కంటికి రెప్పలా కాపాడతాడు...

God Saves us

వి. పుష్పలీల 

 

అమెరికాలో చాలా కంపెనీల్లో నెలాఖరులో ఉద్యోగులు మూడు కవర్లు అందుకుంటారు. ఒకదాంట్లో పే స్లిప్పు, రెండోదాంట్లో ఆ నెల పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసే పత్రం, ఇక మూడో కవర్లో ఉద్యోగంలో ఉంచుకుంటున్నట్లో లేదా తిలోదకాలు ఇస్తున్నట్లో తెలియజేసే పత్రం..

 

చాలా ఏళ్ళక్రితం ఈ సంగతి విన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. కానీ ఇప్పుడు మనదేశంలో కూడా పరిస్థితి దాదాపు ఇలానే తయారైంది. తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు కానీ.. ఉద్యోగాలు తుమ్మకుండానే ఊడిపోయేట్లున్నాయి. పూర్వం ఒక ఉద్యోగంలో చేరితే ఇక రిటైర్ అయ్యేదాకా అక్కడే. ఇప్పుడలా కాదు. ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇన్ సెక్యూరిటీ అంతకంటే పదింతలు పెరిగింది.

 

ఈ నేపథ్యంలో చాలామందిలాగే మా అబ్బాయి కూడా ఉద్యోగం విషయంలో ఆందోళన చెందసాగాడు. ఉన్నదేదో కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడ్డం తన నైజం. అది నిజానికి చాలా మంచి లక్షణం. కానీ దానివల్ల ఒక్కోసారి ఇబ్బందులు ఎదురౌతాయి. మా వాడిక్కూడా అంతే జరిగింది. తను చేరిన కంపెనీ చాలా పేరున్నది. అందులో పని చేస్తున్నట్లు చెప్పుకోవడమే గొప్ప. అందులో ఉంటే మంచి గ్రోత్ ఉంటుంది. కానీ, మావాడు కొన్నిసార్లు ''ఆఫీసు సలక్షణమైందే కానీ, కొందరివల్ల చీడ పట్టింది'' అని విసుగ్గా మాట్లాడేవాడు. ఓరోజు ''తనకు ఇవ్వాల్సిన ప్రమోషన్ ఏమాత్రం అర్హత లేని వ్యక్తికి ఇచ్చారని.. గుర్తింపు, గౌరవం లేనిచోట పనిచేయలేను'' అంటూ ఉద్యోగం మానేయడానికి సిద్ధమయ్యాడు.

 

నాకు, మా కోడలికి ఆ ఉద్యోగం వదిలి మరోదాంట్లోకి మారడం ఇష్టం లేదు.

ఎంత నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. నెలాఖరుకు మానేస్తానని తేల్చి చెప్పాడు.

''సరే, మానేద్దుగాని.. కానీ.. ముందు మాత్రం ఈ మాట ఆఫీసులో చెప్పకు'' అన్నాను.

 

నేను బాబా భక్తురాలిని. మనసా వాచా సాయిబాబాను ప్రార్ధించాను. మర్నాడు గురువారం కావడంతో ''శ్రీ సాయి లీలామృతం'' సప్తాహం మొదలుపెట్టాను. భక్తిశ్రద్ధలతో పూర్తిచేశాను. అనుకున్నట్లుగానే చివరిరోజు ఒంగోలులో జరిగే అన్నదానం కోసం డబ్బు పంపాను.

***   ***   ***

ఆశ్చర్యం.. ఆ సాయంత్రం మావాడు స్వీట్ పాకెట్ తో వచ్చాడు. ముఖంలో ఎనలేని సంతోషం చిందులు వేస్తోంది.

మా కోడలు కళ్ళెగరేస్తూ ''ఇంకో జాబ్ వచ్చిందా?" అంది.

"నాకు ప్రమోషన్ ఇచ్చారు.. ఇంకెందుకు మారడం?" అన్నాడు మెరిసే కళ్ళతో.

''ఇదంతా అత్తయ్యవల్లే జరిగింది'' అంది మా కోడలు.

''అంటే, నా ప్రోగ్రెస్ చూసి ఇవ్వలేదా?" అన్నాడు మా అబ్బాయి.

''అత్తయ్య సాయిబాబా పారాయణం చేయబట్టే వాళ్ళలో మార్పు వచ్చింది'' అంది కోడలు.

''థాంక్స్ అమ్మా'' అంటూ ప్రేమగా నా చేతులు అందుకున్నాడు.

''నాకు కాదురా నాన్నా.. బాబాకు చెప్పు'' అన్నాను.

 

ఇలాంటి మధురానుభూతులు ఎన్నో ఉన్నాయి. నమ్మినవారిని కంటికి రెప్పలా కాపాడతాడు సాయిబాబా. నిరంతరం నిదర్శనాలు చూపిస్తాడు.

 

It's my personal experience, personal feelings, personal experience with sai baba, divine feelings, me and superficial power, God Saves in critical times

 

****************************************************

దేవుళ్ళు, దెయ్యాలు, గుళ్ళు, గోపురాలు, ధ్యానం, అలౌకిక ఆనందం

లాంటి అంశాల్లో మీ అనుభూతి లేదా మీకు ఎదురైన మరపురాని సంఘటన

గురించి తెలుగు లేదా ఇంగ్లీషులో రాసి, మీ photoతో సహా ratnakumari.v@objectinfo.comకు పంపండి.

short and sweet గా ఉండాలని మర్చిపోవద్దు.

****************************************************


More It's My Experience