Previous Page Next Page 
అందరూ మేధావులే  పేజి 5

    అందరూ మేధావులే!?!
                                                            - కండ్లకుంట శరత్ చంద్ర                                          

పార్ట్ - 5

అతడు వెళ్ళిన అరగంటకు...నార్ల రాజశేఖర్, పోలీస్ దగ్గరికి వచ్చి, "సార్! ఇక్కణ్ణించి హుసేన్ సాగర్ కు ఎలా వెళ్ళాలి?" అడిగాడు.
    పోలీసు, ముక్కు చీదుతూ... "రాత్రిపూట బస్సులు అంత సులభంగా దొరకవు. ఆటోలో వెళ్ళు. రెండొందలో...మూడొందలో...నీ ఆస్తో అడుగుతాడు...ఆటోవాడు. ఇచ్చెయ్యి." అన్నాడు.
    "నా దగ్గర డబ్బులు లేవు సార్!"
    "అయితే...బయటికి వెళ్ళి...బస్టాపులో నిలబడు. పొరపాటున సికిందరాబాద్ బస్సు వస్తే ఎక్కు... ఆఫ్ కోర్స్...అది ఆగితేనే! సికిందరాబాదులో దిగి...అక్కడ... 5, 5k, 5c, 8, 7z....వీటిలో ఏదో ఒక బస్సు కనిపిస్తే...ఎక్కు."
    "బస్సులో వెళ్ళడానికి డబ్బులు లేవు సార్!"
    "అహాఁ! మరి ఎట్లా పోతావ్?"
    "నడిచి..."
    హ్ మ్! సరే...బయటికి వెళ్ళి...కుడివైపు వెళ్ళు. ఆ తర్వాత...ఎడమకు తిరిగి...సికిందరాబాద్ స్టేషన్ కు వచ్చేదాకా నడువు. ఆ తర్వాత...నేను చెప్పిన ఏదో ఒక బస్సు వెంట ఫాలో అవ్వు." చెప్పి పోలీస్ వెళ్ళిపోతూ... "ఇంతకూ...హుసేన్ సాగర్ కి ఎందుకు?" అన్నాడు.
    "ఆత్మహత్య చేస్కోవడానికి." చెప్పేసి గబగబా...చీకట్లో కలిసిపోయాడు. పోలీస్ వెనక్కి తిరిగి చూసేసరికి... అతడు లేడు. పోలీస్ వేగంగా వచ్చి చూసాడు. అతడి జాడ కనిపించలేదు.
        *    *    *
    నెక్లెస్ రోడ్ లో...కార్తీక్, స్వప్నలను అల్లరిపెట్టిన వ్యక్తి...పోలీసు కానిస్టేబుల్ వెంట నడుస్తున్నాడు.
    "నీ పేరేంది?" అడిగాడు కానిస్టేబుల్.
    "ఎవరెస్ట్ రెడ్డి!" చెప్పాడతడు అతి మామూలుగా. కానిస్టేబుల్ చప్పున ఆగి, అతని మొహంలోనికి చూసి, "ఏందీ?" అన్నాడు కీచుగా.
    "ఎవరెస్ట్ రెడ్డి."
    "డైనోసారు గుడ్డు రెడ్డేం...కాదు." వెటకారంగా అన్నాడు కానిస్టేబుల్.  ఆ కానిస్టేబుల్...ఎక్కువగా...నెక్ లెస్ రోడ్ ప్రాంతంలో...నైట్ డ్యూటీ చేస్తుంటాడు. అతనికి...వేశ్యలు ఎక్కువగా తగులుతుంటారు. వాళ్ళ పేర్లు చెప్పమంటుంటే.... అసలు పేర్లు చెప్పరు. 'ఇలియానా' అనో, 'జెనీలియా' అనో, 'త్రిష' అనో, 'సానియామీర్జా' అనో...కూస్తుంటారు.
    "నీ పేరేంటి?" అడిగాడతడు, కానిస్టేబుల్ ను.
    "పెంటయ్య."
    "ఓహో! నీపేరు...నాపేరు కంటే బావుందనా...నీ ఉద్దేశ్యం?"
    "మంచీ చెడూ కాదు...నాది అసలు పేరు, నీది దొంగ పేరు."
    "నాది దొంగపేరని నీకెలా తెలుసు?"
    "మరి...కాకపోతే...ఎవరెస్టు రెడ్డేమిటి. నేను...హౌలా గానిలాగా కనిపిస్తున్నానా ఏంది?"
    "నా పేరు ఎవరెస్టురెడ్డే! నా...సర్టిఫికెట్లు చూపిస్తా. లక్షరూపాయలు పందెం వేసుకుందామా?"
    కానిస్టేబుల్ కు అతని వాలకం చూసి, అతని పేరు సరైన పేరేననిపించింది.
    "ముందు...స్టేషన్ కు తీసుకుపోయి...మక్కెలిరగదంతా...మా వాళ్ళతో తన్నిస్తా! ఆ తర్వాత...చూద్దాం.... పేరు సంగతి...! టైరు విప్పదీసి...హుసేన్ సాగర్ లో వేస్తావా! స్టేషన్ లో నీ టైర్లు విప్పుతాం." అన్నాడు కానిస్టేబుల్.
    "ఒక చిన్న రిక్వెస్టు." అన్నాడు ఎవరెస్ట్ రెడ్డి.
    "ఏంది?"
    "నన్ను దయచేసి...లాఠీలతో కొట్టొద్దు...! ఇనుపరాడ్లతో కొట్టండి."
    "ఆఁ?!!!!"
    "అవును. లాఠీలంటే నాకు పడవు. వాటి దోస్తే...కటిఫ్ చేసానెప్పుడో. వీలైతే...ఇనుపరాడ్ ను ఎర్రగా...కాల్చి...నాకు వాతలు పెట్టండి."
    "!!!!!!"
    "దయచేసి...నా వీపుమీద వాతలు పెట్టొద్దు. ఇంకెక్కడైనా పెట్టుకోండి. అలాగే...వీలైతే...ఏసిడ్ తెచ్చి నా మొహాన పొయ్యండి."
    "?!!!!" కానిస్టేబుల్ కు...భారతదేశానికి తూర్పున హిమాలయాలు, పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రం ఉన్నాయేమోనని భ్రమ కలిగింది.
    "యాసిడ్ అంటే...లెట్రిన్లు కడిగే యాసిడ్ కాదు. మాం...ఛి...నిఖార్సయిన...యాసిడ్ తీసుకురాండి. నైట్రిక్ యాసిడ్ అయితే అంత పవర్ ఫుల్ గా ఉండదు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే...కొంత బెటర్... నా చర్మం...మాడిపోయిన మామిడి తోక్కలా అవుతుంది."
    "............." కానిస్టేబుల్ కు అర్జెంటుగా ఆంద్రప్రదేశ్ ను పాతికముక్కలు చేయాలని...ఒక్కోముక్కా...ఒక్కో క్రికెటర్ కు అమ్మేయాలని...అనిపించింది.
    "అనుకుంటాం గానీ...సిట్రిక్ యాసిడ్, ఆగ్జాలిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్... ఇవన్నీ శుద్ధ దండగ! అస్సలు నన్నడిగితే...ఏసిడ్ లలో కెల్లా బెస్ట్ యాసిడ్...సల్ఫ్యూరిక్ యాసిడ్. మాంఛి.... గాఢమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ పోయండి....నామీద! అప్పుడుంటుంది...నా సామిరంగా...వొళ్ళంతా...కసకసకస....సూదులు పొడిచినట్లయ్యి...తగలబడిపోతుంది. మాం...ఛి...వాసన వస్తుంది. చర్మకాలే వాసన...పీల్చారా? నేను...శ్మశానాలలో చాలాసార్లు పీల్చాను...మాం...ఛి... సుగంధం."

    "............" కానిస్టేబుల్ కు అర్జంటుగా ఒంటికీ, రెంటికీ వెళ్ళాలనే భావన కలిగింది.
    "అసలే...భారతదేశంలో కల్తీ ఎక్కువ. యాసిడ్ కొనేటప్పుడు...రుచి చూసి మరీ కొనండి. పుల్లగా ఉండాలి సుమా! అప్పుడే...అది యాసిడ్ అని అర్ధం. ముందుగా...స్టేషన్ లో నన్ను కట్టేయండి. ఆ తర్వాత...నా కళ్ళలో ఇంకుపిల్లర్ తో యాసిడ్ పొయ్యండి. కళ్ళు రెండు...చిటపట పేలిపోవాలి...రక్తం కారి...నా చొక్కా తడిసిపోవాలి. ఆ తర్వాత...నా కడుపు మీద వెయ్యండి. పొట్టపగిలి...పేగులు బయటికి రావాలి...రక్తం జివ్వున చిమ్మాలి!"
    "వొయి...క్! వొ...యి...క్!!" కానిస్టేబుల్ వాంతిచేసుకోసాగాడు.
    ఎవరెస్టురెడ్డి, అతని చెవులను ఆనిస్తూ...తన రెండు చేతులనూ...కానిస్టేబుల్ తలమీద పెట్టి, "ఇప్పుడు ప్రశాంతంగా వాంతి చేసుకో! వాంతి చేసుకునేటప్పుడు...చేతులను ఇలా పెడితే మంచిది. అవునూ...నువ్వెవరితోనైనా కాలుజారావా? ఈ వాంతి ఎందుకు చేసుకున్నావ్?" అడిగాడు.
    "వొయిక్...వొయిక్...వొ...యీ...క్ క్ క్...!!"
    "నా సలహా ఏమిటంటే...ఈ వాంతిని...నువ్వు...మూటగట్టి తీసుకెళ్ళు. ఫ్రిజ్ లో పెట్టు...పెట్టీ..."
    కానిస్టేబుల్ అతణ్ణి ఒక్కతోపు తోసి...వాంతి చేసుకుంటూనే...వెనక్కి తిరిగి చూడకుండా...పారిపోసాగాడు.
    "పెంటయ్యా... నీ అడ్రసు చెప్పు...నీ వాంతిని...నేను కొరియర్ చేస్తా..." అరుస్తూ ఎవరెస్టు రెడ్డి అతని వెంటపడ్డాడు.
    కానిస్టేబుల్ పెంటయ్య...వేగంగా పరుగెత్తుకెళ్ళి...తన బైక్ ఎక్కి...స్టార్ట్ చేసాడు. ఇంజన్ స్టార్ట్ అయ్యింది కానీ... బైకు ముందుకు పోలేదు.
వెనక్కి తిరిగిచూసేసరికి...ఎవరెస్టు రెడ్డి ఉన్నాడు. అతని చేతిలో...టైరు ఉంది.
    "హ్హిహ్హి...ఇది పోలీసుబండి అని తెలీక...విప్పాను. సారీ! దీని రుచి...ఏమిటి...చాలా బావుంది? నీ బైకును... ఆవుపేడలో నుండి నడుపుతూ తెచ్చావా?"  అన్నాడు దాన్ని నాకుతూ.
    కానిస్టేబుల్ పెంటయ్య బండి వదిలేసి...పారిపోయాడు.
    ఎవరెస్టు రెడ్డి...టైరును నాకుతూ...కదిలాడు.
        *    *    *
    టి.వి. సీరియల్ నటి లలితకు తెలివొచ్చింది.
    తెలివి అంటే...'తెలివి తేటలు', 'తెలివైన వ్యక్తి', 'తెలివి తెల్లారినట్లే ఉంది'...ఈ పదాలలోని తెలివి...కాదు.
    స్పృహవచ్చింది...అని అర్ధం!
    స్పృహరాగానే చుట్టూ చూసింది. తన తల్లిదండ్రులు, అన్నయ్య...గదిలో కూర్చుని వున్నారు.
    "నేను...మన ఇంటికి ఎలా వచ్చాను?" అడిగింది లలిత.
    "నువ్వు...షూటింగ్ జరిగే ఇంటి బాత్రూంలో...స్పృహ తప్పిపడిపోయావ్. మీ యూనిట్ వాల్లే...తీసుకొచ్చారు." అంది తల్లి బాధగా.
    "వాడేడీ?" అంది ట్రాన్స్ లో ఉన్నట్లుగా.
    తల్లి...'వాళ్ళే' అనే పదాన్ని 'వాల్లే' అనేసరికి గుర్తొచ్చింది, లలితకు.
    "ఎవరు...నీకు పచ్చబొట్టు వేసిన వాడా?" అడిగాడు తండ్రి.
    "పచ్చబొట్టు ఏంటి?" అడిగింది లలిత అయోమయంగా.
    ఆమె అన్నయ్య, ఆమెకు అద్దాన్ని అందించాడు.
    ఆమె అద్దంలో చూసుకుంది.  
    తన నుదుటిమీద...పచ్చబొట్టు! ఇంకా...రక్తపు మరకలు సరిగ్గా ఆరలేదు... ఆమె తల్లిదండ్రులూ, డాక్టరూ.... నుదుటిని తుడవడం వల్ల...ఆమాత్రమైనా...బెటర్ గా ఉంది.
    ఆ అక్షరాలు...స్పష్టంగా కనిపిస్తున్నాయి.
    "విస్వభాషలందు తెలుగు లెస్స!"
    ఆమె కెవ్వున అరిచింది.
    ఆ అరుపుకు...ఆమె ఇంటి హాల్ లో కూర్చునివున్న...ఎస్సై, సీరియస్ రచయిత, దర్శకుడు లోపలికి వచ్చారు.
    ఆమె...అద్దాన్ని విసిరేసింది. అది భళ్ళున పగిలి ముక్కలయ్యింది.
    "దొంగరాస్కెల్...గాడిదకొడుకు...వాడి పల్లురాలగొడతా...వాడి కల్లల్లో ముల్లు గుచ్చుతా..." అంది ఏడుస్తూనే.
    తల్లి, ఆమెను దగ్గరకు తీసుకుని అనునయించింది.
    "అసలు...బాత్రూంలో ఏమయ్యింది?" అడిగాడు ఎస్సై.
    "ఎవడో...ఆల్రెడీ బాత్రూంలో ఉన్నాడు. నేను...వరున్ అనేపదాన్ని వరున్ అని పలికినందుకు కొట్టాడు." అంది ఏడుస్తూ. 
    'వరున్ అనే పదాన్ని వరున్ అనక...మరేమంటారు?' మనసులో అనుకున్నాడు ఎస్సై.
    "కల్లు అనే పదాన్ని కల్లు అన్నానని...కొట్టాడు." అంది ఏడుపు కొనసాగిస్తూ.
    "కల్లు...కల్లంటే...తాగే కల్లే కదా! ఈత కల్లు, తాటి కల్లు...కల్లును...కల్లు అంటే తప్పేమిటి?" ఎస్సై బుర్రగోక్కుంటూ అడిగాడు.
    "తాగే కల్లు కాదు..." అంది ఏడుస్తూ.
    "ఓహో...తినే కల్లుకూడా ఉందా? నాకు తెలీదే?!"
    "అబ్బా! కల్లంటే...ఇవి...ఐస్..." అంది తన కళ్ళు చూపిస్తూ.
    "ఓహ్...కళ్ళా!!"
    "ఆఁ...కల్లే! కల్లును...కల్లూ అన్నానని, బానమును...బానం అన్నాననీ...కొట్టాడు. తెలుగు పదాలు పలకడం చేతగాకపోతే...ఎందుకు నటిస్తున్నావ్ అంటూ కొట్టాడు." అంది.
    "................."
    దర్శకునికి...విషయమేమిటో పూర్తిగా అర్ధమయ్యింది.
    "బయటికి పదండి సార్...మాట్లాడాలి." అన్నాడు దర్శకుడు, ఎస్సైతో.
    ఎస్సై, అతని వెంట హాల్లోనికి నడిచాడు. రచయిత వారిని అనుసరించాడు.
    "సార్! వాడెవడో...తెలుగు భాషకు వీరాభిమానిలా ఉన్నాడు. ఈ అమ్మాయి తెలుగు పదాలను సరిగ్గా పలకదు. అఫ్ కోర్స్! ఈ రోజుల్లో...చాలామంది నటీనటులు ఇలాగే ఉన్నారనుకోండి. వాడు...ఈమెను అందుకే కొట్టాడు. మామూలుగా అయితే...తెలుగు పద్యం ప్రకారం...దేశభాషలందు తెలుగు లెస్స అనాలి. వాడికి...తెలుగంటే ఎంత పిచ్చో...ఆమె మొహం మీద వేసిన పచ్చబొట్టును చూస్తుంటే తెలుస్తోంది. వాడు...కనీసం...ఆసియా భాషలందు తెలుగులెస్స అనో... దక్షిణార్దగోళమందు తెలుగులెస్స అనో...ప్రపంచభాషలందు తెలుగు లెస్స అనో...రాయలేదు. ఏకంగా...ప్రపంచ భాషలందు తెలుగులెస్స అని వ్రాసినా... ఏ గ్రహంమీదో జీవులు ఉండొచ్చనీ...వాటికీ ఒ భాష ఉంటుందనీ...అయితే...ఆ భాషకన్నా...తెలుగే...గొప్పదనీ.... వీడి ఉద్దేశ్యం! అందుకే...విశ్వభాషలందు తెలుగు లెస్స అని వ్రాసాడు." తను అర్ధం చేసుకున్నది వివరించాడు దర్శకుడు. 
    "ఇంత చక్కగా విశ్లేషించి చెపుతున్నారు. కొంపదీసి...వాడికీ, మీకూ పరిచయం ఉందా?" ఈ పని నువ్వే చెయ్యించావా అనే ధ్వని వినిపించేలా అడిగాడు ఎస్సై.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS