సమస్య పీడకలలా మాయమైంది..
Problem dissolved
అనూరాధ, గుంటూరు
పగలంతా అలసిపోయి ఉండటాన రాత్రి కాగానే ఎప్పుడు పక్కమీద వాలిపోదామా అనిపిస్తుంది. కానీ, శాపగ్రస్తనైన రాజకుమారిలా నాకు హాయిగా నిద్ర పట్టదు. ఒకపక్కన ఎంతో మగతగా ఉన్నా, గాఢంగా నిద్రాదేవి ఒడిలో వాలిపోయి సేదతీరలేను. నిద్ర పోయినట్లూ ఉండదు, మెలకువగా ఉన్నట్టూ ఉండదు. కళ్ళు మూతలు పడుతుంటాయి. కానీ ఏదో అదృశ్య రూపం నన్ను వెంటాడుతున్నట్టు ఉంటుంది.
నాకు ఆరేళ్ళ వయసప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఫొటోలే తప్ప నాన్నతో గడిపిన జ్ఞాపకాలేవీ నాలో ముద్రితం కాలేదు. నిద్రకు ఉపక్రమించినప్పుడు చాలాసార్లు ఒక నల్లటి ఆకారం నా తలపై నిమురుతున్నట్లు అనిపిస్తుంది. అది నిజ్జంగా నిజం అనిపిస్తుంది. కళ్ళు తెరిచి నాన్నను స్పష్టంగా చూడాలని, చేత్తో తడమాలని ఎంతో తపనగా అనిపిస్తుంది. కానీ అదేదీ నా చేతిలో ఉండదు. నా చేతులు నా నియంత్రణలో ఉండవు. అశక్తురాలినై ''నాన్నా.. నాన్నా'' అని కలవరిస్తుంటాను.
నా వెనుక ఎవరో నిలబడినట్లు... నా మెదడుకు వెనకవైపు నుంచి ఏదో శబ్దం వినిపిస్తున్నట్లు... ఆ ధ్వని స్పష్టంగా అయితే ఉండదు కానీ క్రమంగా పెద్దదౌతుంది. ఇనపరేకు మీద డబడబా కొడుతున్నట్టు ఒకటే హోరు. నాకు అక్కణ్ణించి పారిపోవాలనిపిస్తుంది. కానీ వీసమెత్తు కూడా కదలలేను. ''ఎవరది, ఏమిటా శబ్దం?'' అని గదమాయించి అడగాలనిపిస్తుంది. కానీ గొంతు పెగలదు. వెంటనే తలనొప్పి మొదలై, అది ఇంకా ఇంకా దుర్భరంగా తయారౌతుంది.
ఇదంతా కల కాదని తెలుసు. ఎందుకంటే నొప్పి, విసుగు, అసహనం అనుభవానికి వస్తాయి. అటు నిద్ర, ఇటు మెలకువ కాని స్థితి. కళ్ళు తెరవాలని ఉంటుంది.. కానీ తెరవలేను. అక్కణ్ణించి వెళ్లాలని ఉంటుంది..కానీ వెళ్ళలేను.. ఈ స్థితి సరిగ్గా ఎప్పుడు మొదలైందో తెలీదు కానీ ఇక ప్రతిరోజూ ఇంతే.. రానురాను నాకు రాత్రి అంటే భయమేయసాగింది. పడుకోగానే, ఉదయం లేచేముందు మరీ దారుణంగా ఉంటుంది. దీన్ని స్లీప్ పెరాలసిస్ అంటారని కూడా మొదట్లో నాకు తెలీదు. ఈ సమస్య చాలా అరుదట..నరకంతో సమానం.
ఈ విషయం ఎవరితోనైనా చెప్పాలన్నా భయంగా, బెరుగ్గా ఉంటుంది. ఎన్నిరోజులిలా, ఇదేం దిక్కుమాలిన సమస్య అని బాధపడుతున్న తరుణంలో ఒక పెద్దాయన ''ఆంజనేయస్వామిని నమ్ముకో.. ఇలాంటి భయాలూ, భ్రమలూ అన్నీ పటాపంచలౌతాయి.. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆంజనేయ దండకం చదువుకుని, హనుమాన్ చాలీసా దిండు కింద ఉంచుకో'' అని సలహా ఇచ్చారు.
అది పాటించాక నా సమస్య మాయమైపోయింది. ఒకప్పుడు నేనేనా అంత తీవ్రంగా బాధపడింది.. అనిపిస్తుంది. ఒకప్పుడు రాత్రులు దుర్భరంగా నైట్మేర్స్ లా ఉండేవి. ఇప్పుడు పూలపాన్పుమీద పడుకున్నంత హాయిగా గడుస్తున్నాయి.
experience of nightmare, experience of sleep paralysis, get rid of sleep paralysis, spiritual power saved, lord hanuman amd me
****************************************************
దేవుళ్ళు, దెయ్యాలు, గుళ్ళు, గోపురాలు, ధ్యానం, అలౌకిక ఆనందం
లాంటి అంశాల్లో మీ అనుభూతి లేదా
మీకు ఎదురైన మరపురాని సంఘటన గురించి తెలుగు లేదా ఇంగ్లీషులో రాసి,
మీ photoతో సహా ratnakumari.v@objectinfo.comకు పంపండి.
short and sweet గా ఉండాలని మర్చిపోవద్దు.
****************************************************