మనకీ కావాలి ఒక బడ్జెట్

మనకీ కావాలి  " ఒక బడ్జెట్ "

 

ఈ రోజు అంతా అందరూ బడ్జెట్ కోసం మాట్లాడుతున్నారు ..ఏవి పెరిగాయి ? ఏవి తగ్గాయి అంటూ ...నాకు ఎందుకో మా అమ్మ గుర్తుకు వచ్చింది ..తన నల్ల డైరీ..లో మా ఇంటి బడ్జెట్ ..వుండేది. ఆ లెక్కలు చూస్తే మాకు భయం వేసేది..నాన్న జీతం ..మా ఇంటి అవసరాలకి మద్య బోలెడంత దూరం వుండేది. అమ్మ ఆ నెల ఖర్చు ఏంటో ఓ లిస్టు రాసేది ముందు ..నాన్న జీతం వచ్చాకా ..దాని బట్టి ఏవి ముఖ్యమ్..ఏవి ఈ నెల వాయిదా వేయచ్చు అని నిర్ణయించేది. అమ్మ ఆ నిర్ణయం లో మా అవసరాలు వాయిదా పడకుండా ఉండాలి అని గట్టిగా కోరుకునే వాళ్ళం. అయితే ఒకో నెల ఒకొక్కరి కోరికలు తీరేవి. ఒకోక్కరివి వాయిదా పడేవి ..వున్నా ఆదాయం తో అందరిని సంతృప్తి పరచేందుకు అమ్మ పెద్ద కసరత్తే చేసేది ..

 

చిన్నప్పుడు ఆ ప్రహసనమంతా ..మాకు కొంచం చిరాకు ని , కోపాన్ని తెప్పించిన మాట మాత్రం వాస్తవం. అమ్మ మా కోరిక వాయిదా వేసినప్పుడు ..అమ్మ కి మా మీద ప్రేమ లేదని బాధపడి పోయేవాళ్ళం. మా కోరిక తీరిన రోజున అమ్మ దేవత అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ కోపాలు, అలకలు , అన్ని తలుచు కుంటే నవ్వు వస్తుంది ..కాని చాలా విషయాలు ఆ బడ్జెట్ అలాట్మెంట్ ద్వారా అమ్మ మాకు నేర్పింది అన్న సత్యం ఇప్పుడు మాకు అర్ధం అవుతోంది. అందులో ముఖ్యమయినవి ..

 

సహనం ...

అవును ..మనసులో ఒక కోరిక వచ్చిందే తడువుగా కొత్త మొబైల్ నుంచి ..కొత్త కార్ దాకా ఏవయినా అందుబాటులో ఉంచుతున్నారు ఇప్పటి తల్లి తండ్రులు . .దానితో తీరని కోరికలు ఏవి లేవు ఇప్పటి పిల్లలకి. కాని అమ్మా నాన్నా కాదుగా "జీవితం "...అన్ని అమర్చి పెట్టదు..కొన్నిటిని ఊరించి , ఊరించి అందిస్తుంది ..కాని అడగగానే అమ్మ అన్ని అందించటం అలవాటు పడిన పిల్లలకి ..ఈ సహనం పట్టటం ఎలా తెలుస్తుంది ? బాధ పడతారు ..అసంతృప్తి తో కుమిలి పోతారు. అదిగో అదే ఇప్పటి జనరేషన్ లో చాలా మంది ని  ఇబ్బంది పెట్టే విషయం ...ఈ రోజు కాకా పోయినా రేపు మనకి కావలసినది దొరుకుతుంది లే ..అనే ఆశ ని కలిగించింది చిన్నప్పటి అమ్మ బడ్జెట్ ..

 

ఎదురు చూపలలో ఆనందం 

ఒక్కసారి ఆలోచించండి ..అనుకున్నదే తడువుగా, తలుచు కున్న క్షణం లో మీకు కావలసినది మీ చేతిలో ఉన్నప్పటి ఆనందాన్ని , ఎంతో ఎదురు చూసి దక్కించుకున్న వస్తువు ..చేతి లో పడిన క్షణాన్న కలిగిన ఆనందాన్ని పోల్చి చూడండి ..రెండో అనుభవం జీవితాంతం గుర్తు వుంటుంది ..అందుకే మన చిన్నప్పుడు పండగ రోజున వేసుకున్న బట్టలు ఇప్పటికి  మనకి తీపి జ్ఞాపకాలు ..ఇప్పుడో ..ఎన్ని కొనుక్కున్నా ..ఆ తృప్తి ..ఆ ఆనందం రుచి చూడలేక పోతున్నాం ..ఎదురు చూపులలో వుండే ఆ తీపిని మిస్ అయిపోతున్నాం . ఇప్పటి పిల్లలకి అయితే ఆ రుచే తెలియదని చెప్పచ్చు. 

 

రూపాయి విలువ.. 

అవును..రూపాయి విలువ పడిపోయింది అన్న మాట నిజమే నేమో అనిపిస్తుంది, ఇప్పటి మన ఖర్చు లు చూస్తుంటే ..ఒకప్పుడు చేతిలో ఉంటేనే మన రూపాయి ..అప్పుడే ఖర్చు ...గురించి ఆలోచన. ఇప్పుడో  ? కార్డు లో మన రూపాయి లేక పోయినా కావలసినంత ఖర్చు పెట్టె వీలు ..దానితో ఖర్చు పెట్టేటప్పుడు ముందు , వెనకా చూడటం మర్చి పోయాం. ఆ తర్వాత తీరిగ్గా ..బాధ పడుతుంటాం . పిల్లలకి అయితే ఆ నొప్పి కూడా తెలియదు , కాబట్టి ..తీరని, తీర్చలేని కోరికలు అంటూ వారికి పెద్దగా ఏవి వుండటం లేదేమో కూడా .

 

ఇలా ఒకటా .రెండా  ? ఎన్నో ఎన్నెన్నో నేర్చుకున్నాం అమ్మ బడ్జెట్ ప్రణాళిక వల్ల మనమంతా. మరి అమ్మలుగా మన పిల్లలకి ఆ విలువలు నేర్పాలంటే మనం కూడా బడ్జెట్ వేయటం మొదలు పెట్టాలి కదా ! దేశ బడ్జెట్ ఎలా వుందో చూసేసాం..ఇక మన ఇంటి బడ్జెట్ వేసుకుందాం ..రాబడి బట్టి ఖర్చు ని నిర్ణయించుకుందాం ..కొన్నిటిని వాయిదా వేద్దాం ..కొన్నిటిని పూర్తిగా వద్దనుకుందాం . పిల్లలకి నో చెప్పటం నేర్చుకుందాం. వాళ్ళ కి ఓర్పుని, ఎదురుచూడటం లోని ఆనందాన్ని రుచి చూబిద్దాం..ఇవే  అతి విలువయిన జీవిత పాఠాలు..

 

-రమ ఇరగవరపు