TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
త్వరపడి (ఉగాది కథల పోటీలో కన్సలేషన్ బహుమతి పొందిన కథ)
"మమ్మీ సెకండ్ షో సినిమాకి వెళతున్నాను " అంటూ క్రిందికి వచ్చింది రజిత.
"ఇప్పుడా ? అదీ నువ్వొక్కదానివే వెళతావా ? వద్దులేమ్మా " అంది లక్ష్మి .
'ఒక్కదాన్నే అయితే ఏమైంది మమ్మీ! నాకిప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది వెళతానంతే ! " పంతంగా అంది . " ఇప్పుడు వద్దని చెపుతున్నాను కదా !" అంతే పంతంతో కార్ కీస్ తీసుకుని చేతిలో బిగించి పట్టుకుంది .
"మీ ఆవిడ పేరుకి డాక్టరే కానీ అన్నీ పాతకాలం అమ్మమ్మ భయాలు. ఒక్కదాన్నే సెకండ్ షో కి వెళ్ళకూడదా ! డాడీ? " అన్న ప్రశ్న నాకు
"వెళ్ళకూడదు, నువ్వు ఆడపిల్లవని మర్చిపోతున్నావ్! " హెచ్చరిస్తూన్నట్లు చెప్పింది లక్ష్మి
"తరతరాలగా స్త్రీలు మగ్గిపోయింది యాతనలు పడింది అణగద్రొక్కబడింది చాల్లేదా ? ఇప్పుడిప్పుడే కదా ! మగవాళ్ళతో సమానంగా చదువులు చదువుతుంది, ఉద్యోగాలు చేస్తున్నది . అమ్మాయిలని కూడా వాళ్ళ లాగానే ఎంజాయ్ చేయనివ్వండి మమ్మీ ! ఇలా ప్రతిదానికి ఆంక్షలు పెడితే ఎలా ? " విసుక్కుంది రజిత.
"చిన్ని నిక్కర్ వేసుకుని పైన స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకుని తిరుగుతుంటే, మగవాళ్ళ చూపులు తాకుతుంటే గర్వంగా ఎంజాయ్ చేసే ఇప్పటి తరం మీది. ఒంటి నిండా కిలోల కొద్దీ బట్టలు చుట్టుకుని కూడా మగవాడి చూపులు శరీరమంతా గుచ్చుకుంటుంటే ఇబ్బందిగా, అవమానంగా భావించిన మా తరానికి ఖచ్చితంగా తేడా ఉంది . ఆలోచనల్లో వచ్చినంత మార్పు మన జీవనవిధానంలో రాలేదు. అమ్మాయిల ఆలోచనా విధానం మారినంత వేగవంతంగా అబ్బాయిల ఆలోచనల్లో మార్పు రాలేదు. సమానత్వం సాధించామని కొన్ని సందర్భాలలో మాత్రమే అనుకోవడానికి బావుంటుంది.జాగ్రత్తగా ఉండాలమ్మా !"
"నాకసలు బుద్ధి లేదమ్మా! నీ పర్మిషన్ అడగడం, నువ్వు కాదనడం ఎప్పుడూ ఉండేవే ! నీ హితబోధ వినే ఓపిక నాకిప్పుడు లేదు" అనుకుంటూ గదిలోకి వెళ్ళి పెద్ద శబ్దంతో తలుపులు మూసుకుంది. నా భార్య హితబోధ నా కూతురి చెవి ఎక్కదు. ఎక్కనీయకుండా ... ఎక్కువ సౌండ్ పెట్టి "ముసుగు వేయొద్దు మనసు పైన, వలలు వేయొద్దు వయసు పైన" పాటని కక్ష కట్టి కావాలని పెద్ద సౌండ్ తో మాకు వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది .
"లక్ష్మీ !ఎన్నిసార్లు చెపుతావ్? పిల్లలకి విసుగు వచ్చేదాకా చెపితే వాళ్ళింకా మొండివాళ్ళగా తయారవుతారు వదిలేయకూడదు" అన్నాను.
"మీకు హాస్పిటల్, సర్జరీ లు తప్ప ఇంకేమి తెలియదు . ఒకసారి మా గైనిక్ విభాగం వైపుకి వచ్చి చూడండి . రోజూ అబార్షన్ కోసం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలైనా వస్తారు . ప్రక్కన భర్తనే వాడు ఉండడు. పోనీ తల్లి కూడా ఉండదు .. ఏ ఫ్రెండో ఉంటారు . ఇవాళొక అమ్మాయి వచ్చింది నాలుగు నెలలు దాటాయి కూడా . అబార్షన్ రిస్క్ అవుతుంది అన్నా వినదు . నేను అబార్షన్ చేయడం కుదరదని గట్టిగా చెప్పేసాను. వాళ్ళు వెళుతూ వెళుతూ నన్ను శత్రువుని చూసినట్టు చూసి వెళ్ళారు. "వయాగ్రా దొరికినంత ఈజీగా అబార్షన్ చేయించుకోవడం కుదరదు.అంటే విన్నావా ? థ్రిల్లింగ్ గా ఉంది అంటూ ట్రై చేసావ్ ! ఇప్పుడు ఏడువ్ ... అని ఆ ఫ్రెండ్ తిడుతూ తీసుకు వెళుతుంది " ఇప్పటి పిల్లలకి సంప్రదాయం చట్టుబండలు ఏమీ లేవు . నాకు చాదస్తమని అనుకున్నా పర్వాలేదు మన అమ్మాయిని కూడా అలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందేమోనని భయంగా ఉందండి " అన్న లక్ష్మి మాటలని "నువ్వు ఎక్కువాలోచిస్తున్నావ్ " అంటూ కొట్టి పడేసాను.
మూడు రోజుల పాటు జరిగే మెడికల్ కాన్ఫరెన్స్ కి విశాఖపట్నం వచ్చాను. ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు సెషన్స్ లోనూ కాన్ఫరెన్స్లో పాల్గొని సాయంత్రానికి బీచ్ కి చేరుకోవడం, మిత్రులతో సందడి చేయడం ఉల్లాసంగా ఉంది. ముఖ్యంగా అరవింద్ తో . కాకినాడ రంగరాయలో చదువుకునేటప్పుడు నాకతను జూనియర్. ఇప్పుడు హైదరాబాద్లో సొంత హాస్పిటలు నడుపుతున్నాడు.
ఆ రెండు రోజుల నుండి భీమ్లీ బీచ్ వెంట, రామకృష్ణ బీచ్ దగ్గర అమ్మాయిలని అబ్బాయిలని చూస్తుంటే మతి పోతుంది. ఎక్కడ చూసినా జంటలు జంటలు. ఏకాంతాన్ని వెతుక్కుంటూ, దూరంగా వెళుతూ ప్రమాదాల అంచున పయనిస్తున్నారనిపించింది .
"ఇప్పుడున్న అమ్మాయిల స్పీడ్ చూస్తుంటే అబ్బాయిలకేమీ తీసిపోనట్లుగానే ఉన్నారు." అన్నాను అరవింద్ తో .
"ప్రపంచదేశాలన్నింటి నుండి టెక్నాలజీ ని దిగుమతి చేసుకున్నట్లే వారి సంస్కృతిని సంప్రదాయాలని ఆహార విహారాలని దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని మాత్రమే కావాలి, కొన్నింటిలో మనం మనలాగే ఉండాలని కోరుకోవడం కూడా స్వార్ధమే అవుతుంది." అన్నాడతను.
"మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసాన్ని పిల్లలు గుర్తించగల్గేలా చేయడంలో మనం విఫలమవుతున్నాం. వాళ్ళతో గడిపే సమయం చాలా తక్కువ, వాళ్ళకి లభించే స్వేచ్చ ఎక్కువ. పల్లె పట్టణం అనే తేడానే లేదు ప్రతి ఒక్కరి జీవితం దృశ్య మాధ్యమం చుట్టూనే తిరుగుతుంది.టీవి అయితేనేమిటి ఇంటర్ నెట్ అయితే ఏమిటీ అన్నట్టుగా ఉంది. మా రజితని చూస్తేనూ భయంగా ఉంటుంది. నా మిసెస్ లక్ష్మి కూడా చాలా ఆవేదనగా ఉందీ విషయంలో అన్నాన్నేను.
" మన ఫెయిల్యూర్స్ ఏమిటో మనకి తెలుసు, అయినా పిల్లల ముందు ఒప్పుకోము. పిల్లల్లో మొరాలిటీ తగ్గిపోతుంది ఎదుటివారిని మోసం చేయడం తాము మోసగింపబడటాన్ని తేలికగా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులని మోసం చేయడమే కాదు తమని తాము మోసం చేసుకుంటున్నారు". బాధగా చెప్పాడు అరవింద్. నేను మౌనంగా తలూపాను.
నా కొడుకు కూడా అంతే ! మేము చెప్పే ఏ మాటని లక్ష్య పెట్టడు. బిట్స్ లో చదువుతున్నాడు . మీకు కావాల్సిన రిజల్ట్స్ మీకిస్తున్నాంగా, మా ప్రతి విషయంలో జోక్యం చేసుకోకండి అంటాడు. ఫ్రెండ్స్,పార్టీలు అన్నీ మామూలే ! అరవింద్ బాధగా చెప్పాడు. ఎదురుగా అనేకమంది యువతని జంటలు జంటలుగా చూస్తూ వాళ్ళ చేష్టలని గమనిస్తూ ఉంటే మా పిల్లలు కూడా ఇలాగేనేమోనన్న ఆలోచనల మధ్య సముద్ర తీరంలో సాయంసమయాల్లో ఉండే సుందర దృశ్యాలని ఆస్వాదించలేకపోయాం. ట్రైన్ అందుకోవాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఆరోజు రాత్రికి అక్కడే ఉండి మర్నాడు ఉదయమే ప్లైట్ కి వెళతానన్న అరవింద్ ఎక్కువసేపు నీతో గడిపినట్లు ఉంటుందని అతను కూడా ట్రైన్ లో వస్తానని నాతో పాటు బయలుదేరాడు. విజయవాడలో ట్రైన్ మారొచ్చు , వచ్చేసేయి అన్నాను సంతోషంగా.
హోటల్ రూమ్ ఖాళీ చేసేసి విశాఖపట్నం - చెన్నైసూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఎక్కేసాము.నాకు రిజర్వేషన్ ఉంది. సోమవారమవడం మూలంగా ఎక్కువ రద్దీ లేకపోవడం మూలంగానేమో అరవింద్ కి కూడా తేలికగానే బెర్త్ దొరికింది. ట్రైన్ బయలుదేరుటకు సిద్దంగా ఉంది ఎనౌన్స్మెంట్ వినబడుతూ ఉండగా ఒకమ్మాయి వచ్చి ఎదురు సీట్ లో కూర్చుంది. తనకన్నా పెద్దగా ఉన్నతను వచ్చి బెర్త్ చెక్ చేసి లగేజ్ సర్దుతూ ... ఎదురుగా కూర్చున్న నన్ను పలకరించి మీరెక్కడి వరకండీ ? అని అడిగాడు. నెల్లూరు వరకు అని చెప్పాను . ఓహ్ .మీరు కూడా నెల్లూరేనా! తను నా సిస్టర్ అండీ ! ఒంటరిగా వెళుతుంది కదా ! అందులోనూ రాత్రి ప్రయాణం. పెద్దవారు మీరున్నారు తోడుగా ఉంటారు, ఇక భయమేమీ లేదు అంటూ భరోసా ఇచ్చుకుంటూ ట్రైన్ దిగేసి కదిలే వరకూ చెల్లెలికి జాగ్రత్తలు చెపుతూనే ఉన్నాడు.
ట్రైన్ ప్లాట్ఫామ్ ని వదిలేశాక " అన్నయ్యండీ ! ఉన్నంత సేపు నస పెట్టి చంపేస్తాడు . ఇంత పెద్ద ట్రైన్ లో నేను ఒక్కదానినంటూ భయం కల్గిస్తాడు" అంటూ విసుక్కుంది. నాకు నవ్వు వచ్చింది. అరవింద్ నేను మాటల్లో పడ్డాం.
కాసేపటి తర్వాత దువ్వాడ స్టేషన్ లో ఆగినప్పుడు ఆ పిల్ల ప్రక్కన మరొక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. "ఎలాగైతేనేం రిజర్వేషన్ సంపాదిన్చావ్. ఎక్కడ మిస్ అవుతావో అనుకున్నాను." అంటూ ప్రక్కకి జరిగి అతనికి చోటిచ్చింది .. క్షణాల్లో అతని కుడి చేతిలో ఆమె ఎడమచేయి కలసి మాట్లాడుకున్నాయి . తర్వాత భుజాలపై చేతులేసుకున్నారు కొద్దిసేపటికి ఆ చేతులు నడుమును చుట్టేసుకున్నాయి.చిన్నగా దగ్గి మా ఉనికి తెలియజేయజేసాను. వాళ్ళిద్దరూ దూరంగా జరిగారు . అరవింద్ కూడా ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాడు. ఎక్కడో ఈ పిల్లని చూసినట్టు ఉంది. గుర్తుకురావడం లేదు అన్నాడు. అనకాపల్లిలో ఒక స్త్రీ ఎక్కింది ఆమె వయసు అరవైకి పైనే ఉంది. ఇంట్లో అసలు రెస్ట్ లేదండీ. మీకు అభ్యంతరం లేకపోతే నేను కాసేపు పడుకుంటాను అంగీకారం కోసం ఎదురుచూస్తూ నిలబడింది. ఏ సి ఫస్ట్ క్లాస్ నాలుగు బెర్త్ ల కాబిన్ వచ్చింది. కేటాయించిన ప్రకారం కాకుండా మేమిద్దరం పై బెర్త్ ల పైకి చేరుకొని విశ్రమించాం.
పనిగట్టుకుని చూడాలని కాకపోయినా అప్పుడప్పుడూ నెల్లూరమ్మాయిపై నా దృష్టి పడుతూనే ఉంది. క్రింద బెర్త్ లో పడుకున్నావిడ కాసేపటిలోనే వారిని బాగా గమనించింది . ఈ కాలం పిల్లలకి హద్దు అదుపు లేదు. ఆడపిల్లలు చదువుకుని వృద్దిలోకి వస్తారు కదా అని చదువులకి పంపిస్తుంటే వీళ్ళు వేసే వెధవ వేషాలు ఇవీ ! ఇలాంటి పిల్లలు నాకుంటే పీక పిసికి చంపెసేద్దునూ .. అసహ్యంగా పైకి అనేసింది. "ఇదిగో అమ్మాయ్.. ఈ కాబిన్ లో నలుగురికే కదా ప్రవేశం. అతనెందుకు ఇందులో ఉన్నాడు అతన్ని పంపించేయి. అని గట్టిగా కోప్పడింది. ఆ పిల్లతో నేను చెప్పలేని విషయాన్ని ఆమె అవలీలగా చెప్పేసింది. వాళ్ళిద్దరూ లేచి ఎంట్రన్స్ వైపు వెళ్ళారు.
"అమ్మాయిలున్నారు చూడండి,కన్న వాళ్ళని ఇట్టే మోసం చేసేస్తారు. స్వేచ్చనిచ్చి కాలేజీలకి పంపిస్తే బాయ్ ఫ్రెండ్ ని వెంటేసుకుని షికార్లు కొట్టడం చూడలేక చస్తున్నాం. వీళ్ళకి నైతిక విలువలేవీలేవు. డ్రెస్ మార్చినట్టు బాయ్ ఫ్రెండ్ ని మార్చేస్తున్నారు. చెడిపోవడానికి మగవాళ్ళతో పోటీ పడుతున్నారు. ముల్లెళ్ళి అరటాకుపై పడ్డా అరటాకు వచ్చి ముల్లుపైబడ్డా అరటాకుకే నష్టమని తెలిసినా వెరుపనేది లేదు. మద్రాస్లో కూడా ఇంతే ! తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని డబ్బులు పంపించేస్తారు. తీరా చూస్తే వీళ్ళ బాగోతలివి"నిర్మొహమాటంగా మాట్లాడేస్తుందామె.
"సమాజపరంగా వచ్చే అనర్ధాలు కొన్నైతే వీళ్ళు కోరి కొని తెచ్చుకుంటున్నవి మరి కొన్ని. అమ్మాయిల ఆలోచనలు స్వేచ్చా పిపాస ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్ళినంత స్పీడ్ గా ఉన్నాయి. సమాజం ప్యాసింజర్ ట్రైన్ నడచినట్టు నత్తనడక నడుస్తుంది. రెండిటికి పొంతన కుదరడం లేదండి " అన్నాను నేను.
"నేనేమీ స్త్రీ అభివృద్ధి నిరోధకురాలినికాదండీ ! పాస్ట్ పాసింజర్ లా వెళ్ళాలనుకుంటున్న దానిని. ఈ సమానత్వాలు చదువులు, ఉద్యోగాలు ఎన్ని చెప్పినా ఆడపిల్లలు అరటాకు లాంటి వారేనండీ ! వారి జీవితం అందులో వడ్డించిన షడ్రశోపేత భోజనం కావాలి. కానీ వీళ్ళు కుక్కలు చింపిన విస్తరిలా చేసేసుకుంటున్నారు. మన చుట్టుప్రక్కల జరుగుతున్నవి గమనిస్తుంటే బాధగా ఉంటుందండి. ఊరుకోలేక కలగజేసుకుని చెపుతూనే ఉంటాను. మా పిల్లలైతే నీతో మాకు సమస్యలొస్తున్నాయ్ అని నన్నుతమతో బయటకి తీసుకెళ్లడం మానేశారు. మనకెందుకవన్నీ ? సమాజం ఏమైపోయినా మనం పట్టించుకోకూడదు. కలుగజేసుకుని సుద్దులు చెప్పకూడదు, అవన్నీ వాళ్లకి నచ్చవ్ అని నా నోరు కట్టేస్తుంటారు". బాధపడుతూ చెప్పింది ఆమె.
అరవింద్ వైపు చూసాను నిద్రలోకి జారుకున్నాడో ఇవన్నీ చూడకూదదనుకుని నిద్ర నటిస్తున్నాడో అర్ధం కాలేదు. రాజమండ్రి దాటింది, ఆ అమ్మాయి బెర్త్ ఖాళీగానే ఉంది. ట్రైన్ లో కాంతి తగ్గుతూ ఉంది. అందరూ నిద్రలోకి జారుకుంటున్నారు. నేను టాయ్లెట్ వైపు వెళ్ళాల్సి వచ్చింది. అటువైపు వెళ్ళబోయి అక్కడ కనబడే దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయాను. బహిరంగంగా చేయకూడనివి రహస్యంగా కూడా చేయకూడదన్నట్టు కంకణం కట్టుకున్నట్టున్నారు ఏకాంతంలో జరగాల్సిన వాటిని నిస్సిగ్గుగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళిద్దరిని చూస్తుంటే భయమేసింది. చటుక్కున వెనక్కి తిరిగి బెర్త్ మీదకి చేరుకున్నాను. నా భార్య లక్ష్మి అనే మాటలు, క్రింద బెర్త్ లో నిద్రపోతున్న పెద్దావిడ అన్నమాటల్లో నిజం లేకపోలేదన్నది తెలుస్తూనే ఉంది. చదువులు ఉన్నత ఉద్యోగాలున్న యువతకన్నా సంస్కారం, నైతిక విలువలున్న యువత కావాలి. తెర మీద చూసిన దృశ్యాల కన్నా వాస్తవ ప్రపంచంలో కనబడుతున్న దృశ్యాలే కలవరపెడుతున్నాయి.
పార్క్, బీచ్, దియేటర్, బస్, ట్రైన్, ఆఖరికి గుడి ... అన్నిచోట్లా స్వేచ్చగా విహరిస్తున్నయువతే ! ఈ తప్పు ఎవరిది ? సినిమాల దా? పోర్న్ సైట్ లదా? సెల్ ఫోన్ వచ్చాక పల్లెటూర్లలో పిల్లలు కూడా ప్రేమ ఊబిలో చిక్కుకుని మోసపోయే తీరుని చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న పట్టణాలలో పెరిగిన పిల్లలే ఇలా ఉంటే ఇక మహానగరాలలో పుట్టి పెరిగిన వారు ఎలా ఉంటారో! రజిత కూడా ఇలాగే అడ్వాన్స్ అవుతుందేమో ! ఊహకే భయమేస్తుంది.
విజయవాడలో అరవింద్ దిగినప్పుడు నేను ట్రైన్ దిగి అతనికి వీడ్కోలు చెప్పి టీ త్రాగుతూ నిలబడ్డాను. నెల్లూరమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో ప్లాట్ఫామ్ పై చక్కర్లు కొడుతూ కనిపించింది.అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాను . ట్రైన్ ఎక్కేసి అలారం నాలుగున్నరకి సెట్ చేసి పడుకున్నాను. అలారం మ్రోతకి మెలుకువ వచ్చింది. కాసేపు కళ్ళు మూసుకునే ఉన్నాను . రాత్రి జరిగిన విషయాలు కళ్ళ ముందు మెదిలాయి. చటుక్కున కళ్ళు తెరిసి చూసాను. ఆ పిల్ల ఒక్కటే కూర్చుని ఉంది. బాయ్ ఫ్రెండ్ ఒంగోల్ లో దిగిపోయి ఉంటాడేమో!
రైలు పెన్నా బ్రిడ్జ్ మీదుగా వెళుతున్న శబ్దం. ఆలస్యమేమి లేకుండానే సమయానికే స్టేషన్ ని చేరుకుంది. లగేజ్ తీసుకుని క్రిందికి దిగాను . ఆ అమ్మాయి నా కన్నా ముందే రైలు దిగి ముందుకు నడుస్తుంది . "అమ్మా ..సరితా ఇదిగో ఇక్కడ అంటూ నా వయసున్నతను ఆ అమ్మాయి వెనుక నుండి పిలుస్తూ దగ్గరకి చేరుకున్నాడు. ఆ అమ్మాయి డాడీ ... అంటూ తండ్రిని హగ్ చేసుకుని .. ఐ మిస్ యూ అలాట్ డాడీ .. ఐ లవ్ యూ అంటూ గారాలు పోతుంది. నేను ఆశ్చర్యపోయాను. ఎంత నటిస్తుందీ అమ్మాయి . ఆ అమ్మాయి అంతకు ముందు ఎలా ప్రవర్తించిందో ఆ తండ్రి తెలియదు . ఒకవేళ నాబోటి వాడు చెప్పినా ఆ తండ్రి నమ్మడు కాక నమ్మడు అలా నంగనాచిలా ప్రవర్తిస్తూ ఉందామ్మాయి. నా టికెట్ చెకింగ్ అయింది. ఆ అమ్మాయి టికెట్ చెకింగ్ లేట్ అయింది. నేను ఆ తండ్రి వంక చూస్తున్నాను. ఎక్కడో చూసినట్టు ఉంది . ఆగి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తండ్రి కూతురు నన్ను దాటుకుని ముందుకు వెళుతూ అతను నన్ను చూసి దగ్గరకి వచ్చి " నువ్వు మాధవ్ వి కదూ ! నన్ను గుర్తు పట్టలేదా ? ఈశ్వర్ ని " అంటూ వచ్చి సంతోషంగా నా చేయి పట్టుకున్నాడు .
"గుర్తుంది. ఎంత మారిపోయావ్ ఈశ్వర్, నిన్నసలు పోల్చుకోలేకపోయాను, ఇక్కడే ఉంటున్నావా ?" అడిగాను . 'అవును, ఏవేవో బిజినెస్ లు చేస్తూ అక్కడా ఇక్కడా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చిపడ్డాను . ఇదిగో నా కూతురు సరిత . నాలా చదువులో మొద్దు కాదు. బిట్స్ లో చదువుతుంది. ప్రాక్టీస్ స్కూలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇచ్చారు పూర్తీ చేసుకుని తిరిగి వస్తుంది. " పరిచయం చేస్తున్నతని కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది . తల ఊపి ఊరుకున్నాను.
"ఎక్కడ ఉంటున్నారు .. హాస్పిటల్ ఎక్కడ ? అడిగాడు ఈశ్వర్ . విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను . ఆ అమ్మాయికి తండ్రితో నేను మాట్లాడటం అస్సలు ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది . ట్రైన్ లో నేను చూసిందల్లా తండ్రికి చెపుతాననే భయం కావచ్చు. అక్కడి నుండి ఎంత తొందరగా బయటపడదామా అని చూస్తుంది . నేను బయటకి వచ్చి కార్ కోసం ఎదురుచూస్తున్నా !
"ఇప్పుడు నువ్వు మాట్లాడినాయన నీ ఫ్రెండా నాన్నా" అడుగుతుంది.
"అవునమ్మా .. తిరుపతిలో పదేళ్ళపాటు కలసి చదువుకున్నాం."
"అవునా ! కల్చర్లెస్ బ్రూట్ . ట్రైన్ లో ఎంత మిస్ బిహేవ్ చేసాడో, ఆ అంకుల్స్ ని అస్సలు నమ్మకూడదు. ఆడపిల్లలు ఒంటరిగా కనబడితే చాలు " ఇంకా ఏవేవో చెపుతుంది . వింటున్న నేను మ్రాన్పడిపోయాను. ఆటో ఎక్కుతూ ఈశ్వర్ అసహ్యంగా నా వైపు చూసిన చూపు జీవితంలో మర్చిపోలేను. నేను మాట్లాడాలనుకున్నా అతని ఫోన్ నంబర్ తీసుకోలేదు. ఆ పిల్ల నాపై వేసిన అంత పెద్ద అపవాదుని పోగొట్టుకోవడం ఎలా ! అవమానంగా ఫీల్ అయ్యాను. ఆ మధ్యాహ్నమే అరవింద్ కి కాల్ చేసి ఆ పిల్ల అలా అందని చెప్పాను. గట్టిగా నవ్వేసాడు .
"ఆ పిల్లని ఎక్కడ చూసానోనన్నది గుర్తొచ్చింది. నా కొడుకుతో పాటు పిక్స్ లో చూసాను. వాడి క్లాస్మేట్ అనుకుంటాను అని చెప్పాడు."
ఖాళీ దొరికినప్పుడల్లా ఈశ్వర్ గురించి వాకబు చేస్తూనే ఉన్నాను. ఫోన్ నంబర్ దొరికినా మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ విషయాన్ని నా భార్య లక్ష్మితో చెప్పాలనుకుని పెదాలపై వచ్చిన మాటని నొక్కేసాను. "రోజూ నేను చెపుతున్న విషయాలు అవేగా ! మీరసలు వినిపించుకోరు ఇప్పుడర్ధమైందా? " అని క్లాస్ తీసుకోవడంతో పాటు ఆడపిల్ల తల్లిగా మరింత భయపడుతుందని మనసులోనే దాచుకున్నాను.
ఓ నెలరోజుల తర్వాత ఈశ్వర్ నుండి ఫోన్. నాకతనితో మాట్లాడటం ఇబ్బందిగానే తోచింది. డా॥ అరవింద్ అనే ఆయన నాకు ఫోన్ చేసి ఆ రోజు ట్రైన్ లో మా అమ్మాయితో కలసి ప్రయాణించినప్పుడు మీరిద్దరూ ఎలాంటి మిస్ బిహేవ్ చేయలేదని చెప్పాడు. నా కూతురెందుకు అలా చెప్పిందా అని ఆలోచించాను. నిశితంగాకూడా
గమనిస్తున్నా ! ఎవరెవరితోనో ఫోన్ లో మార్చి మార్చి మాట్లాడుతూ ఉంటుంది. నా దగ్గర నటిస్తుందని అర్ధమయింది. నా కూతురు మాటలు నమ్మి నిన్ను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించాలి "అన్నాడు. అరవింద్ ఈశ్వర్ నంబర్ ఎలా సేకరించాడో? తన కొడుకు సూర్య హెల్ప్ తీసుకుని ట్రై చేసి ఉంటాడని అనిపించింది. మొత్తానికి నన్ను రక్షించాడు. లేకపోతే ఈశ్వర్ దృష్టిలో నేనెంత చెడ్డవాడిగా మిగిలిపోయే వాడినో కదా! అనుకున్నాను.
మరి కొన్నాళ్ళ తర్వాత ఈశ్వర్ స్వయంగా కలవడానికి వచ్చాడు. ఆతను చాలా దిగులుగా కనిపించాడు. ఎందుకలా ఉన్నావ్ ? ఏమైనా సమస్యలా అడిగాను .
"అన్నింటి కన్నా పెద్ద సమస్య పిల్లలే ! నా కూతురు నా దగ్గర ప్రేమ కురిపిస్తూ గారాం పోతుంటే ఇంకా చిన్న పిల్లే అనుకున్నాను. అడిగినవన్నీ కొనిస్తూ నా స్తోమతకి మించి ఖర్చు చేసైనా ఏమీ తక్కువకాకుండా చూస్తున్నాను. అబ్బాయి కన్నా అమ్మాయే ముఖ్యమనుకున్నట్టు పెంచుకుంటూవచ్చాను.తను ఇంత స్వేచ్చగా విహరిస్తుందని, తల్లిదండ్రులని కూడా మోసం చేస్తుందని అనుకోలేదు. ఇన్నాళ్ళు తను క్లోజ్ గా తిరిగినతనని పెళ్ళి చేసుకోనంటుందని ఈ ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తూ ఎవరో అబ్బాయి నాకు కొరియర్లో ఈ ఫోటోలు పంపాడు. అవి తీసుకుని కాలేజ్ కి వెళ్ళి నా కూతురికి చూపించాను. ఏమిటమ్మా ఇవి అని అడిగితే "ఆడమగ కలసి చదువుకుంటున్నాం. జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రానే పెళ్లి చేసుకుంటానని అతననుకుంటే తప్పు నాదెలా అవుతుందని నాన్నా అంటుంది ? అంత క్లోజ్ గా అతుక్కుని ఫోటోలు దిగడాన్ని ఫ్రెండ్షిప్ అంటారా? తల్లీ అని అడిగాను. "కోడ్ ఆఫ్ కండక్ట్" పెడుతున్నారా ? అంది. అంటే ఏమిటో నాకేమీ అర్ధం కావడంలేదు. నువ్వేదైనా సలహా చెపుతావని వచ్చాను అంటూ నా చేతిలో ఒక కవర్ పెట్టాడు.
నాక్కూడా ఏం మాట్లాడాలో తోచలేదు "కోడ్ ఆఫ్ కండక్ట్ " అన్నమాట గురించి ఆలోచిస్తూనే కవర్ ఓపెన్ చేసాను. ఈశ్వర్ కూతురు ఒక అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉన్న చిత్రాలు. ఆ చిత్రాలలో ఉన్న అబ్బాయి ఆ రోజు ట్రైన్ లో కలిసి ప్రయాణం చేసిన అబ్బాయి ఒకటి కూడా కాదు. అదేంటి ? ఈ అబ్బాయి వేరే అబ్బాయా ? అని అనబోయి క్షణాల్లో తమాయించుకున్నాను. మీరు ట్రైన్ లో చూసిన అబ్బాయి ఈ అబ్బాయే కదూ ? అడిగాడు. కాదని అంటే గుండె పట్టుకుని నా కళ్ళ ముందే కుప్ప కూలి పోయేటట్టున్నాడనుకుని అవునని తలూపాను. ఆ రాత్రంతా ..ట్రైన్ లో మాతో పాటు ప్రయాణం చేసిన పెద్దామె మాటలు గుర్తుకొస్తూనే ఉన్నాయి. అతి కొద్దీ మంది అమ్మాయిలు అతి స్వేచ్ఛతో ప్రవర్తించడం వల్ల పద్దతిగా ఉండే మిగతా అమ్మాయిలకి కూడా ఇబ్బంది వస్తుంది. అందరూ ఆడపిల్లలు అలాగే ఉంటున్నారని జమ కట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరు త్వరపడి ఎవరు పొరబడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారో తెలుసుకోవడం కూడా కష్టంగానే ఉంది. ప్రతి తల్లిదండ్రులు పిల్లలని అనుమానంగా చూడాల్సొచ్చిన రోజులివి. ప్రశాంతంగా నిద్రపోలేని రోజులివి .
కొద్దీ నెలల తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసి సృహలేని స్థితిలో ఉన్న కూతురిని చేతుల్లో వేసుకుని నా హాస్పిటల్ కి వచ్చారు ఈశ్వర్ అతని భార్య. సేవ్ చేసిన తర్వాత ఈశ్వర్ భార్యకి ఇంకో విషయాన్ని చెప్పే బాధ్యతని నా భార్య లక్ష్మీ పై ఉంచాను. ఆమె అభావంగా నావైపు చూసింది.
-వనజ తాతినేని