అందరూ మేధావులే!?!
- కండ్లకుంట శరత్ చంద్ర

పార్ట్ - 6
"నాకంత తీరికా లేదు, ఓపికా లేదు...!" చెప్పాడు దర్శకుడు సీరియస్ గా.
ఎస్సై...వాడి రూపురేఖలు కనుక్కుందామని లలిత గదిలోనికి వెళ్ళాడు. కానీ...చీకట్లో చూడడం వల్ల...ఆమె, వాడి రూపురేఖలు చెప్పలేకపోతోంది.
ఎస్సై వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత...సీరియల్ దర్శకుడు, రచయిత...బయటికి నడిచారు.
"ప్చ్! ఏం చేద్దాం సార్...ఈ అమ్మాయి మొహాన పచ్చబొట్టుతో ఎలా నటిస్తుంది?" అడిగాడు రచయిత.
అప్పటికే...ఆమె కోసం బోలెడన్ని సీన్ లు, పేజీల కొద్దీ డైలాగులూ రాసి పెట్టాడు.
"వరుణ్ పాత్ర...ఈమెను పెళ్ళి చేసుకునే సీన్ లు మార్చి రాయండి. వరుణ్ తల్లి...ఈమె తలమీద కర్రతో మోదుతుంది. ఈమెను హాస్పటల్ లో
వేస్తారు...తర్వాత కూడా...కొన్ని ఎపిసోడ్ లపాటూ...తలకు కట్టు కట్టుకుని నటిస్తుంది. జనాలు చచ్చినట్లు చూస్తారు." చెప్పాడు సీరియల్ దర్శకుడు.
అప్పటికే ఆ సీరియల్...ఏడువందలా తొంభైరెండవ ఎపిసోడ్ ప్రసారమౌతోంది.
"ఒకవేళ...ఈ అమ్మాయి...తన పచ్చబొట్టు చెరిగిపోయేలా...ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను... ఇక సీరియల్ లో నటించను...అని చెప్తే?"
"అప్పుడు సీరియల్ లో...ఈమె పాత్రను కారుతో గుద్దించి...ఈమె మొహానికి ప్లాస్టిక్ సర్జరీ అయ్యిందని చెప్పి...వేరే అమ్మాయిని పెడదాం."
"జనం చూస్తారా?"
"భేషుగ్గా!" అన్నాడు దర్శకుడు.
నవలకు ,సినిమాకు, నేటి టి.వి సీరియల్ కు...ఒక ముఖ్యమైన తేడా ఉంది. నవల...వందో, రెండొందలో... పేజీలలో పూర్తవుతుంది. పాఠకుడికి...ఏమైనా
సందేహం కలిగినా, రచయిత...ఎక్కడైనా లాజిక్ వదిలేసాడని అనిపించినా...పేజీలు వెనక్కి తిప్పి...చదివి...పరిశీలించగలిగే అవకాశం ఉంటుంది.
సినిమా...రెండు గంటలలో అయిపోతుంది కాబట్టి...అందులోని సన్నివేశాలను, సంభాషణలను... విశ్లేషించగలిగే అవకాశం ఉంటుంది. కనీసం...రెండోసారి
చూసైనా...దూషణ భూషణలు చెయ్యగలరు.
నేటి టి.వి సీరియల్ పరిస్థితి...దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది! ఒకసారి చూసినా ఎపిసోడ్ మళ్ళీ చూడలేడు. కధ...పిచ్చిపట్టినట్లుగా సాగుతూనే
ఉంటుంది. ప్రేక్షకులు...వారంరోజుల ఎపిసోడ్లో, పదిరోజుల ఎపిసోడ్లో... విశ్లేషించగలరు కానీ...పూర్తిగా...సీరియల్ ను...ఆసాంతం విశ్లేషించలేరు!! నవల...రచయిత గ్రిప్ లో
ఉంటుంది. పాఠకుల జడ్జిమెంటుకూ...అనువుగా ఉంటుంది!! సినిమా...పూర్తిగా ఎవ్వరి గ్రిప్ లోనూ ఉండదు. ప్రేక్షకుల జడ్జిమెంటుకు....సులభంగా ఉంటుంది!!
నేటి టి.వి. సీరియళ్ళు...ఎవరి గ్రిప్ లో ఉంటాయో...టి. ఆర్.పి రేటింగు నిర్ణయించేవారికి బాగా తెలుసు. ప్రేక్షకులు మాత్రం స్వచ్చందంగా బలైపోతుంటారు.
"సార్! ఒకవేళ...ఈమెను నటింపజేసేటప్పుడు...వాడు మళ్ళీ దాడి చేస్తే?" అడిగాడు సీరియల్ రచయిత.
"చెయ్యకూడదనే ఆశిద్దాం. ఇక మీదట...ఈమెకు...డబ్బింగు చెప్పిద్దాం."
"వద్దు సార్! ఇన్ని ఎపిసోడ్ లు ఈమె కంఠం విని...ఇప్పుడు వేరే కంఠం వినాలంటే...ప్రేక్షకులు హర్షించరు."
"అయితే...ఈమెకు రాసే సంభాషణలలో...ళ, ణ...లేకుండా రాయండి."
"అదెలా కుదురుతుంది...మన జీరో పాత్రపేరు వరుణ్. విలన్...మృణాళిని. సబ్జెక్టు...పెళ్ళి. ఈ మూడుపదాలు లేకుండా...రాయడం కష్టం."
"ఈమె...ఇప్పటినుండి వరుణ్ ను...ముద్దుగా వరూ...అంటుంది! మృణాళిని విలన్ కాబట్టి...ఆమెను...తిక్కదెయ్యం అని సంభోదిస్తుంది. పెళ్ళి అనే పదానికి
బదులుగా...వివాహం అనే పదాన్ని వాడండి..."
'ఈయన దగ్గర...ప్రతి సమస్యకూ...సులువైన పరిష్కారం ఉంటుంది!' మనసులో అనుకున్నాడు రచయిత.
* * *
సమయం...ఉదయం పదయ్యింది.
హైదరాబాద్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ల...సమావేశం...ఏసిపి నరేంద్ర ఆఫీసులో జరిగింది.
ఎసిపి నరేంద్రకు నలభై ఎనిమిదేళ్ళుంటాయి. ఆరడుగుల ఎత్తు...బట్టతల!
జంటనరగాలలో క్రైమ్ రేటును తగ్గించడానికి అహర్నిశలూ కృషి చేస్తుంటాడు.
యూనిఫామ్ లో ఉంటే...యుద్ధంలో భీష్ముడిని కూల్చిన అర్జునుడిలా కనిపిస్తాడు.
యూనిఫామ్ తీసేసి, సాధారణ దుస్తులు వేసుకుంటే...పక్కింటి బాబాయిలా ఉంటాడు.
ఆ వారంరోజుల్లో...జంట నగరాలలో జరిగిన హత్యలు, మానభంగాలు, బోర్డు తిప్పేసి పారిపోయిన చిట్ ఫండ్ లు, కల్తీ మందులు,
ఏక్సిడెంట్లు...ర్యాగింగ్...ఇలాంటి కేసుల గురించి, సంఘటనల గురించి...వాటి తీరుతెన్నుల గురించీ చర్చించారు.
ఒకరికొకరు...ఉచిత సలహాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
సమావేశం ముగిసింది. అటెండర్, అందరికీ టీ, బిస్కెట్లు తెచ్చాడు.
"నిన్నరాత్రి...ఓ విచిత్రమైన కేసు మా ఏరియాలోని పోలీస్ స్టేషన్ కు వచ్చింది." అన్నాడు ఒక సి.ఐ.టీ కప్పు అందుకుంటూ.
"ఏంటి?" అడిగాడు ఇంకో సి.ఐ.
"ఒక వ్యక్తి...నలుగురు యూనివర్శిటీ విద్యార్ధులను...వాళ్ళ కారులోనే కిడ్నాప్ చేసి, తీసుకువెళ్ళాడు. అందులో...ముగ్గురిని గుండుసూదులతో పొడిచి
హింసించాడు. ఒకణ్ణి మాత్రం ఏమీ అనలేదు. కారణం చెబితే...ఆశ్చర్యపోతారు. వాళ్ళు ముగ్గురూ...నాన్
వేజిటేరియన్సని...తిండి కోసం జంతువులను చంపడమెందుకనీ
వారితో వాదించాడట! వాడి పేరు...ధర్మవ్యాదుడు అని చెప్పాడట."
అందరూ పగలబడి నవ్వారు.
"ధర్మవ్యాదుడంటే...మిధిలా నగరంలో ఉండే ఒక మాంసపుకొట్టు వ్యాపారి." చెప్పాడు ఏసిపి నరేంద్ర, తన
ఇతిహాస పరిజ్ఞానాన్ని వాడుతూ.
"మాంసపు కొట్టు వ్యాపారి పేరు...మరి...నాన్ వెజిటేరియన్స్ ని బాధించిన...వీడు ఎందుకు
పెట్టుకున్నట్లో!" అన్నాడు ఒక సి.ఐ.
"ధర్మవ్యాదుడిది చాలా చిత్రమైన క్యారెక్టర్! తన కులవృత్తి కాబట్టి...మాంసాన్ని అమ్ముతున్నానంటాడు.
మాంసం కోసం...జంతువులను చంపడు.
బోయవాళ్ళు చంపి, తీసుకొచ్చే వాటిని కొంటుంటాడు. వాటినే...అమ్ముకుంటాడు. అసలు...ఈ
ప్రపంచంలో...హింసలేని చోటే లేదనీ వాదిస్తాడు. అయితే...అహింసను
అనుసరించమంటాడు. ధర్మం అతి సూక్ష్మంగా ఉంటుందనీ...ఇది హింస. ఇది అహింస అని విడమరిచి
చెప్పలేమని...ఒప్పుకుంటాడు. అహింస అంటే...హింసించకపోవడం
కాదు...! సాధ్యమైనంత వరకూ...హింసకు దూరంగా ఉండడమే అహింస... అని నిర్వచిస్తాడు." చెప్పాడు
ఏసిపి నరేంద్ర.
"నిన్నరాత్రి...నా ఏరియాలోని స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ కు...నెక్ లెస్ రోడ్డులో ఒక విచిత్రమైన....
తిక్కమేళం తగిలాడట! వాడి మాటలకు గానూ...మా
కానిస్టేబుల్ వాంతి చేసుకున్నాడట." అన్నాడు ఇంకో సి.ఐ., బిస్కెట్ ను టీలో ముంచుతూ.
"అవునా! నిన్నరాత్రి...సీతాఫల్ మండీలో ఇంకో చిత్రమైనవాడు తగిలాడట! పేరు...నార్ల రాజశేఖర్ అట!
ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడట. అక్కడి
కానిస్టేబుల్...మా స్టేషన్ లోని ఎస్సైకి ఫోన్ చేసి...ఒకడు హుసేన్ సాగర్ లో ఆత్మహత్య చేస్కోవడానికి
బయల్దేరాడు...అని చెప్పాడట! ఆ...నార్ల రాజశేఖర్ ను... చూసిన
సుబ్బారావు అనే వ్యక్తిని... ఇద్దరు కానిస్టేబుళ్ళను...ట్యాంక్ బండ్ ఏరియాకు పంపాను."
"చెప్పడం మరిచా...నిన్న మా కానిస్టేబుల్ వాంతికి కారణమైన వాడి పేరు...ఎవరెస్టు రెడ్డి!" అందరూ
నవ్వారు.
"నిన్నరాత్రి...కృష్ణకిరణ్ అనే వ్యక్తి...సినిమా డైరెక్టర్...పి.వి. రాజకృష్ణనాద్ వర్మ ఇంట్లో...దూరాడట.
దెయ్యం తరుముతోందని నానాహంగామా చేసాడట!
వాళ్ళ వాచ్ మెన్...మా కానిస్టేబుల్ తో చెప్పాడట."
"ఇంకో న్యూస్ వినండి! ఎవడో...తెలుగు భాష వీరాభిమాని... ఒక టి.వి. సీరియల్ హీరోయిన్ ను.... కొట్టి,
ఆమె మొహాన...విశ్వభాషలందు తెలుగు లెస్స
అని రాసాడట. ఇక్కడికి వచ్చేముందు...మా ఎస్సై చెప్పాడు."
అందరూ... పగలబడి నవ్వుకున్నారు... ఒక్క ఏ.సి.పి. నరేంద్ర తప్ప!
'నార్ల రాజశేఖర్, కృష్ణకిరణ్, ఎవరెస్టు రెడ్డి, ధర్మవ్యాదుడు, భాషాభిమాని!' మనసులో అనుకున్నాడు.
ఎందుకో... అతనికి ఇవన్నీ విన్నాక...నగరంలో ఏదో
సంచలనం జరగబోతోందని... అనిపించింది.
అందరూ బయటికి వెళ్ళారు.
తన జీపు ఎక్కుతూ... ఒక సి.ఐ. చూపు...ప్రక్కజీపు నెంబర్ ప్లేట్ మీద పడింది.
"AP10J
3758"
ఈ నెంబర్ లో...ఎవరో...AP ని కొట్టేసి...J ని కొట్టేసి...ఇలా రాసారు.
"ఆం.ప్ర 10 జె
3758"
రెండు నిమిషాలలో...అర్ధమైందేమిటంటే...అక్కడ ఆగి ఉన్న ప్రతిజీపు నెంబర్ ప్లేట్లలోనూ...తెలుగు
అక్షరాలు... రాసున్నాయి...!!
అందరూ మొహామొహాలు చూసుకున్నారు. ఎసిపి కిటికీలో నుండి... చూడసాగాడు!
* * *
గత సాయంత్రం అడుక్కున్న డబ్బులతో...ఆర్ టి సి క్రాస్ రోడ్ లో...మూల మలుపు మీదున్న బండి దగ్గర
నిలబడి... ఉల్లిపాయలు బాగా
వేయించుకుని...రెండు గరిటెల చెట్నీ వేయించుకుని...దోసెను కళ్ళతో మిటకరించి చూస్తూ... ముక్కుతో
వాసనను పీలుస్తూ...చేతితో ఆబగా తడుముతూ... పొయ్యిమీద...దోసె
పిండి చేస్తున్న శబ్దాన్ని వింటూ... దోసెను తుంచి, నోట్లో వేసుకుని, జిహ్వనూ... ఆత్మారాముణ్ణీ
సంతృప్తిపరిచాడు.
దోసెను...ఇలా పంచేంద్రియాలతో ఆస్వాదిస్తూ తినే జీవిని...బండివాడు మొదటిసారిగా చూస్తున్నాడు.
"ఆహా...ఆహా...గుండమ్మకథ సినిమాలో ఎన్టీర్, సావిత్రి కలిసి...లేచింది మహిళా లోకం పాట పాడుతూ
రుబ్బిన పిండితో చేసావా...దోశలు?!"
మెచ్చుకుంటూ అడిగాడతడు.
"అప్పటి పిండితో...ఇప్పుడు దోశలు వేస్తే...కక్కుకొని చస్తావ్." అన్నాడు బండివాడు.
"ఈ దోర ఉల్లిపాయముక్కలు తింటుంటే... పదహారేళ్ళ వయస్సులో శ్రీదేవిని చూస్తున్నంత కిక్ గా ఉంది."
"నీ పేరేంటి?" అడిగాడు బండివాడు.
"చలనచిత్ర శర్మ!"
బండివాడు అతని వంక విచిత్రంగా చూసి, చెమటలు తుడుచుకుంటూ...పొయ్యిమీద ఉన్న పెనాన్ని కాస్త
కదిలించాడు.
"ఇప్పుడు...తెలుగు సినిమా ఇండస్ట్రీలో...టాప్ డైరెక్టర్ ఎవరు?" అడిగాడు చలనచిత్ర శర్మ, చట్నీని
నాకుతూ.
"ఏమో...నాకు తెల్వదు. అయినా...మీరు తెలుగువాళ్ళలానే ఉన్నారు...మీకు తెల్వదా?"
"తెలుగువాడినే. కానీ...ఇక్కడ లేను. ఈరోజే దిగాను."
"ఎక్కడికి వెళ్ళారు?"
"మంగపూర్ దేశం."
"సింగపూర్ తెలుసు. మంగపూర్ ఎక్కడుంది?"
"సింగపూర్ కూ, ఇటలీకీ మధ్య ఉంది."
బండివాడికి జాగ్రఫీ తెలీదు కాబట్టి సరిపోయింది.
"ఇప్పుడు...హిట్ సినిమాలేమిటి?" అడిగాడు.
"బేవర్సునాయాలా..."
"నేను అంతమంచిగా అడుగుతుంటే...తిడతావేంటయ్యా?" అన్నాడు చలనచిత్ర శర్మ, కోపంగా చూస్తూ.
"నిజం సార్! ఇప్పుడు సిటీలో...బాగా ఆడుతున్న సినిమా...ఇదే! బేవర్సునాయాలా."
"అదేంపేరు? తిట్టులా ఉంది."
"తిట్టేసార్! ఇందులో హీరో...బేవర్సునాయాలలాగా తిరుగుతుంటాడు..."
"ఏ థియేటర్ లో ఉంది?"
"దేవి థియేటర్ లో..."
చలనచిత్ర శర్మ, సరిగ్గా పావుగంటలో...దేవీ థియేటర్ ముందు ఉన్నాడు.
లైన్ లో నిలబడి...టికెట్ కౌంటర్ మీద రాసున్న రుసుము చూసాడు.
"టిక్కెట్ ధర...యాభై రూపాయలా!!! ఘోరం, ఘోరాతిఘోరం!" అనుకున్నాడు. అప్పటికే... సినిమా
రిలీజై.... యాభైరోజులు అవడంతో...జనం కాస్త
పల్చపడ్డారు. టికెట్ తీసుకుని లోపలికి నడిచాడు.
