Facebook Twitter
సాంఘిక విలువ

 

సాంఘిక విలువ

- రావూరి భరద్వాజ

వచనాన్ని అందంగా రాయగల రచయిత. కన్నెపిల్ల సిగ్గులా కథనశైలిని నడపగలరు. కథలు, నవలలు, స్మృతి సాహిత్యాన్ని అపారంగా రాశారు. ఆవేదన నుంచి, ఆకలి బాధల నుంచి, ఆర్థిక లేమి నుంచి, కష్టాల సుడి గుండాల నుంచి సాహిత్యాన్ని సృష్టించారు. ఎక్కడా పర్వతాలు ఎక్కి పాఠకుడ్ని లోయల్లో పడేయరు. వాస్తవాన్ని నేస్తంగా, న్యాయనిర్ణేతగా చెప్తారు. అతనే రావూరి భరద్వాజ. విశ్వనాథ సత్యనారాయణ, డా. సి. నారాయణ రెడ్డి తర్వాత తెలుగువారికి జ్ఞానపీఠ్ ను తెచ్చిన పాకుడురాళ్ల నవలా రచయిత డా. రావూరి భరద్వాజ. వీరు రాసిన ఎన్నో కథలు సామాజిక జీవితంలోని ఎగుడు దిగుడులను నగ్నంగా చూపిస్తాయి. అలాంటిదే సాంఘిక విలువ కథ.

          ఏభై ఏళ్ల కిందట కూనూరు వాళ్లు అంటే ఆ చుట్టుపక్కల మంచి పేరు. కేవలం రెండు వందల ఎకరాల పొలం ఉన్నా దాన ధర్మాలు చేయడంలో, వచ్చిన వారికి లేదనకుండా పెట్టడంలో వారిది పేరున్న ఇల్లు. అసలు డబ్బును పరోపకారార్థం ఉపయోగించాలి అని వారి ఉద్దేశం. అందువల్లే వారికి అంత పేరు వచ్చింది. ఎప్పుడు ఇంటి నిండా బంధువులు,  పశువులు... అలా వైభవంగా జరిగేది. చలమయ్య అంటే చేతికి ఎముకలేని వారు అని గొప్పగా చెప్పుకునే వారు. ఆవుపెయ్య తిండి తినకపోతే ఎనిమిది ఆమడల దూరంలో ఉన్న నాలుగు తరాల బంధువు కుటంబంతో సహా వచ్చి నెల రోజులు ఉండి, ఆ ఆవు గడ్డి మేసిందాకా.. ఉన్నాడు. చివరకు చలమయ్య చనిపోతూ కూడా బంధువు పెళ్లికి నూటపదాహార్లు ఇవ్వమని సైగచేసి మరీ చనిపోతాడు.
          చలమయ్య కొడుకు బసవయ్య. తండ్రి అంత ఉదారవాది కాకపోయినా, తండ్రి పేరు నిలబెట్టడానికే ప్రయత్నం చేశాడు. తండ్రి చేసిన దానాలతో ఉన్న ఆస్తులు కరిగిపోయాయి. కొంత మంది ఇతని స్వభావాన్ని చూసి, తండ్రి అప్పులు చేసినట్లు కాగితాలు సృష్టిస్తారు. బంధువు ఒకతను దొంగ సంతకంతో కాగితాలు తయారు చేసుకొని మీ తండ్రి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అంటాడు. పదిహేను వేలు ఇస్తాను అన్నా కాదని పదిహేను ఎకరాల పొలం రాయించుకుంటాడు. మిగిలిన ఆస్తి కూడా తాకట్టులోకి పోతుంది. కానీ బసవయ్య తండ్రి అంత కాకపోయినా తండ్రికి తగ్గ కొడుకే అని మాత్రం పేరుతెచ్చుకుంటాడు. చివరకు పేదరికంలోకి నెట్టివేయబడతాడు. చివరకు ఒక్కగానొక్క కొడుకు శేషగిరికి బారసాలను చాలా హీనస్థితిలో జరుపుతాడు.
         శేషగిరి చదువు ఆరో తరగతితో ఆగిపోతుంది. తాత, తండ్రి చేసిన దానాల వల్ల శేషగిరి జీవితం పూర్తిగా పేదరికంలోకి వెళ్లిపోతుంది. తాతను, తండ్రిని పొగిడిన వాళ్లు, వాళ్ల సహాయంతో ఎదిగిన వాళ్లు- పేరు ప్రతిష్టల కోసం, డబ్బును దుర్వినియోగం చేసుకున్నారు అని దెప్పిపొడుస్తారు. శేషగిరికి కూడా ఏ పని చేతకాదు. తను దౌర్భాగ్యుడని తెలిసినా యశోదను పెళ్లి చేసుకుంటాడు. కానీ చిల్లగవ్వ లేని ఇంట్లో యశోద కష్టాలు పడాల్సి వస్తుంది. చేతగాని వాడివి పెళ్లెందుకు చేసుకున్నావు... మా వాళ్లు నా గొంతు కోోశారు... అని తిడుతుంది, కోప్పడుతుంది. కానీ ఫలితం శూన్యం. ఒక్కోసారి శేషగిరి ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. అయితే ఒకరోజు యశోద ఆకలిని తట్టుకోలేక దూరంగా అరటిపళ్లు అమ్మే బల్ల దగ్గరకు వెళ్తుంది. అక్కడ అరటికాయలు తినే వ్యక్తి యశోద మాటలను గమనిస్తాడు. యశోద చూపుల ఆయన బరువైన జేబును చూస్తాయి. అలా యశోద అక్కడ తప్పు చేస్తుంది. పదిరూపాయలతో ఇంటికి వచ్చి రేగిన జుట్టును పగిలిన అద్దంలో చూసుకొని భర్త ఇంటికొచ్చే సమయానికి రెండు కూరలతో భోజనం చేసి పెడుతుంది. అప్పు తెచ్చాననిని అబద్దం చెప్తుంది. ఒకరోజు మధ్యహ్నం ఇంటికి వచ్చిన శేషగిరికి తలుపులు వేసి ఉండడం కనిపిస్తాయి. కానీ ఇంట్లోనుంచి నవ్వులు వినిపిస్తాయి. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి కొత్త చీరతో, మల్లెపూలతో భార్య కనిపిస్తుంది. మీకు కొత్త ధోవతీ తెచ్చానని చెప్తుంది. ఇరుగుపొరుగువాళ్లు, తోటి వాళ్లు వీరి గురించి అనేక రకాలుగా చెప్పుకుంటుంటారు. శేషగిరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. కానీ పెద్దపెద్ద వాళ్లు రాత్రులు కూడా యశోద దగ్గరకు వచ్చి కావాల్సిన పనుల గురించి ఏకరవు పెట్టి చేయించుకుంటూ ఉంటారు.
        కొంత కాలానికి శేషగిరికి కొడుకు పుడతాడు. వాడు సీతారామయ్య పోలికలతో ఉంటాడు. అప్పటికే భార్య సలహా ప్రకారం శేషగిరి సీతారామయ్యతో కలిసి వ్యాపారం ప్రారంభించి లాభాలు గడిస్తుంటాడు. పదెకరాల పొలం కొంటాడు. ఊళ్లో వాళ్లు మాత్రం కోటి వీరయ్యగారు యశోదకు కొనిపెట్టారు అని చెప్పుకుంటారు. క్రమంగా శేషగిరి ధనవంతుడవుతాడు. ఇల్లు బాగుచేయిస్తాడు. మనిషి పచ్చబడతాడు. తాత, తండ్రుళ్లా దాన ధర్మాలు చేయడం మొదలుపెడ్తాడు. బీదవిద్యార్థుల కోసం ఆడే నాటకానికి వంద రూపాయలు విరాళం ఇస్తాడు. ఊళ్లో హైస్కూలు కట్టడానికి అందరి కంటే ఎక్కువ దానం చేస్తాడు. లైబ్రరీ పునరుద్ధరణలో ముందుంటాడు. ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్లు పొగడడం ప్రారంభిస్తారు. బంధువులు మళ్లీ రావడం మొదలు పెడ్తారు. శేషగిరి మాత్రం ఒక సత్యం నేర్చుకున్నాడు- డబ్బుకావాలి. అది పాపిష్టిదే కావచ్చు. సంఘంలో గౌరవంగా బతకడానికి ఆ దిక్కుమాలింది అవసరం. మనకు హెచ్చుతగ్గులుగా గౌరవాన్ని ముట్టచెప్తుంది. అది సంపాదించిన విధానం కంటే, సంపాదించిన పరిమాణం మీద సంఘదృష్టి వుంటుంది.... ..... మనిషికి కావల్సింది విజ్ఞానం కాదు, డబ్బు. పాపిష్టిది దిక్కుమాలింది అయిన డబ్బు. అని రచయిత కథను మముగిస్తారు.
          ఈ సాంఘిక విలువ కథలో డబ్బుకు సమాజంలో ఉన్న గౌరవం, విలువలే కాకుండా, మనిషికి నీతి నిజాయితి లేకపోయినా డబ్బు ఉంటే చాలు అని లోకం తీరును చెప్పాడు భరద్వాజ. మూడు తరాల చరిత్రను చిన్న కథలో చెప్పడం సామాన్యమైన విషయం కాదు. అది వీరి శిల్పానికి నిదర్శనం. కథను ఎక్కడ ప్రారంభించారో అక్కడే ముగించారు. తాత బసవయ్య దానాల గురించి కథను మొదలు పెట్టి, మనమడు శేషగిరి చేసే దానాలతో ముగించారు. మధ్యలో వారి జీవితంలోని ఎగుడుదిగుడలను,  ఆకలి బాధ తట్టుకోలేక యశోద లైంగికంగా చేసిన తప్పను. ఆ తప్పులతోనే మరలా పూర్వ వైభవాన్ని పొందిన విధానాన్ని అద్భుతంగా చెప్పారు. అలానే లోకం తీరును చెప్తూ- డబ్బు లేనప్పుడు దూరమైన వాళ్లు, తప్పు చేస్తున్నప్పుడు హేళన చేసిన వాళ్లు, ధనం రాగానే పొగడ్తలతో, గౌరవంతో చూడడాన్ని రచయిత వాస్తవిక దృక్పథంతో చెప్పారు.
      కథలో అక్కడక్కడా సూక్తులు కనిపిస్తాయి. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. వానలో తడిసిన తర్వాతగాని గొడుగు విలువ తెలియదు. దరిద్రం కుష్ఠువ్యాధి లాంటిది. అది రాకుండానే ఉండాలి గానీ, వచ్చిన తర్వాత ఆ వంశం యావత్తూ దాన్ని భరించక తప్పదు. ఇలానే యశోద తప్పు చేసినప్పుడు ఆమెను వర్ణిస్తూ- పగిలి పోయిన అద్దం చెక్కలో రేగిన జుట్టు సరిచేసుకుంది. పమిటతో కళ్లు, బుగ్గలు తుడుచుకుంది. ఎందుకో కళ్లలో నీళ్లు తిరిగినై, దగ్గర్లో వున్న పదిరూపాయల నోటు గాలికి రెపరెపలాడింది. అన్నారు. ఇవి ఆమె మానసిక, శారీరక స్థితిని తెలియజేస్తాయి.
            ఇలా సాంఘిక విలువ కథను ఆద్యంతం అప్రతిహతంగా రచించి, చదివిన పాఠకులకు కన్నీటిని, వాస్తవాన్ని అద్దంలో చూపారు భరద్వాజ. 

- డా. ఎ.రవీంద్రబాబు