కొత్త ఫీచర్ ప్రారంభం
It's My Experience
రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది...
Remote Control
లేఖా గుమ్మడి
మెడిటేషన్ గొప్పతనం గురించి అటు ఆధ్యాత్మిక గురువులు, ఇటు వైద్యశాస్త్ర నిపుణులు కూడా ఎంత ఢంకా బజాయించి చెప్తున్నా నాకు దానిమీద అంతగా నమ్మకం ఉండేది కాదు.
''ఆ.. ఏముందిలే.. ఒకళ్ళు మొదలుపెడితే వరసబెట్టి అందరూ ఊదరగొడతారు..'' అనుకునేదాన్ని.
మా చిన్నత్తయ్య (ఆర్టిస్ట్ శ్రీమతి నిర్మలాదత్) ''గోయంకా మెడిటేషన్ సెంటర్''లో టీచర్. APPSC లో ఉద్యోగం చేస్తూనే, విపస్సన వైపు ఆకర్షితురాలైంది. అత్తయ్య నాతో పదిరోజుల కోర్సు చేయించదానికి ఒప్పించింది. ఆర్రోజులు E.L., నాలుగు రోజుల loss of pay మీద వెళ్ళాను. నిజం చెప్పొద్దూ.. ''ఏంటో.. ఈ అత్తయ్య మీది ఇష్టంతో కాదనలేక వెళ్ళడమే గానీ.. దండగమారి పని చేస్తున్నాను.. నాలుగు రోజుల శాలరీతో ఓ మాంచి చీరో, డ్రెస్సో కొనుక్కొక ఇలా ఇరుక్కున్నానే..'' అని నిట్టూరుస్తూనే వెళ్ళాను.
గోయంకా విపస్సన అంటే పది రోజులు పూర్తిగా అక్కడే (Meditation Centre) మకాం. బయటి ప్రపంచంతో సంబంధమే ఉండకూడదు. నాలుగురోజులు యమాయమా కష్టంగా అనిపించింది. వ్యోమగామిని కాకుండానే చుక్కల్ని చూసొచ్చాను. అచ్చం జైల్లా ఉండేది. పొద్దున నాలుగ్గంటలకి లేస్తే రాత్రి తొమ్మిదిన్నర దాకా ధ్యానం.. ధ్యానం.. ధ్యానం.. నాకసలే పొద్దున్నే లేవడమంటే మాచెడ్డ చిరాకు. అలాంటిది చిమ్మచీకట్లో లేచి అడవిలాంటి చెట్లమధ్య నుంచి నడుచుకుంటూ పగోడా (Bouddha Meditation Hall) చేరాలి. రెండుగంటలు ఏకబిగిన ధ్యానం. టిఫిన్ తిని మళ్ళీ ధ్యానం. భోజనం చేసి మళ్ళీ... ఇలా చిన్నచిన్న విరామాలతో రోజంతా మెడిటేషనే. అబ్బో.. విరక్తి వచ్చిందంటే నమ్మండి. కాళ్ళు పీక్కుపోయేవి. కదలకుండా ఒకే postureలో కూర్చోవడం కంటే గోడ కట్టే మేస్త్రీ పని నయం అనిపించేది. ఆకలి దంచికొట్టేది. నిద్ర ముంచుకొచ్చేది. విపరీతంగా ఉబ్బరించేది. దగ్గరదగ్గరగా ఫాన్లున్నా వేసేవారు కాదు. కష్టాలు, సుఖాలకు ప్రతిస్పందించకూడదు, అన్నిటినీ సమానంగా చూడాలి, దేనిమీదా ఇష్టం, అయిష్టం లేకుండా నిశ్చలంగా ఉండాలి, ఏదీ శాశ్వతం కాదు, కష్టసుఖాలన్నీ ఇలా వచ్చి అలా పోయేవే - అనే బుద్ధుడి ఫిలాసఫీని practicalగా బోధించడమే ధ్యాన తరగతుల ఉద్దేశం.
అక్కడి టీచర్తో .. అదీ అత్యవసరం అయితే తప్ప మరెవ్వరితో ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మహా మౌనం.. నోబుల్ సైలెన్స్.. గోడలెక్కి దూకడం రాదు.. కానీ క్షణంలో దూకి అక్కణ్ణించి మాయమైపోవాలనిపించేది. సరే, ఏమైతేనేం.. ఆ కష్టాలన్నీ గట్టెక్కి కోర్సు పూర్తిచేశాను.
అమృతం ఊరికే వస్తుందా? మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్రాన్ని చిలికితే వచ్చింది. అది కూడా ముందు విషం వచ్చిన తర్వాత. అలాగే గోయంకా మెడిటేషన్ కోర్సు కూడా చాలా కష్టమైంది. కథల్లో మునుల తపస్సు గురించి చదివితే ''ఏదో ముక్కు మూసుకుని కూర్చోడమేగా'' అనిపిస్తుంది. దిగితే కానీ లోతు తెలీదు.. అన్నట్లు.. అది చాలా చాలా కష్టం. అందుకే దేవుళ్ళు ప్రసన్నమైపోయి వరాలు గుప్పించేవారు. నాకూ అలాగే, కష్టం పూర్తయ్యాక ఒక మహానుభూతి అనుభవానికి వచ్చింది.
మనసును పూర్తిగా నియంత్రించగల్గితే.. అదేమంత తేలిగ్గా సాధ్యం కాదు.. ఏ రాకెట్టూ వెళ్ళలేనంత వేగంగా ఎక్కడెక్కడో విహారాలు చేస్తుంది.. కానీ.. ఆ చంచల మనసు పగ్గాలు గనుక చిక్కించుకుంటే ఇక అద్భుతాలు సాధించొచ్చు. ఇందులో ఎలాంటి కల్పనా లేదు.. వీసమెత్తు అతిశయోక్తి లేదు. చేయాల్సిందల్లా ఏ ఆలోచనా లేకుండా blankగా ఉండాలి. వింటే ''ఓస్ ఇంతేనా'' అని కళ్ళెగరేస్తాం. కానీ కళ్ళు మూసుకు కూర్చుంటే ''వామ్మో, ఇంత కష్టమా'' అని నీరసంగా నిట్టూరుస్తాం. మనసు అరసెకను కూడా నిలకడగా ఉండదు. ఎక్కడెక్కడో కుప్పిగంతులు వేస్తుంది. బుడమేరులో మునిగి మిసిసీపీలో తేలుతుంది. కానీ దాన్ని కనుక blankగా ఉంచగలిగితే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది.
అబ్బో.. రోజూ కోట్లమంది ధ్యానం చేస్తుంటారు.. ధ్యానానికి నిజంగా అంత పవరుంటే వాళ్ళంతా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోరా.. హిట్లర్లైపోయి శాసించరా అనుకోవచ్చు.. కానీ గుడికి వెళ్ళినవాళ్ళంతా భక్తులు, కవిత్వం రాసినవాళ్ళంతా కాళిదాసులు కారు. ఎందులోనైనా perfection సాధిస్తే అది తపస్సుతో సమానం. నిజమైన ధ్యానం చేస్తే మాత్రం వాళ్ళు సిసలైన మహర్షులౌతారు. దేన్నయినా శాసించే రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది.
గోయంకా విపస్సనా కోర్సుతో ధ్యానం గొప్పతనాన్ని తెలుసుకున్నాను. అనుభూతి చెందాను. కానీ కోట్లాదిమందిలాగే దాన్నో తపస్సులా చేయలేదు కనుక చిన్నచిన్నసమస్యలను మాత్రమే తొలగించుకోగలను. మామూలుగా సముద్రంలా అల్లకల్లోలంగా ఉండే మనసు కాసేపు ధ్యానం చేస్తే మహా ప్రశాంతంగా మారడమే కాదు, నాకెదురైన సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ''మెడిటేషన్ అంటే ఎస్కేపిజం'' అని వాదించేవారికో నమస్కారం. ఒకసారి చేసి చూస్తే ''ధ్యానం పారిపోవడం కానేకాదని, సమస్యను శాంతంగా ఎదుర్కోవడం'' అని అర్ధమౌతుంది.
ఇది నా వ్యక్తిగత అనుభవం.
My experience with god, devotional personal touch, me and god, god in my dreams, angels and gods in dreams, feelings of god
*******************************************************************************
దేవుళ్ళు, దెయ్యాలు, గుళ్ళు, గోపురాలు, ధ్యానం, అలౌకిక ఆనందం
లాంటి అంశాల్లో మీ అనుభూతి లేదా మీకు ఎదురైన మరపురాని సంఘటన గురించి
తెలుగు లేదా ఇంగ్లీషులో రాసి, మీ photoతో సహా ratnakumari.v@objectinfo.com కు పంపండి. short and sweet గా ఉండాలని మర్చిపోవద్దు.
*******************************************************************************