"చలి బాబూ...వద్దు..."

 

    "నే ఉన్నాగా...రా డార్లింగ్..." ఒక చెయ్యి పట్టుకుని లాగుతూ రెండో చేత్తో బకెట్ లోంచి మగ్ తో నీళ్ళు తీసి ఆ అమ్మాయి మీద పోసేసాడు.

 

    చీరా జాకెట్టు తడిసిపోయాయి. మళ్ళీ నీళ్ళు పోసాడు. గట్టిగా రెండు చేతుల్తో ఆ అమ్మాయిని కౌగిట్లో బంధించేసి-

 

    "మనం చిన్న పిల్లలం అయిపోదామా..." అని అడిగాడు. అర్థమైనా ఆ అమ్మాయేం జవాబు చెప్పలేదు.

 

    కానీ-

 

    మరో పదినిమిషాలకు ఆ బాత్రూంలో వాళ్ళిద్దరూ చిన్నపిల్లల్లా ఉన్నారు.

 

    మరో పదినిమిషాలయాక-

 

    వాళ్ళిద్దరూ ఆ గదిలోంచి బయటికొచ్చారు.

 

    మంచమ్మీద దుప్పటిని చీరలా చుట్టుకుని, తడిసిపోయిన చీరని అక్కడే ఆరేసి, ఫాన్ వేసి, మంచమ్మీద కూర్చుంటూ-

 

    "మనం పెళ్ళి చేసుకుందాం..." అని డిక్లేర్ చేసింది ముంతాజ్.

 

    "పెళ్ళంటే మంచమ్మీద కూర్చుని కబుర్లాడ్డం కాదు...

 

    ఉద్యోగమైనా ఉండాలి...డబ్బయినా ఉండాలి..." అన్నాడు అవినాష్ తల దువ్వుకుంటూ.

 

    "నా దగ్గర డబ్బుందిగా..." కళ్ళెగరేస్తూ అంది ముంతాజ్.

 

    "నేను ఇంట్లోంచి వచ్చేస్తాను..." మళ్ళీ అంది ముంతాజ్.

 

    "దూరంగా పారిపోదాం..." దగ్గరగా వస్తూ అంది ముంతాజ్.

 

    "నీకు నిజంగా ధైర్యముందా..." ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అవినాష్.

 

    "లేదా...ఎప్పుడు రమ్మంటావో చెప్పు...ఎంత తీసుకు రమ్మంటావో చెప్పు..."

 

    చెప్పాడు అవినాష్.

 

    ఆ తర్వాత మరో పది నిమిషాల తర్వాత ముంతాజ్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

 

    మూడ్రోజుల తర్వాత అన్నీ సిద్ధం చేసుకుని రాత్రి పన్నెండు గంటలకల్లా కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు, రైల్వేస్టేషన్ కి వచ్చేస్తానని చెప్పింది ముంతాజ్.

 

    ఆ రోజు, మర్నాడు చాలా ఆలోచించాడు అవినాష్.

 

    తనను నమ్మి, తనతో పాటు వస్తున్న ముంతాజ్ దగ్గరున్న డబ్బు మాత్రమే తనకు కావాలి.

 

    కానీ ముంతాజ్....

 

    ముంతాజ్ ని ఎలా వదిలించుకోవాలి.

 

    ఆ రోజు రాత్రి.

 

    సరిగ్గా పదకొండు గంటలకు రైల్వేస్టేషన్ కొచ్చాడు అవినాష్.

 

    రెండు టిక్కెట్లు తీసుకున్నాడు.

 

    రాత్రి సమయం. రైల్వేస్టేషన్లో ఎక్కువమంది ప్రజలు లేరు.

 

    సరిగ్గా పన్నెండు గంటలకు కోణార్క్ ఎక్స్ ప్రెస్ స్టేషన్లోకి వచ్చింది. అంతకు ముందు గాభరా గాభరాగా ఓ సూట్ కేస్ తో ముంతాజ్ వచ్చింది.

 

    పావుగంట తర్వాత రైలు బయలుదేరింది.

 

    వాళ్ళెక్కిన ఫస్టుక్లాసు కంపార్ట్ మెంట్ లో తక్కువ మంది ప్రయాణీకులున్నారు.

 

    అందరూ దాదాపు నిద్రపోతూ.

 

    "ఎక్కడకు తీసావ్ టిక్కెట్లు..." ముఖం తుడుచుకుంటూ అడిగింది ముంతాజ్.

 

    "భువనేశ్వర్ కు...."

 

    "అక్కడ ఎక్కడుంటాం..." ఆ ప్రశ్నకు అవినాష్ జవాబు చెప్పలేదు.

 

    "నువ్వు రావడం ఎవరూ చూడలేదు కదా..."

 

    అనుమానంగా అడిగాడు అవినాష్.

 

    "లేదు... మా డాడీ లక్కీగా ఇవాళుదయమే కేంప్ వెళ్ళారు... రెండ్రోజులుగ్గాని రారు..." చెప్పింది ముంతాజ్.

 

    "మనీ ఎంత తెచ్చావ్..." ఆసక్తిగా అడిగాడు అవినాష్.

 

    "ఇరవై వేలు... బీరువాలో అంతే ఉంది..."

 

    ఆ మాటకు షాక్ తినేసాడు అవినాష్.

 

    కనీసం ఒక యాభై వేలైనా తెస్తుందనుకున్నాడు.

 

    ఆ సమయంలో అవినాష్ లో చాలా నిరాశ ప్రవేశించింది.

 

    "ఆ డబ్బు చాలదు..." ముక్తసరిగా అన్నాడు.

 

    "నగల కోసం ట్రై చేశాను...కానీ... ఆ బీరువా తాళాలు ఎక్కడున్నాయో...మా మమ్మీకి కూడా తెలీదట...మా డాడీ ఎక్కడో దాచేశారు... పోనీలే...ఓ మూడు నెలలు ఈ డబ్బు సరిపోతుంది కదా... ఈ లోపు ఎక్కడో దగ్గర ఓ టైపిస్టు జాబయినా దొరకదా..." అమాయకంగా, అవినాష్ మీద అంతులేని ప్రేమతో, ప్రేమ మీదున్న అంతులేని అభిమానంతో అంది.

 

    కానీ అదే సమయంలో అవినాష్, ముంతాజ్ గురించి ఆలోచిస్తున్నాడు.

 

    ముంతాజ్ ని ఎలా వదిలించుకోవాలి?

 

    ఎలా...ఎలా...ఎలా...

 

    అవినాష్ కి ఆ సమయంలో సరిగ్గా అయిదేళ్ళ క్రితం,

 

    అదే కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేసిన విషయం జ్ఞాపకాని కొచ్చింది.

 

    రాయగడ స్టేషన్ తర్వాత వచ్చే బ్రిడ్జి, దాని కింద వందమీటర్ల లోతులో ప్రవహించే ఏదో నది జ్ఞాపకానికొచ్చింది.

 

    అదే సమయంలో ఏదో ఆలోచన అతని మెదడులో మెదిలింది. ఆ తర్వాత చటుక్కున అతని పెదవుల మీదకు ఓ చిర్నవ్వు వచ్చింది.

 

    "ఏవిఁటి నవ్వుతున్నావ్..." అతని ముఖంలోకి చూస్తూ అంది ముంతాజ్.