చేతులున్నవారి మీద ఆమెది పైచేయి

 


అసలే ఆడపిల్ల! ఆపై రెండుచేతులూ లేకుండా పుట్టింది. పోనీ కుప్పలకుప్పలుగా డబ్బులున్నాయా అంటే మధ్యతరగతి కుటుంబమయ్యే. ఇదీ ‘దామినీ సేన్‌’ పరిస్థితి. మరొకరు ఆమె స్థానంలో ఉంటే ఏం జరిగేదో కానీ... దామినీ మాత్రం తానేమిటో నిరూపించుకుంది. ప్రతి విషయంలో ఇతరులతో పోటీపడుతూ- ఏకంగా ఓ ప్రపంచ రికార్డునే సాధించింది. దామినికి పుట్టుకతోనే చేతులు లేకపోవడంతో ఆమెకు చదువు ఎలాగా అన్న సమస్య మొదలైంది. పసి దామినికి స్నానం చేయించడం, బట్టలు తొడగడం వంటి పనుల్లో అయితే తల్లి సాయపడగలదు. కానీ ఆమెతో అక్షరాలను రాయించేదెలా! అందుకోసం ఆమె తల్లి మాధురీ సేన్ ఒక నిర్ణయం తీసుకుంది. దామినీ కాళ్లతోనే అక్షరాలను దిద్దించాలనుకుంది. కానీ ఎలా! అందుకోసం ముందు తనే కాళ్లతో అక్షరాలు రాసే ప్రయత్నం చేసింది. అందులో కాస్త నేర్పు సాధించాక అదే విద్యను దామినీకి నేర్పింది.

 

 

దామినీకి అక్షరాలు వచ్చేశాయి సరే! మరి ఆమెను బడిలో చేర్చేదెలా? అన్నది మరో సవాలు. చేతులు లేని దామినిని చేర్చుకునేందుకు పాఠశాల యజమాన్యాలు మొదట నిరాకరించాయి. కానీ ‘ఒక్కసారి ఆమెను చేర్చుకుని చూడండి. ఆమెను బడిలో కూర్చోబెట్టి చూడండి..’ అంటూ దామిని తండ్రి అభ్యర్థనను మన్నించక తప్పలేదు. నిజంగానే ఒక్కసారి చేర్చుకున్నాక దామిని మిగతా విద్యార్థులతో ఏమాత్రం తీసిపోదన్న విషయం ఉపాధ్యాయులకు అర్థమైంది. దామిని ఒకో తరగతినే దాటుకుంటూ రెండేళ్ల క్రితం ‘మా బంజారి గురుకుల్ విద్యాలయ(రాయ్‌పూర్)’లో పదో తరగతిని కూడా పూర్తిచేసింది. అది కూడా 80 శాతం మార్కులతో! ఇంతాచేసి దామిని కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ చేయాల్సి వచ్చేది కాదు. ఆమె కాళ్లతో నోట్స్‌ రాసుకునేందుకు కాస్త విడిగా కూర్చోనిస్తే సరిపోయేది!

 

 

దామిని చదువులోనే కాదు! మిగతా ఏ విషయంలోనూ ఇతరులకు తీసిపోదు. దామినిని చూస్తే ఆమెకు చేతులు లేవన్నది ఉత్తమాటే అనిపిస్తుంది. తన రెండు కాళ్లతోనే తలదువ్వుకోవడం, బట్టలు ఉతకడం, పాలు తాగడం దగ్గర్నుంచీ వంట చేయడం వరకూ అన్ని పనులూ చేసేస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే కాళ్లతో చకచకా బొమ్మలు గీసేయడం మరో ఎత్తు. మొదట్లో ఏదో కూతురు సరదా పడుతోంది కదా అని దామని తల్లిదండ్రులు ఆమెను బొమ్మలు గీసేందుకు ప్రోత్సహించేవారు. కానీ కార్టూన్లతో మొదలుపెట్టిన దామినిలోని చిత్రలేఖనం భారీ బొమ్మలు గీసే స్థాయికి చేరుకుంది. అంతేకాదు! కాలితో ఒక గంటలో అత్యధిక బొమ్మలు (38) గీసిన చిత్రకారిణిగా ప్రపంచ రికార్డుని సొంతం చేసుకుంది.

 

 

దామిని ప్రస్థానంలో ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు అండగా ఉన్నారన్న మాట నిజమే! అయితే స్వతహగా ఆమెలో సానుకూల దృక్పథం లేకపోతే ఎవరెంతగా ప్రోత్సహించినా ఉపయోగం ఉండేది కాదు కదా! ఆ ఆత్మవిశ్వాసమే దామిని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్లో తాను కాళ్లతో పనిచేయడాన్ని నేర్చుకున్నప్పుడు, జనం నవ్వుతారేమో అన్న ఆలోచన వచ్చిందనీ... కానీ ఇతరుల గురించి కాకుండా తన గురించి ఆలోచించడంతో ముందుకు సాగిపోయానని చెబుతుంది. అంతేకాదు! ‘మనమీద మనకి నమ్మకం ఉంటే, ప్రపంచం ఏమనుకుంటుందో అన్న ఆలోచన అడ్డుపడదని’ అంటోంది. ‘భగవంతుడు ఒక అందమైన జీవితాన్ని ప్రసాదించాడనీ... ఆ జీవితంతో ఏదో ఒకటి సాధించాలనీ’ ఆలొచింపచేసేలా మాట్లాడుతోంది.

 

దామిని ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మున్ముందు తనబోటివారికి సాయంగా నిలిచేందుకు IAS సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది. దామిని ప్రతిభ, పట్టుదల ఎరిగినవారికి, ఆమె తన లక్ష్యాన్ని సాధిస్తుందన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు. చేతులు ఉండికూడా మనం చేయలేని పనిని దామిని అలవోకగా సాధించి చూపుతుందని... ఆమె నేస్తాల నమ్మకం. నిజమే కదా!

 

 

- నిర్జర.