"ఎందుకిలా చేసిందో నాకేం అర్థంకావటంలేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, పూజని నేను మర్చిపోలేకపోతున్నాను..." నిట్టూరుస్తూ అన్నాడు శ్రీధర్.

 

    అతనక్కడికి వచ్చి అరగంటయింది.

 

    ఆ అరగంట నుంచీ అతను పూజ గురించే ఆలోచించడం, బాధపడటం ఇటు మాళవికకిగాని, అటు నిర్మలకిగాని మింగుడు పడటంలేదు.

 

    కొద్ది నిమిషాలు చురుగ్గా ఆలోచించిన నిర్మల వంటగదికేసి నడుస్తూ మాళవికకి సైగ చేసింది.

 

    "కాఫీ తెస్తాను..." అంటూ నిర్మల వెనుకే పూజ వంటగదిలోకి వెళ్ళింది.

 

    "ఇదేమిటి కొత్త సమస్య వచ్చిపడింది? ఆ పాత్రకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ పాత్రని కొనసాగిద్దామనుకుంటే, ఆ పాత్రచుట్టే శ్రీధర్ తిరుగుతున్నాడు?" అయోమయానికి లోనవుతూ అంది చిన్నగా మాళవిక.

 

    "అదే...నాకూ తోచటంలేదు" అంది నిర్మల.

 

    "పోనీ...ఓ పనిచేస్తే?"

 

    "ఏమిటది?"

 

    "పూజ చచ్చిపోయినట్టు శ్రీధర్ని నమ్మిస్తే?"

 

    మాళవిక మాటలకి ప్రశంసగా చూసింది నిర్మల.

 

    "గుడ్ ఐడియా! శాశ్వతంగా పోయిందని మనమనుకొని ఆ పాత్రకి గుడ్ బై చెప్పినంత మాత్రాన లాభంలేదని తేలిపోయిందిగా. కనుక ఇప్పుడు అతడ్ని నమ్మించగలిగితే-ఇవ్వాళ కాకపోయినా, మరి కొన్నాళ్ళయినా, పూజ పాత్రని మర్చిపోయి, నీతో కలిసిపోతాడు. కాని ఎలా?" నిర్మల దీర్ఘంగా ఆలోచిస్తూ అంది.

 

    మాళవిక ఆలోచనలో పడిపోయింది.


                                                   *    *    *    *


    పట్టు వదలని విక్రమార్కుడిలా యోగి కిందకెళ్ళి తన ఎంక్వైరీని కొనసాగిస్తూండగా ఒకతను అనుకోకుండా కలిశాడు. అతను ఎప్పటినుంచో మూగగా పూజని ప్రేమిస్తున్న వ్యక్తి. అతనే తారసపడటంతో యోగికి గెలిచినంత ఆనందం వేసింది.

 

    వాళ్ళలా మాట్లాడుకుంటుండగా మాళవిక ఆఫీసుకెళ్ళేందుకు బయలుదేరి కిందికొచ్చింది.

 

    అంతకు అరగంట క్రితమే శ్రీధర్ నిర్మల ఫ్లాట్ నుంచి బయలుదేరి సరాసరి ఆఫీసుకెళ్ళిపోయాడు.

 

    సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి మాళవికని చూసేసాడు. ఒక్కసారి అతని కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి.

 

    "అదిగోండి సార్... ఆమె..." అంటూ ఆ వ్యక్తి అమితమైన ఎగ్జ్సెట్ మెంట్ కి లోనవుతూ అరిచాడు.

 

    చటుక్కున యోగి వెనుతిరిగి, ఆ వ్యక్తి చూపించిన వేపుకి తన చూపులు మరల్చేలోపే... మాళవిక ఆటో ఎక్కేసింది.

 

    ఆమె వెనుక భాగమే తప్ప- పూర్తిగా ఆమెని చూడలేకపోయాడు యోగి.

 

    "నిజమేనా!" అంటూ యోగి రేసుకుక్కలా అప్పుడే కదిలివెళ్తున్న ఆటోకేసి దూసుకుపోయాడు.

 

    కానప్పటికే ఆటో స్టార్ట్ అయి వేగం అందుకుంది.

 

    కొద్ది క్షణాల తేడాలోనే ఓడిపోయిన యోగి నుదురుకొట్టేసుకున్నాడు నిస్పృహగా.


                                                    *    *    *    *


    "హలో...నేను...మాళవికని" అంది మాళవిక ఫోన్ లో.

 

    "ఇప్పుడే గదా ఆఫీసుకెళ్ళావు? ఇంతలో ఫోన్ చేశావేంటి? పూజ చచ్చిపోయిందని శ్రీధర్ ని నమ్మించగల ఐడియా ఏమైనా తట్టిందా?" ఆతృతగా అడిగింది నిర్మల.

 

    "ఐడియా తట్టటం కాదు-కొత్త సమస్య వచ్చిపడింది. నన్నొక పిచ్చివాడు మూగగా చాలా రోజులనుంచి ప్రేమిస్తున్నాడు. అతను ఐదారుసార్లు నా వెనుకే నా పాత ఫ్లాట్ వరకు వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నాతో మాట్లాడే ధైర్యంలేక. అతను ఈరోజు నేను ఆఫీసుకి బయలు దేరివచ్చేముందే, గ్రౌండ్ లో నిలబడి, యోగితో మాట్లాడుతున్నాడు. దాంతో నాకు వెంటనే అనుమానం వచ్చి, నా నడకలో వేగం పెంచి, దగ్గర్లో దొరికిన ఆటో ఎక్కేశాను, అప్పుడతడు అదిగోండి సార్...ఆమె... అంటూ అతను నాకేసి వేలు చూపించాడు. అదృష్టం బాగుండి యోగి నన్ను చూసేలోపే నేను ఆటోలోకి చేరుకున్నాను" టెన్షన్ పడిపోతూ అంది మాళవిక.

 

    ఆమె మాటలు వింటూనే నోటమాట పడిపోయినట్లయింది నిర్మలకి.


                                                     *    *    *    *


    "నేను నమ్మను. పూజ స్టేట్స్ వెళ్ళిపోతే, ఆ వ్యక్తి నాకు పూజ నెలా చూపించాడు? ఈ సంఘటన జరిగి అరగంట కూడా కాలేదు. నేను వెంటనే ఆఫీసుకి వచ్చేశాను. నాకేదో... అంతా గందరగోళంగా వుంది. కొద్ది క్షణాల జాప్యంతో నేనామెను మిస్ అయ్యాను. లేదంటే అక్కడి కక్కడే ఆమెని పట్టేసుకుని ఇప్పుడు నీ ముందు హాజరుపరిచేవాడ్ని" ఆఫీసు లంచ్ అవర్ లో అన్నాడు యోగి.

 

    "ఎవర్ని చూసి ఎవరనుకున్నాడో? వాడు కూడా నీలాగే తాగుబోతేమో?" శ్రీధర్ ఆ విషయాన్ని అంత సీరియస్ గా పట్టించుకోకుండా అన్నాడు.

 

    "మరిదే బాధ కలిగించే విషయం. తాగినంత మాత్రాన అన్నీ అబద్ధాలు చెప్పి, అవతలి వారిని అబ్బురపరచాలనిపిస్తుందా?"

 

    "మనసు వల్లనే అజ్ఞానం కలుగుతుంది. నీకా అజ్ఞానం బాగా వంటబట్టినట్టుంది. విషయ గ్రహణం, విషయానుభూతి, విషయ నిర్ణయం, అహంభావం విషయాలలో జాగ్రత్తగా వుండటం నేర్చుకో" చిరాకుపడుతూ అన్నాడు శ్రీధర్.

 

    ముఖం మాడ్చుకున్నాడు యోగి.

 

    "నువ్వెలా అనుకున్నా పూజ ఇంకా ఇక్కడే వుంది. అమెరికా లేదు, ఆవకాయ జాడీ లేదు. ఆ మూగ ప్రేమికుడ్ని పట్టుకుని, ఆమె జాడతెలుసుకుని, నీ ముందు ఆమెని వుంచకపోతే నా పేరు యోగే కాదు..." నిష్టూరంగా అంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు యోగి.


                               *    *    *    *


    మూగ ప్రేమికుడికి కనిపించకుండా బురఖాతో నిర్మల ఫ్లాట్ లోకి ప్రవేశించింది మాళవిక.

 

    "ఈ డ్రస్ ఏమిటి? ఎన్ని ట్విస్ట్ లేమిటే బాబూ! ఎవరి లవ్ స్టోరీలోనూ ఇన్ని మలుపులు, మతలబులు, తిరకాసులు నేను చూడలేదు" విస్మయంగా అంది నిర్మల.