దృష్టి సోకడం నిజమే
Drisht: Evil Eyes Causes Trouble
ఎస్. బాలాజీ
దృష్టి సోకడం లాంటివి మొదట్లో నాకు నమ్మశక్యంగా ఉండేవి కావు. ఇవన్నీ మూఢ నమ్మకాలు లేదా చాదస్తాలు అని కొట్టిపారేసేవాణ్ణి. కానీ ఒకసారి మా ఇంట్లో జరిగిన సంఘటన అవి కేవలం ఈ ఆచారాలు చాదస్తంతో కూడిన నమ్మకాలు కాదని నిరూపించింది.
మా అమ్మాయి శ్వేతకి మూడేళ్ళ వయసులో తెలిసినవారి ఇంటికి వెళ్ళాం. అక్కడ అందరూ ''పాప చాలా బాగుంది'' అంటూ ముద్దు చేశారు. కబుర్లు, కాలక్షేపాలు అయ్యాక, భోజనం గట్రా చేసి తిరిగి ఇంటికి వచ్చాం. శ్వేత ఏమీ తినలేదు సరికదా దారిపొడుగునా ఏడుపే. సరే, అక్కడ ఏమీ నచ్చలేదేమో, ఇంట్లో తినిపిద్దాం అనుకుంటే ఉహూ.. ఇంట్లోనూ ఏమీ తినకపోయింది. పైగా గుక్కపట్టి ఒకటే ఏడుపు. ఏమైనా నొప్పేమో అంటే అదీ చెప్పదు. భయమేసి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళాం.
డాక్టర్ ''ఏదయినా సరిపడని ఆహారం తిందేమో'' అని, ''ఒకవేళ పడిపోయిందా.. దెబ్బ తగిలిందా'' అని వివరాలు అడిగారు. మొత్తానికి అన్ని విధాలుగా పరీక్ష చేసి ఏవో మందులిచ్చారు. కానీ లాభం లేకపోయింది. శ్వేత ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇంతలో మా పక్కింటి మామ్మగారు ''ఏంటి.. పాప ఆ వరసన ఏడుస్తోంటే చోద్యం చేస్తున్నారా...'' అంటూ వచ్చారు.
''బంధువుల ఇంటికి వెళ్ళామని, పొట్ట బరువు చేసిందేమో అనుకోడానికి అక్కడ ఏమీ తినలేదు, డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళినా ప్రయోజనం లేకపోయింది'' అంటూ సంక్షిప్తంగా విషయమంతా చెప్పాం.
''పిల్లకి దృష్టి సోకింది.. వెంటనే దిష్టి తీసేయాలి'' అన్నారావిడ.
''అదంతా చాదస్తంలే మామ్మగారూ'' అన్నాను.
''ఇదిగో అబ్బాయి.. మీరెంత చదువుకున్నా అన్నిటినీ తీసిపారేయొద్దు.. మన పెద్దవాళ్ళు ఏదీ ఊరికే చెప్పలేదు...'' అని నన్ను సుతిమెత్తగా మందలించి, మా ఆవిడని ఉద్దేశించి ''అమ్మాయి, కొంచెం ఉప్పు తీసుకురా'' అంటూ పురమాయించింది.
ఆవిడ ఉప్పు తెచ్చివ్వగా, మామ్మగారు ఏదో చదువుతూ శ్వేతకు దిష్టి తీసింది.
ఎంత ఆశ్చర్యం అంటే... మాయ చేసేనట్లు, మంత్రమేసినట్లు శ్వేత వెంటనే ఏడుపు ఆపేసింది. కిలకిలా నవ్వుతూ టేబుల్ మీదున్న పాలగ్లాసు కావాలంటూ చూపింది. పాలు గటగటా తాగేసి కాసేపట్లోనే హాయిగా నిద్రలోకి జారుకుంది.
మామ్మగారు బోసినవ్వులు నవ్వుతూ దృష్టి సోకడం గురించి అనర్గళంగా చెప్పుకొచ్చారు. ''నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగుల్తాయట.. కొన్ని కళ్ళు బొత్తిగా మంచివి కావు, అలాంటివారి చూపు పడితే ఇలాగే అవుతుంది, ముఖ్యంగా పిల్లలమీద ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఉప్పు, మిరపకాయలు, చీపురుకట్ట మొదలైనవాటితో దిష్టి తీసేయాలి'' అంటూ వివరించారు.
అది మొదలు దిష్టి తగలడం చాదస్తం కాదని అర్ధమైంది. మా అమ్మాయి కొంచెం అందంగా అలంకరించుకుని బయటకు వెళ్ళి వస్తే మా ఆవిడ ఇప్పటికీ దిష్టి తీస్తుంది.
drishti or dishti means evil eyes, evil eyes causes trouble, dishti or drushti causes head-che, stomach ache because of dishti, dishti removed by salt, dishti removed by broomstick etc