాడు కదా... చాలా సులభంగా అపహరించగలిగాను."
తన కొడుకుని కిడ్నాప్ చేసాడని అర్ధమయ్యింది.
"ప్లీజ్. వాడిని ఏం చెయ్యొద్దు."
"నేను చెప్పినట్లు చేస్తే నిక్షేపంగా ఉంటాడు. లేకపోతే...మలక్ పేట మురుగుడు కాలువలో ఒక అంగం, లక్ డీకాపూల్ దగ్గరున్న మురుగు గుంటలో ఒక అంగం...ఇలా దొరుకుతాయి.
"ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అడగండి." ఏడుపు గొంతుతో అన్నాడు రామకృష్ణ.
"నాకు డబ్బు వద్దు."
"మరి?"
"మీ పిల్లవాడిని...తాను చదివే ఆంగ్లపాఠశాల నుండి...తెలుగు మాధ్యమంలో విద్యాబోధన సాగే పాఠశాలకు మార్చాలి. అంతే!"
"అదేంటి?!!!"
"అవును. నువ్వు సరిగ్గానే విన్నావు." ఫోన్ కట్ అయ్యింది.
వెంటనే...రామకృష్ణ, విషయాన్ని తన భార్యకు, పాఠశాల యాజమాన్యానికి, పోలీసులకు తెలియజేసాడు.
* * *
'ఆత్మహత్య మహాపాపము! sucide is a sin!!' అని వ్రాసి ఉన్న బోర్డు తాలూకు నీడలో...ఇద్దరు ప్రేమికులు నిల్చుని...ట్యాంక్ బండ్ నీళ్ళను చూస్తూ మాట్లాడుకుంటున్నారు.
"నమస్తే..." ఒక అపరిచిత కంఠం విని, అతని వంక ప్రశ్నార్ధకంగా చూసారు.
"నాపేరు...శేఖర్! రాజశేఖర్!! నార్ల రాజశేఖర్!!" చెప్పాడు ఆ వ్యక్తి.
"అయితే?" అడిగాడు ప్రేమికుడు.
"ఈ...హుసేన్ సాగర్ లోతు ఎంత?"
"తెలీదు...ఒ వంద అడుగులు ఉండొచ్చు."
"తెలీదా? వంద అడుగులా? ఏదో ఒకటే సమాధానం చెప్పండి."
"ఏయ్...ఎవరయ్యా నువ్వు. మమ్మల్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్. పో...పోపో..."
"అదికాదు...ఇందులో దూకితే చావు ఖాయమా లేదా? తీరా నేను దూకాక...ఇది...చాలా తక్కువలోతు ఉంటే కష్టం. మాది ఈ ఊరు కాదు... అందుకని..."
"ఏంటీ...దూకుతావా?" అంది ప్రేయసి.
"పిచ్చిపిచ్చిగా ఉందా!" అన్నాడు ప్రేమికుడు.
"సరే సరే...కోపగించుకోకండి. అన్నట్లు...నేను ఇందులో దూకాక...మీరు నన్ను రక్షించే ప్రయత్నం చెయ్యొద్దు. ప్లీజ్!!" రిక్వెస్టుగా అన్నాడు.
"మాకు ఈతరాదు."
"థాంక్స్." అన్నాడు నార్లరాజశేఖర్ చెప్పులు విప్పుతూ.
"ఏయ్....నిజంగానే దూకేస్తావా?" అనుమానంగా అడిగాడు ప్రేమికుడు.
"మరి...కామెడీ చేయడానికి నేనేమైనా బ్రహ్మానందాన్నా?" అన్నాడు నార్లరాజశేఖర్... ఫెన్సింగ్ లా ఏర్పాటుచేసిన ఇనుపరాడ్ ఎక్కుతూ.
"ఏయ్...దిగు..." అరిచాడు ప్రేమికుడు.
"చచ్చిపోయేటప్పుడు ప్రశాంతంగా చావానివ్వు. వీలైతే...ఈ జీవన చదరంగాలలో పాట పాడు..." అన్నాడు నార్ల రాజశేఖర్, మరో రాడ్ ఎక్కేస్తూ.
"ఈ జీవన చదరంగాలలో కాదు! ఈ జీవన తరంగాలలో..." సరిచేసింది ప్రేయసి, అంత టెన్షన్ లోనూ.
"గుడ్! నీకు పాట బాగా తెలుసనుకుంటాను. నువ్వూ నాతోరా...నరకం దకా... నాకు బోరు కొట్టకుండా ఉంటుంది." చెబుతూ అమాంతం బలంగా...ఆమెను పైకి లాగి...ఆమెతో సహా...నీళ్ళలోనికి ఒక్క దూకు దూకాడు నార్ల రాజశేఖర్.
ప్రేమికుడి ఆర్తనాదం...గాలిలో కలిసిపోయింది!
ప్రేయసి ఆర్తనాదం... సగం గాలిలో, సగం నీళ్ళలో కలిసిపోయింది.
* * *
"ప్రేయసి గొంతుకోసిన ఉన్మాది! సంతోషంతో ఉక్కిరిబిక్కిరైన ముఖ్యమంత్రి! తనకేమీ సంబంధం లేదన్న ప్రధాని మన్మోహన్ సింగ్.!"
"ఎర్రగొండలో యువతి మానభంగం...తమ ప్రతిభేనంటున్న శ్రీ చైతన్య విద్యార్ధులు...ఇది మళ్ళీమళ్ళీ జరగాలన్న సోనియాగాంధీ!"
"రాజమండ్రిలో కుక్కల స్వైరవిహారం...పట్టించుకోవద్దన్న చిరంజీవి...సంతోషంతో ఉక్కిరిబిక్కిరైన చిదంబరం!"
"అక్రమసంబంధమే సుమతి హత్యకు కారణం... తానే చేసానంటున్న రవితేజ... దేశం అన్నిమూలలా ఇవి మామూలేనన్న రామ్ దేవ్ బాబా!"
"మాదకద్రవ్యాల మత్తులో రాష్ట్ర సినీపరిశ్రమ...తమకూ కావాలంటున్న ప్రతిపక్షాలు... ధరలు తగ్గించి మరీ అమ్ముతామంటున్న కేంద్రప్రభుత్వం..."
ఎవరెస్టురెడ్డి...టి.వి.లు అమ్మే దుకాణంలో నిలబడి...ఓ న్యూస్ ఛాకావాలి సార్?" అడిగాడు సేల్స్ మేన్ వినయంగా.
