Previous Page Next Page 
అందరూ మేధావులే  పేజి 4

అందరూ మేధావులే!?!

                                                           - కండ్లకుంట శరత్ చంద్ర                                          

 

పార్ట్ - 4

    జ్ఞానచంద్ర గొంతు సవరించుకున్నాడు.
    "మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో...నాకు అర్ధంకావడంలేదు. మీరేగనక ఈ రోజు... చురుకుగా పని చేసుండకపోతే...పరిస్థితి ఇంకా...దారుణంగా ఉండేది."
    తమను తిడతాడేమోనని...ఉద్యోగం నుండి పీకిపారేయించేస్తాడనీ మధనపడుతున్న ఆ నలుగురికీ... ఆయన మాటలు పన్నీటి జల్లులా తగిలాయి. నలుగురూ...సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
    "మీరు చేసిన పనికిగానూ...మీకు ఒక్కొక్కరికీ...పాతికవేల రూపాయలు...నా పర్సనల్ అకౌంట్ నుండి...బహుమతిగా ఇస్తున్నాను."
    ఆ నలుగురూ...ఆనందంతో లేచి నిలబడ్డారు.
    "అయ్యా...చాలా సంతోషం..." అన్నాడు సుబ్బన్న.
    "నా కూతురికి పెళ్ళి చేస్తున్నాను సార్. పెళ్ళిబట్టలు...ఈ డబ్బుతో కొంటాను." అన్నాడు శీనయ్య.
    "నా అప్పు...సగం తీరిపోతుంది సార్." అన్నాడు ఖాజా.
    "మీరు దేవుడు సార్!" అని మాత్రం అన్నాడు ఏసుపాదం.
    "అయితే...సమస్య...పూర్తిగా సమసిపోలేదని మీకూ తెలుసు. మీరు...నాకు పూర్తిగా సహకారం అందించాలి." అన్నాడు జ్ఞానచంద్ర.
    "అయ్యో...మీరు చెప్పాలా సార్! అది...మా డ్యూటీ! మేము...అదే పనిమీద...ఉంటాం." స్థిరంగా అన్నాడు ఖాజా.
    "మీరు...ఆ పని చేస్తారని నాకు తెలుసు. కానీ...ఒక విన్నపం! దయచేసి...ఈ విషయం...మీడియాకు తెలీకూడదు. తెలిస్తే...మన పరువుపోతుంది. విషయం...మనలోనే ఉండాలి. మనమందరం...కలిసి...సాధిద్దాం." అన్నాడు జ్ఞానచంద్ర.
    అందరూ తలలూపారు.
    "ఆ...బాస్టర్డ్...శేఖర్ గాడు కనిపిస్తే..." జ్ఞానచంద్ర మాట పూర్తికాకముందే...శీనయ్య అన్నాడు..." పట్టి తెస్తాం బాబూ."
    "వద్దు. దొరికితే...ముందు కనీసం...రెండు పళ్ళైనా రాలగొట్టండి. ఆ వెధవకు జ్ఞానదంతం...ఇంకా రాలేదు సరికదా...అజ్ఞానదంతాలు ఎక్కువై...కొట్టుకుంటున్నాడు." అన్నాడు జ్ఞానచంద్ర పళ్ళు పటపటకొరుకుతూ.
    నలుగురూ తలలూపారు.
    "మీడియాకు తెలీకుండా...జనం దృష్టికి రాకుండా...మీరు ఈ పని పూర్తిచెయ్యాలి. అలా చేస్తే...మరో పాతికవేలు అదనంగా ఇస్తాను." చెప్పి బయటికి నడిచాడు జ్ఞానచంద్ర వాళ్ళూ...వాళ్ళతోపాటు...రాఘవేంద్ర బయటికి నడిచాడు.
    వాళ్ళ పని ఏమిటో...వాళ్ళకు విడమరిచి చెప్పనక్కర్లేదు!!
    బయటకి వెళ్ళగానే...అందరూ తలో దిక్కుకు కదిలారు.
    ఆ అయిదుగురిలో ఒకరు...సెల్ ఫోన్ బయటికి తీసి...ఫోన్  చేసారు.
    "హలో..." కరుకుగా వినిపించింది అవతలి నుండి ఓ కంఠం.
    "హలో..."
    "ఊఁ! చెప్పు...ఏమంటున్నాడు...జ్ఞానచంద్ర."
    "టెన్షన్ పడుతున్నాడు. నలుగురికీ తలో పాతికవేలు ఇచ్చాడు. ఇంకా ఇస్తాడట...పని పూర్తయితే..."
    "హ్హహ్హహ్హ...హ్హహ్హహ్హ...అమాయకుడు. నీకు...నా థాంక్స్! నువ్వు సహాయం చేసుండకపోతే...నా పరిస్థితి ఘోరంగా ఉండేది. అసలే...వారంరోజుల్లో...నేనొక హత్య...చేయాల్సివుంది.
    "ఎవరిని?"
    "అది నీకు అనవసరం..." అవతల ఫోన్ కట్ అయ్యింది.
    ఫోన్ కట్ చేసిన వ్యక్తి...ప్రొఫెషనల్ కిల్లర్...యశ్వంత్!
    తన స్వార్ధం కోసం...పోలీస్ డిపార్ట్మెంట్ నూ, న్యాయస్థానాన్ని తెలివిగా మోసంచేసి...ఆఖరకు... ఈరోజు... తన చదరంగంలో భాగంగా...జ్ఞానచంద్రను ఇక్కట్లలోనికి నెట్టిన...యశ్వంత్!!
    యశ్వంత్ కు...జ్ఞానచంద్రపై ఎలాంటి పగ, ప్రతీకారభావనా లేవు!
    ఒక ఏనుగు అడ్డదిడ్డంగా పరుగెత్తుతుంటే...అడ్డంవచ్చే కుందేళ్ళను, కుక్కపిల్లలను పట్టించుకోను. అలా...యశ్వంత్ అనే పిచ్చి ఏనుగుకు...జ్ఞానచంద్ర అనే కుందేలు పిల్ల అడ్డం వచ్చింది! ఇక్కడ...ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...ఏనుగు తొక్కడం వల్లే...తన ఇల్లూ... వాతావరణం అస్తవ్యస్తమయ్యాయని కుందేలుకు తెలీదు.
    కుందేలు...తన పరిసరాలు బాగుచేసుకునే పనిలో పడిందే తప్ప...తన పరిసరాలను ఎవరు ధ్వంసం చేసారో... ఆలోచించే స్థితిలో అస్సలు లేదు.
        *    *    *
    కృష్ణకిరణ్...హాల్లో నిలబడి ఉన్నాడు.
అతనికి చెరోవైపు...వాచ్ మెన్, ఆ ఇంటి పనివాడు నిలబడి ఉన్నారు.
    బెడ్ రూమ్ లో నుండి...సన్నగా, ఎత్తుగా, తెల్లగా ఉన్న ఓ వ్యక్తి బయటకి వచ్చాడు.
    "సార్...నిద్ర డిస్టర్బ్ చేసినందుకు సారీ. వీడెవడో...దొంగవెధవ...మన ఇంటి గోడ దూకాడు సార్" చెప్పాడు వాచ్ మెన్.
    బెడ్రూంలో నుండి వచ్చిన ఆ వ్యక్తి, కృష్ణకిరణ్ వంక చూసి, "ఏరా...దొంగవెధవా...నా ఇంట్లో...ఏం ఎత్తుకుపోదామని వచ్చావ్ రా...?" నిద్రగొంతుతో అడిగాడు.
    కృష్ణకిరణ్...అతని వంక పరీక్షగా చూసి... "సార్...మీరు...మీరు...వావ్...వావ్...పి.వి. రాజకృష్ణనాథ్ వర్మ... కదూ!!" అన్నాడు సంబరంగా.
    "అవును." అన్నాడు ఆవులిస్తూ.
    "మీరేంట్సార్...ఇక్కడున్నారు? మీరు...సినిమా డైరెక్టర్ కదా?" అన్నాడు కృష్ణకిరణ్.
    "ఇది నా ఇల్లు...అని తెల్సుకోకుండానే దొంగతనానికి వచ్చావా?" అన్నాడు దర్శకుడు.
    "నేను దొంగతనానికి రాలేదు సార్!"
    "మరి? నా ఆటోగ్రాఫ్ కోసం వచ్చావా?"
    "మీరేమైనా...సచిన్ టెండుల్కరా...అబ్దుల్ కలామా...మీ సంతకం నాకెందుకు సార్?" అది వినగానే... దర్శకుడి మత్తు వదిలింది.
    "మరి ఎందుకొచ్చావ్?" అడిగాడు కోపంగా.
    "నన్ను...దెయ్యం తరిమింది సార్."
    "ఏంటీ?" మొహం చిట్లించి అడిగాడు దర్శకుడు.
    "దెయ్యం సార్."
    "దెయ్యమా...రౌడీలా?"
    "దెయ్యమే సార్!"
    "ఈ రోజుల్లో...దెయ్యాలేంటయ్యా...పిచ్చా నీకు?"
    "అదేంట్సార్...అలా అంటున్నారు. దెయ్యాలరాత్రి...అని మీరో సినిమా తీసారుగా."
    "హేయ్! మా నమ్మకాలతో సినిమాలు తీయడానికి...మేమేమీ...కె. విశ్వనాధ్...తమ్ముళ్ళమో...జంధ్యాల శిష్యులమో కాదు."
    "............."
    "నిజం చెప్పు. దొంగతనానికి వచ్చి...కధలు చెప్తున్నావ్ కదూ."
    "లేద్సార్...! అమ్మతోడు...సార్! నిజంగా దెయ్యాన్ని చూసాను సార్. ఆ భయంతోటే...అనుకోకుండా మీ ఇంటికి గోడ దూకాను సార్!"
    "నేనుగానీ...సమయానికి చూడకపోయుంటే...మన కుక్కకు బలయ్యేవాడు సార్!" అన్నాడు వాచ్ మెన్, దర్శకునితో.
    దర్శకుడు 'అలాగా!' అన్నట్లు తలూపి...కృష్ణకిరణ్ వంక చూసి, "సరే! వెళ్ళిపో." అన్నాడు.
    "నేను బయటికి వెళితే... ఆ దెయ్యం మళ్ళీ వస్తుందేమో సార్!" భయంభయంగా అన్నాడు కృష్ణకిరణ్.
    "చూడు! ఒకవేళ అది దెయ్యమే అయితే...నిన్ను చంపాలని అనుకుంటే...అది ఎక్కడికైనా వస్తుంది. కేవలం బయటమాత్రమే...వెంటాడదు. అది దెయ్యమే అయితే, మా ఇంట్లోనికి రావాలిగా? మరి...రాలేదేం? సో...అదంతా నీ భ్రమ, వెళ్ళు." తార్కికంగా వివరించడానికి ప్రయత్నించాడు...అస్సలు లాజిక్కే లేకుండా సినిమాలు తీసే...ఆ దర్శకుడు.  
    కృష్ణకిరణ్...అనుమానంగానే తలూపి...బయటికి నడిచాడు.
    అతడు...బయటికి నడవగానే...దర్శకుడు. వాచ్ మెన్ వంక కోపంగా చూసి, చెప్పాడు. ఇదే...లాస్ట్ వార్నింగ్... ఇంకోసారి ఇలా జరిగితే...నీ ఉద్యోగం పోతుంది."
    "సారీ సర్! మిమ్మల్ని...నిద్రలేపను."
    "నేను తిడుతోంది...నన్ను నిద్రలేపినందుకు కాదు."
    "............"
    "మన...ప్రభాకర్ బాబును...కుక్క అని పిలిచినందుకు" చెప్పి, విసవిసా బెడ్రూంలోనికి వెళ్ళిపోయి.... 'అసలు... దెయ్యాలు నిజంగా ఉన్నాయా?! ఎందుకైనా మంచిది...' అనుకుంటూ...ఆంజనేయస్వామి ఫోటోలు దిండుక్రింద పెట్టుకుని పడుకున్నాడు. దర్శకుడికి...తన కుక్క అంటే ప్రాణం. అయితే...ఆ కుక్కకు...తనకు పారితోషకం ఎగ్గొట్టిన నిర్మాత... ప్రభాకర్ బాబు పేరు పెట్టాడు.
    వెర్రి...వేయి విధాలు!!
    కృష్ణకిరణ్, గేటు దాటి బయటికి వచ్చాడు. దెయ్యం ఎక్కడా కనిపించలేదు.
    'హమ్మయ్య!' అనుకుంటూ...గబగబా నడవసాగాడు.
    అతడు...అరకిలోమీటర్ నడిచాక...ఒక చెట్టుకు...తలక్రిందులుగా వ్రేలాడుతూ...తనను తరిమిన దెయ్యం కనిపించింది.
    అతడి వొంట్లో...రక్తపోటు...కాస్త పెరిగింది. భయంతో పళ్ళు పటపట కొట్టుకున్నాడు.
    ఆ దెయ్యం...సునాయాసంగా...చెట్టు నుండి క్రిందికి దూకింది.
    దాని కళ్ళు...ఎర్రగా కాలిన చింతనిప్పుల్లా ఉన్నాయి!!
    ఒక్కసారిగా...కృష్ణకిరణ్ వైపు దూసుకొచ్చింది.
    "బ్యా....వ్...." ఒక్క పొలికేకపెట్టి సందుల్లో పడి పరుగెత్తసాగాడు. అది...అతణ్ణి తరుముతూనే వుంది!!
        *    *    *
    అతడు గజగజ వణికిపోతున్నాడు.
    "ఎందుకు...అట్లా వణుకుతుండావ్?" అడిగాడు రైల్వే పోలీస్, ఆ వ్యక్తిని ఎగాదిగా చూస్తూ.
    "సా....ర్....న....న్ను....న్ను....న్ను...."
    "ఏమైనాది? మలబద్దకమా? అట్లా...పలుకుతుండావేంది?"
    "క్...క్...కా...దు...సా...ర్...! ఒకడు నన్ను చంపబోయాడు సార్." వణుకుతున్న కంఠంతో చెప్పాడు.
    "ఏమైనాది?!" నింపాదిగా అడిగాడు పోలీస్.
    "సార్...నా పేరు...సుబ్బారావు. మా ఇల్లు...ఈ రైల్వేస్టేషన్ వెనకే...! నేను...టైంపాస్ కని...అప్పుడప్పుడు.... ఈ స్టేషన్ లోనికి వచ్చి కూర్చుంటాను. ఒకడు...నా దగ్గరికి వచ్చి...ఆత్మహత్య చేస్కోవాలి...రైలు ఎన్నింటికి, ఏ ప్లాట్ ఫారమ్ మీదికి వస్తుందీ...అని అడిగాడు సార్! వాడికి, నేను ఆ వివరాలు చెప్పకపోయేసరికి...వేరేవాళ్ళను అడిగాడు సార్. ఆ తర్వాత...పట్టాలమీద పడుకున్నాడు సార్! చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణం పోతుందంటే...ఎలా ఊరుకుంటాం సార్! నేను... వాణ్ణి రక్షించాలని వెళ్ళాను సార్! కానీ...వాడు...నన్నూ పట్టాల మీదికి లాగాడు సార్." 
    "ఓహో! మరి చచ్చిపోలేదేం?" అడిగాడు పోలీసు వాచీ చూసుకుంటూ.
    "అదేంట్సార్...అలా అంటారు. సమయానికి రైలు...మా పట్టాల మీదికి కాకుండా...ప్రక్కనున్న పట్టాల మీది నుండి వెళ్ళడం వల్ల...బ్రతికిపోయాం సార్!" అన్నాడు ఏడుస్తూ.
    "బతికినావు కదా! ఏడుస్తావేమి? అసలే...నైట్ డ్యూటీలతో చచ్చిపోతా వుంటే...స్టేషన్ లో...ఇట్లాంటి గొడవలు. ఛ." అన్నాడు కానిస్టేబుల్ బుర్రగోక్కుంటూ.
    ఆ పోలీసుకు... స్టేషన్ లో దొంగలు, రైలు కింద పడజూసే జనాలు, తన్నుకునేవాళ్ళు, డబ్బులు పెట్టి పేకాట ఆడే పేకాటరాయుళ్ళు, పారిపోయి వచ్చే పిల్లలు, గంటల తరబడి నిలబడే వేశ్యలు... ఇలా రకరకాల నెగిటివ్ మనుషులను చూసీ చూసీ...విరక్తిపుట్టింది.
    "సార్...వాడు మళ్ళీ కనిపిస్తే...అరెస్టు చెయ్యండి సార్...వాడి పేరు నార్ల రాజశేఖర్! అయిదడుగులా ఏడంగుళాల ఎత్తు...ఉంటాడు. ఉంగరాల జుట్టు. చామనఛాయ."
    'సికిందరాబాద్ ప్రాంతంలో... ఆ ఎత్తు ఉన్నవాళ్ళు...ఓ లక్షమంది ఉండొచ్చు. ఓ పదిలక్షలమంది.... చామనఛాయగాళ్ళు ఉండుంటారు. ఇహ...ఆంద్రప్రదేశ్ లో ఉంగరాల జుట్ల వాళ్ళకు కొదువేలేదు. ఈ మూడూ కలిపిన లక్షణాలున్నవాళ్ళు...వీధికి పదిమంది...ఉంటారు. ఇహ నాకు పనీ పాటా ఏమీ లేదా!' మనసులో అనుకున్నాడు పోలీసు.
    "ఆఁ! సరే...నువ్వు పో..." అన్నాడు బయటకు.
    సుబ్బారావు, కన్నీళ్ళు తుడుచుకుంటూ" మా ఆవిడ పుస్తె గట్టిది!" అనుకుంటూ... వెళ్ళిపోయాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS