“ఓం భూర్భువస్సువః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్”
దీ గాయత్రీ మంత్రం. మన పూజలు, మంత్రాల్లో ఈ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. “న గాయత్ర్యాః పరం, మంత్రం నమాతుః పరదైవతం” అన్నారు పెద్దలు. అంటే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అనేది దీని భావం. ఆది శంకరాచార్యుడు “గాయాన్ త్రాయతే ఇతి గాయత్రీ” అన్నాడు. అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్ధం.
చాలామంది గాయత్రీ మంత్రాన్ని పదేపదే స్మరిస్తుంటారు. ఉచ్చరించ లేనివారు సీడీ పెట్టుకుని వింటారు. కానీ దీనికి అర్ధం ఎందరికి తెలుసు? కబీర్ దాస్ చెప్పినట్టు ‘చేతిలో జపమాల, నోట్లో రామనామం కదలాడినా మనసు కనుక చంచలమైతే ఫలితం లేనట్లే’, గాయత్రీ మంత్రానికి అర్ధం, పరమార్ధం తెలీనప్పుడు లక్షసార్లు విన్నా, స్మరించినా ప్రయోజనమే లేదు. అందుకే ముందుగా ఈ పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రానికి అర్ధం ఏమిటో తెలుసుకుందాం.
గాయత్రీ మంత్రంలో ప్రతి అక్షరానికీ అర్ధం ఉంది. స్థూలంగా - “లోకంలో సమస్తాన్నీ సృష్టించే, సర్వ విశిష్ట గుణాలతో, ఎవరు మన బుద్ధులను ప్రేరేపిస్తున్నారో, అటువంటి పరబ్రహ్మ స్వరూపుని, శ్రేష్టుని, జ్ఞాన ప్రకాశములు కలవానిని, పూర్తి రూపం ఉన్నవానిని ధ్యానిస్తాను” అని గాయత్రీ మంత్రానికి అర్ధం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – “ప్రణవ స్వరూపుడు, అన్నిటికీ ఆధారమైనవాడు, అంతటా నిండి ఉన్నవాడు, సర్వేంద్రియములను ప్రకాశింపచేసేవాడు, సృష్టి, స్థితి, లయ, కారణభూతుడు, సమస్త దుఃఖాలను పోగొట్టి సర్వ సుఖాలను ఇచ్చే, స్వయం ప్రకాశకుడైన పరమాత్మునికి నా నమస్కారాలు” అని అర్ధం.
క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పుకుంటే, “అన్ని లోకాల నుండి అన్నిటినీ నడిపించే మహాశక్తీ, మా బుద్ధులను ప్రక్షాళన చేసి, మంచి కర్మలను ఆచరించేలా ప్రేరేపించు” అని గాయత్రీ మంత్ర అర్ధం. ఈ మంత్రంలో ఉద్దేశించిన శక్తిని కొందరు నారాయణుడిగా తలిస్తే, ఇంకొందరు ఆది పరాశక్తిగా ధ్యానిస్తారు. మరికొందరు నిరాకార, నిర్గుణ బ్రహ్మగా భావిస్తారు.
రోజుకు వేయిసార్లు చొప్పున నెల రోజుల పాటు గాయత్రీ మంత్రాన్ని జపించినట్లయితే సర్వ పాపాలూ హరిస్తాయని ఉద్ఘాటించాడు మనువు.
ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.
గాయత్రీ మంత్ర జపం చేయాలనుకునేవారు మొదట మూడుసార్లు ప్రాణాయామం ఆచరించి, ఆపైన గాయత్రీ జపం చేయాలి. జపం చేసే సమయాన్ని బట్టి భిన్న నామ రూపాలతో ప్రార్ధించాలి. ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా స్మరించాలి. ప్రాతః కాల వేళ తూరుపు దిశగా నిలబడి సూర్యోదయం అయ్యేవరకు ప్రార్ధించాలి. సాయంకాలం పడమటి దిశగా కూర్చుని, నక్షత్రాలు కనిపించేవరకూ ప్రార్ధించాలి. ఈ మంత్రాన్ని పైకి వినిపించకుండా మనసులోనే జపించాలని గుర్తుంచుకోవాలి.
గాయత్రీ మంత్రం ఇహ లోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా, మరు జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే, ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తారు.