థైరాయిడ్ సమస్యను అధిగమించాలంటే...

 

థైరాయిడ్ సమస్యను అధిగమించాలంటే...

 

 

ఈమధ్య కాలంలో పది మందితో మాట్లాడితో వాళ్లలో ఒకరైనా థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నామని చెప్తున్నారు. అంతగా సమస్య పెరిగిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు. ఇక మహిళలనైతే ఇది వెంటాడి వేటాడుతోంది. ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయిల్లోనే థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని తాజాగా ఓ సర్వేలో తేలింది. అందుకే మహిళలంతా థైరాయిడ్ గురించి వీలైనంత స్పష్టంగా తెలుసుకోవడం చాలా మంచిది.

రక్తంలో థైరాక్సిన్ హార్మోన్ శాతం తక్కువగా ఉండటం వల్లే థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య వచ్చిందనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. కాస్త పనికే అలసిపోతుంటారు. ఎంతసేపు పడుకున్నా ఇంకా పడుకోవాలనిపిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఉన్నట్టుండి బరువు పెరగడమో లేక తగ్గిపోవడమో మొదలవుతుంది. విసుగు, కోపం ఎక్కువవుతుంటాయి. గుండె దడ, టెన్షన్ పెరుగుతాయి. కొందరిలో రుతుస్రావంలో కూడా మార్పులు కనిపిస్తాయి. రుతుస్రావం అధికంగా అవ్వడం, నెలలో ఒకసారి కంటే ఎక్కువసార్లు రావడం జరగవచ్చు. లేదంటే రావాల్సిన సమయానికి రాకపోవడం, వచ్చినా సరిగ్గా అవ్వకపోవడం జరగవచ్చు. జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు కూడా కొందరిలో కనిపిస్తాయి. కండరాల నొప్పులు కూడా రావొచ్చు. కొందరిలో గొంతు కూడా మారుతుంది. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

థైరాయిడ్ సమస్య ఏర్పడిందనగానే కంగారు పడిపోవద్దు. ముందు మీకు వచ్చింది ఏ రకమైన థైరాయిడో తెలుసుకోండి. హైపో థైరాయిడిజమ్ అయితే థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోవడం వల్ల ఏర్పడుతుంది. హైపర్ థైరాయిడ్ గ్రంథి అయితే చేయాల్సిన దానికన్నా ఎక్కువగా చేయడం వల్ల వస్తుంది. మీకు ఏర్పడింది ఏ రకమైన సమస్యో తెలుసుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ ని స్పష్టంగా అడగండి.

థైరాయిడ్ కి డాక్టర్ సూచించిన మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం మంచి పరిష్కారం. మాంసకృత్తులు, విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. బి విటమిన్ ఎక్కువగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, రాగి జావ లాంటివి మేలు చేస్తాయి. ఇనుము ఎక్కువగా ఉండే గుడ్లు, ఆకు కూరలు, ఖర్జూరం వంటివి తీసుకోవడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. సోయా గింజలు, పాలకూర, వెల్లుల్లి, తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ కి పూర్తి దూరంగా ఉండండి. ఉప్పు విషయంలో అన్నిటికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అయొడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలి.

అలాగే వ్యాయామం కూడా తప్పనిసరి. మందులు వాడుతూ, పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే థైరాయిడ్ సమస్యను చక్కగా అధిగమించవచ్చు.

-Sameera