బాబా మహిమలు వర్ణించ శక్యమా?
Sai Baba's Miracle
సరోజినీ దేవి, విజయవాడ
ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బంధుమిత్రులు దగ్గరుండొచ్చు, దూరం కావచ్చు. కానీ.. దేవుడలా కాదు. ఎప్పటికీ నిలిచే పెన్నిధి. సర్వకాల సర్వావస్థల్లో తోడూనీడగా ఉండే ఆత్మీయబంధం. నేను సాయిబాబాను త్రికరణశుద్ధిగా నమ్ముతాను. బాబా నన్ను నిరంతరం కనిపెట్టుకుని ఉంటాడు. అలాంటి ఉదంతాలకు అంతులేదు. అయితే శాస్త్రీయంగా కూడా రుజువు చేసిన సంఘటన ఒకటి చెప్తాను. ఇది జరిగి చాలా ఏళ్ళు గడిచినా ఇప్పుడే జరిగినంత తాజాగా జ్ఞాపకం ఉంది.
నాకు పొత్తికడుపులో బాగా నొప్పి రావడంతో మా ఫామ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. చెప్పిన లక్షణాలను బట్టి ఏవో పెయిన్ కిల్లర్లు ఇచ్చారు. రెండు రోజులు గడిచినా కాస్త కూడా నొప్పి తగ్గనందున మళ్ళీ వెళ్ళాను. డాక్టర్ గారు కంగారుపడి, ''యుట్రస్ ప్రాబ్లం అని చెప్పి.. వెంటనే గైనకాలజిస్టును కలవమన్నారు. డాక్టర్ సుమతి ప్రముఖ గైనకాలజిస్టు. ఆవిణ్ణి కలిస్తే వెంటనే అవసరమైన పరీక్షలన్నీ రాసింది. మరుసటిరోజు ఆపరేషన్ కు సిద్ధంగా ఉండమంది.
తాత్కాలిక ఉపశమనం కోసం డాక్టర్ సుమతి గారిచ్చిన మెడిసిన్లు పనిచేసి నొప్పి తీవ్రత కొంత తగ్గినా ఇంకా పోట్లు వస్తూనే ఉన్నాయి. నొప్పి పోటు వచ్చినప్పుడల్లా ప్రాణం పోతున్నట్లే ఉంది. ఎంత తమాయించుకున్నా ఆగలేక ఏడ్చేస్తున్నాను. ఇంట్లో అందరూ నా చుట్టూ చేరి ఓదారుస్తున్నారు.
నాకు ఆపరేషన్ అంటే చాలా భయం. మందులతో నయమయ్యే అవకాశం లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. ఎక్కువ సమయం కూడా లేదు. తెల్లారితే ఆపరేషన్ విపరీతమైన భయం కలిగింది. మా ఆయనా, పిల్లలు వెక్కిరించడం మొదలుపెట్టారు. ''open heart surgeryలు, kidney transplantation లు జరుగుతున్న కాలంలో దీనికింత హంగామా చేస్తున్నావా? ఆపరేషన్ చాలా తేలిక... కన్ను మూసి తెరిచేలోగా పనైపోతుంది...'' అంటూ నచ్చజెప్పడానికి, భయం పొగొట్టడానికి ప్రయత్నించారు.
కానీ నాకు మట్టుకు భయంగానే ఉంది. ''ఈ గండం ఎలా గడుస్తుంది.. ఏంటి బాబా చోద్యం చూస్తున్నావా? నన్ను రక్షించు నాయనా..'' అంటూ వేడుకున్నాను. నొప్పికి తాళలేక అలా చేరగిలబడ్డాను. వేసుకున్న మందులవల్ల నొప్పిలోనూ మగత.. అలా మాగన్నుగా నిద్ర పట్టింది.. అంతలో చిత్రమైన కల.. మా వాకిటిముందు పెద్ద మంచుగోళం... దానిమీద కృష్ణుడి రూపంలో ఉన్న సాయిబాబా నిలబడి ఉన్నాడు. ''ఏవండీ బాబా చూడండి.. అమ్మా బుజ్జీ.. త్వరగా రా.. బాబాను చూడు.. అయ్యో.. మీరొచ్చేలోగా వెళ్లిపోతాడేమో.. త్వరగా రండి...'' అని కేకలు పెడుతున్నాను. ఎవరూ రాలేదు.. ఇంతలో గుండ్రంగా ఉన్న ఐసంతా కరిగిపోయి బాబా మాత్రమే మిగిలాడు. ''నేనున్నాను కదా.. ఎందుకు భయపడుతున్నావు'' అన్నట్లు సైగ చేసి, అభయహస్తం చూపి అంతర్ధానం అయ్యాడు.
ఉలిక్కిపడి లేచాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. సాయిబాబా కలలో కనిపించడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఇందాకటి నొప్పి ఎక్కడికి పోయిందో తెలీదు. ఇప్పుడే బాధా లేదు. పైగా ఎంతో హాయిగా ఉంది. తెల్లారిన తర్వాత ''నొప్పి తగ్గిపోయింది.. ఇక ఆపరేషన్తో పని లేదు..'' అంటే అందరూ కోప్పడ్డారు. ''చిన్నపిల్లలా మారాం చేయకు.. డాక్టర్ గారిచ్చిన మందులతో నొప్పి తగ్గి ఉండొచ్చు.. కానీ ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పలేదా'' అంటూ నర్సింగ్ హోంకి తీసికెళ్ళారు.
కల గురించి డాక్టర్ గారికి చెప్పాలనిపించలేదు. అందుకే సాయిబాబా కలలో కనిపించిన సంగతి చెప్పకుండా నొప్పి పూర్తిగా తగ్గిపోయిన విషయం మాత్రమే చెప్పాను. ఆవిడ ఆశ్చర్యపోయి ''అలా ఎలా తగ్గింది.. సరే.. మళ్ళీ స్కాన్ చేయించండి'' అంది. అలాగే చేయించాం. రెండోసారి వచ్చిన రిపోర్టులో గర్భసంచిలో ఏమీ తేడా లేదు. పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఆవిడ నవ్వుతూ ''నిన్నటి రిపోర్టు కరక్టు కాదేమో.. సరే.. నార్మల్ గా ఉంది.. ఆపరేషన్ అవసరం లేదు'' అన్నారు.
సుమతిగారు డాక్టర్ కనుక నిన్నటిది రాంగ్ రిపోర్టు అన్నారు. కానీ, నేను స్కాన్ చేయించింది మా బంధువుల డయాగ్నోస్టిక్ సెంటర్లో. వాళ్ళు దగ్గరుండి తీయించారు. ఒకరి రిపోర్టు మరొకరికి ఇవ్వడమో, లేక రాంగ్ రిపోర్టు ఇవ్వడమో జరిగే అవకాశమే లేదు. ఇదంతా ఖచ్చితంగా సాయిబాబా మహిమే. బాబా నాకు అభయహస్తం ఇచ్చాడు.. సాయిబాబా మహిమలు వర్ణించ శక్యమా? బాబా వల్లే నాకు ఆపరేషన్తో పని లేకుండా నయమైంది. నాకు సాయిబాబా కలిగించిన దివ్యానుభూతుల్లో ఇదొకటి.
Saibaba cured my health, sai baba's miracles, sai baba in my dreams, my personal experience with sai baba, shirdi sai baba's miracles