కాని సుబ్బారావలా- పల్లెటూరిగబ్బిలాయిలా అలా పైకి తేలిపోవడం నచ్చలేదు.
    "దేముడు వరమిచ్చినా పూజారి వరమివ్వడట- మధ్యలో మీకేమిటి బాధ!" జ్యోతి నవ్వుతూ అంది.
    "బాగా చెప్పారు" అంటూ నవ్వాడు మురారి.
    పదకొండుగంటలవేళ ఇల్లుచేరారు అందరూ.
    "ఓ ఇక్కడా మీరు వుంటున్నది" అన్నాడు మురారి.
    "రారా - లోపలికి" అన్నాడు సుబ్బారావు.
    జ్యోతి గుండెలు బితుకు బితుకుమన్నాయి. మురారి వచ్చి తమ ఇల్లు చూసి నవ్వుకుంటాడేమో! మరీ అందులో ఎక్కడివి అక్కడ పడివున్నాయి. రాకపోతే బాగుండుననుకుంది. సిగ్గుతో.
    "ఇప్పుడుకాదు మరోసారి. పదకొండు దాటింది. ఈసారి సావకాశంగా వస్తా ఇల్లు తెల్సిందిగా. గుడ్ నైట్" అన్నాడు మురారి.
    జ్యోతి గుండెలమీద బరువుదించినట్లయి- "థ్యాంక్స్- మెనీ థ్యాంక్స్! ఈ రాత్రి చాలా భాగా గడిచింది" అంది సంతోషంగా.
    "నిజంగారా- చాలా ఎంజాయ్ చేశాం. థ్యాంక్స్! ఓ సాయంత్రం తప్పకుండా రారా...." అన్నాడు సుబ్బారావు.
    "అలాగే! గుడ్ నైట్" మురారి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
    తాళంతీసి లోపలికి అడుగుపెట్టగానే అద్భుతమైన కల చెదిరి వాస్తవంలోకి వచ్చినట్లు జ్యోతి గుండెలు బరువెక్కాయి. ఛీ.... మళ్ళీ తాను ఈ రెండుగదుల కొంప, ఈ జిడ్డుమొహం భర్తా తయారు! నిరుత్సాహంగా కాళ్ళు చేతులు కడుక్కుని చీర మార్చుకుని పడుకుంది.
    సుబ్బారావు ఖుషీగా వున్నాడు. డ్రింక్ మహాత్యం కొంత, జ్యోతి కస్సు బుస్సులులేకుండా నాలుగైదు గంటలు గడపడం, చూసిన కేబరే డేన్సర్ ఇచ్చిన వేడి అన్ని కలిసి ఉషారు కల్గించాయి.
    జ్యోతి పక్కన చేరి గట్టిగా కౌగలించుకుని "ఎలా వుంది డార్లింగ్? సాయంత్రం బాగా గడిచింది కదూ?" అన్నాడు ముద్దు ముద్దుగా. విస్కీ వాసన కొట్టింది జ్యోతికి.
    "ఛా.... వదలండి. పెద్ద ఏదో మీరే తీసికెళ్ళినట్టు పోజు పెడుతున్నారు. మన మొహానికి హోటల్సు, క్లబ్బులూ" ఈసడించినట్టు వదిలించుకుంటూ అంది.
    సుబ్బారావుకి ఆ విదిలింపుకి మత్తు సగం దిగినా - "ఎవరు తీసికెళితే నేంవోయ్! నా మూలంగాకదా వెళ్ళావు...." అన్నాడు చేతులు మరింత బిగించి.
    "ఛీ.... వదలమంటుంటే మీక్కాదూ. విస్కీవాసనా మీరూ" అంది జ్యోతి గింజుకుంటూ.
    "విస్కీ వాసననేమిటోయ్.....! విస్కీ తాగడం ఫేషన్ కదూ" వ్యంగ్యంగా అన్నాడు.
    'ఆఁ! మీలాంటివారికి కాదు' అనుకుంది జ్యోతి మనసులో తిరస్కారంగా.
    జవాబు చెప్పకుండా సుబ్బారావుని విసురుగా తోసి అటుతిరిగి పోయింది.
    అంతవరకు నవ్వుతూ, తుళ్ళుతూ చక్కగా కబుర్లు చెప్పిన భార్య ఇప్పుడు ఇలా చీదరించుకుంటుంటే సుబ్బారావుకి తిక్క రేగింది.
    "ఏం? ఇంతలో ఏం రోగం వచ్చింది? ఇంతవరకు చక్కగా చిలకపిట్టలా కబుర్లు చెప్పావుగా? విస్కీ తాగడం, గెంతడం ఫేషన్ గా - ఇప్పుడు విస్కీ వాసన గొట్టిందేం?" అన్నాడు కరుకుగా. జ్యోతిని తనవైపు లాగుతూ "నీకు నన్ను చూసేసరికి వస్తాయి రోగాలు" అన్నాడు కోపంగా.
    "ఆఁ.... అవును! నన్ను వదలండి ముందు. నాకు నిద్రవస్తుంది" అంది జ్యోతి తీక్షణంగా.
    "నీ రోగం వదులుస్తాను. పిచ్చివేషాలు వేయకు" తాగిన మత్తులో జ్యోతి నిరాకరణ అతని అహంమీద దెబ్బతీసింది. జ్యోతి గింజుకుంటున్నా వదలక బలవంతాన ఆక్రమించుకున్నాడు.
    "ఛీ..... మీరు మనుష్యుకారు. ఐ హేట్ యు, ఐ హేట్ యు" జ్యోతి పళ్ళు బిగువున అరిచింది.  
    "నోర్ముయ్!" సుబ్బారావు వళ్ళుమరిచే కోపంతో జ్యోతి చెంప పగులగొట్టాడు.
    జ్యోతి ఒక్కక్షణం దిమ్మెరపోయింది. ఆ తర్వాత తేరుకుని ఎగిసి పడుతున్న గుండెలతో-
    "కొట్టారా, నన్ను కొట్టారా! మీకెవరిచ్చారీ అధికారం?" అరిచింది కోపంగా.
    "మళ్ళీ మాట్లాడావంటే ఇంకా కొడ్తాను. వెధవ వేషాలు వేయకు. ఊరుకుంటున్న కొద్దీ మరీ వేషాలు వేస్తున్నావు. జాగ్రత్తగా మసులుకో. నేను నీ మొగుడ్ని అని మరిచిపోకు. ఛీ.... నిన్ను కట్టుకున్న దగ్గరనించి ఒక్కరోజు సంతోషంలేదు. నా జీవితం నాశనం చేశావు. ఫో - అవతలికి" జ్యోతిని విసురుగా తోసేసి ఆ మంచంమీదనుంచి తన మంచంమీదపడి నిద్రపోయాడు.
    అసలే మురారిని చూసిన కళ్ళతో సుబ్బారావుని చూశాక ఆమె విరక్తి మరింత పెరిగింది.
    ఈ సంఘటనతో జ్యోతి మనసు మరింత విరిగిపోయింది. అవమానం, కోపం, దుఃఖం, కసితో కన్నీళ్ళు కారుస్తూ, పళ్ళు కొరుక్కుంటూ, సుబ్బారావుని శపిస్తూ, తిడుతూ ఎప్పటికో నిద్రలోకి జారింది జ్యోతి.
    ఉదయం లేచేసరికి రాత్రి మత్తు, కోపం దిగజారాయి సుబ్బారావుకి. ఏడ్పుతో ఉబ్బిన కళ్ళతో, పీక్కుపోయిన మొహంతో ఉన్న జ్యోతిని చూసేసరికి రాత్రి జరిగిన సంగతి గుర్తుకొచ్చి సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు.
    తనంత దిగజారి నీచంగా చెయ్యి చేసుకున్నందుకు జ్యోతి మొహంలోకి చూడలేనట్టు సిగ్గుపడ్డాడు. తను తొందరపడ్డాడు.
    ఎంత సహనం, ఓర్మి చూపించుదామన్నా జ్యోతి పెడసరం, విముఖత ఎప్పటికప్పుడు తన సహనాన్ని పరీక్షీస్తూనేవుంది.
    అయినా కొట్టడం అమానుషం. తనదే తప్పుగా భావించాడు సుబ్బారావు.
    కాఫీతెచ్చి విసురుగా టేబిల్ మీదపెట్టి వెళ్ళిపోతున్న జ్యోతి చెయ్యి పట్టుకుని "సారీ జ్యోతీ.... నిన్నరాత్రి తొందరపడ్డాను. క్షమించు." అన్నాడు ప్రాధేయపూర్వకంగా.