
పార్ట్ - 8
- కండ్లకుంట శరత్ చంద్ర
"ఆగవోయ్...ముందు నన్ను పరిశీలించనివ్వు. క్లారిటీ, సౌండ్...అన్నీ చూస్కోవాలిగా!" అన్నాడు ఎవరెస్టురెడ్డి.
సేల్స్ మేన్ తలూపి...ప్రక్కకు వెళ్ళిపోయాడు.
"డాడీ...డాడీ...ఎల్ సిడీయే కొందాం. ప్లీజ్..." ఓ పదిహేనేళ్ళ కుర్రాడు, తన తండ్రిని అడుగుతున్నాడు.
ఎవరెస్టురెడ్డి అతని వంక చూసి...తిరిగి ఇంకో టి.వి. చూడడంలో మునిగాడు.
"ఆగదూ...ఆగదూ..." ప్రేమాభిషేకం పాట వస్తోంది.
"ఆగకపోతే...బాత్రూంకి పోరా...నాయనా...మమ్మల్నెందుకు చంపుతావ్..." అని చేతిలోని రిమోట్ తో పాట ఫార్వర్డ్ చేసాడు.
"దిల్ దీవానా...బిన్ సజ్ నాకే...మానేనా......." సాజన్ సినిమా పాట.
"మానెయ్యవోయ్...ఎవడొద్దన్నాడు..." అని రిమోట్ నొక్కాడు.
"అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే... సత్తురేకు కూడ స్వర్ణమేలే..." ప్రేమికుడు సినిమా పాట.
"మా నాయనే...ఇంకేం...తుప్పుపట్టిన ఇనుపసామానుషాపు పెట్టుకొని...ఇనుముతో బంగారం చేసి అమ్ముకో..." అంటూ రిమోట్ నొక్కాడు.
"పంచదార బొమ్మా బొమ్మా..." మగధీర సినిమా పాట.
"ఆమె వంటిమీద...చీమలు ఎక్కుతాయేమో చూస్కో..." అంటూ రిమోట్ నొక్కాడు.
"నువ్వు యాడికెల్తె ఆడికొస్త సువర్ణా...నీ ఇంటిపేరు మారుస్తా సువర్ణ..."
"ఓహ్...పేర్లు పెయింట్ వేసే దుకాణముందా నీకు!" అంటూ...సేల్స్ మేన్ ని పిలిచి, "ఈ టి.వి.లో పాటలు తప్ప ఏమీ రావా?" అడిగాడు.
"పాటలన్నీ మిక్స్ చేసిన సి.డి. ని...ప్లే చేస్తూ...టి.వికి ప్లేయర్ కనెక్ట్ చేసాం సార్." అన్నాడు.
"అలాగా! నువ్వెళ్ళు." అనేసి మరో టి.వి. దగ్గరికి వచ్చాడు.
"ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త...అచ్చాపురపు పిచ్చారావుగారు...పాఠకుల ప్రశ్నలకు, ఫోన్ లో సమాధానాలు ఇస్తారు." చెప్పాడు మేల్ ఏంకర్.
అంతలోనే ఫోన్ మోగింది.
"హలో..." అన్నాడు ఏంకర్ చిరునవ్వుతో.
అతని ప్రక్కనే...అరకిలో రుద్రాక్ష మాలలతోను, పావుకిలో విబూదిని మొహాన ధరించి...చిరునవ్వు చిందిస్తున్న పిచ్చారావు కూర్చుని వున్నాడు.
"హ...ల్లో! పీ టీవీనా నండీ..." రిసౌండ్ వచ్చింది.
"అవును...మీ టి.వి. వాల్యూమ్ కొంచం తగ్గించండి. పిచ్చారావుగారితో మాట్లాడండి."
"హలో...పిచ్చారావుగారూ..."
"హలో చెప్పండి..." అన్నాడు పిచ్చారావు.
"విజయవాడ నుండి...విజయ్ ని మాట్లాడుతున్నాన్ సార్! నాకింకా...పెళ్ళికాలేదు సార్...ఎప్పుడవుతుందో కాస్త చెప్తారా?"
"ఓ తప్పకుండా! అన్నట్లు...మీ నక్షత్రం, పుట్టిన తేదీ, పుట్టిన సమయం చెప్పండి."
"రేవతి...రెండోపాదం సార్! ఆరూ జూన్ పందొమ్మిదివందలా డెబ్భైతొమ్మిది. సమయం...రాత్రి పదింటికి." చెప్పాడు విజయ్.
పిచ్చారావు ఏవో లెక్కలు వేసి, "శనికి తైలాభిషేకం చెయ్యించండి. పది శనివారాలు...నువ్వులు దానం ఇవ్వండి. మీ పెళ్ళి అయిపోతుంది." అన్నాడు పిచ్చారావు.
ఎవరెస్టురెడ్డి గబగబా సేల్స్ మేన్ దగ్గరికి వెళ్ళి, "ఒక టి.వి కొనాలని నిర్ణయించుకున్నాను. మా యావిడకు చెప్పి సలహా తీస్కోవాలి. కాస్త...మీ సెల్ ఫోన్ ఇస్తారా... నా ఫోన్ మర్చిపోయి వచ్చాను." అన్నాడు.
"దానికేం!" అని సేల్స్ మేన్ తన సెల్ ఫోన్ ఇచ్చాడు.
వెంటనే...ఎవరెస్టురెడ్డి...టి.వి.లో స్క్రోల్ అవుతున్న...నెంబరుకు ఫోన్ చేసాడు. బిజీ అని వచ్చింది. మళ్ళీ మళ్ళీ చెయ్యసాగాడు. బిజీ అని వస్తూనే వుంది.
"ఏంటి సార్? కలవడం లేదా?" అడిగాడు సేల్స్ మేన్.
"కలుస్తోంది. కానీ మాయావిడ ఫోన్ తియ్యడం లేదు." అన్నాడు ప్రయత్నిస్తూనే.
"తీసేదాకా...ట్రయ్ చెయ్యండి సార్! నో ప్రాబ్లమ్" అనేసి సేల్స్ మేన్ వేరే కస్టమర్ తో మాట్లాడసాగాడు.
ఫోన్ రింగవుతున్న శబ్దం!!!
"హలో..." వినిపించింది ఓ అమ్మాయి కంఠం.
"ఇది...పిచ్చారావుగారి లైవ్ షో కాదా?" ఆత్రంగా అడిగాడు.
"అవును. ఇంకో కాల్ నడుస్తోంది. తర్వాత...మీది కనెక్ట్ చేస్తాం. మీపేరు, వివరాలు సింపుల్ గా చెప్పండి" అంది ఆ అమ్మాయి.
"నా పేరు...రాము. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సంతానం లేదు. ఈ విషయమై పిచ్చారావు గారి సలహా తీసుకుందామని..." చెప్పాడు ఎవరెస్టు రెడ్డి.
తన అసలుపేరు చెబితే...నమ్మక...కట్ చేస్తారేమోనని...పేరు మార్చి చెప్పాడు. "లైన్ లో ఉండండి." అంది.
రెండు నిమిషాల తర్వాత... "హలో..." వినిపించింది మేల్ ఏంకర్ గొంతు.
"హలో...పిచ్చారావుగారూ...నమస్తే" అన్నాడు ఎవరెస్టు రెడ్డి
"నమస్తే...మీ పేరు, వివరాలు చెప్పండి."
"నా పేరు రాము. నాకు ఇంకా సంతానం లేదు సార్. నా భార్య రోజూ ఏడుస్తోంది. ఎలాగైనా మీరు కరుణించి, నాకు సంతానం ప్రసాదించాలి సార్."
"నేను కాదు...దేవుడు కరుణించాలి. మీ పుట్టిన తేదీ, సమయం?"
"ఐదూ...అగస్ట్...పందొమ్మివందలా...నలభై! సమయం... ఉదయం... తొమ్మిది గంటలా... తొమ్మిది నిమిషాల... తొమ్మిది సెకన్ల... తొంభైతొమ్మిది మిల్లీ సెకన్ల...తొంభైతొమ్మిది నానో సెకన్లు! పుట్టిన ప్రదేశం...తెల్లమల అడవులు! అదే...నల్లమల అడవుల తర్వాత ఉంటాయే...అవి! తొంభైరెండు డిగ్రీల అక్షాంశము...అరవై ఆరున్నర డిగ్రీల రేఖాంశము! తెలుగు సంవత్సరం పేరు గుర్తులేదుగానీ... రక్తాక్షినామ సంవత్సరం అనుకుంటాను" గడగడా చెప్పాడు ఎవరెస్టు రెడ్డి.
"అంటే...మీ వయసు... డెబ్భైఒకటి సంవత్సరాలా!" పిచ్చారావు, పిచ్చిచూపులు చూస్తూ అడిగాడు.
"అవును సార్! నా భార్య చచ్చిపోయి...దెయ్యమయ్యింది సార్! రోజూ...నా ఇంటికి వచ్చి ఏడుస్తోంది సార్. ఎలాగైనా పరిష్కారం చెప్పి సంతానం కలిగేలా చెయ్యండి సార్! దెయ్యంతో...శృంగారం ఎలా చేస్తానని సందేహించకండి సార్! అవసరమైతే... డాక్టర్ యుద్ధం...గారి సలహా తీసుకుంటాను."
మేల్ ఏంకర్...కాల్ కట్ చెయ్యమని సైగ చేసాడు...తన యూనిట్ తో.
"అవసరమైతే...నేను చచ్చిపోయి దయ్యమై...దెయ్యం పిల్లల్ని కంటాను సార్! ఒకవేళ నేను చచ్చిపోయి... పిశాచం అయితే...? దెయ్యానికీ, పిశాచానికీ పుట్టే పిల్లలు... దెయ్యాలౌతారా...పిశాచాలౌతారా... భూతాలౌతారా? చెప్పండి సా...." ఎవరెస్టురెడ్డి వాక్య ప్రవాహానికి బ్రేకు వేస్తూ...ఫోన్ కట్ అయ్యింది.
"హలో...హలో...హలో..." అని మేల్ ఏంకర్ మూడుసార్లు అరిచి, "ఫోన్ కట్ అయినట్లుంది... ఇప్పుడు బ్రేక్!" అన్నాడు.
ఎవరెస్టురెడ్డి వెనక్కి తిరిగేసరికి... సేల్స్ మేన్, మేనేజర్ రౌద్రాకారంలో నిలబడి వున్నారు
* * *
"భౌ...భౌ...భౌభౌభౌ..." కుక్క మొరుగుడు విని, కోళ్ళకోసం దాణా తయారుచేస్తున్న...సీతయ్య, అతని భార్య రామలక్ష్మి...బయటికి వచ్చారు.
కోళ్ళఫారమ్ లో...కోళ్ళన్నీ రిధమికల్ గా "క్కో...క్కో...క్కోక్కో...క్కోక్కోక్కో..." అంటున్నాయి. సంగీతపరిజ్ఞానం లేని...కొన్ని కోళ్ళు మాత్రం, "క్కోక్కో...క్కోక్కో...క్కోక్కో..." అని శబ్దం చేస్తూ...రిధమ్ ను తప్పిస్తున్నాయి.
దంపతులిద్దరూ బయటికి వచ్చి చూసారు.
కోళ్ళఫారమ్ ను కాపలాకాసే కుక్క... అక్కడికి వచ్చిన ఒక వ్యక్తిని ఆపేసింది.
"ఏం కావాలె?" అడిగాడు సీతయ్య.
"కోళ్ళు కొనడానికి వచ్చాను." చెప్పాడు ఆ వ్యక్తి గట్టిగా అరిచి.
"టైగర్...పో...పోపో..." అన్నాడు సీతయ్య.
కుక్క, ఆ వచ్చినవాడు దొంగ కాదని నిర్ణయించుకుని ప్రక్కకు వెళ్ళిపోయింది.
ఆ వ్యక్తి గబగబా... ఆ దంపతుల దగ్గరికి వచ్చాడు.
"ఎన్ని కావాలె?" అడిగాడు సీతయ్య.
"పది..."
"రండి సారూ...లోనికొచ్చి చూస్కోండి." అంది రామలక్ష్మి, దారి ఇస్తూ.
ముగ్గురూ లోపలికి నడిచారు.
ఆ వ్యక్తి...కోళ్ళను పరిశీలించసాగాడు.
"పుచ్చువంకాయలు ఏరేసినట్లు చూడనక్కర్లేదు సారూ...మాం...ఛి...తిండితిని పెరిగినాయి. కోసి...మసాలా పెట్టి వండితే...నా సామిరంగా...నోట్లో...జాలం ఊరదూ!" అంది రామలక్ష్మి.
అతడు కోళ్ళను చూస్తూనే...వేగంగా వెనక్కి తిరిగి, ఆమెను పట్టుకుని, ఆమె గొంతుమీద గుండుసూది పెట్టాడు.
ఈ హఠాత్పరిణామానికి సీతయ్య విస్తుపోయాడు.
రామలక్ష్మి గిలగిలా గింజుకుంది.
"ఏయ్...ఏందిది...వదులు..." అన్నాడు సీతయ్య మీదికొస్తూ.
"చూడు నాయనా! నేను...సహజంగా ఆవులాంటి వాణ్ణి! నన్ను రెచ్చగొడితే...ఆంబోతుగా మారిపోతాను. అంచేత...నామీద దయ ఉంచి, నేను చెప్పినట్లు చెయ్యి నాయినా! బాగుపడతావ్!"
సీతయ్య మరింత ముందుకు రాబోయాడు.
అతని చేతిలోని గుండుసూది, ఆమె చెంపమీద...కుట్టుమిషన్ లోని సూది...గుడ్డమీద దిగినట్లుగా...కచక్.... కచక్...కచక్...అని వేగంగా మూడుసార్లు దిగింది.
కోళ్ళ శబ్దంతో పాటూ...రామలక్ష్మి పెట్టిన కేక...కోళ్ళఫారమ్ లో మోగింది!
రక్తం ఆమె చెంపలమీదుగా కారి...నేలమీద పడుతోంది.
సీతయ్య ఆగిపోయాడు.
"వద్దు...దాన్నేం చెయ్యకు. కావాలంటే పదికోళ్ళూ...పైసలియ్యకుండానే తీసుకపో..." ఏడుపు, కోపం కలియగలిపిన గొంతుతో చెప్పాడు సీతయ్య
ఆ వ్యక్తి పగలబడి నవ్వాడు. "నేను శాఖాహారిని నాయనా! పైగా...మాంసాహారద్వేషిని. మనిషికి...దేవుడిచ్చిన దంతాలు... శాఖాహారాన్ని భుజించడానికి. ఒకవేళ...మనిషి, మాంసాహారం భుజించేవాడైతే...పులులకూ, సింహాలకూ ఇచ్చినట్లు కోరలు ఇచ్చుండేవాడు. ఈ కోళ్ళఫామ్ లో ఉన్న కోళ్ళను...వదిలెయ్యండి. వెళ్ళిపోతాను."
"అయ్యా...బాబూ...కోళ్ళు మావి కావు. మేము ఇక్కడ పనిజేసేవాళ్లం. మా...సారుకు తెలిస్తే మా పని అంతే." అన్నాడు సీతయ్య.
మీ సారు...మిమ్మల్ని ఏమీ అనడుగానీ...కోళ్ళను వదిలెయ్యి. నన్ను విసిగించినా, నేను చెప్పిన పని వెంటనే చెయ్యకపోయినా...నేను మృగంలా మారిపోతాను."
సీతయ్య మౌనంగా నిలబడిపోయాడు.
"ఈసారి...సూది నీ భార్య కంట్లో దిగుతుంది."
సీతయ్య ఇక చేసేదేమీ లేదన్నట్లు...కోళ్ళను ఆరుబయటికి వదలసాగాడు.
కోళ్ళన్నీ బయటికి వస్తుండడం చూసి, టైగర్ కు అనుమానం వచ్చి...లోపలికి పరుగెత్తుకొచ్చింది.
సీతయ్య...కోళ్ళను బయటికి వదులుతూనే వున్నాడు!
వచ్చినవ్యక్తి...రామలక్ష్మి జబ్బ పట్టుకుని నిలబడడం...టైగర్ కు నెగెటివ్ సంకేతాన్ని పంపినట్లయ్యింది.
టైగర్ ఇక ఆలోచించలేదు. వెంటనే...అతని మీదికి ఒక్క గెంతు గెంతింది!
అతడు, రామలక్ష్మిని వదిలేసి, వేగంగా...ఫామ్ లో అటూ ఇటూ పరుగెత్తుథూ...వేగంగా బయటికి దూసుకుపోయాడు.
* * *
"పిచ్చిపిచ్చిగా ఉందా? నా ఫోన్ తీసుకుని... టి.వి లైవ్ 'షో'కు ఫోన్ చేస్తావా?" అరిచాడు సేల్స్ మేన్.
"అసలు నీకు టి.వి కొనే ఉద్దేశ్యం ఉందా...లేదా?" సీరియస్ గా అడిగాడు మేనేజర్.
"ఉంది." అన్నాడు ఎవరెస్టురెడ్డి.
"అయితే... ఏ టి.వి కావాలో చెప్పి, డబ్బు చెల్లించి తీసుకుపో..." మళ్ళీ సీరియస్ గానే చెప్పాడు మేనేజర్.
"మీ దగ్గర...డయోనోరా టి.వి ఉందా?" అడిగాడు ఎవరెస్టురెడ్డి.
"లేదు."
"పోనీ...కోణార్క్ టి.వి ఉందా?"
"లేదు."
"బి.పి.ఎల్ ఉందా?"
మేనేజర్, సేల్స్ మేన్ మొహామొహాలు చూసుకున్నారు.
"నువ్వు అడిగే టి.వి లేవీ...తయారవడం లేదు. చూసావుగా...ఎల్.జి, సోనీ, ఒనిడా, అకాయ్, వీడియోకాన్... ఇవి ఉన్నాయి." అన్నాడు మేనేజర్.
"అయితే...రెండుకిలోల ఎల్.జి టి.విలు, అరడజను సోనీ టి.విలు, నాలుగు తులాల
